కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ | gaddi annaram fruit market shifted to koheda | Sakshi
Sakshi News home page

కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌

Published Thu, Mar 23 2017 2:28 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌

కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌

178 ఎకరాల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేస్తాం: హరీశ్‌
త్వరలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల: తలసాని
ఈ ఏడాది సిద్దిపేటలో మెడికల్‌ కాలేజీ: లక్ష్మారెడ్డి
పాల కల్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీనివాస్‌గౌడ్, సోలిపేట


సాక్షి, హైదరాబాద్‌: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలించాలని నిర్ణయిం చినట్లు మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకు కోహెడలో 178.09 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించామని, అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్‌ కేవలం 22 ఎకరాల్లోనే ఉందని, దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో సరైన సదుపాయాల్లేక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

అలాగే నగరం మధ్యలో ఉండటం వల్ల మార్కెట్‌కు వాహనాల రద్దీ పెరిగినప్పుడు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఔటర్‌రింగ్‌ రోడ్డుకు దగ్గరలో ఉన్న కోహెడకు మార్కెట్‌ను తరలిస్తున్నామన్నారు. అక్కడ భూములు కోల్పోయే వారికి ఒక్కొక్కరికి రూ.7.40 లక్షల చొప్పున రూ.9.38 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికే చెల్లించామన్నారు. అక్కడ మార్కెట్‌ ఏర్పాటుపై రాష్ట్ర అధికారులు ముంబై, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారని, ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నారని, ఆ తర్వాతే అవసర మయ్యే నిధులపై స్పష్టత వస్తుందన్నారు.

పాల కల్తీపై అధికార పార్టీ సభ్యుల ఫైర్‌
పాల కల్తీ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను అధికార పార్టీ సభ్యులే ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదటగా ఈ అంశాన్ని శ్రీనివాస్‌గౌడ్‌ లేవనెత్తుతూ... హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాల డిమాండ్‌ ఉంటే కేవలం 5 లక్షల లీటర్ల ఉత్పత్తే ఉందని, ఇదే అదనుగా చిక్కదనం కోసం పాలల్లో యూరియా కలుపుతూ ప్రైవేటు సంస్థలు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పశువులకు ఆక్సిటోసిన్‌ వంటి ఇంజెక్షన్లు ఇస్తున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని సూచించారు. దీన్నుంచి బయట పడేయాలంటే నగరంలో విజయ డైరీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. పర్యాటకప్రాంతాలు, జాతీయ రహదారుల్లో విజయ్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కల్తీపై మాత్రం స్పందించలేదు. దీంతో శ్రీనివాస్‌గౌడ్‌ మరోసారి మాట్లాడుతూ.. ‘‘50 శాతం పాలల్లో కల్తీ ఉంది. దీని నిరోధానికి చట్టం తేవాలి. కల్తీకి పాల్పడే వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలి. హెరిటేజ్‌ వంటి సంస్థలు కోట్లు సంపాదిస్తుంటే విజయ డెయిరీ మాత్రం నష్టాల్లో ఉండటం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ... పాల కల్తీ నిజమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ వంటి సంస్థలు విజయ డెయిరీ ఉత్పత్తులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. మరో సభ్యుడు చెన్నమనేని రమేశ్‌ సైతం.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెండేళ్లలో లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగిందంటే తాను నమ్మనని అన్నారు. ఒకేసారి అధికార సభ్యులంతా దాడి చేయడంతో తలసాని కొద్దిగా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది.

పశు సంచార వైద్యశాలలకు 28 కోట్లు: తలసాని
రాష్ట్రంలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఇందుకు రూ.28.45 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆరూర్‌ రమేశ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. ఎల్లారెడ్డి వంటి నియోజకవర్గాల్లో పశుసంపద ఎక్కువగా ఉన్న దృష్ట్యా, అక్కడ అవసరమైన డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు.

పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు: లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కాగా.. ఈ ఏడాది సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 700 మెడికల్‌ సీట్లు, 221 పీజీ కోర్సుల్లో సీట్లు పెరిగాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement