కాలిన అరచేతిని చూపుతున్న తిరివీధి లక్ష్మయ్య
ఇందుకూరుపేట (నెల్లూరు): మొబైల్ ఫోన్ చోరీ జరిగిందని.. నిజం నిగ్గుతేలాలంటూ అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించడంతో ఓ యువకుడి చేయి తీవ్రంగా కాలిపోయింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాముడుపాలెంకు చెందిన తిరువీధి లక్ష్మయ్య ఇందుకూరుపేటలోని ఓ ఇటుకలబట్టీలో పనిచేస్తున్న సోదరి సారమ్మ వద్దకు చుట్టపుచూపుగా వెళ్లాడు.
ఇటుకలబట్టీ వద్ద ఉన్న సారమ్మ తన మొబైల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న ఓ నివాసంలో చార్జింగ్ కోసం పెట్టారు. కొంతసేపటికి ఆమె వెళ్లి చూసేసరికి ఫోన్ మాయమైంది. దీనిపై అక్కడున్న వారందరినీ ఆరా తీశారు. అయితే ఎంతకు ఈ విషయం తేటతెల్లం కాకపోవడంతో ఆగ్రహిస్తూ, సారమ్మ సోదరుడు లక్ష్మయ్యతోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అందరూ అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తే దొంగ ఎవరో తెలుస్తుందంటూ పట్టుబట్టాడు.
బట్టీ యజమాని ఒత్తిడి మేరకు... అనుమానితులైన ముగ్గురు వ్యక్తుల అరచేతుల్లో కర్పూరం వెలిగించారు. వేడికి తాళలేక ఒక మహిళ, మరొక వ్యక్తి కర్పూరాన్ని పడేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే లక్ష్మయ్యను మాత్రం వెలిగించిన కర్పూరాన్ని కిందపడేస్తే దొంగ తనం చేసినట్లు అవుతుందని అనడంతో లక్ష్మయ్య అరచేయి కాలుతున్నా పడేయలేదు. దీంతో లక్ష్మయ్య అరచేయి తీవ్రంగా కాలిపోయింది. దీనిపై బాధితుడు గిరిజన సంఘం నాయకుల సహకారంతో సోమవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.