mango farmers
-
Fact Check: చీడపీడలు మీ మెదడుకే
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. పాత తోటల పునరుద్ధరణ, కొత్త తోటల విస్తరణ కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా తోట బడులు, ఆర్బీకేల ద్వారా రైతులకు శిక్షణ ఇప్పించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. బంగినపల్లి, ఇమామ్ పసంద్ వంటి ఫైన్ వెరైటీ పండ్లకు టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా టన్ను రూ.40వేలు–50వేలు పలుకగా, ఈ ప్రభుత్వంలో రూ.1.30లక్షల వరకు కూడా పలికింది. గత ప్రభుత్వంలో టన్ను రూ.ఐదారువేలు కూడా పలకని తోతాపూరికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రూ.10వేలకు తగ్గకుండా పలికేలా చేసింది. కానీ ఇవేమీ పట్టని ఈనాడు దినపత్రిక ప్రభుత్వంపై బురద జల్లడం, మామిడి రైతులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ‘మామిడి రైతుకు ఏటా కష్టాలే’ అంటూ విషం కక్కింది. ఆరోపణ: 5.86 లక్షల ఎకరాల్లో తగ్గిన విస్తీర్ణం! వాస్తవం: 2019–20లో 9,41,235 ఎకరాల్లో మామిడి తోటలు సాగవగా, 2023–24లో అది 9,97,100 ఎకరాలకు పెరిగింది. కొత్తగా ఈ ఐదేళ్లలో 55,865 ఎకరాల్లో కొత్తగా మామిడి తోటలు పెరిగాయి. 2019–20లో 46.88లక్షల టన్నుల దిగుబడులు రాగా, 2023–24లో 49.85లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడుకు మాత్రం రాష్ట్రంలో 5.86 లక్షల ఎకరాల్లో మామిడి సాగు తగ్గిపోయింది, ఆరోపణ: చీడపీడలను నివారించేందుకు చర్యలేవి? వాస్తవం: 5 ఏళ్లలో 883 తోట బడుల ద్వారా సమీకృత తెగులు, ఎరువు యాజమాన్య పద్ధతులపై మామిడి రైతులకు ఆర్బీకే స్థాయిలో శిక్షణనిచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందాలను మామిడి సాగయ్యే జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయిలో తోటలకు సోకుతున్న చీడపీడలు, తెగుళ్లను గుర్తించడం, తక్షణ నివారణ చర్యలు చేపట్టేలా రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నల్లతామరతో సహా వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతు క్షేత్రాల్లోనే సామూహిక చర్యలు చేపట్టారు. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. రూ.కోటి రాయితీతో 2802.50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మామిడి సాగుకు, రూ.3.50 కోట్ల రాయితీతో 6250 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల నాణ్యత ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఇలా 4 ఏళ్లలో రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను రైతులకు పంపిణీ చేశారు. తద్వారా మామిడి నాణ్యత ప్రమాణాలను పెంచి దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా ఆంధ్ర మామిడికి గిరాకీ వచ్చేటట్టు చేయగలిగారు. ఆరోపణ: వైకాపా వచ్చాక ప్రోత్సాహమే కరువు వాస్తవం: పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ కార్యక్రమం కింద 1.14 లక్షల మంది రైతులకు రూ.126.51 కోట్లు, పాత తోటల పునరుద్ధరణ కింద 8618 మందికి రూ.14.53 కోట్ల లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం ఉన్న తోటలలో ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా సూక్ష్మనీటి సాగు పథకం కింద ఐదేళ్లలో 70,350 ఎకరాల్లో మామిడి తోటలకు డ్రిప్ పరికరాలను సమకూర్చారు. 5 ఏళ్లలో రూ.35.04 కోట్ల రాయితీతో 1752 ప్యాక్ హౌస్‌లను రైతుల పొలాల్లో నిర్మించగా, రూ.39.02 కోట్ల రాయితీతో 485 కలెక్షన్ కేంద్రాలను మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నిర్మించారు. 91 కోల్డ్ రూమ్స్ నిర్మాణానికి 70 శాతం రాయితీ అందించారు. 2023–24లో మామిడి రైతుల అభివృధ్ధి కోసం రూ.22.50 కోట్ల రాయితీతో మామిడి ఎఫ్పీఓల ద్వారా 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్ల రాయితీతో రైతు క్షేత్రాల్లో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోపణ: ఎగుమతులకు ఏదీ ప్రోత్సాహం వాస్తవం: ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రతిఏటా అపెడా ఆధ్వర్యంలో అమ్మకపు, కొనుగోలు దారుల సదస్సులు నిర్వహించారు. దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా, లండన్ వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగాయి. టీడీపీ కాలంలో ఐదేళ్లలో ఏటా సగటున 500 టన్నులు ఎగుమతి అయితే.. ఈ 5 ఏళ్లలో ఏటా సగటున 1200 టన్నుల పండ్లతో పాటు 8 లక్షల టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేయగలిగారు. మరో వైపు దేశంలోనే తొలిసారి మామిడి రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఫలితంగా మామిడి ఎగుమతులు పెరగడమే కాదు..రైతులు అత్యధిక ధర పొందేందుకు దోహదపడనుంది. ఆరోపణ: మామిడి రైతులకు చేయూత ఏదీ వాస్తవం: ప్రాంతాల వారీగా మామిడి తోటలను సమీప గుజ్జు పరిశ్రమలకు అనుసంధానం చేశారు. తోతాపురి మామిడి ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు పతనం కాకుండా చర్యలు చేపట్టారు. పండ్ల నాణ్యతను పెంచడానికి పండు ఈగల నష్టాన్ని నివారించడానికి ఆధునిక పండ్లకోత పరికరాలతో పాటు పండు ఈగ నివారణకు అవసరమైన ఆకర్షణ బుట్టలను పంపిణీ చేస్తున్నారు. పండ్ల కోత, నాణ్యతపై మండల స్థాయిలో రైతులకు, కోసిన పండ్లను గుజ్జు తయారీ పరిశ్రమలకు చేరవేయడంపై ఆర్బీకే సిబ్బందికి జిల్లా స్థాయిలోనూ శిక్షణ ఇచ్చారు. ధరలు పడిపోకుండా ఉండేందుకు దశల వారీగా పండ్ల కోతలు జరిగేలా చర్యలు చేపట్టారు. కోత మొదలైనప్పటి నుంచి చివరి పండు కోత కొచ్చే వరకు ప్రతిరోజు ధరల స్థిరీకరణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఫలితంగా ఈ ఐదేళ్లలో ఏ దశలోనూ టన్ను రూ.10వేలకు తగ్గకుండా ఉంది. సీజన్లో గరిష్టంగా రూ.23వేలకు అమ్ముకోగలిగారు. అదే టీడీపీ హయాంలో ఏనాడు రూ.5వేలకు మించి కొనలేని పరిస్థితి ఉండేది. -
విదేశాల్లో ఏపీ మామిడికి విపరీతమైన క్రేజ్..!
-
మామిడి సాగు విధానం, మామిడి రకాలు
-
తీపి మామిడి పండ్ల తక్కువ ధరలో..!
-
తక్కువ ధరకు మామిడి రైతులు ఇబ్బందులు..!
-
‘చిగు’రిస్తున్న ఆశలు!
సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వచ్చిన పూతకు కాయలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం రెండో విడతలో కూడా పూత కనిపిస్తుండడంపై ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయి. ఎక్కడ చూసినా పూత, పిందెతో చెట్లు కనిపిస్తుండడం.. గతేడాది కంటే ఈసారి ధర కూడా బాగానే ఉండే అవకాశాలు ఉండడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల వరకు మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో సరాసరిన 20 వేల హెక్టార్లలో పెద్ద చెట్లు (కాయలు కాచే) ఉండవచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ఒకవైపు కాయలు.. మరోవైపు పూత అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పంట విస్తారంగా సాగులో ఉంది. ముందుగా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాయలు మార్కెట్‌కు వస్తాయి. తర్వాత మిగతా ప్రాంతాల్లోని కాయలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పిందెలతో కూడిన కాయలు కనిపిస్తుండగా మరోవైపు పూత కూడా ఇప్పుడే విరివిగా కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో శీతాకాలంలో పూత విపరీతంగా వచ్చినప్పటికీ శీతల ప్రభావానికి కొంతమేర ముసురుకుంది. అయితే మంచుకు తట్టుకుని నిలబడిన తోటల్లో ప్రస్తుతం కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరుసలో రెండవ విడతగా పూత కూడా విస్తారంగా రావడంతో ఈసారి కూడా భారీగా మామిడి కాయలు అన్నమయ్య జిల్లా నుంచి మార్కెట్‌కు రానున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు మార్కెట్లో కాయలు మామిడి పంటకు సంబంధించి కాయలు మార్చి నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మనకు తొలుత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్చి నెలలో ఇక్కడి మార్కెట్లకు కాయలు రానున్నాయి. తర్వాత రైల్వేకోడూరుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఏప్రిల్ నెలనుంచి జూన్ వరకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పలు మండలాల నుంచి భారీగా మామిడి కాయలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూర, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, లాల్ బహార్, ఖాదర్, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గూబా తదితర రకాల కాయలను సాగు చేశారు. మార్చి రెండవ వారం నుంచి జూన్ నెలాఖరు వరకు కాయలు ఇక్కడి మార్కెట్లలో కళకళలాడనున్నాయి. రెండుమార్లు పూత మామిడి పంటకు సంబంధించి ప్రస్తుతం పూత విరివిగా కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన పూతకు లేలేత కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వచ్చిన పూత కూడా నిలబడింది. దిగుబడి కూడా ఈసారి అనుకున్న మేర ఆశాజనకంగా ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 37 వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా...సరాసరిన 20 వేల హెక్టార్లలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఈసారి దిగుబడి కూడా బాగా వస్తుందని అంచనా వేస్తున్నాం. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్‌గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్‌వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్‌వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్‌ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్‌చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్‌ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్‌వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
మామిడి తోటల సంరక్షణ.. సీవీఆర్ మెళకువలు
వర్షాకాలంలో మామిడి తోటల సంరక్షణకు మట్టి సేద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఈ సూచనలు చేశారు. మామిడి ప్రూనింగ్ చేయటానికి ముందు లేదా చేసిన తర్వాత ప్రతీ చెట్టుకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు+ 50 నుంచి 100 కిలోల లోపలి మట్టి (సబ్ సాయిల్.. అంటే భూమిలో 2 నుంచి 4 అడుగుల లోతు నుంచి తవ్విన మట్టి) + 5 కిలోల ఆముదం పిండి (హై డెన్సిటీ ప్లాంటింగ్‌లో అయితే ఆముదం పిండి చెట్టుకు 2 కిలోలు చాలు) వేసుకోవాలి. మట్టి, ఎరువు, ఆముదం పిండిని ఈ పాళ్లలో కలిపిన (130 కిలోల) మిశ్రమాన్ని సీజన్‌కు ఒకసారి ప్రతి చెట్టుకూ డ్రిప్పర్ల దగ్గర వేసుకోవచ్చు. ఆ తర్వాత, ప్రతి 15 రోజులకోసారి.. డ్రిప్పర్ల దగ్గర 2 కిలోల చొప్పున పై మట్టి (టాప్ సాయిల్) + లోపలి మట్టి కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటే పోషకాల లోపం రాకుండా ఉంటుంది. చెట్టు ఎదుగుదల సంతృప్తికర స్థితికి వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకోసారి వెయ్యాలి. అయితే, చెట్టుకు ఈ విధంగా 130 కిలోల మిశ్రమాన్ని ఒకటేసారి కాకుండా దాన్ని 4 భాగాలుగా విభజించి.. 20 రోజులకు ఒక్కో భాగాన్ని వేసుకోవచ్చు. అటువంటప్పుడు ఇక డ్రిప్పర్ల దగ్గర 15 రోజులకోసారి 2 కిలోల చొప్పున అదనంగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమావాస్య/పౌర్ణమికి ముందు పిచికారీ: 200 లీటర్ల నీటిలో 20 కిలోల లోపలి మట్టి తో పాటు.. 2 కిలోల గోధుమ లేదా సోయా బీన్ మొలకల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చెయ్యాలి. సంతృప్తికర స్థితికి తోట ఎదిగేంత వరకు అమావాస్యకు ముందు, పౌర్ణమికి ముందు ఈ మట్టి, మొలకల ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. -
మామిడి రైతులకు కాసుల పంట
సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది చిత్తూరు జిల్లా మామిడి రైతుల పంట పండింది. తోతాపురి, బేనీషా, మల్లిక, అల్ఫాన్సా తదితర రకాలకు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. చిత్తూరు జిల్లాలోని రైతులు అధిక శాతం.. మామిడి పంటను సాగు చేస్తున్నారు. సకాలంలో చెట్లకు పూత వచ్చి మంచి దిగుబడి వస్తే అన్ని రకాల కాయలు కలిసి దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల నెల రోజులు ఆలస్యంగా చెట్లకు పూత వచ్చింది. దీంతో కోత ఆలస్యమై.. దిగుబడిపై ప్రభావం పడింది. దీనికితోడు మే, జూన్ నెలల్లో కురిసిన వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి. పక్వానికి రాక ముందే కొంత మేర కాయలు నేలపాలయ్యాయి. జిల్లాలో 68,479 హెక్టార్లలో వివిధ రకాల మామిడి సాగు చేయగా.. 4,49,042 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు సీజనుకు ముందే కాయలను మార్కెట్లకు తరలించారు. ప్రారంభంలో ధర లేకపోయినా అయినకాడికి అమ్మేసుకున్నారు. మిగిలిన రైతులకు నెల రోజులుగా కాసుల వర్షం కురుస్తోంది. దిగుబడి తక్కువ వచ్చిందని బాధలో ఉన్న వారు.. ఇప్పుడు రికార్డు ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు రావడంతో.. కాయలు నాణ్యంగా ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో ధరలు అమాంతం పెరిగాయి. తోతాపురి, అల్ఫాన్సా రకాలకు టన్నుకు రూ.90 వేలు ధర పలికింది. ఇక మల్లిక రకానికి ఏకంగా రూ.1.2 లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది కూడా మంచి ధర రావాలంటే ప్రతి రైతు పచ్చిరొట్ట తప్పనిసరిగా సాగు చేయాలి. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఈస్థాయి ధర ఎప్పుడూ చూడలేదు.. గత 50 ఏళ్లలో ఈస్థాయి ధరలు ఎప్పుడూ రాలేదు. భవిష్యత్‌లో కూడా వస్తుందో.. రాదో చెప్పలేం. పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. ఎకరాకు 10 టన్నులు రావాల్సింది. వర్షాల వల్ల ఈసారి మూడు, నాలుగు టన్నులే వచ్చాయి. దీంతో బాధలో ఉన్న మాకు.. రికార్డు ధరలు రావడం చాలా సంతోషంగా ఉంది. – రవీంద్రనాథ్, పాలమాకులపల్లె, బంగారుపాళెం మండలం -
మామిడి రైతుకు నిరాశే
నూజివీడు/ చింతలపూడి : ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి, కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మామిడి పరిశ్రమ ఈ ఏడాది రైతులు, వ్యాపారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడి ఎగుమతుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలు ఉండటం విశేషం. మిగిలిన ఏడు వేల ఎకరాలు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి. దెబ్బతీసిన నల్ల తామర గత రెండేళ్లు కరోనాతో దెబ్బతిన్న రైతులు, ఈ ఏడాది కొత్తగా ఆశించిన నల్లతామర వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. సంక్రాంతి తరువాత తోటల్లో పూత ఉద్ధృతంగా వచ్చినప్పటికీ నల్లతామర పురుగు ఆశించడంతో పూత అంతా మాడిపోయి కేవలం కాడలే మిగిలాయి. దీని ప్రభావం దిగుబడిపై çపడింది. సాధారణంతో పోల్చితే సగం కూడా దిగుబడి రాలేదు. అరకొరగా వచ్చిన దిగుబడికి సరైన ధర లభించకపోవడంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. భారీగా తగ్గిన ఎగుమతులు ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి కోల్‌కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వేలకొద్ది లారీల్లో నాణ్యమైన మామిడి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చినా ఎగుమతులు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా ఒక్క నూజివీడు ప్రాంతం నుంచే రోజుకు దాదాపు 350 నుంచి 400 లారీల మామిడి ఎగుమతులు జరి గేవి. ఈ ఏడాది ఎగుమతులు రోజుకు 150 లారీలకు పడిపోయాయి. చింతలపూడి ప్రాంతం నుంచి రోజుకు 25 లారీల ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 నుంచి 12 లారీలకు పడిపోయాయి. దీనిని బట్టి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్‌తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగుంటుందని రైతులు భావించారు. రైతుల ఆశలను ఢిల్లీ వ్యాపారులు ప్రతిఏటా మాదిరిగానే అడియాస చేశారు. వారంతా సిండికేట్ అయ్యి ధరను తమకు కావాల్సిన విధంగా పెంచడం, తగ్గించడం చేస్తూ రైతులతో ఆడుకున్నారు. దీంతో దిగుబడి తక్కువగా ఉన్నా ధర మాత్రం రోజురోజుకూ దారుణంగా పతనమైంది. మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారం, మార్చి తొలి వారంలో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, కలెక్టర్ (తోతాపురి) రకం రూ.90 వేలకు కొనుగోలు చేసిన ఢిల్లీ వ్యాపారులు దిగుబడి పూర్తిస్థాయిలో వచ్చే సమయాల్లో అతి దారుణంగా ధరను పతనం చేశారు. ఆ తరువాత సీజన్ గడుస్తున్న కొద్దీ తగ్గుకుంటూ వచ్చి చివరకు బంగినపల్లి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలో నిలబడింది. కలెక్టర్ రకం ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల మధ్య నడుస్తోంది. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్ అయ్యారు ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దారుణంగా తగ్గించి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ధర బాగున్నప్పటికీ సీజన్ గడుస్తున్న కొద్దీ ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టాలపాలయ్యారు. – మూల్పురి నాగవల్లేశ్వరరావు, మామిడి రైతు, నూజివీడు నష్టాలు తప్పువు ఈ ఏడాది మామిడి రైతుకు నష్టాలు తప్పవు. మంగు తెగులు కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే గానీ నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగులుతుంది. – చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్ వ్యాపారి, చింతలపూడి -
మామిడి రైతుకు ‘యుద్ధం’ గుబులు..
సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి మామిడి మార్కెట్లోకి రాబోతుంది. గడిచిన రెండేళ్లు మామిడి మార్కెట్‌ను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లకు తరలించే విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం మామిడి రైతుకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఈసారి కరోనా ప్రభావం లేకపోవడంతో కాస్త మంచి రేటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్న రైతులకు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలపై యూరప్ దేశాలు విధిస్తోన్న ఆంక్షలు కలవరపెడుతున్నాయి. మామిడి పూర్తి స్థాయిలో మార్కెట్‌కు వచ్చే సమయానికి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావంతో వారున్నారు. 3.35లక్షల హెక్టార్లలో.. రాష్ట్రంలో ఈ ఏడాది 3.35లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. గతేడాది చివర్లో కురిసిన వర్షాల ప్రభావంతో ఈసారి పూత కాస్త ఆలస్యమైంది. ప్రారంభంలో పూతపై అక్కడక్కడ కన్పించిన నల్ల తామర పురుగు (త్రిప్స్ పార్విస్ పైనస్) ప్రభావం ప్రస్తుతం ఎక్కడా కన్పించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హెక్టార్‌కు 12 టన్నుల చొప్పున 40.26లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడులతో పాటు ఫ్రూట్‌కేర్ విధానాల వల్ల దిగుబడుల్లో నాణ్యత పెరుగుతోంది. ఎగుమతులకు ప్రామాణికమైన “ఫైటో శానిటరీ సర్టిఫికెట్’ జారీకోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంట ఎగుమతుల కోసం ఇప్పటి వరకు 18,486 మంది రైతులు (కొత్తగా 17,416 మంది) నమోదు చేసుకున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమ తుల అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్–సెల్లర్స్ మీట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పండే బంగిన పల్లి, సువర్ణరేఖ, తోతాపూరి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. గడిచిన రెండేళ్లు ఆశించిన స్థాయిలో రేటు పలకలేదని, కనీసం ఈ ఏడాదైనా టన్ను రూ.లక్ష వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం చర్యల వల్ల గతేడాది గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయగలిగారు. యూరప్ దేశాల ఆంక్షలతో కలవరం సాధారణంగా ఎగుమతుల్లో 30–40 శాతం యూరప్ దేశాలకు, 40–50 శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ దేశాలు విమాన రాకపోకలపై విధిస్తోన్న ఆంక్షలు మామిడి ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన నెలకొంది. పూత ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు రావడం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలవుతుందని, ఈలోగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశాభావంతో ఎగుమతిదారులు, రైతులు ఉన్నారు. కాగా ఈ ఏడాది దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తి వేయడంతో ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎగుమతి దారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి మంచి దిగుబడులు గడిచిన రెండేళ్లు కరోనా వల్ల ఆశించిన స్థాయిల్లో ఎగుమతులు జరగక రైతులు ఇబ్బంది పడ్డారు. శాస్త్రవేత్తలు, ఉద్యానవనశాఖాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుండడం వలన మంచి ఫలితాలొస్తున్నాయి. ఆర్బీకేలు వేదికగా నిర్వహిస్తోన్న తోటబడులు, ఫ్రూట్‌కేర్ యాక్టివిటీస్ వల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ మామిడి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. – ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ -
మామిడిపై నల్లతామర
సాక్షి, అమరావతి: మిరపను కబళించిన ‘త్రిప్స్ పార్విస్ పైనస్’ (నల్లతామర) తాజాగా మామిడిపై సోకింది. ఇప్పుడిప్పుడే పూతకొస్తున్న మామిడిపై ఈ నల్లతామర జాడను గుర్తించారు. మిరపను నాశనం చేసిన నల్లతామర మామిడిపై సోకే అవకాశం ఉందని జాతీయ శాస్త్రవేత్తల బృందాలు పేర్కొన్న నేపథ్యంలో పూతకొస్తున్న మామిడిపై వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో అంచనా వేసేందుకు మామిడి సాగవుతున్న జిల్లాల్లో శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కృష్ణాజిల్లాలో మామిడిపై ఈ నల్లతామర జాడను కనుగొన్నారు. నూజివీడు ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం మైలవరం, రెడ్డిగూడెం, రెడ్డికుంట, అన్నారం ప్రాంతాల్లో 10 వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. మామిడిపై సోకే సాధారణ త్రిప్స్తో పాటు నల్లతామర పురుగు కూడా సోకినట్లు గుర్తించారు. మామిడి చుట్టుపక్కల కూరగాయల పాదులతో పాటు కలుపు మొక్కలపైనా దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు నమూనాలను సేకరించారు. నల్లతామర ఉధృతి ఏ స్థాయిలో ఉంది? పూత, పిందెలపై వాటి ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేవి అంచనా వేస్తున్నారు. మామిడితో పాటు ఇతర పంటలపైనా వీటి ప్రభావం కనిపిస్తున్నందున రైతులను అప్రమత్తం చేయడంతోపాటు ఆర్బీకే స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సామూహిక నివారణ చర్యలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మామిడిపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సారం (లూపర్), మరికొన్ని ప్రాంతాల్లో తేనెమంచు (హోపర్) పురుగులు, ఇంకొన్నిచోట్ల ఆకుమచ్చ (ఆంత్రాక్నోజ్), కొమ్మఎండు తెగులు సోకగా ఇప్పుడు సాధారణ త్రిప్స్తో పాటు తామరపురుగు కూడా ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కృష్ణా జిల్లాలో మామిడితో పాటు కూరగాయలు, కలుపుమొక్కలపై గుర్తించిన నల్లతామర నివారణకు శాస్త్రవేత్తలు సూచించిన చర్యలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళతామని వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్ చెప్పారు. తామరపురుగు నివారణకు మందులు సూచిస్తామని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ జానకీరామ్ చెప్పారు. ఏ మందులు పడితే ఆ మందులను మోతాదుకు మించి వాడవద్దని రైతులకు సూచించారు. -
మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది : పూనం మాలకొండయ్య
-
మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మామిడికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికంటే ఎక్కువ ధర చిత్తూరు జిల్లాలోని రైతులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మామిడికి మార్కెట్లో రేటు తగ్గుతోందని తెలియగానే సీఎం జగన్ జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దింపి మామిడి ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘చిత్తూరు జిల్లాలో మామిడిపై ఈ జిల్లా వ్యక్తిగా చంద్రబాబుకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. అయినా వాస్తవాలను వక్రీకరిస్తూ, ప్రభుత్వంపై ఏదో రకంగా బురద చల్లాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలోని మామిడి రైతుల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఆ రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి కర్ణాటకలోని శ్రీనివాసపురం, తమిళనాడులోని కృష్ణగిరి మార్కెట్లలోకి తక్కువగా మామిడి వస్తే.. అక్కడి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు వచ్చి మన రైతుల నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లా కన్నా తక్కువ రేట్లు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్తో కలిపి కిలో రూ.7కు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో రైతులు ఒకేసారి కోతలు ప్రారంభించారు. అవసరానికి మించి ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం వల్ల కూడా కొంతమేర రేటు తగ్గింది. రైతుల గురించి ఎంతగానో ఆలోచించే సీఎం జగన్ ఇప్పటికే మ్యాంగో బోర్డు ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయించి, కేంద్రానికి పంపారు. మామిడి ధరలు పడిపోతున్నాయనే సమాచారం రాగానే మార్కెటింగ్ కమిషనర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ నాలుగైదు సార్లు పల్ప్ ఉత్పత్తిదారులు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. కేజీ రూ.11కు కొనుగోలు చేసేలా ఒప్పించారు. చిత్తూరు నుంచి పంట రాకముందే కృష్ణా జిల్లా నుంచి వచ్చేది. అక్కడ కొనుగోళ్లు పూర్తయిన తరువాత చిత్తూరు ప్రాంతంలో పంట వచ్చేది. కృష్ణా జిల్లాలో కేజీ ధర రూ.9 వద్ద ప్రారంభమై రూ.4కు పడిపోయింది. చిత్తూరులో కూడా అలాగే రూ.9 రూపాయల వద్ద ఉంది. 90 శాతం ఫ్యాక్టరీలు చంద్రబాబు బంధువులు, మద్దతుదారులవే చిత్తూరు జిల్లాలో 9 శాతం మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు చంద్రబాబు బంధువులు, వారి పార్టీ మద్దతుదారులకు చెందినవే. ఈ ఫ్యాక్టరీలు సిండికేట్ అయి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని గతంలో అనేక సార్లు మేం చెప్పాం. కనీసం మా ప్రాంతంలోని రైతులకైనా అండగా నిలవాలన్న ఉద్దేశంతో సొంత ఫ్యాక్టరీని ప్రారంభించాం. సింగిల్ లైన్లో 3 వేల నుంచి 4 వేల టన్నులు మాత్రమే ఈ ఫ్యాక్టరీ ద్వారా మేం పల్ప్ ఉత్పత్తి చేయగలుగుతాం. మాకు, మా కుటుంబ సభ్యులకు ఉన్న సొంత తోటల నుంచి వచ్చే మామిడి మా ఫ్యాక్టరీకి 70% వరకు సరిపోతుంది. బయట నుంచి మరో 20 నుంచి 30 శాతం కొనుగోలు చేస్తాం. ఇంత తక్కువ సామర్థ్యం ఉన్న మా ఫ్యాక్టరీ ద్వారా మేం మామిడి ధరను నియంత్రిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణం. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆ ఫ్యాక్టరీల గురించి, రైతులు పడుతున్న ఇబ్బంది గురించి ఆయనెందుకు మాట్లాడటం లేదు. చంద్రబాబు తానా అంటే సీపీఐ నారాయణ తందానా అంటున్నారు. వారిద్దరూ కూడబలుక్కుని అసత్య ప్రచారం చేస్తున్నారు. ‘వైఎస్ వల్లే ప్రాజెక్టులొచ్చాయని కేసీఆరే అన్నారు’ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి బదులిస్తూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి స్వయంగా కేసీఆర్ ఏం మాట్లాడారో అందరూ గమనించాలన్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు మేలు చేశారని, ఆయన వల్లే తెలంగాణకు ఇన్ని ప్రాజెక్ట్‌లు వచ్చాయని కేసీఆర్ ప్రశంసించారని గుర్తు చేశారు. రాయలసీమకు తాగు, సాగునీటిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మించడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఏపీకి ఎన్ని టీఎంసీలు కేటాయించారో వాటిని మాత్రమే తీసుకుంటామని, ఇందులో తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. రాయలసీమకు నీరివ్వాలని గతంలో కేసీఆర్ సూచించారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణకు నష్టం చేకూర్చే పనులను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ చేయదని, ఇందుకు సీఎం జగన్ కూడా అంగీకరించరని స్పష్టం చేశారు. -
మామిడి కాపు బాగుంది.. కరోనా కాటేసింది
నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): సముద్ర తీరంలో ఇసుక నేలలో పండే మొగల్తూరు మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి రకాల్లో ఈ రకం రుచి మధురంగా ఉండటంతో దీనికోసం ఆహారప్రియులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. డిమాండ్ అధికంగా ఉండటంతో మొగల్తూరు మామిడి ధరలు అదేస్థాయిలో ఉంటాయి. ధర, ఎగుమతులు బాగుండటంతో సాగు చేసిన రైతులు లాభాలను గడిస్తుంటారు. అయితే రెండేళ్లుగా మొగల్తూరు మామిడి రైతుల పరిస్థితి మారింది. కరోనా ప్రభావంతో కాపు బాగున్నా స్థానికంగా బేరాలు లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు ఎగుమతులు తగ్గడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మిగిలిన రకాలతో పోలిస్తే ఇవి ఆలస్యంగా కాపు కాస్తారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. ప్రస్తుతం మొగల్తూరు ప్రాంతంలో మామిడి తోటలు పండ్లతో కళకళలాడుతున్నాయి. గిరాకీ బాగు మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 600 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పండ్ల రకాలైన బంగినపల్లి, చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి, పచ్చళ్ల రకాలైన సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. జిల్లాలోని దూర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పండ్లు, కాయలు కొంటుంటారు. రైతులే వ్యాపారులై.. సాధారణంగా మామిడి తోటలకు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు సోకి రైతులు ఇబ్బందులు పడతారు. ఈదురుగాలులతో పిందెలు, కాయలు రాలిపోయి ఇబ్బంది పడతారు. అయితే ఈ సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టును రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో ముందుగా రైతులకు, వ్యాపారులకు మధ్య బేరసారాలు పెద్దగా జరగలేదు. దీంతో రైతులే నేరుగా వ్యాపారుల అవతారం ఎత్తి అమ్మకాలు ప్రారంభించారు. ఎగుమతులు లేక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ మార్కెట్‌కు మొగల్తూరు మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. సీజన్లో సుమారు 150 లారీల వరకు సరుకు ఎగుమతి చేస్తుంటారు. సీజన్లో మామిడి పండ్లు పరక (13 కాయలు) రూ.500 ధర పలుకుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గింది. ప్రస్తుతం పరక కాయలు రూ.200 లోపు ధర పలుకుతున్నాయి. అయినకాడికి అమ్ముకుంటూ.. నాకు ఎకరా మామిడి తోట ఉండగా మరో రెండెకరాలను రూ.2 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు ఎగుమతులు లేకపోగా స్థానిక మార్కెట్లు కూడా పెద్దగా సాగడం లేదు. దీంతో అయినకాడికి కాయలు అమ్ముకుంటున్నాం. గతంలో ఇక్కడి బంగినపల్లి కాయ ఒకటి రూ.50 ధర పలకగా ప్రస్తుతం రూ.20 కూడా లేని పరిస్థితి. చాలా మంది నేరుగా తోటల్లోకి వచ్చి కాయలు కొనుక్కుని దూర ప్రాంతాల్లో ఉండే తమ బంధువులకు పంపేవారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు లేవు. – అయితం నాగేశ్వరరావు, రైతు మొగల్తూరు కాపు బాగా కాసింది ఈ ఏడాది కాపు చాలా బాగుంది. గతంలో కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లం. ఈసారి కాపు బాగుండటంతో తోటలతో ఆదాయం కూడా పెరుగుతుందని అనుకున్నాం. అయితే నిరాశ ఎదురైంది. మొగల్తూరులో రోజువారీ జరిగే మార్కెట్లో కూడా మామిడి పండ్లకు ధర రావడం లేదు. త యారైన పండ్లను చెట్లకు ఉంచలేక వచ్చిన ధరకు అమ్ముతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. గతంలో మొగల్తూరు మామిడి అంటే జనం ఎగబడేవారు. – వెల్లి సురేష్, రైతు, మొగల్తూరు -
Girdling, Ring Barking: పాత చెట్లకు కొత్త ఊపు!
పాత తరం మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో, కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి.. కొత్తగా మళ్లీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ, బాగా పాత చెట్ల కొమ్మల బెరడును కొద్ది మేరకు కత్తిరించి వలిచెయ్యటం ద్వారా ఆ పాత చెట్ల ద్వారా కూడా అధిక మొత్తంలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా, పాత చెట్టు కొమ్మను కత్తిరిస్తే.. ఆ మొండి కొమ్మలకే విస్తారంగా కాయలు కాస్తాయి. ఇటువంటి ప్రయోగాలు రైతులు, శాస్త్రవేత్తలకు తెలియనివి కాకపోయినప్పటికీ.. గుజరాత్‌కు చెందిన రాజేష్ షా, ఈడ్పుగల్లుకు చెందిన శ్రీనివాస్‌ల అనుభవాలు ఆసక్తిగొలుపుతున్నాయి. 35 ఏళ్లు దాటిన చెట్లకే..! 35–40 ఏళ్ల క్రితం నాటిన పాత మామిడి చెట్ల కాపు తగ్గిపోవటం సహజమే. ఇటువంటి చెట్ల కాండానికి బెజ్జం వెయ్యటం వంటి చిట్కాల ద్వారా పండ్ల దిగుబడిని పెంపొందించుకోవడం చిరపరిచితమైనదే. గుజరాత్‌కు చెందిన రాజేష్ షా తోటలో 65 ఎకరాల్లో అల్ఫాన్సో, కేసర్ వంటి రకాల మామిడి చెట్లు వందల కొద్దీ ఉన్నాయి. వాళ్ల తాత కాలం నుంచీ ఆ తోట ఉంది. పాత చెట్లకు కాపు ఏటేటా తగ్గిపోతుండటంతో షా ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ చిట్కాను ప్రయోగించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభించారు. పాత పండ్ల చెట్టు కాండం లేదా కొమ్మ లేదా రెమ్మలకు చుట్టూ బెరడును కత్తిరించి తీసెయ్యటమే హార్టీకల్చర్ పరిభాషలో ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ అంటే. 15 ఏళ్ల తర్వాత గానీ ఈ పనిలో తనకు పూర్తిస్థాయి నైపుణ్యం చేకూరలేదంటారాయన. ఈ సంవత్సరం 75 కొమ్మలకు గిర్డ్లింగ్ చేశారాయన. రింగ్ బార్కింగ్ చేసేదెలా? శుభ్రమైన, పదునైన చాకుతో అంగుళం వెడల్పున చెట్టు కాండం చుట్టూతా కత్తిరించి, బెరడును తొలగించాలి. ఆ గాయంలో నుంచి చెట్టుకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి క్రిమిసంహారక మందు లేదా స్థానికంగా రైతులు తయారు చేసుకునే పేస్ట్‌ను పూయాలి. అంతే, చెట్టు ఆ ప్రాంతానికి ముఖ్యమైన పోషకాలను అందించడానికి కత్తిరించిన ప్రాంతంలో కొత్త పొరలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా పోషకాలు పుష్కలంగా అంది చెట్టు కాపు పెరుగుతుంది. గాలిలో తేమ 70% మేరకు ఉండే దీపావళి కాలంలో రింగ్ బార్కింగ్ చేయటం వల్ల తమ తోటలో చెట్లకు ఉపయోగపడిందని షా తెలిపారు. 35 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న చెట్లకు, నేల పై నుంచి 15–20 అడుగుల కన్నా ఎత్తున్న కొమ్మలకే రింగ్ బార్కింగ్ టెక్నిక్ సమర్థవంతంగా పని చేస్తోందని షా వివరించారు. అంతేకాదు, కాండం లేదా కొమ్మల చుట్టుకొలత కనీసం 12 (30 సెం.మీ.) అంగుళాల మేరకు ఉంటేనే ఈ చిట్కా బాగా పని చేస్తున్నదని షా వివరించారు. గాటు పెట్టి బెరడు తీసేసిన పై ప్రాంతంలో కొమ్మల్లో కాపు చాలా ఎక్కువగా వస్తుందని, పండ్లు పెద్దగా, తియ్యగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. 125, 100, 80 ఏళ్ల క్రితం నాటిన చెట్లకు కూడా ఈ టెక్నిక్ ద్వారా మంచి పండ్ల దిగుబడిని పొందానని సంబరపడుతున్నారాయన. కొమ్మ కత్తిరిస్తే.. గుత్తులు..! 45 ఏళ్ల నాటి మామిడి చెట్టు కొమ్మను కత్తిరిస్తే ఆ మోడుకు ఆశ్చర్యకరంగా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో దేశవాళీ రకం మామిడి చెట్టుకు వింతగా ఎక్కువ మొత్తంలో కాసిన కాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయన తండ్రి కోటేశ్వరరావు 45 ఏళ్ల క్రితం దేశవాళీ మామిడి విత్తనాన్ని నాటారు. ప్రస్తుతం అది మహా వృక్షంగా మారింది. పీచు లేకుండా, ముదురు పసుపు రంగులో తియ్యని గుజ్జుతో కూడిన ఈ చెట్టు పండ్లు రుచికరంగా ఉన్నాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ చెట్టు కాస్తుందని శ్రీనివాస్ తెలిపారు. ఏ ఎరువూ వెయ్యటం లేదు.. కొమ్మలు బాగా విస్తరించటంతో అడ్డుగా ఉన్న కొమ్మలను రంపంతో రెండేళ్ల క్రితం కత్తిరించారు. అలా కత్తిరించిన ప్రదేశంలో గుత్తులుగా కాయలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని కొమ్మలను కత్తిరించారు. కత్తిరించిన ప్రతి చోటా గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉన్న రకం. సేంద్రియ/రసాయనిక ఎరువులు ఏవీ వెయ్యటం లేదు. నీరు పెడుతున్నాం అంతే అన్నారాయన. విషయం తెలుసుకున్న డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. టి. జానకిరాం తదితర ఉద్యాన శాస్త్రవేత్తలు ఇటీవల ఈ దేశవాళీ మామిడి చెట్టు వైభవాన్ని సందర్శించి రైతును ప్రశంసించారు. 45 ఏళ్ల నాటి దేశవాళీ మామిడి చెట్టు జన్యు వనరుల పరంగా ఎంతో విలువైనదని అంటూ మెరుగైన వంగడాల అభివృద్ధి కోసం జరిపే పరిశోధనల్లో ఈ జన్యు వనరును ఉపయోగిస్తామని తెలిపారు. వాణిజ్య దృష్టితో కాకుండా దేశవాళీ రకం పండ్ల రకాలను మక్కువతో పెంచడమే తనకు ఇష్టమని శ్రీనివాస్ (93929 22007) సంతోషంగా చెప్పారు. జామలో కూడా ఈ టెక్నిక్‌ను ప్రయోగిస్తున్నానన్నారు. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు అధిక పోషకాల నిల్వ వల్లనే..! మామిడి చెట్ల కొమ్మలను డిసెంబర్, జనవరి నెలల్లో పూతకు ముందుగా నరకడం ∙కొన్ని సందర్భాలలో కొమ్మలపైన చిగురు కాకుండా పూత రావడం, పిందె కట్టడం జరుగుతుందని డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి.జానకిరామ్ తెలియజేశారు. కార్బోహైడ్రేట్స్ అధిక శాతం నిల్వ వలన, కార్బన్–నత్రజని శాతంలో వ్యత్యాసం వలన నరికిన కొమ్మలకు కాయలు గుత్తులుగా వస్తాయన్నారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని పర్వతనేని శ్రీనివాస్ తోటలోని దేశవాళీ మామిడి చెట్టుకు కొమ్మలపైన గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి పండ్లను ఉపకులపతి డా. టి.జానకిరామ్ పరిశీలించారు. పరిశోధన సంచాలకులు డా. ఆర్‌విఎస్‌కె రెడ్డి, నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. శ్రీమతి బి. కనకమహాలక్ష్మి, కంకిపాడు ఉద్యాన అధికారి జి. లక్పతి, రైతులు ఆయన వెంట ఉన్నారు. రైతు శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వివిధ రకాలైన జామ, వాటర్ ఆపిల్, స్టార్ ఫ్రూట్, చెర్రిగోవా, నోని, మాల్టా బత్తాయి, బొప్పాయి మొక్కలను పరిశీలించారు. పరాగ సంపర్కానికి అవసరమైన తేనేటీగలను కూడా పెంచి తోటలలో ఫలదీకరణ శాతం పెరిగి దిగుబడి అధికంగా ఉంటుందని డా.జానకిరామ్ సూచించారు. -
దక్షిణ కొరియాకు ఆంధ్రా మామిడి
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలో మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ధరలు పడిపోకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం ఎగుమతులకు ఆటంకం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల మామిడి పండ్ల దిగుబడులు వస్తాయని అంచనా. గతేడాది లాక్డౌన్ కారణంగా మామిడి రవాణా విషయంలో విదేశాలతో పాటు దేశీయంగానూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతుకు ఊరటనిస్తున్నాయి. దశల వారీగా పంట మార్కెట్‌కు వచ్చేలా చేయడం.. రైతులు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని సమీక్షించడం, లాక్డౌన్ అమలులో రాష్ట్రాలతో పాటు ఆంక్షలు విధించిన రాష్ట్రాలతో చర్చలు జరుపుతూ రవాణాకు ఇబ్బంది లేకుండా చూడటం వంటి చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత నెలలో విజయవాడ, తిరుపతిలో నిర్వహించిన బయ్యర్స్, సెల్లర్స్ మీట్ల ద్వారా సుమారు 5 వేల టన్నుల ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి (కలెక్టర్), చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. తొలిసారి దక్షిణ కొరియాకు.. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విజయవాడ నుంచి విమాన మార్గం ద్వారా సౌదీకి పంపించి.. అక్కడి నుంచి వాయు మార్గంలోనే దక్షిణ కొరియాకు పంపించారు. న్యూజిలాండ్, సింగపూర్, ఒమన్ దేశాలకు సైతం 70 టన్నులకు పైగా మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, యూరప్ దేశాల నుంచి కనీసం 500 టన్నుల ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్ నుంచి ఆయా దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఎగుమతులపై ప్రభావం చూపింది. నెలాఖరులోగా పరిస్థితి చక్కబడి విమాన రాకపోకలు పునరుద్ధరిస్తే ఎగుమతులకు డోకా ఉండదని భావిస్తున్నారు. ఏడు కిసాన్ రైళ్లలో రవాణా ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది. ఇప్పటికే విజయవాడ, విజయనగరం నుంచి ఢిల్లీకి కిసాన్ రైళ్లు వెళ్లాయి. వీటి ద్వారా సుమారు 3,500 టన్నుల మామిడితో ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌కు పంపించారు. ఈ నెలాఖరులోగా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని కిసాన్ రైళ్ల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు రోజుకు వంద టన్నులకు పైగా మామిడి రవాణా అవుతోంది. వినియోగదారులకు నేరుగా మామిడి ఈ ఏడాది కూడా రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు, అపార్టుమెంట్లలో నివసించే వారికి రాయలసీమ ప్రాంత రైతులు నేరుగా మామిడిని రవాణా చేస్తున్నారు. గతేడాది కరోనా దెబ్బకు టన్ను రూ.30 వేలకు మించి పలుకని మామిడి ఈ ఏడాది గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. కాగా ప్రస్తుతం రూ.35వేల నుంచి రూ.45 వేల మధ్య నిలకడగా ఉంది. దేశీయంగా ఇబ్బందుల్లేవు మామిడి రైతులు నష్టపోకుండా ఎప్పటికప్పుడు మార్కెట్‌ను పరిశీలిస్తున్నాం. లాక్డౌన్ ఉన్న రాష్ట్రాలతో చర్చిస్తున్నాం. రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. సౌత్ కొరియాకు తొలి కన్సైన్మెంట్ వెళ్లింది. మిగిలిన దేశాలకూ పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎం.వెంకటేశ్వరరావు, ఏడీ, ఉద్యాన శాఖ -
మామిడి రైతుకు 'తీపి' ధర
సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతుకు ఈ ఏడాది మంచి రోజులొచ్చాయి. గత సంవత్సరంకంటే అధిక దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఎక్కువగా లభిస్తోంది. ఇన్నాళ్లూ రైతులు మామిడిని స్థానిక మార్కెట్లోనే విక్రయించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఫలితంగా రైతుకు నష్టం వాటిల్లేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మామిడికి మంచి ధర లభించేలా చూస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూమిలో తేమ శాతం పెరిగి మామిడి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి రాగా ఈ సంవత్సరం ఐదు టన్నులకుపైగా (25 నుంచి 30 శాతం అధికంగా) వస్తోంది. ఈ ఏడాది 56 లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. పైగా ఈ ఏడాది మామిడి నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. ఇప్పటికి మామిడి కోత 20 శాతం వరకు జరగ్గా ఏప్రిల్ రెండోవారం నుంచి పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు వస్తుందని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. తోటలోనే రైతులకు సొమ్ము.. బంగినపల్లి రకం టన్ను ఎ–గ్రేడు రూ.60 వేల నుంచి 65 వేలు, బి–గ్రేడు రూ.50 వేలు, సి–గ్రేడు రూ.40 వేలు పలుకుతోంది. తోతాపురి టన్ను ధర రూ.35 వేలు ఉంది. ఉద్యానశాఖ ఈనెల 16న విజయవాడలో నిర్వహించిన మ్యాంగో సెల్లర్స్, బయ్యర్స్ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఆ సమావేశంలో రైతులు.. కొనుగోలుదార్లు/ఎగుమతిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ఈ ఏడాది ఐదువేల టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదార్లు వస్తున్నారు. వీరు మామిడితోటల్లోకి నేరుగా వెళ్లి కాయలను కోయించుకుని స్పాట్లోనే రైతులకు సొమ్ము చెల్లించి కాయల్ని తీసుకెళుతున్నారు. రైతులు స్థానిక మార్కెట్లో అమ్ముకుంటే సొమ్ము కోసం నాలుగైదుసార్లు తిరగాల్సి వచ్చేది. పైగా ఎగుమతిదార్లు ఇచ్చే ధరకంటే స్థానిక మార్కెట్లో టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువే లభించేది. గత సంవత్సరం నాణ్యమైన బంగినపల్లి టన్ను గరిష్టంగా రూ.30 వేలకు, తోతాపురి రూ.10 వేలకు మించలేదు. గతంలో రైతులే మార్కెట్‌కు తరలించే సమయంలో కాయ కోత, లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కింద టన్నుకి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చయ్యేది. మార్కెట్లలో 10 శాతం కమీషన్ కింద ఇవ్వాల్సి వచ్చేది. కొనుగోలుదారులే నేరుగా తోటల్లోకి వచ్చి తీసుకెళుతుండటంతో రైతులకు ఈ ఖర్చులు, కమిషన్ సొమ్ము ఆదా అవుతున్నాయి. మంచి ధర దక్కుతోంది స్థానిక మార్కెట్లో మామిడిని విక్రయిస్తే తక్కువ ధరతో పాటు కమీషన్, హమాలీల ఖర్చుల కింద 10 శాతం సొమ్ము తీసుకుంటున్నారు. ఇలా గత ఏడాది రైతుకు టన్నుకు రూ.30 వేలు రావడం కష్టమైంది. సెల్లర్స్, బయ్యర్స్ మీట్లో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫలితంగా ఎ–గ్రేడు బంగినపల్లి రకం టన్ను రూ.52 వేల నుంచి రూ.70 వేల వరకు కొనుగోలు చేశారు. వెంటనే సొమ్ము చెల్లించారు. ఇలా నాకున్న 20 ఎకరాల్లో ఇప్పటివరకు నాలుగున్నర టన్నులు విక్రయించాను. మా గ్రామం నుంచి వంద టన్నులు ఎగుమతిదార్లకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాం. – బాలరాఘవరావు, మామిడి రైతు, హనుమంతునిగూడెం, కృష్ణా జిల్లా ఒప్పందాలతో సత్ఫలితాలు గత ఏడాదికంటే మామిడి అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ధర కూడా లభిస్తోంది. రైతులు నాణ్యమైన మామిడిని ఎగుమతిదార్లకు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మ్యాంగో మీట్లో ఒప్పందాల మేరకు ఎగుమతిదారులు నేరుగా కొనుగోళ్లు మొదలు పెట్టారు. – సీహెచ్. శ్రీనివాసులు, ఏడీ, ఉద్యానశాఖ -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఉలవపాడు మామిడి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. ప్రధాన క్లస్టర్‌గా ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. కాయల్ని ఎలా ప్యాక్ చేయాలో శిక్షణ ఇస్తున్నాం.. ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం. – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా -
ఫలరారాజు విలవిల!
ఉగాది వచ్చేస్తోంది. పచ్చడి చేసుకుందామంటే ఒక్క మామిడి కాయ అయినా కానరావడం లేదు. కారణం ఈ పంటను మంచు ముంచేస్తోంది. దీనినే నమ్ముకున్న వేలాది మంది రైతాంగాన్ని... పరోక్షంగా ఆధారపడిన వ్యాపారులను కలవరపరుస్తోంది. జనవరికి ముందే పూత విరగకాసింది. అది చూసిన అన్నదాత ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంతలోనే ఆరంభమైన పొగమంచుపగబట్టింది. పూతను సమూలంగా మాడ్చేసింది. ఫలితంగా పూత మొత్తం రాలిపోయి... కాయల్లేకుండా తోటలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లక్కవరపుకోట: ఫల రారాజు మామిడికి కష్టమొచ్చింది. ఈ ఏడాది దిగుబడి గగనంగా మారింది. పూత తీవ్రంగా రాలిపోవడంతో మచ్చుకైనా ఓ మామిడి పండు దొరుకుతుందా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం మామిడి తోటలు పూతకు వచ్చినా పూతంతా రాలిపోవడంతో తొడిమలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాణిజ్య పంటలైన జీడి, మామిడి ద్వారా కాసిన్న కాసులు వెనకేసుకోవచ్చనుకున్న రైతాంగానికి నిరాశే మిగులుతోంది. ప్రస్తుత సీజన్లో జీడి, మామిడి చెట్లు పువ్వు, కాయలతో కళకళలాడాల్సి ఉండగా చెట్లు కళావిహీనంగా కన్పిస్తున్నాయి. ఒక పక్కపొగ మంచు, మరో పక్క చీడపురుగులు పట్టడంతో పూత వచ్చినా పిందెలు కాయనీయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పంటకు పెట్టింది పేరు రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో సుమారు 43వేల హెక్టార్లో మామిడి పంట, 16 వేల హెక్టార్లలో జీడి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 35వేల మంది రైతులు మామిడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యాపారులు సుమారుగా 20 వేల మంది ఉంటారు. వీరు రైతులనుంచి డిసెంబర్, జనవరి నెలల్లో మామిడి తోటలను కొనుగోలు చేస్తారు. పూత, నిగారింపును చూసి తోటలను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది మార్చి నెల వచ్చేసినా తోటలు పూతకు రాలేదు. కనీసం వచ్చిన పూత కూడా పిందెకట్టలేదు. అక్కడక్కడ పూత వచ్చినప్పట్టికీ పొగమంచు కారణంగా పూర్తిగా రాలిపోయింది. జిల్లాలో సగటున 4.5లక్షల టన్నుల మామడి దిగుబడి రావాల్సి వుండగా ప్రస్తుత ఏడాది కనీసం సగం దిగుబడైనా వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. జిల్లాలో మామిడి సాగు చేసే మండలాలు మెరకమొడిదాం, దత్తిరాజేరు, రామభద్రపురం, బొబ్బిలి, గంట్యాడ, కొత్తవలస, మెంటాడ, లక్కవరపుకోట, శృంగవరపుకోట, జామి తదితర మండలాల్లో సుమారు 43వేల హెక్టార్లో అత్యధికంగా మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక జీడి మామిడిని కురుపాం, కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస, శృంగవరపుకోట, గంట్యాడ మండలాల్లో అత్యధికంగా 16వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మొదట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కనిపించినప్పటికీ తర్వాత తేనె మంచు పురుగు ఆశించడంతో పూత పూర్తిగా మాడిపోయింది. ఏటా రూ. 40కోట్ల వ్యాపారం జిల్లాలో మామిడి పంటపై సుమారుగా ఏడాదికి రూ.40కోట్ల వరకూ వ్యాపారం సాగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండిన మామిడి పంటకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ వుంది. ముఖ్యంగా ఇక్కడి పంట అరబ్ దేశాలకు ఎగుమతువుతుంది. అలాగే ఢిల్లీ, ముంబాయి, కోల్కత్తా, రాయ్‌పూర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత ఏడాది ఆశించిన పంట లేకపోవడంతో రైతులు, అటు వ్యాపారులు దిగాలైపోయారు. పెట్టుబడి వస్తుందో ,.రాదో నాకు ఐదెకరాల మామిడితోట ఉంది. మరో 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాను. మొత్తం 25 ఎకరాలకు పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా లేదు. ఈ సమయానికి పూర్తిగా కాయలతో ఉండాలి. కనీసం పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. 25 ఎకరాలు బాగా కాస్తే సుమారు రూ. 2.5లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఏడాది తోటల్లో దుక్కి, ఎరువులు, పురుగు నివారణ మందులకు అత్యధికంగా పెట్టుబడులు పెట్టాం. ఫలితం మాత్రం శూన్యమే.– దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం -
వాతావ'రణం'.. పూతకు ప్రతికూలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రాలిపోతోంది.దీంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఉద్యానశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అకాల వర్షాలు కురవడం, తర్వాత చలి నెలకొనడం తదితర కారణాల వల్ల ఈసారి పూత రావడమే ఆలస్యమైందని, ప్రస్తుత వాతావరణం కూడా పూత, పిందెలు నిలబడే స్థితి లేకుండా పోయిందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 60 శాతం దిగుబడులు పడిపోయే ప్రమాదం... రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి.అత్యధికంగా ఖమ్మం, మంచి ర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా తోటలుండగా, మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు సరాసరి 4 టన్నుల వరకు మామిడి దిగుబడులు వస్తాయి.బాగా కాస్తే ఏడెనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అంటున్నారు.ఆ ప్రకారం రాష్ట్రంలో సుమారు 20 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుందని అంచనా. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా మన మామిడి పంట ఎగుమతి అవుతుంది. ఈసారి కాపు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు కురవడంతో దాని ప్రభావం మామిడి పూతపై పడింది. సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే 92 శాతం, అక్టోబర్ నెలలో సాధారణం కంటే 70% అధికంగా వర్షం కురిసింది. ఫిబ్రవరిలో ఇప్పటివరకు అంటే ఈ 12 రోజుల్లో ఏకంగా 279% అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 12 రోజుల్లో 2.4 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 9.1 మి.మీ నమోదైంది. అంటే మామిడి పూతకు అత్యంత కీలకమైన సమయాల్లో వర్షాలు కురిశాయి. మధ్యలో చలి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితే మామిడి పూత, కాతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఫంగస్, చీడపీడలు... అక్టోబర్ నెల నుంచే మామిడి పూతకు అను కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈసారి అక్టోబర్ వరకూ వర్షాలు విపరీతంగా కురిశాయి. ఈ దెబ్బ ఇప్పటివరకు కొనసాగుతోంది. జనవరిలో సంక్రాంతి నాటికి పూత పూర్తిస్థాయిలో రావాలి. ఉద్యానశాఖ వర్గాల అంచనా ప్రకారం నెల రోజులపాటు మామిడి పూత, కాతకు అంతరాయం ఏర్పడిందంటున్నారు. వాతావరణ మార్పులతో మామిడిపై ఫంగస్ పంజా విసిరింది. చీడపీడలు విజృంభించాయి. దీంతో రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పూతలో 98 % మగ పూతే ఉంటుంది. అది రాలిపోతుంది. ఇక మిగిలిన 2 శాతం ద్విలింగ (ఆడ, మగ) పూత ఉంటుంది. దాని నుంచే కాపు వస్తుంది. అందులో సాధారణంగా 0.5 శాతం మాత్రమే మామిడి కాయగా వస్తుంది. దానినే దిగుబడిగా లెక్కిస్తారు. ఇప్పుడు ఆ దిగుబడి కూడా 60 శాతం వరకు పడిపోయే ప్రమాదముందని ఉద్యాన శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం పంటపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపిందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మార్చిలో మార్కెట్లోకి మామిడి కాయ రావాలి. జూన్ నెల వరకు వస్తూనే ఉంటుంది. ఈసారి ఏప్రిల్‌లో కాయలు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని అంచనా. పూత నిలవడంలేదు పదేళ్ల కిందట 4 ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. అప్పటినుంచి మంచి దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది పూతనే రాలేదు. బంగినపెల్లి మామిడి చెట్లకు పూత వచ్చినా నిలవడం లేదు. దస్రీ రకానికి ఇప్పుడిప్పుడే వస్తోంది. మామిళ్లు పూతకు వస్తే ఎండకాలంలో చెట్లకు కాయలెట్లా నిలుస్తది. ఈ ఏడాది మామిడి తోటలకు నష్టం వచ్చినట్లే. ఎండాకాలంలో నీళ్లు అందక కాయలు రాలిపోతాయి. – తిరుపతిరావు, గాంధీనగర్, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా ఆరంభం నుంచే సమస్య వాతావరణ మార్పుల వల్ల పూత రాలిపోతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ సమస్య నెలకొంది. పూత రాలటంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం కూడా ఉంది. – ఎనమల నారాయణరెడ్డి, బోడు, టేకులపల్లి మండలం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
ఇంట్లో తాగునీటి శుద్ధి–నిల్వపై ఫిబ్రవరిలో చర్చాగోష్టి
ఆర్.ఓ. పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.), ఎస్.ఎం.సెహగల్ ఫౌండేషన్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మెరుగైన ‘ఇంటి స్థాయిలో తాగునీటి శుద్ధి– నిల్వ పద్ధతుల’పై అనుభవాలను పంచుకునేందుకు, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.లో చర్చాగోష్టి జరగనుంది. కెనడాకు చెందిన సెంటర్ ఫర్ అఫార్డబుల్ వాటర్ శానిటేషన్ టెక్నాలజీ ఈ వర్క్‌షాపునకు నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నీటిశుద్ధి–నిల్వ సాంకేతికతల డెవలపర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, వీటిని అనుసరిస్తున్నవారు తమ అనుభవాలను పంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. తాము వాడుతున్న ప్యూరిఫయ్యర్లను ప్రదర్శించవచ్చు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు/పోస్టర్లను చూపించి చర్చలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 7లోగా వివరాలు పంపాలి. వివరాలకు.. అపరాజిత–98012 73123. Email: a.vaibhav@smsfoundation.org మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్) మహాసభ సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ సమీపంలోని) బిడకన్నె గ్రామంలోని వ్యవసాయ శిక్షణా క్షేత్రంలో జరగనుంది. ‘భూతాపోన్నతి – శాశ్వత వ్యవసాయ పరిష్కారాలు’ అనే అంశంపై ఈ మహాసభలో విస్తృత చర్చ జరుగుతుంది. పర్యావరణపరమైన సుస్థిరతను అందించే రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తి సాధనకు దోహదపడే జీవవైవిధ్య, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఈ మహాసభ వేదిక కానుంది. రిజిస్ట్రేషన్ తదితర సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 75697 20601. E-mail id : aranyahyd@gmail.com చిరుధాన్య వంటకాలపై 18న ఐ.ఐ.ఎం.ఆర్.లో శిక్షణ వర్షాధారంగా పండే చిరుధాన్యాలలో సకల పోషకాలు ఉన్నాయి. వీటిని మూలాహారంగా తీసుకుంటే జీవనశైలి వ్యాధులు సైతం నయం అవుతాయి. అయితే, వీటితో సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక వంటకాలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ–ఐ.ఐ.ఎం.ఆర్. (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. చిరుధాన్య వంటకాల తయారీపై కుకింగ్ విత్ మిల్లెట్స్ పేరిట గృహిణులు, హోటళ్ల నిర్వాహకులు, స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు ఈ నెల 18(శనివారం)న ఐ.ఐ.ఎం.ఆర్.లోని న్యూట్రిహబ్ శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 1,500. పేర్ల రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం.. nutrihubtbi@gmail.com 040-24599379/ 29885838 / Mobile - 9490476098 www.millets.res.in / www.nutrihub-tbi-iimr.org మట్టి ద్రావణంతో చీడపీడల నివారణపై 19న శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి ద్రావణంతో వివిధ పంటల్లో చీడపీడల నివారణ పద్ధతులపై ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, మట్టి ద్రావణ ంపై పేటెంట్ పొందిన చింతల వెంకటరెడ్డి ఈ నెల 19(ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని తమ శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255. 22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 29న చోహన్ క్యు, సీవీఆర్ సాగు పద్ధతులపై శిక్షణ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. -
11 నుంచి గుడివాడలో ఒంగోలు ఎడ్ల బండలాగుడు ప్రదర్శన
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి చెందిన ఎన్టీఆర్2వైఎస్సార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్డులోని కె.కన్వెన్షన్‌లో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన జరగనుంది. 9 విభాగాల్లో రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు మొత్తం 60 బహుమతులు ఇవ్వనున్నారు. పశుపోషకులు, రైతులందరికీ ఆహ్వానం. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు.. 94909 20887, 84990 63579, 99124 30945 9న నాచుగుంట గోశాలలో వరి, చెరకు సాగుపై శిక్షణ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గోపాలకృష్ణ గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, శ్రీగోపాల కృష్ణ గోశాల ఆధ్వర్యంలో ఈ నెల 9 (గురువారం)న వరి, చెరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సేంద్రియ బెల్లం తయారీ, సేంద్రియ సర్టిఫికేషన్, వినియోగదారులకు సేంద్రియ ఉత్పత్తుల అమ్మకంలో మెలకువలు తదితర అంశాలపై సీనియర్ రైతు రామకృష్ణంరాజు శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన వసతి ఉంది. వివరాలకు.. జగదీశ్ – 78934 56163. 22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 29న చోహన్ క్యు, సీవీఆర్ సాగు పద్ధతులపై శిక్షణ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. రైతుబంధు వ్యవసాయ కథల పోటీలు 2020 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై రైతుబంధు మాసపత్రిక నెస్ట్ ఫౌండేషన్, తెలంగాణ రిసోర్స్ సెంటర్ సహకారంతో వ్యవసాయరంగ కథల పోటీలను నిర్వహిస్తోంది. కథల స్వీకరణకు చివరి గడువు ఈ నెల 31. వివరాలకు.. ఎస్. లక్ష్మీ మోహన్ – 98489 02520 12న కొర్నెపాడులో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 12 (ఆదివారం)న పుట్టగొడుగుల పెంపకంపై మహిళా రైతు కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 97053 83666. ఫిబ్రవరిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన–2020 బెంగళూరు హెసరఘట్ట లేక్ పోస్ట్ ప్రాంతంలోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆవరణలో ఫిబ్రవరి 5(శుక్ర) నుంచి 8వ తేదీ వరకు జాతీయ ఉద్యాన ప్రదర్శన –2020 జరగనుంది. వైవిధ్యభరితమైన అనేక రకాల పండ్లు, పూలు, కూరగాయలను పండించడంతోపాటు వాటిని యంత్రాల తోడ్పాటుతో ఉత్పత్తులుగా మార్చి వినియోగదారుల దగ్గరకు చేర్చుకునే వ్యూహాలపై ఐఐహెచ్ఆర్ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ ఉద్యాన ప్రదర్శనలో కొత్త వంగడాలు, కొత్త ప్రాసెసింగ్ యంత్రాలు, మార్కెటింగ్ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతారు. -
సేంద్రియ ‘స్వాహా’యం!
సాక్షి, ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఉలవపాడు ప్రాంతం మామిడికి పేరెన్నిక గన్నది. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి కేరళకు చెందిన జిజో జోసెఫ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా మరో 7 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ద రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ జిజో జోసెఫ్కుగ్రిక ఇంటర్నేషనల్ కాంపెటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అల్చర్ (ఇకోవా) అనే సంస్థ ఉంది. దీని పేరుతో టీడీపీ హయాంలో ఉలవపాడు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించటం, వారిని ప్రోత్సహించటంలాంటివి చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2016 సంవత్సరం మే నెలలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ను ప్రభుత్వంతో ఇకోవా సంస్థ కుదుర్చుకుంది. అప్పటి నుంచి మామిడి రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అంతా కాగితాలపైన, రికార్డుల్లోనే చూపించి రైతులను నిలువునా మోసం చేయటంతో పాటు లక్షలాది రూపాయలు దిగమింగారు. రూ. 50 లక్షలకు పైగా నిలువు దోపిడీ ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరుతో ఇకోవా సంస్థ చేపట్టిన సేంద్రియ సాగు పేరిట దాదాపు రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మామిడి రైతులను సేంద్రియ సాగు వైపు మరలించటానికిగాను ఇకోవా ఉలవపాడు మండలంలోని 7 గ్రామాలను ఎంపిక చేసుకుంది. ఉలవపాడుతో పాటు బద్దిపూడి, చాకిచర్ల, వీరేపల్లి, భీమవరం, ఆత్మకూరు, కరేడు గ్రామాల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ. కోటికి పైగా నిధులు రాబట్టుకుంది. అందుకుగాను ఈ ఏడు గ్రామాల్లోని 442 మంది రైతులకు సంబంధించి 500 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు. మూడేళ్ల పాటు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో హెక్టారుకు శిక్షణ తరగతులకు, అవగాహన సదస్సులకు రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ మూడేళ్లలో రెండు మూడు అవగాహన సదస్సులు మినహా పెట్టింది లేదు. అంటే 500 హెక్టార్లకు ఒక్కో హెక్టారుకు రూ. 10 వేలు చొప్పున రూ. 50 లక్షలు అవుతుంది. ఇంకెంత మోతాదులో దోచుకున్నారో ఇంకా లోతుకు వెళ్లి విచారిస్తే తప్ప పూర్తి దోపిడీ బయట పడదన్న విషయాలు అర్థమవుతున్నాయి. నోరు మెదపని ఉద్యానవన శాఖాధికారులు సేంద్రియ వ్యవసాయం పేరుతో భారీ దోపిడీ చోటుచేసుకున్నా జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులు నోరు మెదపటంలేదు. ఎందుకంటే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ పాత్ర దీని వెనుక ఉండటంతో జిల్లా స్థాయి అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకా జిల్లాలో ఇలాంటి సంస్థలు సేంద్రియ వ్యవసాయం పేరుతో ఎన్ని రూ. కోట్లు దోపిడీ చేశాయో అన్నది లోతుల్లోకి వెళ్లి చూస్తేకాని వెలుగుచూడవు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కార్యాలయమే లేని సంస్థ సేంద్రియ వ్యవసాయం పేరుతో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఇకోవా సంస్థకు ఉలవపాడులో అసలు కార్యాలయమే లేదు. అవసరమైన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది ఉండాల్సి ఉంటే ఇద్దరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగా కొందరు రైతులకు కషాయాలు కలుపుకోవటానికి డ్రమ్ములు మాత్రం ఇచ్చారు. ఇకపోతే సేంద్రియ ఎరువులు, మందులు పేరుతో తూ.. తూ మంత్రమే చేశారు. వర్మీ కంపోస్ట్ పేరుతో తెనాలి నుంచి మట్టి సంచులు కొందరు రైతులకు పంపిణీ చేశారు. -
మామి‘ఢీ’లా
వేసవి కాలం ప్రత్యేకం. రుచిలో మధురాతి మధురం. ఈ ఫలరాజం నమ్ముకున్న అన్నదాతకు లాభాల మాధుర్యాన్ని చవి చూపించే సందర్భాలు ఏటా ఉండవు. ఒక ఏడాది కాపునిస్తే మరో ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ దఫా జిల్లాలో మామిడి సాగు కష్టంగా మారింది. తీవ్ర వర్షాభావంతో మామిడి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయి తడులు తడిపే పరిస్థితి లేదు. ట్యాంకర్లు ద్వారా నీరు పోయాలన్నా దొరకని పరిస్థితి. అధిక వ్యయం భరించలేని స్థితిలో రైతన్న కూరుకుపోయాడు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల మామిడి తోటలు కళ్ల ముందే ఎండుపోతుంటే.. రైతులు కన్న ఆశలు అడియాసలవుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయగిరి: జిల్లాలో 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఒకప్పుడు మామిడి సాగు లాభాసాటిగా ఉండేది. రానురాను వర్షాలు తగ్గిపోవడంతో వర్షాధారంపై ఆధార పడడంతో ఈ సాగులో ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. నీరులేక తోటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి దయనీయంగా మారింది. చుక్క నీరులేక తోటలు ఎండిపోతున్నాయి. మొదట రెండేళ్లు కొంత మేర తోటలను కాపాడుకున్న రైతులు ఈ ఏడాది మరింత దుర్భిక్షం నెలకొనడంతో తడులు అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 40 ఏళ్ల పాటు ఫలసాయం అందించే మామిడి తోటలు పట్టుమని పదేళ్లు కూడా గడవక ముందే ఎండిపోతున్నాయి. మామిడినే నమ్ముకున్న అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. భారంగా మారిన తోటల పెంపకం జిల్లాలో 10 వేల హెక్టార్లులో మామిడి తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కావలి, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలోని పలు మండలాల్లో తోటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో తోటలు నిలువునా ఎండుతున్నాయి. కలిగిరి, వింజమూరు, జలదంకి, ఆత్మకూరు, ఏఎస్ పేట,