సుపారీ ఇచ్చి మరిదిని చంపించిన వదిన
మద్యం తాగుదామని తీసుకెళ్లి హతమార్చిన నిందితులు
వదినతో పాటు మరో ముగ్గురికి రిమాండ్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
బషీరాబాద్,వికారాబాద్: మండలంలోని నవల్గాలో మంగళవారం జరిగిన మాల శ్యామప్ప హత్య కేసును బషీరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ శంకర్‌తో కలిసి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నవల్గా గ్రామానికి చెందిన హతుడు మాల శ్యామప్పకు ఇంటి స్థలం విషయంలో వదిన మాల సుగుణమ్మతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
మరిదిని అంతమొందిస్తే అతని ఆస్తి తనకు దక్కుతుందని సుగుణమ్మ భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాల శివకుమార్, కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్‌తో రూ.50 వేలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. మాల శ్యామప్పకు శివకుమార్ వరుసకు తమ్ముడు.. కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్ స్నేహితులు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శివకుమార్, కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం మద్యం తాగుదామని శ్యామప్పను బైక్‌పై ఎక్కించుకొని నవల్గా గేటు సమీపంలోని రాథోడ్ మోహన్ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.. ఆ తర్వాత శ్యామప్ప తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు.
హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కన పడేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ శంకర్, సిబ్బంది 24 గంటల్లో ఛేదించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తాండూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మొదటి ముద్దాయి సుగుణమ్మను చర్లపల్లి జైలుకు, మిగతా ముగ్గురిని పరిగి సబ్‌జైల్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన ఎస్‌ఐ శంకర్, ఏఎస్‌ఐ నారాయణ, క్రైమ్ కానిస్టేబుళ్లు దస్తప్ప, నర్సింలు, ముని, ప్రతాప్ సింగ్‌కు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.
Vikarabad: ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన..
Comments
Please login to add a commentAdd a comment