పరీక్ష భయంతో సీఏ విద్యార్థి, ఐటీ ఉద్యోగిని రిటోజ బసు
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
నగరంలో 18.. 28.. 29 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు, 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమైందని ఒకరు..ఈ జీవితం నచ్చలేదంటూ మానసిక వేదనతో మరొకరు.. పరీక్ష సరిగా రాయలేదనే భయంతో ఓ యువకుడు, అనారోగ్యం వేధిస్తోందని ఓ యువతి ఉసురు తీసుకున్నారు. క్షణికావేశం.. జీవితమంటే ఏర్పడిన భయం.. మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు ప్రాణాలు తీసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
1 ప్రియురాలికి వీడియో కాల్ చేసి..
ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ప్రియురాలికి వీడియో కాల్)(Video call) చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాములు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా జిల్లుండ జరడ గ్రామానికి చెందిన ధర్మ ప్రధాన్ (29) ఇరవై రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని అపర్ణ సైట్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. అక్కడే లేబర్ కాలనీలో నివాసం ఉంటూ మంగళవారం సాయంత్రం 4.55 గంటల సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
అంతకు ముందు చేతిపై కత్తితో కోసుకొని..ఆ తర్వాత వీడియో కాల్ చేసినట్లుగా ఎస్‌ఐ రాములు పేర్కొన్నారు. ప్రేమ వైఫల్యమే కారణమై ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. వీడియో కాల్ అందుకున్న యువతి హైదరాబాద్‌లో మరో సైట్‌లో పనిచేస్తున్న తమ బంధువులకు ఫోన్‌చేసి ధర్మ ప్రదాన్ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేసింది. వెంటనే వారు సైట్‌లోని లేబర్ కాలనీకి వచ్చి చూడగా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం మృతుడి బంధువులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
2 అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగిని ..
అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగి (IT employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మాదాపూర్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ చెందిన రిటోజ బసు(22) మాదాపూర్ సిద్దిఖ్‌నగర్ జోలో స్టెర్లింగ్ కో లివింగ్ హాస్టల్‌లో స్నేహితునితో కలసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు.
ఆమె స్నేహితుడు కోల్‌కత్తాకు చెందిన హర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక నెలక్రితమే హాస్టల్‌కు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ లోపే అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడికి గురైన రిటోజ బసు హాస్టల్ భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్లోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
3 జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్‌పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన ప్రకారం..జగిత్యాల జిల్లా బూగారం మండలం భోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గంతుల కుమార్ (28) ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బీకే గూడ సంజయ్ గాం«దీనగర్ కాలనీలో గంగాధర్ అనే స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు.
బుధవారం ఉదయం గంగాధర్ బయటికు వెళ్లి తిరిగి 10 గంటల సమయంలో రూమ్‌కు వచ్చాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో తలుపులు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ‘నాకు జీవితం నచ్చలేదు. నన్ను క్షమించండి’ అని నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
4 పరీక్ష భయంతో సీఏ విద్యార్థి
పరీక్ష సరిగా రాయలేదని ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి మండలం కరిటిగుడ్డ గ్రామానికి చెందిన రాజుశెట్టి కుమారుడు ఎస్.అమర్‌జీత్ (18) ఎస్‌ఆర్ నగర్ బాపూనగర్‌లోని జీవీ క్రేజీ పీజీ హాస్టల్‌లో ఉంటూ లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. 2024 డిసెంబరు 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష సరిగా రాయలేదని ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానేమో అని భయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గత జనవరి 27న మరో పరీక్ష రాయాల్సి ఉండటంతో తిరిగి నగరానికి వచ్చి హాస్టల్‌నే ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఆరోగ్యం బాగాలేదని రూమ్‌మేట్ సుబ్రమణ్యంతో చెప్పి గదిలో ఉండిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రమణ్యం వచ్చి చూడగా లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్‌జీత్ ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment