చి‘వరి’కి తప్పని చినుకు దెబ్బ
దేవీపట్నంమండలం ఇందుకూరుపేటలో ధాన్యం బస్తాలను నీటిలో నుంచి బయటకు తెచ్చుకుంటున్న రైతులు
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీతోపాటు, మెట్టలోని తుని, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం, మండపేటలతోపాటు కోనసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న సామాన్యులు వర్షంతో సేదతీరినా.. అకాలంగా విరుచుకుపడ్డ చినుకులు వరి, మామిడి, జీడిమామిడి రైతులను నష్టపరిచాయి.
మెట్టలోని కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో మామిడి, జీడి మామిడి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజులు ఉంటే కోతలు దాదాపు పూర్తయ్యేవి. ఈ సమయంలో కురిసిన వర్షం వల్ల పక్వానికి వచ్చిన మామిడి, జీడిమామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఈ ఏడాది దిగుబడి పడిపోయిందని, ఆశపడ్డ లాభాలు రాకపోయినా.. వచ్చిదానితోనే తృప్తి పడదామనుకుంటే.. అకాలవర్షం మరికొంత దెబ్బ తీసిందని రైతులు వాపోతున్నారు. వర్షం కురిసినా.. దానికి ఈదురుగాలులు తోడు కాపోవడం కొంతలో కొంత నయమని, అదే జరిగితే కుదేలైపోయే వారమని అంటున్నారు.
ఆశలు రాల్చిన ‘1010’ వంగడం
గోదావరి డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు ప్రాజెక్టుల పరిధిలో రబీ సాగు ఆలస్యమైన శివారు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోనున్నారు. మెట్టతోపాటు, డెల్టాలో రబీ వరి కోతలు 80 శాతం పూర్తయినా.. సాగు ఆలస్యంగా ఆరంభించిన అమలాపురం, ముమ్మిడివరం, కరప, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట సబ్ డివిజన్లలో సుమారు 70 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాలేదు. మరో 50 వేల ఎకరాల్లో పంట పనల మీద, పొలం గట్ల మీద రాశులుగా ఉంది. వర్షానికి పనలు, రాశులు తడవడంతో రైతులకు ఎంతోకొంత నష్టం తప్పదు. రబీలో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా 1010 సన్నరకాలు సాగు చేశారు.
కోతలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ రకం పైరులో కొద్దిపాటి గాలి, వర్షానికే కంకుల నుంచి ధాన్యం నేల రాలుతుంటుంది. రోజంతా అడపాదడపా పెద్దపెద్ద జడులు పడిన చోట ధాన్యం రాలుడు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.
కాగా ‘ఒక్కరోజు కురిసిన వర్షం వల్ల పెద్దగా నష్టం ఉండదు. వర్షాలు ఇలాగే కొనసాగి పనల మీద ఉన్న చేలు ముంపుబారిన పడితే మాత్రం నష్టం తీవ్రత పెరుగుతుంది’ అని అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షానికి తడిసిన పనలను, ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు.