ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న లంకా సుబ్రమణ్యం (24) కిడ్నాప్ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా తేల్చారు. సుబ్రమణ్యం తండ్రి లంకా లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌ఓటీ బృందం బాధితుడితో పాటు నిందితులను నల్లగొండ జిల్లా చింతలపల్లి వద్ద గుర్తించారు. కిడ్నాప్‌నకు గురైన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఎసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కార్పొరేటర్ అనుచరుడు శ్రవణ్ బంధువులను సైతం ఆయన వేధిస్తున్నాడని, అలాగే లక్ష్మీనారాయణ సోదరుడు లంకా మురళి కూడా తమ ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని శ్రవణ్‌ను వేడుకున్నాడు. ఈ విషయాలను శ్రవణ్ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వనస్థలిపురానికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పునీత్ తివారీతో మాట్లాడిన కార్పొరేటర్.. లక్ష్మీనారాయణకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కిడ్నాప్ చేసి కొట్టాలని పురమాయించాడు.
8 మందితో ముఠా ఏర్పాటు..
పునీత్ తివారి తన ఎనిమిది మంది స్నేహితులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. గురువారం అర్ధరాత్రి లంకా లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుమారుడు సుబ్రమణ్యం ఇంటి ముందు ఉన్నాడు. రెండు కార్లలో వెళ్లిన పునీత్ బృందం సుబ్రమణ్యాన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గమధ్యలో అతడిని చిత్రహింసలు పెట్టి నల్లగొండ జిల్లా చింతాలపల్లికి తీసుకెళ్లారు. ఈలోగా బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కార్పొరేటర్ సూచనల మేరకే తాము కిడ్నాప్‌నకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. కార్పొరేటర్‌తో పాటు పునీత్ తివారి అతని అనుచరులు పోతబోయిన మంజునాథ్, పాలపర్తి రవి, కందాల పవన్‌కుమార్, రవల హేమంత్, రేవళ్ల చంద్రకాంత్, బలివాడ ప్రణీత్, కుంభగిరి కార్తీక్, మరుపోజు రవివర్మలను సాయంత్ర 7 గంటల ప్రాంతంలో రిమాండ్‌కు తరించారు. కేసులో నందితులుగా ఉన్న శ్రవణ్ గౌడ్, లంకా మురళి, మహేష, సాయి కిరణ్‌లు పరారీలో ఉన్నట్లు ఏసీపి తెలిపారు.
మరో కేసు నమోదు
లంకా సుబ్రమణ్యం కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేసిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, పునీత్‌తివారి, రవివర్మ, హేమంత్‌లతో పాటు కార్పొరేటర్ మరో అనుచరుడు కోటేశ్వరరావులపై సరూర్‌నగర్ పోలీసులు మరో కిడ్పాప్ కేసు నమోదు చేశారు. పీఅండ్‌టీ కాలనీకి చెందిన భువనగిరి జయశంకర్, కార్పొరేటర్ అనుచుడు బొమిడిశెట్టి కోటేశ్వరరావుల మధ్య డబ్బు లావాదేవీలు ఉన్నాయి.
ఇదే క్రమంలో గత నెల 28న రాత్రి 10 గంటల సమయంలో పునీత్ తివారి, రవివర్మ, కోటేశ్వరరావులు కారులో ఎక్కించుకుని సైదాబాద్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎదురుగా ఉన్న భవనంలోకి తీసుకెళ్లి డబ్బులు త్వరగా ఇవ్వాలని బెదిరించారు. అక్కడ నుంచి కార్పొరేటర్ కార్యాలయంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లాలని బెదిరించినట్లు కార్పొరేటర్ మిగిలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ
జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment