Indukurupeta
-
నా లైఫ్‌లో మధుర ఘట్టం అదే: ఎస్పీ బాలు
ఇందుకూరుపేట: మనిషి మనిషిగా జీవించడమే గాంధేయతత్వమని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గాంధీజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. తొలుత ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూల మాలవేససి నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బాపూజీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడతుతూ.. ప్రతి ఒక్కరూ గాంధీజీ చెప్పిన సత్యం, అహింస మార్గాలను పాటిస్తే చాలునన్నారు. ఈ తరం వారు గాంధీజీ సిద్ధాంతాలను పాటించట్లేదని, వీరిని చూస్తే మహాత్ముడు బాధపడేవారన్నారు. మహా గాయకుడు జేసుదాసు గాత్రం లేకపోతే గురువాయూర్‌లో సుప్రభాతం లేదని.. కానీ అదే ఆలయంలో ఆయనకు ప్రవేశం లేదన్నారు. దేవుడు అందరి వాడని.. మధ్యలో ఈ నిబంధనలు ఏంటని ప్రశ్నించారు. ఓ తెలుగు అనువాద చిత్రంలోని గాంధీజీ పాత్రకు తన స్వరం అందించానని.. అది జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టమన్నారు. జాతిపిత ప్రారంభించిన ఈ ఆశ్రమాన్ని దేవాలయంగా చూసుకోవాలని బాలసుబ్రహ్మణ్యం కోరారు. -
ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా
రంగులుపూసుకునేవాడికి పార్టీ ఎందుకని అనింది చంద్రబాబు చిత్తూరులో టీడీపీ జెండాలను తగలపెట్టింది బాబే వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి ఇందుకూరుపేట : ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. నోరు తెరిస్తే చంద్రబాబునాయుడు మాట్లాడేది అబద్ధాలేనని అని ఆయన మండిపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అతను అబద్ధాల కోరు అని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎన్టీ రామారావు కుమార్తెతో ఆయనకు పెళ్లి కుదిర్చింది ఆయన కుమారుడు జయకృçష్ణ, విశ్వేశ్వరరావులని చంద్రబాబునాయుడు అన్నాడన్నారు. అయితే వాస్తవానికి సంబంధం కుదిర్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడని తెలిపారు. ఎన్టీఆర్‌ను పార్టీపెట్టమని తానే సూచించానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడన్నారు. రామారావు పార్టీ స్థాపించే రోజుల్లో రంగులు పూసుకునే వాడికి రాజకీయాలు ఎందుకని అనింది చంద్రబాబునాయుడన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టించింది చంద్రబాబేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి ఆదేశిస్తే రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది చంద్రబాబేనన్నారు. అయితే హైదరాబాద్‌లో విలేకర్లు రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది మీరే కాదా అని ప్రశ్నిస్తే కాదని చంద్రబాబునాయుడు బుకాయించారన్నారు. చంద్రబాబును అప్పట్లో టీడీపీలో చేర్చుకునేందుకు నాదెండ్ల భాస్కరరావు, ఆయన వర్గం ఒప్పుకోలేదని, ఆ సమయంలో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర తీసుకోమని చెప్పారన్నారు. నిండు శాసనమండలిలో చంద్రబాబునాయుడు కార్చింది మొసలి కన్నీరన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు కన్నీళ్లు రాలేదా, అనారోగ్యంతో ఉన్న తండ్రి కర్జూరపునాయుడ్ని పీఏ రూంలో ఉంచి గాలికొదిలేనప్పుడు రాలేదనా కన్నీరు అని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిన్ను కన్న తల్లి అమ్మణ్నమ్మ తమను పట్టించుకోవడం లేదని ఇంటికి వెళ్లిన వారితో చెప్పినప్పుడు ఏమయ్యాయి ఆ కన్నీళ్లు అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతి చదివే లోకేష్‌ను ప్రధామంత్రి కావాలా అని ^è ంద్రబాబునాయుడు అడిగితే వద్దని చెప్పాడని, అందుకే కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు సుద్ద అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు అందుకు నిదర్శనమన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడింది లోకేష్ అని, కుల పిచ్చి, మతపిచ్చి ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకేనని మాట్లాడింది లోకేష్ అని ఆయన గుర్తు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందికూడా తానేనని చంద్రబాబునాయుడు చెప్పడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పీవీ సింధుకు రియో ఒలంపిక్సలో పతకం వచ్చేలా చేసింది తానేనని, గోపీచంద్‌కు శిక్షణ ఇచ్చింది తానేనని , రాష్ట్ర ప్రజలకు పెళ్లిళ్లు చేసింది తానేనని చెప్పినా ఆశ్చర్చపోనక్కర్లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరి శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు. -
నేరం మోపి... అగ్ని పరీక్ష పెట్టారు
ఇందుకూరుపేట (నెల్లూరు): మొబైల్ ఫోన్ చోరీ జరిగిందని.. నిజం నిగ్గుతేలాలంటూ అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించడంతో ఓ యువకుడి చేయి తీవ్రంగా కాలిపోయింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాముడుపాలెంకు చెందిన తిరువీధి లక్ష్మయ్య ఇందుకూరుపేటలోని ఓ ఇటుకలబట్టీలో పనిచేస్తున్న సోదరి సారమ్మ వద్దకు చుట్టపుచూపుగా వెళ్లాడు. ఇటుకలబట్టీ వద్ద ఉన్న సారమ్మ తన మొబైల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న ఓ నివాసంలో చార్జింగ్ కోసం పెట్టారు. కొంతసేపటికి ఆమె వెళ్లి చూసేసరికి ఫోన్ మాయమైంది. దీనిపై అక్కడున్న వారందరినీ ఆరా తీశారు. అయితే ఎంతకు ఈ విషయం తేటతెల్లం కాకపోవడంతో ఆగ్రహిస్తూ, సారమ్మ సోదరుడు లక్ష్మయ్యతోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అందరూ అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తే దొంగ ఎవరో తెలుస్తుందంటూ పట్టుబట్టాడు. బట్టీ యజమాని ఒత్తిడి మేరకు... అనుమానితులైన ముగ్గురు వ్యక్తుల అరచేతుల్లో కర్పూరం వెలిగించారు. వేడికి తాళలేక ఒక మహిళ, మరొక వ్యక్తి కర్పూరాన్ని పడేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే లక్ష్మయ్యను మాత్రం వెలిగించిన కర్పూరాన్ని కిందపడేస్తే దొంగ తనం చేసినట్లు అవుతుందని అనడంతో లక్ష్మయ్య అరచేయి కాలుతున్నా పడేయలేదు. దీంతో లక్ష్మయ్య అరచేయి తీవ్రంగా కాలిపోయింది. దీనిపై బాధితుడు గిరిజన సంఘం నాయకుల సహకారంతో సోమవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
చి‘వరి’కి తప్పని చినుకు దెబ్బ
దేవీపట్నంమండలం ఇందుకూరుపేటలో ధాన్యం బస్తాలను నీటిలో నుంచి బయటకు తెచ్చుకుంటున్న రైతులు అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీతోపాటు, మెట్టలోని తుని, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం, మండపేటలతోపాటు కోనసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న సామాన్యులు వర్షంతో సేదతీరినా.. అకాలంగా విరుచుకుపడ్డ చినుకులు వరి, మామిడి, జీడిమామిడి రైతులను నష్టపరిచాయి. మెట్టలోని కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో మామిడి, జీడి మామిడి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజులు ఉంటే కోతలు దాదాపు పూర్తయ్యేవి. ఈ సమయంలో కురిసిన వర్షం వల్ల పక్వానికి వచ్చిన మామిడి, జీడిమామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఈ ఏడాది దిగుబడి పడిపోయిందని, ఆశపడ్డ లాభాలు రాకపోయినా.. వచ్చిదానితోనే తృప్తి పడదామనుకుంటే.. అకాలవర్షం మరికొంత దెబ్బ తీసిందని రైతులు వాపోతున్నారు. వర్షం కురిసినా.. దానికి ఈదురుగాలులు తోడు కాపోవడం కొంతలో కొంత నయమని, అదే జరిగితే కుదేలైపోయే వారమని అంటున్నారు. ఆశలు రాల్చిన ‘1010’ వంగడం గోదావరి డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు ప్రాజెక్టుల పరిధిలో రబీ సాగు ఆలస్యమైన శివారు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోనున్నారు. మెట్టతోపాటు, డెల్టాలో రబీ వరి కోతలు 80 శాతం పూర్తయినా.. సాగు ఆలస్యంగా ఆరంభించిన అమలాపురం, ముమ్మిడివరం, కరప, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట సబ్ డివిజన్లలో సుమారు 70 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాలేదు. మరో 50 వేల ఎకరాల్లో పంట పనల మీద, పొలం గట్ల మీద రాశులుగా ఉంది. వర్షానికి పనలు, రాశులు తడవడంతో రైతులకు ఎంతోకొంత నష్టం తప్పదు. రబీలో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా 1010 సన్నరకాలు సాగు చేశారు. కోతలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ రకం పైరులో కొద్దిపాటి గాలి, వర్షానికే కంకుల నుంచి ధాన్యం నేల రాలుతుంటుంది. రోజంతా అడపాదడపా పెద్దపెద్ద జడులు పడిన చోట ధాన్యం రాలుడు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. కాగా ‘ఒక్కరోజు కురిసిన వర్షం వల్ల పెద్దగా నష్టం ఉండదు. వర్షాలు ఇలాగే కొనసాగి పనల మీద ఉన్న చేలు ముంపుబారిన పడితే మాత్రం నష్టం తీవ్రత పెరుగుతుంది’ అని అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షానికి తడిసిన పనలను, ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. -
రొయ్యల ప్లాంట్‌లో గ్యాస్ లీక్
ఇందుకూరుపేట, న్యూస్‌లైన్: రొయ్యల ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ పైపులైను లీకవడంతో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేటలోని ఓ రొయ్యల ప్లాంటులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 9 గంటలకు కార్మికులు ప్లాంట్‌కు చేరుకోగా, 10 గం టల సమయంలో గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు ప్రమాదాన్ని గుర్తించి బయటకు పరుగులు తీయగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, ఎన్సీడీ అధికారి ఈదూరు సుధాకర్, డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ శీనానాయక్, నెల్లూరు రూరల్ డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై సుధాకర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు సకాలంలో చికిత్స నెల్లూరు(బారకాసు): రొయ్యల ప్లాంట్‌లో అస్వస్థతకు గురైన వారిని రామచంద్రారెడ్డి ఆస్పత్రి, డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, విజయా కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులందరికీ సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని డీఎస్సార్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఉషాసుందరి తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ బి.లక్ష్మీకాంతం పరామర్శించారు. కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి కంపెనీపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. దాని ఆధారంగా కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
గాంధీజీ మార్గంలో పయనించాలి
పల్లెపాడు(ఇందుకూరుపేట), న్యూస్‌లైన్: జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని జేసీ లక్ష్మీకాంతం అన్నారు. మండలంలోని పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో గాంధీజీ 143 జయం తి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జేసీ మాట్లాడుతూ మనిషి తన జీవితంలో ఏం చదివాం, ఎంత సంపాదించాం అనే దానికంటే సమాజానికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యమన్నారు. గాంధీ ఆశ్రమాన్ని జిల్లాలో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గాంధేయ వాది వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం గాంధీజీ అని కొనియాడారు. ప్రజలతో గాంధీజీ మమేకమై సాధారణ జీవితాన్ని గడుపుతూ దేశానికి సేవ చేశారన్నారు. మనిషి ఉన్నతంగా ఆలోచించి తనకు ఎంత వరకు అవసరమో అంత వరకే తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతుగా ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనతరం క్విజ్,చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆశ్రమంలో రక్తదాన శిబిరం నిర్వహిచారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. డాక్టర్ సీవీరెడ్డి, ఇందిర దంపతులు అన్నదానానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, ఆశ్రమ కన్వీనర్ గణేశం కృష్ణారెడ్డి, సభ్యులు నెల్లూరు రవీంద్రరెడ్డి, నేదురుమల్లి సుబ్బారెడ్డి, సీహెచ్ నారాయణ, కె పోలయ్య, బి భాస్కర్, పోలయ్య, గాంధీజీ సిద్ధాంత ప్రచార కమిటీ అధ్యక్షుడు శివరామయ్య, మహిళా అధ్యక్షురాలు గూడూరు లక్ష్మి, ఏవీ సుబ్రహ్మణ్యం,సర్పంచ్ గూడూరు జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.