గడ్డిఅన్నారం మార్కెట్ వద్ద సోమవారం ఉదయం మామిడి రైతులు ఆందోళనకు దిగారు
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్ వద్ద సోమవారం ఉదయం మామిడి రైతులు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి మామిడి పండ్ల లారీలను మార్కెట్‌లోకి అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రస్తుతం పండ్లను కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్, నల్గొండతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన లారీలు రోడ్డుపైనే ఉండటంతో అధికారులు జోక్యం చేసుకుని మార్కెట్లోకి పంపించారు. కానీ పండ్ల లోడును కొనుగోలు చేసేందుకు మాత్రం వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో పండ్ల మగ్గపెడుతున్నారన్న కారణంతో గడ్డిఅన్నారం మార్కెట్‌లోని 90 దుకాణాలకు అధికారులు అనుమతులు రద్దు చేశారు. దీనిపై వ్యాపారులు తీవ్ర నిరసన తెలుపుతూ మార్కెట్‌లో లావాదేవీలను నిలిపివేశారు. దీనిపై సమాచారం అందుకున్న మంత్రి జూపల్లి సోమవారం ఉదయం మార్కెట్ వద్దకు చేరుకుని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.