basheerabad
-
జీపీల నిధులు వెంటనే విడుదల చేయాలి
బషీరాబాద్: పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన కేంద్ర నిధులను ఇతర పథకాలకు వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట అధికార బీఆర్ఎస్కు చెందిన దాదాపు 20 మంది సర్పంచులు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల (జీపీ) అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో ఎనిమిది నెలలుగా తమకు కేంద్ర నిధులు అందలేదని తెలిపారు. కాగా, గత వారంరోజుల్లో రెండు విడతలుగా కేంద్ర నిధులు జమయ్యాయని స్పష్టంచేశారు. కానీ జమైన నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పారు. జీపీల కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలకు కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్రం ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం, అభివృద్ధి పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎనిమిది నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయలేదని, దీంతో ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. అప్పులు తెచ్చి పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, నెలనెలా వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సంఘం నిధులు జమచేయాలని, లేదంటే బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేస్తామని సర్పంచులకు సర్ది చెబుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచులు ప్రియాంక, రవీందర్, భీమప్ప, శాంతిబాయి, విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథ్, హన్మీబాయి, నారాయణ, దేవ్‌సింగ్, అనురాధ, గాయత్రి, వీరమణి, వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
యువతిపై సర్పంచ్ అత్యాచారం
సాక్షి, వికారాబాద్: ఓ గ్రామ సర్పంచ్ పూటుగా తాగిన మైకంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని నిలదీసిన యువతి అన్నపై దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నంద్యానాయక్‌తండాలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన ఓ యువతి (21)మేకల కాపరిగా పనిచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా యువతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూసేందుకు వచ్చిన తమ బాబాయి పిల్లల్ని తిరిగి అప్పగించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది. పక్కనే సర్పంచ్ రాథోడ్ శంకర్ నాయక్ ఇల్లు ఉంది. యువతి తిరిగి వస్తుండగా అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్న శంకర్‌నాయక్ ఆమెకు మాయమాటలు చెప్పి మిద్దమీదకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పిల్లల్ని అప్పగించేందుకు వెళ్లిన తన చెల్లి ఇంకా ఇంటికిరాలేదని అటుగా వెళ్లిన యువతి అన్న అక్కడున్న పిల్లల్ని ఆరాతీయగా సర్పంచ్ తీసుకెళ్లాడని చెప్పారు. వెంటనే మిద్దెమీదకు వెళ్లి చూడగా జరిగిన దారుణం కంటబడింది. సర్పంచ్‌గా ఉంటూ ఇలాంటి పనులు చేస్తావా అని గట్టిగా నిలదీయగా అతడిపై శంకర్‌నాయక్ దాడికి పాల్పడ్డాడు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి రాకను చూసి సర్పంచ్ తప్పించుకున్నా డు. అయితే కొద్దిసేపటికే అతడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: (అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..) -
పంట చేలకు పరదాలుగా బతుకమ్మ చీరలు
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి. -
అయ్యో.. 5 లక్షల చేపలు మృత్యువాత
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలోని అక్కలమ్మ చెరువులో సుమారు 5 లక్షల చేపలు మత్యువాతపడ్డాయి. మైల్వార్ గ్రామానికి చెందిన 70 ముదిరాజ్ కుటుంబాలు చెరువులో చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం గతేడాది వర్షాకాలంలో 2 లక్షల చేపపిల్లలను వారికి అందించింది. మరో 3 లక్షల పిల్లలను వాళ్లు కొనుగోలు చేసి పెంచుతున్నారు. అయితే సోమవారం, మంగళవారం చెరువులోని చేపలు మత్యువాతపడి నీళ్లపై తేలాయి. రైతులు తుప్పలి కిష్టప్ప, గుండేపల్లి బుగ్గప్ప తదితరులు గమనించి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: ముందు పోలీస్ వాహనం.. వెనుకే ఆమె పరుగు.. Warangal: నా పెళ్లి ఆపండి సార్..! -
అనంత్‌రెడ్డి ఔట్!
బషీరాబాద్ : తీవ్ర అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన మండల పరిధిలోని నావంద్గి సొసైటీ చైర్మన్ అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. ఆయన అవినీతి వ్యవహారంపై గతంలో పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు విచారణ జరిపారు. చైర్మన్ అనంత్‌రెడ్డిని పర్సన్ ఇన్చార్జిగా కొనసాగించవద్దని డీసీఓ హరిణి పదిహేను రోజుల క్రితం ప్రభుత్వానికి మూడు పేజీల లేఖ రాశారు. చైర్మన్ స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రతిపాదిస్తూ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ వీరభద్రయ్యకు ఈనెల 5న లేఖ అందజేశారు. దీంతో పాటు సహకార సంఘం ఆర్థిక లావాదేవీలపైన జరిపిన ఆడిట్‌లోనూ అక్రమాలు జరిగినట్లు తేలాయి. ఈ రెండు అంశాలను పరిశీలించిన కమిషనర్ నావంద్గి సొసైటీ చైర్మన్ అనంత్‌రెడ్డిని తొలగించడంతో పాటు, పాలకవర్గాన్ని రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై సొసైటీ పరిపాలనను ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందుకు ప్రభుత్వం సహకార సంఘాల పదవీకాలాన్ని ఆరునెలల పాటు పొడగించింది. ఇది ఫిబ్రవరి 4తో ముగిసింది. ఈ క్రమంలో మరో ఆరునెలల పాటు ప్రస్తుత చైర్మన్లనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఇలా జిల్లాలోని అన్ని సహకార సంఘాలు కొనసాగింపునకు అర్హత సాధించాయి. నావంద్గి సొసైటీ మాత్రం కొనసాగింపు అర్హతను కోల్పోవాల్సి వచ్చింది. ఫలితమివ్వని పైరవీలు! సొసైటీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ డైరెక్టర్‌గా కొనసాగిన అనంత్‌రెడ్డి ఎలాగైనా తన పదవిని కాపాడుకోవాలని చివరి వరకు విశ్వ ప్రయాత్నాలు చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రిని ప్రాధేయపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వంలో పరపతి ఉన్న అధికార పార్టీ నాయకులను సైతం ఆశ్రయించారు. అక్కడ అభయం దొరకకపోవడంతో ఏకంగా సంఘంలోని ఓ ఉన్నతాధికారితో కాళ్లబేరానికి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తనను కొనసాగించాలని కోరారు. అదీ కూడా ఫలితమివ్వలేదు. చివరకు జిల్లాలోని తన సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నతాధికారులకు, మాజీ మంత్రి వద్దకు రాయబేరాలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సొసైటీ పాలకవర్గాన్నే రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. అయితేరద్దు విషయమై తనకు ఎలాంటి సమాచారం అందలేదని చైర్మన్ ‘సాక్షి’తో చెప్పారు. -
అనుమానం హత్యకు దారితీసింది
బషీరాబాద్ : అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్మాయి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సందాపురం భీమమ్మ(38), ఎల్లప్ప భార్యభర్తలు. వీరు చాలా కాలంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన తగాదాలతో ఐదేళ్ల పాటు విడిపోయారు. మళ్లీ పెద్దల సమక్షంలో పెట్టిన పంచాయతీతో ఐదు నెలల క్రితం మళ్లీ వీరిద్దరూ ఒక్కటయ్యారు. అప్పటి నుంచి వీరి కాపురం బాగానే సాగింది. అయితే రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భీమమ్మను భర్త ఎల్లప్ప వెంటనే రావాలని ఎక్మాయికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి 10 గంటల తర్వాత భార్యతో గొడవకు దిగాడు. తాను దూరంగా ఉన్న కాలంలో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శారీరకంగా హింసించాడు. అంతడితో ఆగకుండా ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భార్య భీమమ్మ తలపై విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో ఆమె ఇంట్లో అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యను తీవ్రంగా కొట్టి పారి పోతున్న భర్త ఎల్లప్పను గాలించి అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన ఊపిరితో ఉన్న భీమమ్మను బతికించేందుకు సీఐ 108కు సమాచారం అందించాడు. కాగా ఆ వాహనంలోని సిబ్బందిని భీమమ్మను పరీక్షించగా అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ ఘనటపై భీమమ్మ కొడుకు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎల్లప్పను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
బషీరాబాద్‌కు ‘భగీరథ’
బషీరాబాద్(తాండూరు) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ రానే వచ్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందించనున్న రక్షిత తాగునీరు ఇప్పటికే శ్రీశైలం నుంచి పరిగిలోని జాఫర్‌పల్లి డబ్ల్యూపీటీకి చేరింది. యాలాల మండలం పగిడ్యాల్ ఓహెచ్‌బీర్ ట్యాంకు నుంచి బషీరాబాద్ మండలం నవల్గ సంపు వరకు సుమారు 32 కి.మీ మేర నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ రక్షితè తాగునీరు కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలానికి చేరుకుంది. ఎక్కడ కూడా మోటార్లు ఉపయోగించకుండా కేవలం గ్రావిటీ మెథడ్తోనే (గురుత్వాకర్షణ పద్ధతి) పరిగిలోని జాఫర్‌పల్లి నుంచి బషీరాబాద్ మండలం నవల్గకు కృష్ణమ్మ నీరు పైపుల్లో పరుగులు పెట్టింది. పగిడ్యాల్ నుంచి నవల్గ వరకు నిర్వహించిన తొలి ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు మిషన్ భగీరథ సివిల్ ఇంజినీరు రాములు ప్రకటించారు. అయితే నీటి ఒత్తిడి కారణంగా యాలాల మండలంలోని హాజీపూర్ గేటు వద్ద పైపులైన్ జయింట్లో స్వల్ప లీకేజీ కావడంతో వరి పొలాల్లోకి నీళ్లు చేరాయి. తాండూరు మండలంలోని గోనూరు గేటు సమీపంలో ఎయిర్ వాల్వ్ ద్వారా నీళ్లు బయటకు చిమ్మాయి. అటు నుంచి నేరుగా నవల్గ చెరువు కట్ట సమీపానికి నీళ్లు చేరాయి. అయితే పైపులైన్లో ఉన్న మట్టితో ఒండ్రు నీళ్లు రావడంతో నవల్గ చెరువు కట్టకింద ఉన్న ఎయిర్ షవర్ వద్ద ఆ నీటిని వదిలేశారు. నవల్గ సమీపంలోని ప్రధాన సంపునకు కి.మీ దూరంలోకి రాగానే అధికారులు ట్రయల్ రన్‌ను నిలిపేశారు. తుదిదశకు ట్యాంకుల నిర్మాణం బషీరాబాద్ మండలంలోని రెండు ప్రధాన ఓహెచ్‌బీర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. మర్పల్లి దగ్గర 40వేల లీటర్ల ట్యాంకు ఇప్పటికే పూర్తికాగా, మాసన్పల్లి దగ్గర గల 60వేల లీటర్ల ట్యాంకు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. దీంతో పాటు నవల్గ సమీపంలో గల 1.5 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన సంపు, వాటర్‌ట్యాంకు నిర్మాణం కూడా పూర్తయ్యింది. తాండూరు నియోజక వర్గంలో రెండు ట్యాంకులకు మాత్రమే పంపుల ద్వారా నీటిని ఎక్కిస్తారు. వీటిలో మర్పల్లి దగ్గర ఉన్న 40 వేల లీటర్ల ట్యాంకుకు నవల్గ సంపు నుంచి 3 మోటర్ల ద్వారా నీటిని పంపిస్తారు. సెప్టెంబర్ 15వరకు గ్రామాలకు.. ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న మిషన్ భగీరథ పథకం నీళ్లు ఈ నెలాఖరు వరకు గ్రామాలకు చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. బషీరాబాద్ మండలంలో 39 గ్రామాల్లో రూ.24.51కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్ పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల పక్షం రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 15వరకు గ్రామాల్లోని ట్యాంకులకు నీళ్లను చేర్చాలని యంత్రాంగం పనుల్లో వేగాన్ని పెంచింది. ఇదిలా ఉండగా కృష్ణ వాటర్ బషీరాబాద్ మండలంలోని నవల్గకు చేరడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
దేశానికి తెలంగాణ దిక్సూచి
బషీరాబాద్(తాండూరు) : స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అమలు చేయనివిధంగా టీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని చెప్పారు. శనివారం ఆయన బషీరాబాద్ మండలం జీవన్గీ, దామర్‌చెడ్, బాద్లాపూర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కుంటుపడిపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. బీడుభూములను సాగులోకి తీసుకురావడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, నిరంతర ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర తదితర కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఖరీఫ్, రబీ రెండు పంటలకు రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ.8వేల పెట్టబడి సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ.12వేల కోట్లతో ఈ పథకాన్ని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతిగా నిలిచిందనడానికి అమలు చేస్తున్న పథకాలే నిదర్శనమని తెలియజేశారు. జిల్లాలో 243.33కోట్ల నిధులు ఈ ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయంగా ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో రెండో విడత కింద సాయం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి భూ వివాదాలతో కార్యాలయాల చుట్టూ తిరిగిన రైతులకు భూ ప్రక్షాళనలో భాగంగా సమస్యలను పరిష్కరించి నేరుగా రైతుల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలియజేశారు. రైతులు పెట్టుబడి సాయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకోకుండా కేవలం లాగోడి కోసమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా బషీరాబాద్ మండలంలో 12వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తాండూరు ఆర్డీఓ వేణు మాధవ్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధు పథకంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చిన హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళావతి, వైస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి జాకబ్, తహసీల్దార్ వెంటకయ్య, రైతు సమితి జిల్లా సభ్యుడు అజయ్ ప్రసాద్, మండల కోఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, జీవన్గీ, కాశీంపూర్, దామర్‌చెడ్ సర్పంచులు పద్మమ్మ, కుందేలు గంగమ్మ, సబిత, ఎంపీటీసీలు స్వరూప, అరుణ, రాజేందర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్లు నర్సిరెడ్డి, కాశీనాథ్, పంతులు, వ్యవసాయ శాఖ ఏడీఏ సచిన్దత్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఇంటి ఆవరణలో వందల పాములు
బషీరాబాద్(తాండూరు) : ఇంటి గుమ్మం పక్కన బండ కింద ఏకంగా 300 పాములు బయటపడ్డాయి. గమనించిన ఇంటి యజమాని గ్రామస్తుల సహాయంతో వాటిని కొట్టి చంపారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లి (జలాల్పూర్) గ్రామంలో శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన చాకలి మొగులప్ప అనే రైతు ఇంటి ముందు కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఓ పాము పిల్ల బండ కింద నుంచి బయటకు వచ్చింది. గమనించిన రైతు ఆ పామును కట్టెతో కొట్టి చంపాడు. మరికొద్ది సమయానికి ఒక్కొక్కటిగా పదుల సంఖ్యలో పాములు బయటకు రావడాన్ని గమనించి ఉలిక్కిపడ్డాడు. విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో నిమిషాల్లో ఇంటి ముందు జనం గుమిగూడారు. కట్టెలతో కొడుతూ వాటిని చంపారు. అనంతరం గుమ్మం చుట్టూ పరిచి ఉన్న నాపరాయి బండలను తొలగించడంతో కుప్పల కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సుమారు 300 పాములు, పాము గుడ్లు బయట పడ్డాయి. వాటన్నింటినీ ఒక దగ్గర వేసి కిరోసిన్ పోసి నిప్పింటించారు. ఇప్పటి వరకు తాము ఇంత పెద్ద మొత్తంలో పాములను చూడలేదని ఇంటి యజమాని మొగులప్ప తెలిపారు. విష సర్పాలు అయినందుకే గ్రామస్తులతో కలిసి చంపామని వివరించారు. బయట పడిన పాములు చాలా విషపూరితమైనవిగా గ్రామస్తులు తెలిపారు. అయితే గుడ్లు పెట్టిన తల్లి పాము జాడ మాత్రం కనిపించలేదని చెబుతున్నారు. సంఘటనపై వన్యప్రాణుల అధికారులు పరిశీలన జరిపి గ్రామస్తుల అనుమానాలను తొలగించాలని కోరుతున్నారు. -
పేట్ బషీరాబాద్‌లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: నగరంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. బ్యాంకు కాలనీలో మంగళవారం నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మీ బాయి అనే మహిళ మెడలోని 5 తులాల పుస్తెల తాడును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇసుక పర్మిట్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇల్లు కట్టుకునేందుకు ఇసుకకు పర్మిట్ ఇమ్మని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని విసుగుచెందిన అంబాజీ అనే వ్యక్తి బుధవారం ఉదయం కిరోసిన్ క్యాన్‌తో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అధికారులు చూస్తుండగానే కిరోసిన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అంబాజీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాండూరు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినా తనకు ఇసుక పర్మిట్ లభించలేదని బాధితుడు పేర్కొన్నాడు. -
రైతన్న బలవన్మరణం
బషీరాబాద్ (రంగారెడ్డి జిల్లా) : బషీరాబాద్ మండలం దామరచేడ్ పంచాయతీ నంధ్యానాయక్ తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అప్పులపాలైన రాథోడ్ ధన్సింగ్(40) అనే రైతు ఊరి చివరన ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధన్సింగ్కు సుమారు రూ.2 లక్షల అప్పు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఆరుగురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు వాపోతున్నారు. -
మహిళ దారుణ హత్య
బషీరాబాద్ (రంగారెడ్డి) : ఓ మహిళను గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అయితే ఈ హత్య క్షుద్ర పూజల నేపథ్యంలో జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి బషీరాబాద్ మండలంలో ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... మండలంలోని మంతట్టి గ్రామానికి చెందిన నర్సమ్మ(46)ను శనివార అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకొసి చంపేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరును బట్టి క్షుద్రపూజల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు బలవన్మరణం
బషీరాబాద్ (రంగారెడ్డి) : సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లాలోని యాలాల మండలం ఇంకెపల్లి గ్రామానికి చెందిన కాశప్ప(40) అనే రైతు బషీరాబాద్ మండలంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా లేకపోవడం, చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో కాశప్ప.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య
రంగారెడ్డి (బషీరాబాద్) : కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన మానెప్ప, పవిత్రమ్మలు భార్యాభర్తలు. పది సంవత్సరాల క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ కోడలు పవిత్ర, తన అత్త,మామ,భర్తపై కేసు పెట్టింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు. కాగా వీరు కేసుల నుంచి బయటపడేందుకు సగం ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా మానెప్ప ఇంట్లో చెప్పాపెట్టకుండా వేరే ఊరికి చెందిన మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పవిత్ర మరోసారి వీరిపై కేసు పెట్టింది. దీంతో కేసుల బాధ భరించలేక అత్త మాణిక్యమ్మ(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి తూకాల్లో మోసం
బషీరాబాద్: పత్తి తూకాల్లో దళారులు మోసం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వివరాలు.. మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామానికి తాండూరుకు చెందిన వ్యాపారి కాసిం పాషా పత్తి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. రూ. 3800 చొప్పున దాదాపు 30 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాడు. అయితే ఆ సమయంలో తూకాల్లో మోసం ఉన్నట్లు కొందరు రైతులు గమనించారు. దీంతో వారు కాసిం పాషాను చుట్టుముట్టి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యాపారిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమవగా రైతులు అడ్డుకున్నారు. వ్యాపారి స్టేషన్‌కు వెళితే తమకు న్యాయం జరగదని, ఇక్కడే పంచాయతీ తేల్చాలని పట్టుబట్టారు. తూకాల్లో క్వింటాలుకు 15 కిలోల వరకు మోసం జరిగిందని రైతులు ఆరోపించారు. కొనుగోలు చేసిన పత్తికి క్వింటాలుకు 15 కిలోల చొప్పున అదనంగా చెల్లించి పత్తి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. చివరకు క్వింటాలుకు ఐదు కిలోలకు అదనంగా డబ్బులు చెల్లిస్తానని కాసిం పాషా చెప్పడంతో రైతులు అంగీకరించారు. అయితే తూకాల్లో మోసాలు జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో తాము దళారుల చేతుల్లో నిలువునా మోసం పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రబీకి సిద్ధమవుతున్న రైతన్న
బషీరాబాద్: రబీ సీజన్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూ ములను దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. చెరువులు నీటితో కళకళలాడుతుండటంతో వేరుశనగ పంట కోసం విత్తనాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా మారారు. అక్టోబర్ మొద టి వారం నుంచి రైతులు వేరుశనగ విత్తుకునేందుకు అనుకూలమని బషీరాబాద్ మండల వ్యవసాయాధికారి కృష్ణమోహన్ తెలిపా రు. నాలుగు నుంచి ఆరు నెలల క్రితం పండిన వేరుశనగ విత్తనాలను రైతులు విత్తుకోవాలని సూచించారు. ఏడాది క్రితం పండించిన విత్తనా లు వేస్తే దిగుబడి ఎక్కువగా రాదని తెలి పారు. నాణ్యత కలిగిన వేరుశనగను విత్తుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా అనుమానాలుం టే తమను సంప్రదించాలని ఆయన తెలిపారు. -
బాలారోగ్యానికి గ్రహణం..!
బషీరాబాద్ : జవహర్ బాలారోగ్య రక్ష పథకానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకోసం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని విద్యాశాఖ, వైద్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. అయితే విద్యాధికారులు మా కేందుకులే అంటు చేతులు దులుపుకుంటే వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో ప్రారంభమైన ఈ పథకం రెండేళ్లపాటు సజావుగానే సాగినా ఈ విద్య సంవత్సరంలో నిర్లక్ష్యానికి గురైంది. అమలుకు దూరం మండలంలో 50 ప్రాథ మిక, రెండు ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 6632 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్య,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో విద్యార్థులకు వారానికోసారి వైద్య పరీక్షలు చేయాలి. ఉచితంగా మందులు అందజేయాలి. అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందజేయాలి. ఆరోగ్యకార్డులో విద్యార్థుల వైద్య సమాచారాన్ని నమోదు చేయాలి. అయితే దీన్ని ఆచరణలో పెట్టడంలో విఫలం అవుతున్నారు. వైద్యులు ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలలోనూ వైద్య పరీక్షలు చేసిన దాఖలాలు లేవు.గ్రామాలలో ఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు సైతం పాఠశాలలను సందర్శించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే ఆస్పత్రులకే మొక్కుబడిగా వచ్చే వైద్యాధికారులు ఇక గ్రామాలలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు ఎం చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అక్రమాల పుట్ట పగులుతోంది!
బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్‌లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వర్నీ వదలం.. బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు. ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు. బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
వర్కవుట్ కాలేదని.. వదిలేసిపోయిన దొంగ
బషీరాబాద్: పెద్దేముల్ మండల కేంద్రంలోని బ్యాంక్‌లో దోపిడీ యత్నం ఘటనను జిల్లా వాసులు మరిచిపోకముందే మళ్లీ అలాంటిదే చోటుచేసుకుంది. ఓ దొంగ బషీరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించాడు. సీసీ కెమెరాలో అతడి కదిలికలు నమోదయయ్యాయి. బుధవారం పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్‌లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను అధికారులు ఏడాది క్రితం మండల కేంద్రానికి మార్చారు. బ్యాంక్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న భీంరావుకు చెందిన భవనంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:52 నిమిషాలకు ఓ దొంగ బ్యాంక్ గేటు తాళాలతో పాటు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అగ్గిపుల్లను వెలిగించిన అతడు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి పరిశీలించాడు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. దీంతో స్ట్రాంగ్ రూం గది తలుపులను తెరిస్తే బర్గ్లర్ అలారం మోగుతుందని దొంగ భావించాడేమో.. చోరీ కష్టమనుకున్నాడేమోమరి.. మూడు నిమిషాలపాటు బ్యాంకులో తచ్చాడి.. 1:55 నిమిషాలకు బయటకు వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బ్యాంకు గేట్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గమనించిన భవన యజమాని భీంరావు మేనేజర్ మల్లికార్జున్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మేనేజర్ పరిస్థితిని గమనించి ఎస్ఐ లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని మేనేజర్ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఓ దొంగ బ్యాంకులోకి రావడం.. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి.. మూడు నిమిషాల పాటు బ్యాంకులో గడిపి తిరిగి బయటకు వెళ్లిపోవడం అందులో నిక్షిప్తమయింది. తనొక్కడే చోరీ చేయడం సాధ్యం కాదని దొంగ వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ.. పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్ టీం సిబ్బందిని రప్పించారు. తలుపులు, తాళాలు, బ్యాంకులో క్లూస్ టీం సిబ్బంది వేలు ముద్రలు సేకరించారు. అనంతరం బ్యాంక్ సిబ్బంది నుంచి కూడా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం జరగడంతో బషీరాబాద్ మండలంలో బుధవారం కలకలం రేగింది. బ్యాంకులో ఎలాంటి దోపిడీ జరగకపోవడంతో ఖాతాదారులు, అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బషీరాబాద్‌లో కొన్ని దుకాణాలు తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి విరగ్గొట్టారు. కాగా ఎలాంటి చోరీ కాలేదు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
రైల్వే శాఖలో చలనం
బషీరాబాద్: ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ చేపట్టిన టీకాస్ ప్రయోగం ఆదివారం మరోసారి చేపట్టారు. రైలు ప్రమాదాలను పసిగట్టి ప్రమాదాలు జరగకుండా టీకాస్ పద్ధతిని ఈ ఏడాది ప్రవేశపెడతామని 5 నెలల క్రితం రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. టీకాస్ ప్రయోగం విజయవంతమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించారు. ఎదురెదురుగా రైళ్లు ప్రయాణించినా ప్రమాదం జరగకుండా వాటంతటవే నిలిచిపోయేలా రైల్వే శాఖ, ఆర్డీఎస్‌ఓల సంయుకాధ్వర్యంలో ట్రెయిన్ కొలిజన్ అవైడింగ్ సిస్టం (టీకాస్) ప్రయోగం సుమారు 20 నెలలుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కర్నెక్స్ కంపెనీకి చెందిన సిబ్బంది నవాంద్గి రైల్వే స్టేషన్లో సాంకేతిక పరికరాలు పరిశీలించారు. పది రోజుల పాటు ఆర్డీఎస్ఓ (టీకాస్) ప్రాజెక్టు డెరైక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక పరికరాలను కర్నెక్స్ కంపెనీ సిద్ధం చేసుకొంటోంది. నాలుగైదు నెలలు క్రితం టీకాస్ ప్రయోగం నిలిపివేసిన అధికారులు ఆదివారం టీకాస్ లోకో ఇంజిన్ రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నవాంద్గి- మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య తిరుగుతూ కనిపించింది. ప్రమాదాలు జరిగితే కానీ రైల్వే శాఖ కళ్లు తెరవదంటూ పలువురు విమర్శించారు. గత గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన పాఠకులకు విదితమే. -
రుణమాఫీ కోసం రైతన్న ఎదురుచూపు
బషీరాబాద్, న్యూస్‌లైన్: రెండు మూడేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న రుణాలు రైతులను మరింత ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు ఓట్ల కోసం రైతు రుణాలను మాఫీ చేస్తామని హమీలు గుప్పించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్.. వెంటనే పంట రుణాలు మాఫీ పథకం ఫైలుపై మొదటి సంతకం చేస్తారన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. అప్పు తీర్చాలని నోటీసులు జారీ చేస్తున్న బ్యాంకర్లు.. బషీరాబాద్ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు, 27 అనుబంధ గ్రామాలకు మూడు బ్యాంకులు, ఒక పీఏసీఎస్ ద్వారా రైతులకు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. అందులో బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఎస్బీహెచ్, డెక్కన్ గ్రామీణ బ్యాంకు, తాండూరు పట్టణంలో ఉన్న మరో బ్యాంకుతోపాటు మండల కేంద్రంలో ఉన్న నవాంద్గి పీఏసీఎస్ ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నారు. నాలుగు నెలల నుంచి పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేయడంతో రైతులు రుణాలు చెల్లించకుండా వెనుకడుగు వేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు బ్యాంకులు రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేశాయి. రుణాలు చెల్లించకపోతే బ్యాంకర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క నవాంద్గి పీఏసీఎస్ అధికారులు దీర్ఘకాలిక రుణాలు ఉన్న రైతుల భూములను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. అధికారుల ఒత్తిడికి బ్యాంకుల్లో రుణాలు చెల్లిస్తే.. కేసీఆర్ రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తే నష్టపోతామేమోనన్న భయంతో రైతులు ఉన్నారు. జూన్ రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్సార్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల మేలు కోసం ఫైలుపై మొదటి సంతకం చేశారు. వైఎస్సార్‌లాగే కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని రుణమాఫీ కోసం మొదటి సంతకం చేసి మాట నిలబెట్టు కోవాలని రైతులు ఆశిస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
బషీరాబాద్, న్యూస్‌లైన్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అత్తింటివారే ఆమెను చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన బషీరాబాద్‌లో గురువారం ఉదయం వెలుగుచూసింది. ఎస్ఐ పరమేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. బషీరాబాద్ గోసాయికాలనీకి చెందిన ఖాసీం పాషా 13 ఏళ్ల క్రితం కర్ణాటక సరిహద్దు గ్రామమైన షాబాద్‌కు చెందిన రిజ్వాన్‌బేగం(30)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఖాసీంపాషా స్థాని కంగా కిరాణాదుకాణం నిర్వహిస్తున్నాడు. 3 నెలల క్రితం ఈయన యాలాల మండలం ఘోరేపల్లికి చెందిన పర్వీన్‌బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్యను వేధించసాగాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి రిజ్వాన్‌బేగం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గొంతుకు తాడుతో ఉరివేసినట్లుగా కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. ఖాసీంపాషా సమాచారంతో రిజ్వాన్ బేగం తల్లిదండ్రులు బషీరాబాద్‌కు చేరుకున్నారు. రిజ్వాన్బేగంను భర్త ఖాసీంపాషా, అత్త బేగంబీ, మరిది అబ్దుల్ కరీం, ఆడపడుచు ఫరీదాబేగం కలిసి హత్య చేశారని ఆరోపించారు. గురువారం మృతురాలి సోదరుడు సలీం ఫిర్యాదు మేరకు తాండూరు రూరల్ సీఐ రవి, బషీరాబాద్ ఎస్ఐ పరమేశ్వర్గౌడ్లు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు ఖాసీంపాషాను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
దాడులు మరిచారు.. దావతు చేసుకున్నారు!
బషీరాబాద్, న్యూస్‌లైన్: అక్రమంగా కల్లు విక్రయిస్తున్న వారితో కలిసి ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లా విభాగం అధికారులు మజా చేసుకున్నారు. దామర్‌చెడ్ గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు 20 రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దామర్‌చెడ్‌తోపాటు మిగతా గ్రామాలలో దాడులు నిర్వహించేందుకు ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిసి మంగళవారం బయలుదేరారు. అయితే తమపై చర్యలు తీసుకోకుండా కల్లు దుకాణాల నిర్వాహకులు ఎత్తుగడ వేశారు. అధికారులకు చికెన్, మటన్, రోటీలతో బషీరాబాద్ గ్రామ శివారులో చింత చెట్టుకింద విందు ఏర్పాటు చేశారు. ఇంతటి రాచమర్యాదలు కాదనుకోవడం భావ్యం కాదనుకున్నారో ఏమో.. అధికారులు దావత్లో పాల్గొని దాడుల విషయం మరిచిపోయారు!. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న విలేకరులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో అక్రమంగా కల్లు విక్రయిస్తున్నారంటూ దామర్‌చెడ్‌లో ఆరుగురిని అరెస్టు చేసి తాండూరు తీసుకెళ్లారు. -
రెండేళ్లుగా వంటగదులకు వీడని గ్రహణం
తాండూరు, న్యూస్‌లైన్ : విద్యాశాఖ ఉదాసీన వైఖరితో మధ్యాహ్న భోజన పథకం వంటగదుల నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. దాదాపు రెండేళ్లుగా వంటగదుల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పథకం కింద పాఠశాల్లో వంటలు చేయడానికి ప్రత్యేకంగా గదులు నిర్మించేందుకు సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని పాఠశాలల్లో మొత్తం 99 వంటగదులు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 31 వంటగదుల నిర్మాణాలు జరిగాయి. ఇంకా 68 వంటగదుల నిర్మాణాలకు పునాది కూడా పడలేదు. పాఠశాల కమిటీ తీర్మానం మేరకు వంట గదుల నిర్మాణాలు చేపట్టాలి. ఒక్కొక్క గది నిర్మాణానికి రూ.75వేలచొప్పున నిధులు మంజూరు అయ్యాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరగాల్సి ఉంది. అయితే నిధులు మురుగుతున్నా వంటగదుల నిర్మాణాలకు మాత్రం మోక్షం కలగటం లేదు. దీంతో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీలు పాఠశాలల ఆవరణలో, చెట్ల కిందనో వంటలు చేయాల్సి వస్తోంది. విద్యాశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చొరవ చూపకపోవడంతో వంటగదుల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దాంతో రూ.51లక్షల నిధులు పంచాయతీరాజ్ శాఖ వద్ద మురుగుతున్నా పనులను చేయించడంలో సంబంధిత ఉన్నతాధికారులకు పట్టింపు లేకుండా పోయిందని స్పష్టమవుతోంది. అయితే మంజూరు చేసిన రూ.75వేల నిధులు వంటగదుల నిర్మాణానికి సరిపోవనే కారణంతో ఈ పనులు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో మండల పరిషత్ లేదా పంచాయతీల నుంచి ఒక్కొక్క గదికి అదనంగా రూ.25వేల నిధులు సమకూర్చుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ మేరకు అదనపు నిధులు ఇవ్వడానికి మండల పరిషత్, పంచాయతీలు విముఖత చూపాయి. దాంతో నిర్మాణాలకు మోక్షం కలగటం లేదని తెలుస్తోంది. బషీరాబాద్‌లో 31వంట గదులకు 13 నిర్మించారు. పెద్దేముల్లో 19కిగాను 5, తాండూరులో 26కిగాను 6, యాలాల మండలంలో 23వంటగదులకు గాను 7 మాత్రమే నిర్మించారు. వంటగదుల నిర్మాణాలు చేపట్టాలని పాఠశాల కమిటీలకు చాలాసార్లు చెప్పామని తాండూరు మండల విద్యాధికారి శివకుమార్ ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. కాగా, నిధులు సరిపోవనే కారణంతోనే ఈ పనులు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని పీఆర్ తాండూరు డీఈ తిరుపతయ్య చెప్పారు. రూ.75వేలతో పలు పాఠశాలల ప్రహారీలను కలుపుతూ కొన్ని వంట గదులు నిర్మాణాలు పూర్తి చేయించామని డీఈ వివరించారు.