బషీరాబాద్, న్యూస్‌లైన్: రెండు మూడేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న రుణాలు రైతులను మరింత ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు ఓట్ల కోసం రైతు రుణాలను మాఫీ చేస్తామని హమీలు గుప్పించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్.. వెంటనే పంట రుణాలు మాఫీ పథకం ఫైలుపై మొదటి సంతకం చేస్తారన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.
అప్పు తీర్చాలని నోటీసులు జారీ చేస్తున్న బ్యాంకర్లు..
బషీరాబాద్ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు, 27 అనుబంధ గ్రామాలకు మూడు బ్యాంకులు, ఒక పీఏసీఎస్ ద్వారా రైతులకు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. అందులో బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఎస్‌బీహెచ్, డెక్కన్ గ్రామీణ బ్యాంకు, తాండూరు పట్టణంలో ఉన్న మరో బ్యాంకుతోపాటు మండల కేంద్రంలో ఉన్న నవాంద్గి పీఏసీఎస్ ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నారు. నాలుగు నెలల నుంచి పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేయడంతో రైతులు రుణాలు చెల్లించకుండా వెనుకడుగు వేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు బ్యాంకులు రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేశాయి. రుణాలు చెల్లించకపోతే బ్యాంకర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆందోళనకు గురవుతున్నారు.
మరోపక్క నవాంద్గి పీఏసీఎస్ అధికారులు దీర్ఘకాలిక రుణాలు ఉన్న రైతుల భూములను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. అధికారుల ఒత్తిడికి బ్యాంకుల్లో రుణాలు చెల్లిస్తే.. కేసీఆర్ రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తే నష్టపోతామేమోనన్న భయంతో రైతులు ఉన్నారు. జూన్ రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్సార్..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల మేలు కోసం ఫైలుపై మొదటి సంతకం చేశారు. వైఎస్సార్‌లాగే కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని రుణమాఫీ కోసం మొదటి సంతకం చేసి మాట నిలబెట్టు కోవాలని రైతులు ఆశిస్తున్నారు.