Gaddiannaram
-
డ్రైనేజీతో డేంజర్ వర్షం పడితే నరకమే..
-
అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. గడ్డిఅన్నారం కార్పొరేటర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న లంకా సుబ్రమణ్యం (24) కిడ్నాప్ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా తేల్చారు. సుబ్రమణ్యం తండ్రి లంకా లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ బృందం బాధితుడితో పాటు నిందితులను నల్లగొండ జిల్లా చింతలపల్లి వద్ద గుర్తించారు. కిడ్నాప్‌నకు గురైన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కార్పొరేటర్ అనుచరుడు శ్రవణ్ బంధువులను సైతం ఆయన వేధిస్తున్నాడని, అలాగే లక్ష్మీనారాయణ సోదరుడు లంకా మురళి కూడా తమ ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని శ్రవణ్‌ను వేడుకున్నాడు. ఈ విషయాలను శ్రవణ్ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వనస్థలిపురానికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పునీత్ తివారీతో మాట్లాడిన కార్పొరేటర్.. లక్ష్మీనారాయణకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కిడ్నాప్ చేసి కొట్టాలని పురమాయించాడు. 8 మందితో ముఠా ఏర్పాటు.. పునీత్ తివారి తన ఎనిమిది మంది స్నేహితులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. గురువారం అర్ధరాత్రి లంకా లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుమారుడు సుబ్రమణ్యం ఇంటి ముందు ఉన్నాడు. రెండు కార్లలో వెళ్లిన పునీత్ బృందం సుబ్రమణ్యాన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గమధ్యలో అతడిని చిత్రహింసలు పెట్టి నల్లగొండ జిల్లా చింతాలపల్లికి తీసుకెళ్లారు. ఈలోగా బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కార్పొరేటర్ సూచనల మేరకే తాము కిడ్నాప్‌నకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. కార్పొరేటర్‌తో పాటు పునీత్ తివారి అతని అనుచరులు పోతబోయిన మంజునాథ్, పాలపర్తి రవి, కందాల పవన్‌కుమార్, రవల హేమంత్, రేవళ్ల చంద్రకాంత్, బలివాడ ప్రణీత్, కుంభగిరి కార్తీక్, మరుపోజు రవివర్మలను సాయంత్ర 7 గంటల ప్రాంతంలో రిమాండ్‌కు తరించారు. కేసులో నందితులుగా ఉన్న శ్రవణ్ గౌడ్, లంకా మురళి, మహేష, సాయి కిరణ్‌లు పరారీలో ఉన్నట్లు ఏసీపి తెలిపారు. మరో కేసు నమోదు లంకా సుబ్రమణ్యం కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేసిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, పునీత్తివారి, రవివర్మ, హేమంత్‌లతో పాటు కార్పొరేటర్ మరో అనుచరుడు కోటేశ్వరరావులపై సరూర్‌నగర్ పోలీసులు మరో కిడ్పాప్ కేసు నమోదు చేశారు. పీఅండ్‌టీ కాలనీకి చెందిన భువనగిరి జయశంకర్, కార్పొరేటర్ అనుచుడు బొమిడిశెట్టి కోటేశ్వరరావుల మధ్య డబ్బు లావాదేవీలు ఉన్నాయి. ఇదే క్రమంలో గత నెల 28న రాత్రి 10 గంటల సమయంలో పునీత్ తివారి, రవివర్మ, కోటేశ్వరరావులు కారులో ఎక్కించుకుని సైదాబాద్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎదురుగా ఉన్న భవనంలోకి తీసుకెళ్లి డబ్బులు త్వరగా ఇవ్వాలని బెదిరించారు. అక్కడ నుంచి కార్పొరేటర్ కార్యాలయంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లాలని బెదిరించినట్లు కార్పొరేటర్ మిగిలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
మామిడి రైతుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్ వద్ద సోమవారం ఉదయం మామిడి రైతులు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి మామిడి పండ్ల లారీలను మార్కెట్లోకి అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రస్తుతం పండ్లను కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన లారీలు రోడ్డుపైనే ఉండటంతో అధికారులు జోక్యం చేసుకుని మార్కెట్లోకి పంపించారు. కానీ పండ్ల లోడును కొనుగోలు చేసేందుకు మాత్రం వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో పండ్ల మగ్గపెడుతున్నారన్న కారణంతో గడ్డిఅన్నారం మార్కెట్లోని 90 దుకాణాలకు అధికారులు అనుమతులు రద్దు చేశారు. దీనిపై వ్యాపారులు తీవ్ర నిరసన తెలుపుతూ మార్కెట్లో లావాదేవీలను నిలిపివేశారు. దీనిపై సమాచారం అందుకున్న మంత్రి జూపల్లి సోమవారం ఉదయం మార్కెట్ వద్దకు చేరుకుని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. -
కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్
178 ఎకరాల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేస్తాం: హరీశ్ ⇒ త్వరలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల: తలసాని ⇒ ఈ ఏడాది సిద్దిపేటలో మెడికల్ కాలేజీ: లక్ష్మారెడ్డి ⇒ పాల కల్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీనివాస్‌గౌడ్, సోలిపేట సాక్షి, హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలించాలని నిర్ణయిం చినట్లు మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకు కోహెడలో 178.09 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించామని, అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కేవలం 22 ఎకరాల్లోనే ఉందని, దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో సరైన సదుపాయాల్లేక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే నగరం మధ్యలో ఉండటం వల్ల మార్కెట్‌కు వాహనాల రద్దీ పెరిగినప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న కోహెడకు మార్కెట్‌ను తరలిస్తున్నామన్నారు. అక్కడ భూములు కోల్పోయే వారికి ఒక్కొక్కరికి రూ.7.40 లక్షల చొప్పున రూ.9.38 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికే చెల్లించామన్నారు. అక్కడ మార్కెట్ ఏర్పాటుపై రాష్ట్ర అధికారులు ముంబై, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారని, ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నారని, ఆ తర్వాతే అవసర మయ్యే నిధులపై స్పష్టత వస్తుందన్నారు. పాల కల్తీపై అధికార పార్టీ సభ్యుల ఫైర్ పాల కల్తీ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అధికార పార్టీ సభ్యులే ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదటగా ఈ అంశాన్ని శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తుతూ... హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంటే కేవలం 5 లక్షల లీటర్ల ఉత్పత్తే ఉందని, ఇదే అదనుగా చిక్కదనం కోసం పాలల్లో యూరియా కలుపుతూ ప్రైవేటు సంస్థలు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పశువులకు ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్లు ఇస్తున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని సూచించారు. దీన్నుంచి బయట పడేయాలంటే నగరంలో విజయ డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. పర్యాటకప్రాంతాలు, జాతీయ రహదారుల్లో విజయ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కల్తీపై మాత్రం స్పందించలేదు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ మరోసారి మాట్లాడుతూ.. ‘‘50 శాతం పాలల్లో కల్తీ ఉంది. దీని నిరోధానికి చట్టం తేవాలి. కల్తీకి పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. హెరిటేజ్ వంటి సంస్థలు కోట్లు సంపాదిస్తుంటే విజయ డెయిరీ మాత్రం నష్టాల్లో ఉండటం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ... పాల కల్తీ నిజమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ వంటి సంస్థలు విజయ డెయిరీ ఉత్పత్తులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. మరో సభ్యుడు చెన్నమనేని రమేశ్ సైతం.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెండేళ్లలో లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగిందంటే తాను నమ్మనని అన్నారు. ఒకేసారి అధికార సభ్యులంతా దాడి చేయడంతో తలసాని కొద్దిగా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. పశు సంచార వైద్యశాలలకు 28 కోట్లు: తలసాని రాష్ట్రంలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ బడ్జెట్లో ఇందుకు రూ.28.45 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆరూర్ రమేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. ఎల్లారెడ్డి వంటి నియోజకవర్గాల్లో పశుసంపద ఎక్కువగా ఉన్న దృష్ట్యా, అక్కడ అవసరమైన డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కాగా.. ఈ ఏడాది సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 700 మెడికల్ సీట్లు, 221 పీజీ కోర్సుల్లో సీట్లు పెరిగాయన్నారు.