heavy rainfall
-
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
దేశవ్యాప్తంగా సాధారణంకంటే అధిక వర్షపాతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణంకంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు 707.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 759.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వివరించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని, అందులో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయని తెలిపింది.తెలంగాణలో 581.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కన్నా 29 శాతం అధికంగా 751.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 373.6 మిల్లీమీటర్లకు గానూ 534.3 మిల్లీమీటర్లు అంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తెలంగాణలో ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవగా, ఏపీలో నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడినట్లు వివరించింది. అలాగే భారీ వర్షాల జాబితాలో తెలంగాణలో 11, ఏపీలో 21 జిల్లాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం ఉందని పేర్కొంది. దేశంలో అతిభారీ వర్షాలు కురిసిన జిల్లాలు అధికంగా తమిళనాడులో 19, రాజస్తాన్‌లో 14 జిల్లాలు ఉన్నాయని వెల్లడించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
సాక్షి కార్టూన్ 06-09-2023
-
వరిసాగు పైపైకి.. పప్పు ధాన్యాలు కిందకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు, పెరిగిన భూగర్భ జలాల లభ్యత కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు దేశ వ్యాప్తంగా 3.45 కోట్ల హెక్టార్లుగా ఉంటే ఈ ఏడాది అది 15 లక్షల హెక్టార్లు (4 శాతం) మేర పెరిగి 3.60 కోట్ల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు మాత్రం 6 శాతం మేర తగ్గింది. గత ఏడాది మొత్తంగా పప్పుధాన్యాల సాగు 1.26 కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది 12 లక్షల హెక్టార్ల మేర తగ్గి 1.14 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యిందని వివరించింది. ముఖ్యంగా కందుల సాగు బాగా తగ్గిందని వెల్లడించింది. -
హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
-
ఉత్తరాదిన విలయం సృష్టిస్తున్న వరదలు
-
ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఢిల్లీ: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధానిని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 153 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 40 ఏళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో వర్షం సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982 జులైలో మొదటిసారి ఇంత భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2-3 రోజులపాటు తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. #WATCH | Delhi wakes up to rain lashing several parts of the city; visuals from Mayur Vihar Phase II area pic.twitter.com/WVXuHMyR0E — ANI (@ANI) July 9, 2023 భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్ పాస్‌లను అధికారులు మూసివేశారు. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ -
Hyderabad: గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఖైరతాబాద్‌లో వాన భారీ ఎత్తున కురిసింది. బొమ్మల రామారం, తుర్కపల్లి లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురు గాలుల కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరింత కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) తప్పిన పెను ప్రమాదం ట్యాంక్ బండ్లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి భాగమతి టూరిస్ట్ బోటు ట్యాంక్ బండ్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. అయితే, అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులతో బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. బుద్ధ విగ్రహం చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో అదుపు తప్పిన బోటు, కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా బోట్‌ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. నిమ్మకాయంత సైజులో రాళ్లు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడటంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. తొగుట మండలం గుడికందుల, గోవర్ధనగిరిలో నిమ్మకాయంత సైజులో రాళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, బీబీ నగర్ లో ఉరుములు, మెరుపులతో కుడిన భారీ వర్షం కురిసింది. (Telangana: డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!) -
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు
చెన్నై: తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తంజావూరు, పుదుకోటై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నైరూతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం తమిళనాడులోని డెల్టా జిల్లాలైన పుదుకోటై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం, తెన్కాశి, తిరునల్వేలి జిల్లాలపై కూడా పడింది. అలాగే, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ అనేక చోట్ల వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. Tamil Nadu Rains: Schools, Colleges Shut In Thanjavur and Pudukottai Districts Amid Heavy Rainfall#TamilNaduRains #Thanjavur #Pudukottai #HeavyRainfall #IMDhttps://t.co/URLQXV6A0u — LatestLY (@latestly) February 4, 2023 వాయుగుండం రూపంలో ఎదురైన గండం డెల్టా అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ నష్టం పరిశీలనకు శుక్రవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగాయి. అధికంగా డెల్టా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. తంజావూరు, పుదుకోటై జిల్లాల్లోని వేలాది ఎకరాలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెల్టా జిల్లాలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట కూడా దెబ్బతింది. ఆయా జిల్లా అధికారులు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నారు. -
Hyderabad Alert: రాగల 24 గంటల్లో భారీ వర్షసూచన..
సాక్షి, హైదరాబాద్: ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగరంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆవర్తనం ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వందలాది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు జనం నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు పోటెత్తింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3, ఎల్బీనగర్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జియాగూడ, రాజేంద్రనగర్‌లలో 4.8 సెం.మీ చొప్పున నమోదైంది. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు.. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వర్షం సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో దంచికొట్టింది.. మచ్చబొల్లారం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేటలతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. చదవండి: ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గంటల తరబడి ట్రాఫిక్‌జాం జడివాన కారణంగా నగరంలో ట్రాఫిక్‌జాం సిటీజన్లకు చుక్కలు చూపించింది. వరద నీరు పోటెత్తడంతో సాయంత్రం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అత్యవసర బృందాలు నానా కష్టాలు పడ్డాయి. -
ఐటీ నగరిని ముంచెత్తిన భారీ వర్షాలు
-
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సీజన్లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది. -
పలిమెల.. విలవిల, మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో బంధం కట్
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఐదురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలురోడ్లు, బ్రిడ్జీలు కోతకు గురవడంతో రవాణా సౌకర్యం స్తంభించింది. ఏడు 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులుగా మండలానికి వెలుపల ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. మండలంలో 8 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 7,500 ఉంటుంది. ఈ మండలానికి మూడు వైపుల ఉన్న దారులు స్తంభించాయి. మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువగా మహదేవ్పూర్ మీదుగా జిల్లాకేంద్రానికి వస్తుంటారు. శనివారంరాత్రి ఆ దారిలోని పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలోని బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కనే పొలాల్లో ఉన్న ఏడు 33 కేవీ కరెంటు లైన్ స్తంభాలు కూలిపోయాయి. గర్భిణి రజితను వాగు దాటించి తీసుకొస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం దీంతో ఆ మండలం మొత్తానికి శనివారంరాత్రి నుంచి రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. తాగు, వంట, ఇతర అవసరాలకు వర్షపు నీరే దిక్కు అయింది. మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పలువురు యువకులు ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలతో సెల్ఫోన్లు చార్జింగ్ చేసుకొని అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మండల ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. గర్భిణులతోపాటు పాలు, కూరగాయల వ్యాపారులను వాగు దాటిస్తూ ఆపత్కాలంలో సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది పలుచోట్ల వాగులు దాటుకుంటూ వచ్చి నలుగురు గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి ప్రసవాలు చేశారు. పలిమెల, పంకేన గ్రామాలకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. మండల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ట్రాక్టర్ బ్యాటరీతో సెల్ చార్జింగ్ పలిమెల: విద్యుత్ సరఫరా లేక ఫోన్ చార్జింగ్కు ఇబ్బంది ఏర్పడటంతో ఒక రైతు వినూత్నంగా ట్రాక్టర్ బ్యాటరీతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఫోన్లు మూగబోయాయి. దీంతో మండల కేంద్రంలో వంగల శివ అనే రైతు సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ట్రాక్టర్ బ్యాటరీ సహాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. దానికి స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ట్రాక్టర్ నడిచేందుకు డీజిల్ తెచ్చి శివకు అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచుతూ ఫోన్లు చార్జింగ్ చేసుకుంటున్నారు. (క్లిక్: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు) -
Telangana Rains: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 10 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. గరిష్టంగా పెద్దపల్లి జిల్లా కనుకులలో 16 సెం.మీ వర్షం కురిసింది. తీవ్ర అల్పపీడనంగా మారి.. సోమవారం దక్షిణ ఒడిశా– ఉత్తర ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్ప పీడనంగా బలపడి ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. మరోవైపు సోమవారం నాటి ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్ ఈ రోజు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఇక రుతుపవన ద్రోణి మంగళవారం జైసాల్మర్, కోట, మాండ్ల, రాయిపూర్, ఝార్సిగూడ తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జిల్లాల్లో జోరు వాన ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో ఆరు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట పుష్కర్ ఘాట్ వద్ద పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల జలదిగ్భంధంలో చిక్కుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ కొండ పైనుంచి జారిపడటంతో ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి సాయి (21) మరణించాడు. ఉమ్మడి వరంగల్‌లో వర్షాలు, వరదలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లాలో 55 చెరువులు అలుగుపోస్తున్నాయి. సిద్దిపేట పట్టణం ఒకటో వార్డుకు చెందిన రామిరెడ్డి(70) అనే వృద్ధుడు కాలకృత్యాలకు వెళ్లగా బాత్రూమ్ గోడ కూలడంతో తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు ఉప్పొంగడంతో వంతెనల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా, జల్దా గ్రామం నుంచి 108లో గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా వంతెన కూలిపోవడంతో ఆమెను ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి 44 జాతీయ రహదారి పైకి తీసుకువచ్చి అటు నుంచి ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లాలో పంటచేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిర్మల్ నడిబొడ్డున గల ధర్మసాగర్ చెరువుకు బుంగపడటంతో పక్కనే ఉన్న గాజులపేట కాలనీని నీళ్లు చుట్టుముట్టాయి. ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 1,376 చెరువులుండగా.. ప్రస్తుతం అన్నీ నిండి అలుగు పారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మంచిర్యాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులు, బాలింతలను మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్: కూరగాయలపై వర్షాల ఎఫెక్ట్.. రేట్లు మరింత పెరిగే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! రాష్ట్రంలో ఉద్ధృతంగా కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి. పుంజుకోని దిగుమతులు మార్కెట్లకు శుక్రవారం నుంచి కూరగాయల దిగుమతులు రాలేదు. రోజు వంద శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అయితే గత నాలుగైదు రోజుల నుంచి 30–50 శాతం మాత్రమే నగర హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయినట్లు మార్కెటింగ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్‌కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్ 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లిలో మార్కెట్‌కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌కు 10 వేల క్వింటాళ్ల దిగుమతులు అవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ఎటపాక/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/ ధవళే శ్వరం/దేవీపట్నం/హోళగుంద/బుట్టాయగూడెం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉప నదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి.. 8.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంవల్ల సీతమ్మసాగర్‌లోకి 14,30,597 (123.62 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. విలీన మండలాల్లో రాకపోకలు బంద్ గోదావరికి వరద పోటెత్తడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక, రాయనపేట, నెల్లిపాక, వీరాయిగూడెం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి వరద చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు జాతీయ రహదారులపై నిలిచిపోయాయి. శబరి నది కూడా ఎగపోటుకు గురవుతోంది. దీంతో చింతూరు మండలంలో పలు వాగులు పొంగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద అధికంగా ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు సమకూర్చాలన్నారు. అలాగే, జ్వరాలు, డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్తగా లక్ష వాటర్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర నిత్యావసర సరకులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అంతేకాక.. వేలేరుపాడు, కుక్కునూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ అరుణ్‌బాబు, ఐటీడీఏ పీఓ జి.శ్రీనుకుమార్, ఆర్డీఓ ఎం.ఝాన్సీరాణి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత పోలవరం నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజీలో సోమవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 8,02,114 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 10.10 అడుగులకు పెరిగింది. నాలుగు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 7,98,114 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రికి బ్యారేజీలోకి పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముంది. ఎస్సారెస్సీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 15.70 మీటర్లు ఉంది. వరద ఉధృతి కారణంంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎస్పీ సురేష్‌కుమార్ రెడ్డి సోమవారం ఆయా గ్రామాలకు పడవపై లంకలోకి వెళ్లి వరద ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు. జూలై రెండో వారంలో ఈ స్థాయిలో గోదావరికి వరద రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆదివారం, సోమవారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో.. ముందుజాగ్రత్తగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 75 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. నారాయణపూర్ కూడా నిండుకుండలా మారడంతో ఆ డ్యామ్ గేట్లు కూడా మంగళవారం ఎత్తివేయనున్నారు. కృష్ణాలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే.. మరో ఐదు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశముంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ డ్యామ్‌లోకి 81 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 91 టీఎంసీలకు చేరుకుంది. మరో 9 టీఎంసీలు చేరితే తుంగభద్ర నిండుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పులిచింతల దిగువన బేసిన్లో కురిసిన వర్షాలకు 43 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతోంది. ఇందులో ఐదు వేల క్యూసెక్కులను డెల్టా కాల్వలకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 38 వేల క్యూసెక్కులను బ్యారేజ్ 50 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. వరదలకు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు రికార్డు స్థాయిలో గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం వరద పరిస్థితిని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఈఎన్సీ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం తొలగే వరకు ప్రజలను పునరావాస శిబిరంలో ఉంచి వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వరద పెరగడంతో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. ఫలితంగా.. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. దీనిని నిపుణుల బృందం పరిశీలిస్తోందని, వారిచ్చిన నివేదిక మేరకు కొత్తది నిర్మించాలా లేదా మరమ్మతులు చేయించాలా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. -
Heavy Rains: భారీ వర్షాలు
భారీ వర్షాలు -
తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు
రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు అలుపెరుగక పరుగెడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.. 1. ములుగు జిల్లాలో కొండలపై నుంచి జాలువారుతున్న ముత్యంధార 2. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల (బాహుబలి) జలపాతం 3. మహబూబాబాద్ జిల్లా మిర్యాలపెంట గ్రామశివారులోని ‘ఏడుబావుల’ ఉరకలు 4. నిర్మల్ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొచ్చర 5. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలోని మల్లెలతీర్థం. -
చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి. -
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు
-
AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.., తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో మదురై, విరుదునగర్ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
-
AP: 1,200 కి.మీ. రోడ్లకు గులాబ్ దెబ్బ
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను రాష్ట్రంలో రోడ్లను దెబ్బకొట్టింది. తుపాను తీవ్రతకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రహదారులు, భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల బృందాలు తుపానుకు దెబ్బతిన్న రోడ్లను రెండు రోజులుగా పరిశీలిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 306 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాలో 122, విశాఖపట్నం జిల్లాలో 355, పశ్చిమ గోదావరి జిల్లాలో 280, కృష్ణాజిల్లాలో 130 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో 100 వరకు కల్వర్టులు, మోరీలు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి ప్రస్తుతానికి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.50 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో మరమ్మతులకు మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అధికారుల బృందాలు రెండు రోజుల్లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపడతారు. అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మత్తులు: మంత్రి పెద్దిరెడ్డి వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై నివేదికలను తక్షణం సిద్ధం చేయాలని సూచించారు. మండలాల్లో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన రోడ్లను గుర్తించాలని, గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండిపోయిన రహదారులను పూర్తిచేయాలని సూచించారు. తాజాగా తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులకు ఆర్థిక చేయూత కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీవ్రతను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. తాజాగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి రైతునూ ఆదుకుంటాం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఒక్క ఎకరా పంటను కూడా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే జరిగిన నష్టంపై ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రాజెక్టులు నిండి పంటలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ మాత్రమైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. గత రెండేళ్లలో సీఎం జగన్ వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ‘కాలువ’వి అర్థం లేని విమర్శలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇతర పంటలు వేస్తున్నారన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఏనాడైనా అక్కడి ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. చివరకు హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు రాయలసీమ దుస్థితి తెలుసు కాబట్టే ఇక్కడి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాయలసీమ రైతుల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాం.. మూడు రోజుల నుంచి గులాబ్ తుపాను వల్ల పలుచోట్ల పంట నష్టం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. ఇప్పటివరకు 1,56,756 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అత్యధికంగా 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయన్నారు. అపరాలు, వేరుశనగ, పత్తి పంటలకు కూడా నష్టం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని చెప్పారు. 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా దాదాపు 6,800 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రైతులు ఒక్క ఎకరం నష్టపోయినా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చామన్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2014–2019 వరకు ధాన్యం సేకరణ, వరి కాకుండా మిగతా పంటలు చూస్తే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం 11,22,912 మెట్రిక్ టన్నుల పంటలను రూ.3,921 కోట్లతో కొనుగోలు చేసిందన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 19,39,987 మెట్రిక్ టన్నుల «పంటలను మొత్తం రూ.6,454 కోట్లతో కొనుగోలు చేసిందని చెప్పారు. -
తేరుకున్న గ్రామాలు
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. కోలుకుంటున్న విజయనగరం తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్‌లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొర్రెల కాపరి సురక్షితం విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గోడకూలి వృద్ధురాలి దుర్మరణం విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది. గోదావరి పరవళ్లు కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శరవేగంగా పునరుద్ధరణ పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్ శాఖ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్ 403, ట్రాన్స్ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు. -
ముంపు నీరు పోతే నష్టం ఉండదు
సాక్షి, అమరావతి: ‘గులాబ్’ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై కొంత మేర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఆరు జిల్లాల్లో దాదాపు 1,56,756 ఎకరాల్లో వ్యవసాయ, 6,463.65 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముంపునీరు పోయేందుకు వ్యవసాయ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌కు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. అలాగే, ముంపులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ముంపులో 1.16 లక్షల ఎకరాల వరిపంట ఇక వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా ప్రకారం.. వ్యవసాయ పంటలకు సంబంధించి 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న, 11,974 ఎకరాల్లో పత్తి, 4,708 ఎకరాల్లో మినుములు, 689 ఎకరాల్లో వేరుశనగ, 541 ఎకరాల్లో రాజ్మా, 466 ఎకరాల్లో చెరకు, 239 ఎకరాల్లో పెసలు, 150 ఎకరాల్లో మిరప, 62 ఎకరాల్లో పొగాకు, 25 ఎకరాల్లో రాగులు పంటలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే.. 3,260.9 ఎకరాల్లో అరటి, 1,517.5 ఎకరాల్లో మిర్చి, 1,105.85 ఎకరాల్లో కూరగాయలు, 376.55 ఎకరాల్లో బొప్పాయి, 136.75 ఎకరాల్లో పసుపు పంటలతో పాటు 22.75 ఎకరాల్లో పూల తోటలు ముంపునకు గురవగా, 374 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. పంటలను కాపాడుకోవచ్చు ముంపునకు గురైన పొలాల్లోని పంటలను కాపాడుకునేందుకు ఆర్బీకే స్థాయిలో వీడియో సందేశాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ముందు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు తగిన మోతాదుల్లో ఎరువులు, మందులు జల్లుకుంటే పంటలను కాపాడుకోవచ్చు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ పక్వానికొచ్చిన పండ్లను కోసేయండి ముంపునకు గురైన ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పే సూచనలను రైతులు పాటించాలి. పక్వానికి వచ్చిన అరటి, బొప్పాయి పండ్లను కోసెయ్యాలి. నేలకొరిగిన పంటలను నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. సీఓసీ, మాన్కోజెబ్ వంటి శిలీంద్ర సంహారిణిని రైతులకు అందించేందుకు ఆదేశాలిచ్చాం. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్ ఉద్యాన శాఖ ముంపు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలి మంత్రి కన్నబాబు ఆదేశం గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లోని అన్నదాతలకు అండగా నిలబడాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి సోమవారం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్నబాబు మాట్లాడుతూ.. ఈ ఆరు జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లుగా గుర్తించారన్నారు. వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా పర్యటించి రైతులకు అండగా నిలబడాలని.. రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని మంత్రి సూచించారు. ముంపునీరు తగ్గగానే ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు హెచ్. అరుణ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గులాబ్ తుపాను సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడిందని, మంగళవారం ఉదయం నుంచి దాని ప్రభావం తగ్గిపోతుందని పేర్కొంది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్త నం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. ఇప్పటికే 35శాతం అధికం జోరు వానలతో భారీగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి సీజన్లో సాధారణంగా ఇప్పటివరకు 70.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని.. ఈసారి సోమవారం ఉద యం వరకు 95.70సెంటీమీటర్లుగా నమోదైందని పేర్కొంది. సాధారణ వర్షపాతం కంటే ఇది 35% అధికమని తెలిపింది. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధికం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది. అప్రమత్తంగా ఉండండి భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ సోమవారం ఢిల్లీలో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర అధికారు లతో సమీక్షించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయం తో కృషి చేయాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇక సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పా టుచేసి పరిస్థితిని పర్యవేక్షించాలని.. ముఖ్య సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు తెలి యజేయాలని చెప్పారు. కాగా.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయా లని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. -
ఉత్తరాంధ్రలో కుండపోత
బలహీనపడిన తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిన తుపాను సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ ఒడిశా వైపు కదులుతూ అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుపాను వల్ల గాలులు 95 కిలోమీటర్ల వేగానికి పరిమితమవగా వర్షాలు మాత్రం విపరీతంగా కురిశాయి. అది కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలపైనా ప్రభావం ఉండటంతో అక్కడా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం వర్షం బాగా తెరిపి ఇవ్వొచ్చని వాతావరణ శాఖ పేర్కొనడం ఊరట కలిగిస్తోంది. సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: గులాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లాలో అనూహ్యంగా 11.8 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 సెం.మీ., విజయనగరం జిల్లాలో 8.9 సెం.మీ. సగటు వర్షం కురిసింది. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. నగర శివారులోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు 33.3 సెం.మీ. వర్షం కురిసింది. పెందుర్తిలో 28.8, గాజువాకలో 23.7, పరవాడలో 22.9 సెం.మీ. వర్షం పడింది. అడవివరంలో 31.9, న్యూ రైల్వే కాలనీలో 31.4, అప్పన్నపాలెం, ధారపాలెం ప్రాంతాల్లో 31.2 సెం.మీ. వర్షం పడింది. రైతుబజార్, కొత్తపాలెం, సింహాచలం ప్రాంతాల్లో 30 సెం.మీ. వర్షం పడింది. విశాఖ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 24.2, గంగవరంలో 22.4, నెల్లిమర్లలో 22.1, పూసపాటిరేగలో 20.7, సబ్బవరంలో 20.2 సెం.మీ. వర్షం పడింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 451 కేంద్రాల్లో 6సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. హుద్‌హుద్, తిత్లీ తర్వాత మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుపాను గులాబ్ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అందులో 99 శాతం మంది విశాఖ జిల్లా నుంచే ఉన్నారు. వీరికోసం 105 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 62 మండలాలపై తీవ్ర ప్రభావం వర్షాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 62 మండలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. విశాఖ జిల్లాలో 32, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 15 మండలాలు వర్షాల ధాటికి విలవిల్లాడాయి. వీటి పరిధిలో మొత్తం 375 గ్రామాల్లో ఎడతెగని వర్షాలు కురిసినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,800కు పైగా ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా విద్యుత్ శాఖ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. విశాఖ విమానాశ్రయంలోకి నీరు భారీ వర్షానికి తోడు, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు విశాఖ విమానాశ్రయంలోకి చేరింది. పాత, కొత్త టెర్మినళ్లలో మోకాలి లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊపిరి పీల్చుకున్న తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లాలో కుండపోత వర్షం పడినా పెద్దగా నష్టం కలిగించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కడియంలో 14 సెం.మీ, తాళ్లరేవులో 12.1, కరప, కాకినాడ అర్బన్, యు.కొత్తపల్లి, పెదపూడి, రాజమహేంద్రవరం రూరల్, ఆత్రేయపురం, అమలాపురాల్లో 10 సెం.మీ మించి వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలోని చావడికోట పంచాయతీ బొడ్లంక సమీపంలోని పెళ్లిరేవు వాగు ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో లలిత అనే మహిళను ప్రసవానికి తరలించాల్సి రావడంతో ఇబ్బందులెదురయ్యాయి. రహదారి ఇవతలి వైపు అంబులెన్స్ ఉంచి స్థానికులు ఆమెను స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. అవతల వైపు మరో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మారేడుమిల్లి పీహెచ్‌సీకి సకాలంలో తరలించారు. ‘పశ్చిమ’లో పొంగిన వాగులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెరిపిలేకుండా భారీవర్షాలు కురిశాయి. దెందులూరు–సానిగూడెం రహదారిలో సైఫన్ వద్ద గుండేరు వాగుకు గండి పడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దోసపాడు–కొవ్వలి గ్రామాల పరిధిలోని డ్రెయిన్లు పొంగాయి. కృష్ణాలో భారీ వర్షం కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం, జిల్లాలోనూ రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలోని చిట్టినగర్ వద్ద కొండచరియలు విరిగి పడటంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. జిల్లాలో అత్యధికంగా రెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడేపల్లిలో 33.25 సెం.మీ. వర్షపాతం గుంటూరు జిల్లాలో సోమవారం వేకువజామునుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. డెల్టా ప్రాంతంలో లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం 8 నుంచి తాడేపల్లిలో 33.25 సెం.మీ, మంగళగిరిలో 29.75, పెదకూరపాడులో 28.75, తాడికొండలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరంలో సీఎస్ సమీక్ష విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో 40,876.7 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగావళి, సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి, గోముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టాలపై సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ కలెక్టరేట్లో సమీక్షించారు. గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను ఆయన పరిశీలించారు. మరోవైపు తుపాను పశ్చిమంగా ప్రయాణించి బలహీన పడింది. ఇది వాయవ్య దిశగా పయనించి మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న సువర్ణముఖి ఐదుగురి మృతి.. ఇద్దరు గల్లంతు తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు ఐదుగురు మరణించారు. ఒక బాలుడి సహా ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన రైతు విజనగిరి శ్రీను నువ్వుల బుట్టలు తెచ్చుకునేందుకు పొలం వెళ్తూ గెడ్డలో పడిపోయాడు. గ్రామస్తులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. విశాఖ జిల్లా వేపగుంట నాయుడుతోట సమీపంలోని సీపీఐ కాలనీలో ఇంటిగోడ కూలడంతో దులసి భావన(31) మృతి చెందింది. కొండవాలు నుంచి వచ్చిన భారీ రాళ్లు ఇంటి ప్రహరీపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని చినముషిడివాడ సమీపంలోగల గిరిప్రసాద్‌నగర్–3లో కుశ్వంత్‌కుమార్ (7) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ విద్యుదాఘాతానికి గురై మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీ పేటకు చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్తూరి నాగేశ్వరరావు(50) పొలం వెళుతూ పర్రెడ్డిగూడెం సమీపంలో వర్షపు నీటిలో కాలు జారి కొట్టుకుపోయారు. వర్షం తగ్గిన తర్వాత తూరలో ఇరుక్కున్న ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. గోపాలపురంలో ఇంటివద్ద నీట మునిగిన మోటర్‌ను ఆన్ చేస్తూ ముల్లంగి విజయభారతి (52) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా సీతానగరానికి చెందిన కోరాడ కృష్ణవంశీరెడ్డి (16) స్నేహితులతో కలిసి చేపల కోసం వెళ్లి స్టీల్‌ప్లాంట్ రైల్వేగేటు సమీపంలో ఉన్న కాలువలో పడిపోయాడు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ధర్మపురి వద్దనున్న గెడ్డలో చేపలు పట్టడానికి వెళ్లిన గేదెల రామారావు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. రాత్రి వరకు గాలించినా అతడి ఆచూకీ దొరకలేదు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట దిగువన ఉన్న మెట్టపైకి సోమవారం గొర్రెలను మేతకు తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్యన చిక్కుకున్నాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
తడిసిముద్దయిన తెలంగాణ.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు సోమవారం మరింత దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో అధిక వర్షాపాతం నమోదైంది. (చదవండి: Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్ జయశీల్‌రెడ్డి ఏమయ్యారు?) సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీగా వానలు పడటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. (చదవండి: Jobs In Telangana: తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..) భారీ వర్షాలకు లోయర్ మానేర్ గేట్లన్నీ ఎత్తారు.. Lower manair dam right now all gates are open. #Telangana #telugunews pic.twitter.com/vsOpIiR1uj — Janam Sakshi news (@JanamsakshiDist) September 7, 2021 Lower Manair #Dam also known as #LMD was constructed across the #Manair #River, at #Alugunur village, #Thimmapur mandal, #Karimnagar District, in the #India state of #Telangana Drone View #rain #water pic.twitter.com/7Ndz1nDcNH — Shankar Updates 🇮🇳 (@shankar0091) September 6, 2021 సిరిసిల్లల్లో రోడ్లన్నీ జలమైన దృశ్యాలు.. #Telangana: Several roads waterlogged in Sircilla town due to incessant rainfall in the area via ANI pic.twitter.com/jIrg8kZTnA — Jagran English (@JagranEnglish) September 7, 2021 భారీ వర్షానికి కరీనంగర్ పరిస్థితి #kareemnagarrain #kareemnagarflood#Telangana pic.twitter.com/FVCVhVU8kT — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 7, 2021 -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాక్షి, నెట్వర్క్: కృష్ణా జిల్లాలో సోమవారం 1.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు మెట్ట, డెల్టా, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఎటపాకలో మిర్చి తోటలు నీట మునిగాయి. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోట్‌క్లబ్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. జిల్లాలో సగటు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ శ్రీకేష్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తోటపల్లి, మడ్డువలస జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. విజయనగరం జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. చంపావతి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, వట్టిగెడ్డ, తాటిపూడి జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తడిసి ముద్దయింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేటి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెం మండలం యడవల్లిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలి గొడ్డేటి నాగేశ్ (55) మృతి చెందాడు. యువతి గల్లంతు బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన మనీషా వర్మ (23) అనే యువతి కొండవాగుల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇక గురువారం మోస్తరు వర్షం పడుతుందన్నారు. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 6.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో ఉధృతంగా వరాహ, శారదా నదులు విశాఖ ఏజెన్సీలో గెడ్డలు, కొండవాగులు, వరాహ, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పైడపర్తికి చెందిన పాడి కన్నయ్య (41) వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అలాగే మాడుగుల మండలం గొప్పులపాలెంకు చెందిన పాగి నాగమణి (28) పిడుగుపాటుతో మృతి చెందింది. -
తెలంగాణలో దంచి కొట్టిన వాన
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. కొన్ని జిల్లాల్లో సోమవారం ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిం డిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమో దైంది. వర్షాల కారణంగా ఓ చిన్నారి సహా ఇద్దరు మృత్యు వాత పడ్డారు. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. 2,491 ఎకరాల్లో వరి, 1,531 ఎకరాల్లో పత్తి పంటకు నష్టంవాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కిన్నెరసాని జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా పొంగిన వాగులు, చెరువులతో జిల్లాలో వందకు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షంతో గనుల్లో నీరు నిలవడంతో కొత్తగూడెం ఏరియాలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది. పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు వరద నీటిలో చిక్కుకుని చిన్నారి మృతి పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీకి చెందిన శనగ రవి – నాగమణి దంపతుల కుమార్తె అంజలి వరద నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 28 కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు. వరదలో కొట్టుకుపోయిన భవన నిర్మాణ కార్మికుడు జిల్లాలోని దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం రెడ్డి వెంకటరెడ్డి (42) అనే భవన నిర్మాణ కార్మికుడు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. గిర్నిబావిలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న ఈదులచెరువు మత్తడిలో కొట్టుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్దిదూరంలో మర్రిచెట్టుకు తట్టుకుని ఉన్న వెంకటరెడ్డి మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు చేర్చారు. కనువిందు చేస్తున్న జలపాతాలు ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీమునిపాద జలపాతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లిలో.. కరీంనగర్ జిల్లాలో జడివాన కురుస్తోంది. అత్యధికంగా కరీంనగర్లో 6.3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉదయ్‌నగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. జగిత్యాలలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీవాన మొదలైంది. జగిత్యాల, మెట్పల్లిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వర్షం కొద్దిగా తెరపినిచ్చింది. ఉమ్మడి పాలమూరులో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజంతా ముసురు వర్షం కమ్ముకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కౌకుంట్ల–ఇస్రంపల్లి మధ్యవాగులో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం చౌటబెట్ల, మాచినేనిపల్లి గ్రామాల మధ్య కేఎల్ఐ కాల్వ కోతకు గురైంది.జిల్లాలో దాదాపు 500 ఇళ్లు దెబ్బతిన్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు ఉమ్మడి మెదక్.. మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ముసురుగా ప్రారంభమైన వర్షం సోమవారం సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి, మోయతుమ్మెద, తాడూరు, హల్దీ వాగులు స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో వరంగల్– సిద్దిపేట దారిపై రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దుర్గమ్మ ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరానది నిజామాబాద్‌లో.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా సోమవారం వానలు కురిశాయి. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని గ్రామాల్లో మధ్యాహ్నం భారీ వడగళ్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఆర్మూర్ మండలం ఆలూరులో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గడచిన పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం కూడా చాలాచోట్ల గరిష్టంగా 5 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఇంటిపై పిడుగుపాటు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దినేష్ ఇంటిపై పిడుగు పడటంతో గోడలు నెర్రెపడ్డాయి. టీవీ, ఫ్రిజ్, వంటపాత్రలు ధ్వంసమయ్యాయి. రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద కుమురం భీం జిల్లాలో.. జిల్లాలోని చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చింతలమానెపల్లి మండలంలోని నాగులవాయి వాగు, చింతలపాటి వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చింతలమానెపల్లి నుంచి కౌటాల మండలానికి వెళ్లే మార్గంలో చింతలపాటి వద్ద వంతెన పైనుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అడెపల్లి, రణవెల్లి, కారెబ్బెన, రుద్రాపూర్, డబ్బా తదితర గ్రామాల పరిధిలోని పంట భూములు నీట మునిగి బురద మేట వేశాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. అడెపల్లిలో నీటమునిగి బురదమేట వేసిన పత్తిపంట పిడుగుపాటుకు ఒకరి మృతి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొలాంగూడలో మొక్కజొన్న పంటచేనులో మంచె కింద ఉన్న ఆత్రం రమేశ్(28)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నీట మునిగిన వరి పొలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో కురిసిన వర్షానికి మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు నిండాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలేరు – సిద్దిపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 25 ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం 1.67 సెం.మీ సగటు వర్షపాతం నమోదు అయ్యింది. రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద ముగ్గురు విద్యార్థినులను కాపాడిన స్థానికులు హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గ్రామంలో వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థినుల ప్రాణాలను గ్రామస్తులు కాపాడారు. గ్రామానికి చెందిన గజ్జి ఆకాంక్ష, మేడిపల్లి వర్షిణి, మేడిపల్లి కావ్యలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డుపై భారీ వరద వెళ్తుండగా దాటేందుకు ప్రయత్నించారు. అయితే వరద ఉధృతికి కొట్టుకొని పోయి సమీపంలో ఉన్న చెట్లకు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో ముగ్గురిని సురక్షితంగా బయటికి తీశారు. పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాన
-
ఏపీ: ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 30,31 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్.కోటలో 5.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇవీ చదవండి: గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం.. బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు! -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్పల్లి, జగద్గిరిగుట్టలో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లోకి, షాపింగ్ కాంప్లెక్సుల్లోకి నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి సంబంధించిన వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. (చదవండి: పాస్ మార్కులు చాలు.. ఆ నిబంధన ఎత్తివేస్తూ ఉత్తర్వులు) (చదవండి: ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #lakdikapul #khairtabad @Hyderabadrains @HiHyderabad pic.twitter.com/1YR3INyvSy — studentsupdate.in (@studentsupdate0) August 23, 2021 #HyderabadRains - Dawakhana, NBT Nagar, #Hyderabad @GHMCOnline @HMWSSBOnline @CommissionrGHMC #MonsoonReady #Rain pic.twitter.com/T0xFpePDea — Hakku Initiative/Hakku Channel (@HakkuInitiative) August 23, 2021 Heavy rain khairathabad , Hyderabad pic.twitter.com/uzx7TSmPbP — Adi Narayana (@adi9390666233) August 23, 2021 Rains. #HyderabadRains #Hyderabad #Telangana @GHMCOnline @GadwalvijayaTRS @CommissionrGHMC rains - water - puddles - traffic jams - potholes… same same. @DeccanChronicle pic.twitter.com/bMSN1ltS5f — Sriram Karri (@oratorgreat) August 23, 2021 #Rain in #Hyderabad How beautiful it is? the rain, the wind, trees and plants... pic.twitter.com/EO2gsizKrh — jyothi (@jyothi_mirdoddi) August 23, 2021 Literally #Hyderabad a ‘Water Plus' (under Swachh Bharat Mission) city. IMD has predicted light to moderate rain or thunder showers at ISOLATED places in a FEW districts of #Telangana. #Monsoon2021 #HyderabadRains pic.twitter.com/D5hW344Y2j — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) August 23, 2021 -
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో కుండపోత వాన పడుతోంది. అక్కడక్కడ ఈదురు గాలులు, చిన్నపాటి మెరుపులతో వర్షంపడింది. దాంతో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. అయితే ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. -
నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం
ఖాట్మండూ: నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో వర్షం బీబత్సం సృష్టించిందని మధ్య నేపాల్ జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సింధుపాల్‌చౌక్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అరుణ్ పోఖ్రెల్ మాట్లాడుతూ.. మంగళవారం ఎడతెగని వర్షం వల్ల ఇంద్రవతి, మేలంచి నదిలో నీటి మట్టం పెరిగినట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించినట్లు వెల్లడించారు. కాగా పదుల సంఖ్యలో జనం వదల్లో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వర్ష ప్రభావం భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో నిరంతర వర్షం కారణంగా బీహార్‌లోని గండక్ నదిలో నీటి మట్టం చాలా వరకు పెరిగింది. చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం -
మరో మూడ్రోజుల్లో తెలంగాణలో రుతు పవనాలు
-
Cyclone Yass: ‘యాస్’ విధ్వంసం
బాలాసోర్/కోల్‌కతా: అత్యంత తీవ్ర తుపాను ‘యాస్’ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పళ్ల తోటలు, పంటపొలాలు నాశనమయ్యాయి. దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా ఒడిశాలో నలుగురు, బెంగాల్లో ఒకరు చనిపోయారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్ జిల్లాల్లో పలు తీర ప్రాంత గ్రామాల్లోకి సముద్ర నీరు చొచ్చుకువచ్చింది. ఆయా ప్రాంతాల్లో స్థానికుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టామని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో చెట్లు కూలి ఇద్దరు, ఇల్లు కూలి ఒక వృద్ధురాలు చనిపోయారు. తీరప్రాంతాల నుంచి 5.8 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. పశ్చిమబెంగాల్లో.. తమ రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామన్నారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సముద్ర తీరాల్లో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. కొన్నిచోట్ల కొబ్బరి చెట్ల ఎత్తులో కెరటాలు విరుచుకుపడ్డాయి. శంకరపుర్లోని తీర ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల అలల ధాటికి కొట్టుకుపోయింది. పౌర్ణమి కావడంతో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. హూగ్లీ నది పోటెత్తడంతో కోల్‌కతా పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రానున్న 24 గంటల పాటు తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం, దక్షిణ 24 పరగణ, బంకుర, ఝార్గం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. ఒడిశాలో.. యాస్ ప్రభావంతో ఒడిశాలో, ముఖ్యంగా భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. -
ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..
సాక్షి, అమరావతి: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివార్’ మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివార్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు) -
నివర్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్ తుఫాను రేపు మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 24 గంటల్లో నివర్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇక రేపు(బుధవారం) మామళ్లపురం- కరైకల్ తీరం వెంబడి 65-85 కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక నెల్లూరు జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్దం చేస్తుండగా.. కాకినాడ, అమలాపురం, పెద్దాపురంలోని 13 మండలాలు అధికారులకు ఏపీ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇక కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్ అలీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెన్నైలో 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
పుడమి పులకరింత
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పుడమి పులకరిస్తోంది. కృష్ణా, గోదావరి, వంశధార, తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదుల్లో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండుకుండల్లా పొర్లుతున్నాయి. రాయలసీమలో ఐదారు వందల అడుగుల లోతులో మాత్రమే నీరుండే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిత్తూరు జిల్లా వడమాలపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని బోర్ల నుంచి మోటార్లు ఆన్ చేయకుండానే నీరు ఉబికి రావడం గమనార్హం. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు కొంత ఆందోళన చెందుతున్నా ఇక రెండేళ్లు కరువు ఉండదని, పుష్కలంగా పంటలు పండించుకోవచ్చని ఊరట చెందుతున్నారు. ఇక నీటి సమస్య ఉండదు... ‘2014 నుంచి 2018 వరకూ కరువుతో సతమతమయ్యాం. గత ఏడాది, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడటంతో దుర్భిక్షం ఛాయలు కనిపించకుండా పోయాయి. పండ్ల తోటలకు ఇక రెండు మూడేళ్లు నీటి సమస్య ఉండదు’ అని అనంతపురం జిల్లా నంబులపూలకుంటకు చెందిన నారాయణరెడ్డి, పెరవలికి చెందిన వెంకటప్ప సంతోషం వ్యక్తం చేశారు. లోటు మాటే లేదు.. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 27.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క జిల్లాలో కూడా వర్షపాత లోటు లేకపోవడం గమనార్హం. ఇదే కాలంలో రాష్ట్రంలో 68.67 శాతం ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైంది. 26.71 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా కేవలం 4.62 శాతం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే లోటు వర్షపాతం రికార్డయింది. వైఎస్సార్ జిల్లాలో సాధారణం కంటే 67.7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దశాబ్దాలుగా దుర్భిక్షం తాండవిస్తున్న అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 58.2 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. రాష్ట్రంలో 460 మండలాల పరిధిలో అధిక వర్షపాతం, 79 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 31 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. జిల్లాలవారీగా వర్షపాతం వివరాలు (1-6-2020 నుంచి 22-10-2020 వరకు వర్షపాతం మిల్లీమీటర్లలో) జిల్లా సాధారణం కురిసింది తేడా శాతం తేడా శాతం శ్రీకాకుళం 878.2 726.7 -17.3 విజయనగరం 848.7 806.6 -5.0 విశాఖపట్నం 895.3 1004.7 12.2 తూర్పుగోదావరి 947.3 1326.3 40.0 పశ్చిమగోదావరి 936.6 1323.2 41.3 కృష్ణా 823.1 1075.0 30.6 గుంటూరు 632.5 835.6 32.1 ప్రకాశం 540.5 652.9 20.8 నెల్లూరు 470.2 559.3 18.9 చిత్తూరు 545.1 770.4 41.3 వైఎస్సార్ 486.8 816.3 67.7 అనంతపురం 424.4 671.5 58.2 కర్నూలు 559.3 878.6 57.1 -
పగబట్టిన వరుణుడు: ఇంకెక్కడి దసరా!
(వెబ్ స్పెషల్స్): ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి... మరోవైపు ప్రకృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్నాయి. పండుగల నాటికైనా చక్కబడతామనుకున్న జనావళికి తీవ్ర నిరాశే ఎదురైంది. అటు కోవిడ్-19 ఆంక్షలు, ఇటు పగబట్టిన వరుణుడు దిక్కుతోచని స్థితి. ప్రధానంగా హైదరాబాదు నగరంలో ఎటునుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అంతుపట్టక నగర వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. ఎడతెగని వర్షాలు, వరదలతో 2020 దసరాలో పండుగ వాతావరణమే కనిపించకుండా పోతోంది. దసరా అంటేనే సరదా. విజయానికి సూచికగా మాత్రమే విజయాలను సమకూర్చే పండుగగా విజయదశమి ప్రతీతి. కొత్తబట్టలు, సరికొత్త వాహనాలు, కొంగొత్త ఆశలతో ఈ పండుగ బోలెడంత సంబురాన్ని మోసు కొచ్చేది. కానీ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటు కరోనా, ఇటు ప్రకృతి ప్రకోపం భక్తుల దసరా ఉత్సవాలపై నీళ్లు జల్లాయి. అంతేకాదు పండుగ సీజన్ పై కోటి ఆశలు పెట్టుకున్న వ్యాపారులను కూడా ఘోరంగా దెబ్బతీశాయి. పండుగ సందర్బంగానైనా కొద్దో గొప్పో వ్యాపారం జరిగి, కాస్త తెప్పరిల్లుదామనుకున్న చిన్న, పెద్ద వ్యాపార వర్గం ఆశలను అడియాసలు చేసేసాయి. దసరాలో మరో సంబురం బతుకమ్మ. శీతాకాలపు తొలి రోజుల ప్రకృతి సౌందర్యంలో పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేయడం ప్రత్యేక విశేషం. ఇది తెలంగాణ ఆడపడుచుల పూల సంబురం. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనంలాంటి రంగు రంగుల పూలను తీర్చి..బతుకవమ్మా అంటూ దీవించే అపురూప దృశ్యం. కానీ 2020 దసరా మాత్రం దేశవ్యాప్తంగా ప్రదానంగా తెలంగాణా ప్రజలకు ఒక చేదు జ్ఞాపకాన్నే మిగులుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఎదురుచూసే సంబురం బతుకమ్మ. ఈ శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆటపాటల ఉత్సాహం, కోలాహల వాతావరణం కన్నుల పండువగా ఉంటుంది. జమిలిగా, లయబద్ధంగా చప్పట్లతో, కోలాటాలతో ఎంతో సందడి చేస్తారు. ఏడాదికి సరిపడా స్ఫూర్తిని పొందుతారు. ప్రస్తుతం అంతటి ఉత్సాహం, కోలాహలం, సందడి ఎక్కడా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎవరికి వారే చాలా పరిమితంగా బతుకమ్మలాడుతూ మళ్లీ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మకు మొక్కుతున్నారు. కనిపించని దసరా జోష్ గత ఏడు నెలలుగా స్థబ్దుగా ఉండి, లాక్ డౌన్ అంక్షల సడలింపు తరువాత కూడా పెద్దగా డిమాండ్ లేక వెలవెల బోయిన వ్యాపార వాణిజ్య సంస్థలు పండుగ సీజన్ బిజినెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. అటు భారీ డిస్కౌంట్లు, తగ్గింపు ఆఫర్లు, ఉచిత ఆఫర్లు అంటూ ఇలా రకరకాల పేర్లతో కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలూ సిద్ధమైనాయి. ఆ మేరకు కొద్దిగా మార్కెట్లో సందడి నెలకొంది. పల్లె, పట్టణ ప్రాంతల్లో నూతన వస్త్రాల కొనుగోళ్లు, ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, వాహనాలు, ఇతర వస్తువుల కొనుగోళ్ల జోరు అందుకుంది. కానీ ఇంతలోనే భారీ వర్షాలు పరిస్థితిని అతాలకుతలం చేసేశాయి. క్యుములో నింబస్ మేఘ గర్జనలు నగర వాసులను వణికించాయి. దీంతో మొదట్లో నెలకొన్న దసరా జోష్ కనుమరుగు కావడంతో వ్యాపారులు డీలాపడిపోయారు. సందడి లేని మార్కెట్లు దసరా, బతుకమ్మ పండుగ అంటూనే పూలపండుగ. అద్భుతమైన పూల జాతర. ప్రధానంగా బంతి, చేమంతి, లాంటివాటితోపాటు, గునుగు, తంగేడు, నంది వర్ధనం, గుమ్మడి పూలు లాంటివాటికి డిమాండ్ ఉంటుంది. రకరకాల, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చడంతోపాటు ప్రతి ఇంటిని అందంగా పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఇంటి గుమ్మాలేకాదు.. ఏ చిన్నకార్యాలయం గేటు చూసినా.. విరబూసిన పూల అలంకరణలతో కళకళలాడుతుంటాయి. అలాగే విజయదశమి రోజున దాదాపు ప్రతి ఇంట్లో, కార్యాలయాల్లో ఆయుధ పూజలు నిర్వహించడం పరపరంగా వస్తోంది. తీరైన గుమ్మడికాయలను కొట్టడం విజయదశమి రోజున అందరూ చేస్తుంటారు. ఇక బొమ్మల కొలువు సరేసరి. కానీ పూలు, పూల దండలు, నిమ్మకాయలు, రకరకాల బొమ్మలను విక్రయించే విక్రయదారులు గిరాకీ లేక నీరుగారి పోయారు. దశమి రోజుకు డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశలు అంతంతమాత్రమే. ముంచెత్తిన వానలు, కట్టలు తెగిన చెరువులు, పొంగిన నాలాలు దసరా పండుగ అనే మాటనే మర్చిపోయేలా చేశాయి. ప్రాణాలరచేతిలో పెట్టుకుని, పిల్లాపాపలతో బతుకుజీవుడా కాలం వెళ్ల దీస్తున్న దయనీయ స్థితి. ఎపుడు ఏవైపు నుంచి మబ్బులు కమ్మేస్తాయో తెలియదు..ఎటునుంచి వరద ముంచుకొస్తుందో తెలియని గందరగోళ పరిస్థితులలో నగర ప్రజ కాలం వెళ్లదీస్తోంది. దీంతో నగర వ్యాపారంపైనే ఎక్కువగా ఆధారపడే గ్రామీణ విక్రేతలు, చిన్న వ్యాపారస్తులు మరింత సంక్షోభంలో పడిపోయారు. బోసిపోయిన షాపింగ్ మాల్స్ పండుగ వచ్చిందంటే పిల్లాపాపలకు కొత్తబట్టల సందడి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ఇసుక వేస్తే రాలనంతగా పలు షాపింగ్ మాల్స్ కిటకిట లాడిపోయేవి. ఒక దశలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా కొనుగోలు దారులు బారులు తీరేవారు. కానీ ఏడాది దసరా పండుగ సందర్భంగా సీన్ రివర్స్. కొనుగోలుదారులు లేక షోరూంలు బోసిపోయాయి. అసలే కోవిడ్-19 దెబ్బకు దిగాలు పడిన వ్యాపారులు ఈ వరదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, ఎప్పటికి వ్యాపారం పుంజుకుంటుందో తెలియని అయోమయం. అయితే చెడుపై మంచి విజయం సాధించినట్టుగా, అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పిన పాండవులను విజయం వరించినట్టుగా తమకూ మంచిరోజులు రావాలని పిల్లాపెద్దా వేయి దేవుళ్లకు మనసులోనే మొక్కుతున్నారు. -
తెలంగాణపైనా వాయుగుండం ప్రభావం
-
భారీ వర్షం: వాగులో చిక్కుకున్నఆర్టీసీ బస్సు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెద్దవడగూరులో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పందుల వాగు పొంగి పొర్లుతోంది. భారీ నీటితో ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో వాగులో నుంచి బస్సును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. భారీ వర్షాలకు పెద్దవడగూరులో వందల ఎకరాల్లో పంటులు దెబ్బతిన్నాయి. పామిడి, పెద్దవడుగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో సాగుచేసిన పత్తి, వేరుశనగ పంట పొలాలు నీటమునిగాయి. పెద్దవడుగూరు సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెన్నాదేవి దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి-పిడుగురాళ్ల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ముంచెత్తిన వాన
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్ష బీభత్సంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అనేక చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో అత్యధికంగా 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గద్వాల, ధరూరు, మల్దకల్, మానవపాడు, కేటీదొడ్డి, ఇటిక్యాల ప్రాంతాల్లో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు రావడంతో ప్రజలు రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కేటీదొడ్డి మండలం గద్వాల–రాయిచూర్ రహదారిపై ఉన్న నందిన్నె వాగులో ఓ లారీ చిక్కుకుంది. అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీ గండి పడింది. కల్వర్టు కింద ఉన్న మట్టి వరదకు కొట్టుకుపోవడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఇది గమనించిన కొందరు యువకులు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అడ్డాకులలోని ఓ కోళ్ల ఫారంలో 9 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. జడ్చర్ల మండలం లింగంపేటకు చెందిన అఫ్రోజ్ (23) శనివారం ఈత కొట్టేందుకు దుందుబి వాగులోకి దూకాడు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాగులో కొట్టుకుపోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం భల్లాన్‌పల్లిలో పాతగోడ కూలి గుడిసెపై పడటంతో అందులో ఉన్న చిన్నారి పూజ (4) అక్కడికక్కడే మృతి చెందింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం జగ్గాయిపల్లిలో కుంట తెగి, వరద నీరు కోళ్లఫారంలోకి వెళ్లడంతో ఐదు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. కాగా, కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 08542–241165 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఇదిలాఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భూదాన్‌పోచంపల్లి –భీమనపల్లి గ్రామాల మధ్య చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి ఆలయానికి వెళ్లే దారి, రింగ్ రోడ్డు కోతకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం భీమనపల్లి నుంచి మాధాపురం వెళ్లే అంతర్గత రోడ్డు ధ్వంసమైంది. దేవరకొండ నియోజకవర్గంలో పంటచేలన్నీ నీట మునిగాయి. వరి, టమాటా, మిరప చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదికి వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జంటుపల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో శివసాగర్ నిండుకుండలా మారింది. గోదావరికి వరద తాకిడి ఎగువన ఎస్సార్ఎస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంకాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం సరస్వతీ బ్యారేజీలోని 66 గేట్లకు 30 గేట్లు ఎత్తి నీటిని కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,06,000 క్యూసెక్కులు ఉంది. అలాగే.. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలో 88 గేట్లకు 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 3,06,470 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్‌ఫ్లో 2,76,100 క్యూసెక్కులు దిగువ గోదావరిలో కలుస్తున్నదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి 8.45 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. గద్వాలలో వరదనీటి ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి -
వర్షాలతో పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్‌పై గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీద నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఓ వీడియోను ట్వీట్ చేసిన గంభీర్ ఢిల్లీ సీఎంని తుగ్లక్తో పోల్చారు. ఈ వీడియోలో 10-15 మంది ప్రయాణికులతో ఉన్న ఓ ఒంటెద్దు బండి వాన నీటితో నిండిన వీధులగుండా ప్రయాణం చేస్తోంది. కొద్ది దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి ప్రయాణికులు పడిపోతారు. కిందపడ్డవారిని వదిలేసి బండి వెళ్లి పోతుంది. ఈ సంఘటనను ఉద్దేశించి గంభీర్.. ‘ఇది 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలించిన ఢిల్లీ కాదు.. 21వ శతాబ్దపు తుగ్లక్ పాలన ఇది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’) ये 14वीं सदी के तुग़लक़ की नहीं बल्कि 21वीं सदी के तुग़लक़ की दिल्ली है! pic.twitter.com/zM9ug41cXI — Gautam Gambhir (@GautamGambhir) August 13, 2020 గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జకీరాలో ఓ బస్సు, ఆటో, కారు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రయాణికులు కారు, ఆటోను బయటకు లాగడంలో విజయం సాధించారు కానీ బస్సును బయటకు తీసుకురాలేకపోయారు. ఇదిలా ఉండగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. పాలమ్ అబ్జర్వేటరీలో గురువారం తెల్లవారుజామున 5:30గంటల వరకు 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
కరీంనగర్లో భారీ వర్షం..
సాక్షి, కరీంనగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.5 సెంటీ మీటర్ల వర్షపాతంనమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలుజలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో పోచమ్మ చెరువు, సుందరగిరిలోని కోమటికుంట మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్నపల్లిలో 11.2 సెంటీమీటర్లు, రేణికుంటలో 10.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట 10.3 సెంటి మీటర్లు, కొహెడ మండలంలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై నుంచి వరద పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షం, వరదలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
ఐఎండీ: ముంబై నగరానికి రెడ్ అలర్ట్
-
కుండపోత
-
రాజధానిలో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయం త్రం 4 గంటల ప్రాంతంలో వర్షం మొదలై అర్ధరాత్రి వరకు పలుదఫాలుగా కుంభవృష్టి కురిసింది. వర్ష బీభత్సానికి పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కొత్తపేట్, మలక్‌పేట్, కోఠి తదితర ప్రాంతాల్లో నడుములోతున వరదనీరు పోటెత్తి, ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని అనేక చోట్ల సోమవారం మోస్తరు వానలు కురిశాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలోని వెంకిర్యాలలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. పెద్దపల్లిలోని సుగ్లాంపల్లిలో 7, మహబూబాబాద్ గూడూరులో 6.5, కరీంనగర్‌లోని తంగుల, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బండ్లగూడలో 6, నల్లగొండలోని కనగల్‌లో 5, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, వరంగల్ రూరల్‌లోని మంగళ వారిపేటలలో 4.8, మంచిర్యాలలోని కొమ్మెరలో 4.7, నల్లగొండ జిల్లా ముల్కచర్లలో 4.6, హైదరాబాద్ నాంపల్లిలో 4.6, రంగారెడ్డిలోని తాటిఅన్నారం, రెడ్డిపల్లెలలో 4.5, హైదరాబాద్ బహదూర్‌పురలో 4.3, చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నేడు, రేపు భారీ వర్షాలు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. -
నిద్ర నుంచే అనంత లోకాలకు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందరిలాగే వారు కూడా రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూసిన కళ్లు తెరవక ముందే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఏం జరిగిందో గుర్తించేలోపే ప్రమాదం ముంచుకురావడంతో పడుకున్న స్థితిలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు కుటుంబాల్లోని 17 మందిని మృత్యుదేవత తడిసిన గోడ రూపంలో కబళించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా మరణించిన వారిలో పది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో ఓ వస్త్రవ్యాపారి ఇంటి సమీపంలో 50 మందికి పైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఇళ్లకు ఆనుకునే ఉన్న వస్త్రవ్యాపారి ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండరాళ్లతో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు పెంకుటిళ్లపై కూలింది. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మేట్టుపాళయంకు వెళ్లనున్నారు. -
48 గంటల్లో వాయుగండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు గ్రామాలు, నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ప్రకాశంలో కుండపోతగా కురిసిన వర్షం
సాక్షి, ఒంగోలు సబర్బన్: జిల్లా కేంద్రం ఒంగోలులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఉన్నట్టుండి 6.00 గంటల సమయంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. చీకట్లు అలముకున్నాయి. అంతలోనే వర్షపు జల్లు ఆరంభమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకండా కుండపోత వర్షం కురిసింది. నగరం జలమయం అయింది. జనజీవనం స్తంభించి పోయింది. రహదారులు వాగులను తలపించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు రావడంతో వాటిని బయటకు తోడుకునేందుకు ప్రజలు శ్రమించారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థ పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఒంగోలు నగరంలో కుంభవృష్టి కురవటంతో ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని ప్రగతి కాలని జలమయం అయింది. దాంతో పాటు ఉత్తర బైపాస్‌లోని వెంకటేశ్వర కాలని పరిసరప్రాంతాలు, శ్రీనివాస సినిమాహల్ రోడ్డులోని బలరాం కాలని పరిసర కాలనిలు జలమయం అయ్యాయి. అదే విధంగా వెంగముక్కపాలెం, కేశవరాజుకుంట, చిన్న మల్లేశ్వరకాలనీ, బాలినేని భరత్ కాలనీ, కొత్తపట్నం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, నెహ్రూనగర్, అగ్రహరం రోడ్డులోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఒంగోలు మండలంతోపాటు పాటు సమీపంలోని సంతనూతలపాడు, కొత్తపట్నం, టంగుటూరు మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల తరువాత కూడా అడపాదడపా జల్లులు పడుతూనే ఉన్నాయి. అదే విధంగా కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా జోరుగా వర్షం కురిసింది. కందుకూరు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో కొంత లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 133.6 మి.మి కాగా సోమవారం వరకు 44.4 మి.మి కురిసింది. సోమవారం సాయంత్రం సముద్ర తీర ప్రాంత మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. పశ్చిమ ప్రాంతంలోని కనిగిరిలో కొద్దిపాటి జల్లులు పడగా గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి వర్ష సూచనలు కనపడలేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో జోరుగా సాగు చేస్తున్న పంటలతో పాటు ఈ వర్షంతో రైతులకు రెట్టించిన ఉత్సాహం నింపింది. -
అసోంలో వరదలు : ఆరుగురు మృతి
గువాహటి : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడగా.. ఎనిమిది లక్షలమందికి పైగా ప్రభావితులయ్యారు. మొత్తం 33 జిల్లాలకు 21 జిల్లాలలో వరద ప్రభావం కొనసాగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోడానికి ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ సంబంధిత జిల్లాల డిప్యూటి కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి సహాయం కోసం ఎదురు చూసే ప్రజల సమస్యలపై స్పందించాలని ఆదేశించారు. మరోవైపు జౌళీశాఖ మంత్రి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు. దేశంలోనే అతి పెద్ద నదులలో ఒకటైన బ్రహ్మపుత్ర నదితోపాటు మిగతా అయిదు నదులు కూడా ఉధృతంగా పారుతుండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా రాష్ట్రంలో 27000 హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగియాని, ఈ క్రమంలో 68 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఏడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ వర్షాలు వారమంతా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి బోటింగ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇక టీ తోటలు అధికంగా ఉన్న ధేమాజీ, లంఖింపూర్ ప్రాంతాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు ప్రవహించడం వల్ల లోతైన ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా కురిసిన వర్షాలకు కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో జంతువులకు రక్షణ కల్పించేందుకు వాటికి ఏర్పాటు చేసిన స్థావారాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదాలను అరికట్టేందుకు ఉద్యానవనం చుట్టూ ఉన్న జాతీయ రహదారిపై వేగ పరిమితిని విధించారు. రాష్ట్రంలో ఎన్సెఫాలిటిస్ బాధితులు పెరిగి పోతుండటంతో సెప్టెంబర్ చివరి వరకు ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులను నిషేధించింది. ఈ వ్యాధి అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు 700 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు. -
తుపానుగా మారిన ‘వాయు’: ఎగిసిపడుతున్న అలలు
-
పెను తుపాను!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తుపాను ఫణి (ఫొణిగా కూడా వ్యవహరిస్తున్నారు) తన దిశను మార్చుకుంటోంది. తీవ్రతను సైతం పెంచుకుంటోంది. శనివారం ఉదయం తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారిన అనంతరం మధ్యాహ్నానికే తీవ్ర తుపానుగా బలపడింది. ఆదివారం నాటికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి ఈ తీవ్ర తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుంది. అనంతరం ఈశాన్య దిశగా మలుపు తిరిగి బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా మే 2వ తేదీ వరకు బంగాళాఖాతంలోనే పయనించి పెను తుపానుగా బలపడే వీలుందని వారు అంచనా వేస్తున్నారు. అంచనాకు అందట్లేదు.. ప్రస్తుతం ఫణి తుపాను తీరును బట్టి అది ఎక్కడ తీరాన్ని దాటుతుందో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఆదివారం గంటకు 125–150, సోమవారం 145–170, మంగళ, బుధవారాల్లో 125–150 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని ఐఎండీ శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 2వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు ఫణి తుపాను ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మంచి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల ఒకటో తేదీన తమిళనాడు, దక్షణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుతం తుపాను తీరానికి చాలా దూరంలో ఉంది. అందువల్ల దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. మరో 24 గంటల తర్వాత కొంత వరకూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ తుపాను దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దక్షిణ కోస్తా, తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 30, మే 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. నిజాంపట్నం హార్బర్లో రెండో నెంబర్ ప్రమాద సూచిక ఫణి తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో శనివారం రెండో ప్రమాద సూచిక ఎగురవేశారు. తుపాను ఈ నెల 30న లేదా మే ఒకటో తేదీన తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని పోర్టు కన్జర్వేటర్ మోపిదేవి వెంకటేశ్వరరావు వివరించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అల్లకల్లోలంగా మారిన సముద్రం తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతానికి ప్రత్యేక బలగాలను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు. విశాఖ జిల్లాలో వర్షాలు విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు ఈదురు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. మామిడి పంట నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్నీపట్నం, కోటవురట్ల, డుంబ్రిగుడ, అరకులోయ, రావికమతం, నాతవరం, గొలుగొండ తదితర మండలాల్లో వర్షాలు కురిశాయి. నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో విద్యుత్ లైన్‌పై తాటిచెట్టు విరిగిపడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. డుంబ్రిగుడ, నర్సీపట్నంలో ఈదురు గాలుల తీవ్రతకు హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ఆశలు గల్లంతేనా? తుపాను వస్తుంది.. మంచి వానలు తెస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అంచనా వేసినట్టుగా ఫణి తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఇది తీవ్ర, అతి తీవ్ర తుపానుగా బలపడినప్పటికీ తన దిశను కోస్తాంధ్ర వైపు కాకుండా బంగ్లాదేశ్ వైపు మార్చుకునే అవకాశం లేకపోలేదని, దీంతో తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు కురిసే వీలు లేనట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. 30న కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, మే ఒకటో తేదీన కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ..(డిగ్రీల్లో) -
మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కురుస్తున్న వర్షాలు మరో 48 గంటలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. తెలంగాణలో ఆదివారం 50 శాతం, సోమవారం 35 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (హైదరాబాద్) డైరెక్టర్ వై కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో 50 శాతం వర్షపాతం నమోదవుతుందని, పలుచోట్ల ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల తక్షణ మరమ్మత్తులకు సంబంధిత అధికారులు, తుపాన్ బృందాలు రాగల 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ విభాగం అధికారులను ఆదేశించారు. -
ఒడిశాలో దయె బీభత్సం
-
ఉప్పొంగిన గోదారి
కాళేశ్వరం/ఆదిలాబాద్/చర్ల: గోదారి గలగలమంటూ కదలి వస్తోంది.. ఇప్పటిదాకా నీటిచుక్క కోసం ఆకాశం వైపు చూసిన అన్నదాతలో ఆనందం కనిపిస్తోంది.. రాష్ట్రంలో ఇటీవలి వరకు స్తబ్ధుగా ఉన్న సాగు పనులు ఇక జోరందుకోనున్నాయి! ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ వర్షాలు రైతన్నకు మేలేనని, ఇప్పటికే నాటిన విత్తుకు ప్రాణం పోస్తాయని అధికారులు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత వరద కలవడంతో సోమవారం గోదారి ప్రవాహం మరింత పెరిగింది. ఆదివారం ఇక్కడ గోదావరి 7.1 మీటర్ల ఎత్తున ప్రవహించగా.. సోమవారం సాయంత్రానికి 7.2 మీటర్లకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం వద్ద 2.43 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీ వద్ద 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలుతోంది. అలాగే మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటేక్వెల్ వద్ద గోదావరి నీటిమట్టం 8.4 అడుగులకు చేరింది. వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం సాయంత్రం 5.57 మీటర్లు ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రానికి 8.47 మీటర్లకు పెరిగింది. నిండిన కడెం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 697.625 అడుగులకు చేరింది. 10,732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గేట్ల ద్వారా 12,496 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భైంసాలో గల సుద్దవాగు గడ్డెన్న ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా, 357.5 మీటర్లకు చేరుకుంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.5 మీటర్లు కాగా, 275 మీటర్లకు చేరింది. కుమురం భీం ప్రాజెక్టు ఫ్లోర్లెవల్ 243 మీటర్లు కాగా 240 మీటర్లకు నీరు చేరుకుంది. గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నాయి. పెద్దవాగు పరిసర లోతట్టు ప్రాంతాలైన వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, దహేగం, పెంచికల్‌పేట మండలాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దహేగాం మండలం పరిధిలోని పెద్ద చెరువు నీరు పెరగడంతో కాగజ్‌నగర్, దహేగాం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మండల కేంద్రంతో పాటు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరుకు భారీ వరద ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు చెందిన 7 గేట్లను ఎత్తారు. 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. నీల్వాయి వాగులో రైతు గల్లంతు ఆదిలాబాద్ జిల్లాలోని నీల్వాయి వాగు దాటుతూ ఓ రైతు గల్లంతయ్యాడు. ప్రాజెక్ట్ పునరావాస కాలనీ గెర్రెగూడెంకు చెందిన మోర్ల సోమయ్య (60) సోమవారం సాయంత్రం నీల్వాయిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు రుణం కోసం వెళ్లాడు. అప్పుడు వాగులో వరద ప్రవాహం లేదు. తిరుగు ప్రయాణంలో వాగు వద్దకు రాగానే మత్తడి నుంచి వాగులోకి వరద రావడం మొదలైంది. వరద ఉధృతి పెరగడంతో జనం చూస్తుండగానే సోమయ్య వాగులో పడి గల్లంతయ్యాడు. కుటుంబీకులు, గ్రామస్తులు వాగులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. -
పొంగుతున్న వాగులు
సాక్షి, గుండాల: రెండు రోజుల క్రితం వరకు అప్పుడప్పుడు పలకరించిన వర్షాలు శుక్రవారం నుంచి ఉధృతరూపం దాల్చాయి. శుక్ర, శనివారాల్లో కుండపోతగా వర్షం కురియడంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గుండాల మండలంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికల వాగు, దున్నపోతుల వాగు, నడివాగు, జల్లేరు తదితర వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాయనపల్లి, ఘనాపురం, చిన్న వెంకటాపురం, దామరతోగు, ఎలగలగడ్డ, తక్కెళ్లగూడెం, కొమ్ముగూడెం, చెట్టుపల్లి పంచాయతీలోని 8 గ్రామాలు, గుండాల పంచాయతీలో నర్సాపురం, రోళ్లగడ్డ, తండా, దేవళ్లగూడెం, కన్నాయిగూడెం, నర్సాపురం తండా, నాగారం, నడిమిగూడెం, వలసల్ల, సజ్జలబోడు, దొంగతోగు, ఆళ్లపల్లి మండలంలో ³ద్దూరు, నడిమిగూడెం, బోడాయికుంట, అడవిరామారం, ఇప్పనపల్లి, జిన్నెలగూడెం, కర్నిగూడెం, సందిబంధం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లేందుకు వాగులు దాటలేక ఆయా గ్రామాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. బూర్గంపాడులో... బూర్గంపాడు: రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు బూర్గంపాడు మండలంలో జనజీవనం స్తంభించింది. మండల పరిధిలోని పెదవాగు, దోమలవాగు, పులితేరు, ఎదుర్లవాగు, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి పత్తిచేలు కోతకు గురయ్యాయి. సారపాకలోని సుందరయ్యనగర్, చండ్ర పుల్లారెడ్డినగర్లలో వర్షపునీరు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 45.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అశ్వాపురం మండలంలో 15.5 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదవాగుకు పోటెత్తిన నీరు అశ్వారావుపేట: వారం రోజులుగా చిరుజల్లులు పడుతూ శనివారం తెల్లవారుజాము నుంచి ఉధృతమైన వర్షంతో చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులోని పెదవాగు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 6 మీటర్లు కాగా శనివారం సాయంత్రానికే 2.5 మీటర్ల మేర వదరనీరు వచ్చి చేరింది. వర్షం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచి నీటిని గోదావరిలోకి వదలాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. రోజంతా వర్షంతో పట్టణంలో సెలవు వాతావరణం కనిపించింది. శనివారం మొత్తంగా 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వారు పేర్కొన్నారు. ఈ వర్షం పత్తి పంటకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే అన్ని రకాల పంటలకు మేలని అంటున్నారు. -
దేశంలో పలు రాష్ట్రాలకు వరద ముప్పు
-
2 గంటలు ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంపై గురువారం క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడ్డాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రెండు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఆవహించడంతో మధ్యాహ్నమే కారుచీకట్లు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య నగరంలోని చాలా ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగులు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతోపాటు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో స్వల్ప పరిమాణంలో ఉన్న వడగళ్లు కురిశాయి. సుమారు 200 వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద మోకాళ్లలోతున వరదనీరు నిలిచింది. రెండు గంటల్లో సగటున 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొత్తం గా 3 సెం.మీ. వాన పడిందని అంచనా. స్తంభించిన ట్రాఫిక్ ప్రధాన రహదారులపై హోర్డింగ్‌లు, చెట్లు కూలిపడటం, రహదారులపై వర్షపు నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉద్యోగులు, మహిళలు, ప్రయాణికులు, వాహన చోదకులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఖైరతాబాద్‌లో రైల్వే విద్యుత్ లైన్‌పై హోర్డింగ్ ఫ్లెక్సీ చిరిగి పడింది. దానిని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. గాలివానకు కారణాలివే.. విదర్భ–ఛత్తీస్‌గఢ్–తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవహించి.. ఉపరితల ద్రోణి ఏర్పడటంతోపాటు బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఉధృతంగా ఏర్పడి గాలివాన కురిసిందని బేగంపేటలోని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు వెల్లడించారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే నగరంలో గాలివాన బీభత్సం సృష్టించిందన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, గాలిలో తేమ అధికంగా ఉండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని తెలిపారు. వచ్చే 24 గంటల్లోనూ హైదరాబాద్‌లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. గాలివాన బీభత్సం సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గాలివాన బీభత్సం ఇలా.. అబిడ్స్ పరిధిలోని జియాగూడ, పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, పాన్‌మండీ, గోషామహాల్ రహదారి, బారాదరి, హిందీ నగర్, గోషామహాల్ చౌరస్తా, మాలకుంట, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకూలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పాన్‌మండీ నుంచి గోషామహాల్ చౌరస్తా వరకు పోలీస్ క్వార్టర్స్ దారిలో ఉన్న చెట్లు విరిగిపడడంతో హిందీ నగర్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే ఇదే ప్రాంతంలోని భారీ చెట్టు కూలిపడటంతో ఓ ఇంటి ప్రహరీగోడ ధ్వంసమైంది. హిందీ నగర్ రహదారిలో పెద్ద చెట్టు విరిగిపడడంతో ఒక ఆటో ట్రాలీ ధ్వంసమైంది. కార్ఖానాలో పరిధిలోని వాసవినగర్ సమీపంలోని పద్మజకాలనీ నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. గృహలక్ష్మి కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగో వార్డు బుసారెడ్డిగూడ, పికెట్‌లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మారేడుపల్లి పరిధిలో ప్రధాన రహదారులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కాలనీ వాసులే మ్యాన్ హోల్స్ మూతలను తెరిచి నీటిని పంపించారు. పాత బస్తీలోని ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా, భవానీనగర్, జంగంమెట్ తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జంగంమెట్ వార్డు కార్యాలయానికి ఎదురుగా పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇంజన్‌బౌలిలో చెట్టు కూలిపడటంతో ఒక ఆటో, చెరుకు రసం బండి ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోని చెట్లు నేలకూలాయి. అత్యవసర విభాగం వద్ద భారీ వృక్షం విరిగి పక్కనే ఉన్న పోలీసు ఔట్‌పోస్ట్‌పై పడింది. ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. ఈసీఐఎల్ చౌరస్తా, హెచ్‌బీకాలనీ రాజీవ్ పార్కు సమీపంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. బండ్లగూడలో 4.3 సెంటీమీటర్లు క్యుములోనింబస్ మేఘాల కారణంగా గురువారం నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌లో 3.5, నారాయణగూడలో 3.4, రాజేంద్రనగర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది. గాలివానకు ఇద్దరు బలి.. గురువారం ఉరుములు మెరుపులతో కురిసిన గాలివాన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురిని బలితీసుకుంది. ఇక్కడి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని అంజిరెడ్డినగర్కాలనీకి చెందిన ఇంద్రావత్ అఖిల్ (7) గురువారం మధ్యాహ్నం సమీపంలోని చింతచెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఊగుతున్నాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో మృతి చెందాడు. ఇక ఆరాంఘర్ ప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రతకు ఓ పాత ఇనుప సామాను గోదాం గోడ కూలడంతో పరశురాం అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గా>యపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గం గా«ంధీనగర్ డివిజన్లోని వి.వి.గిరి నగర్లో గాలివాన బీభత్సానికి రేకుల షెడ్డు కూలిపడి.. పి.డానియేల్ (50), ఆయన ఇద్దరు కుమారులు దీపక్ (13), చరణ్ (9)లు గాయపడ్డారు. పక్కనే మరో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు కూలడంతో మురుగన్రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, విదర్భ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని.. అటు విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి నెలకొని ఉందని పేర్కొంది. వీటి కారణంగా తెలంగాణలో శుక్రవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వడగళ్ల వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. శని, ఆది వారాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. -
తిరుమలలో కుండపోత వర్షం
-
నగరంలో మళ్లీ జడివాన
-
ఏపీ వ్యాప్తంగా ముంచెత్తిన వాన
-
నీట మునిగిన పొలీస్ స్టేషన్
-
వాన వెల్లువ
- నగరంలో కుండపోత వర్షం - ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వాన.. - జలమయమైన ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు - పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్.. వాహనదారుల ఇక్కట్లు - రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అన్నదాతల్లో ఆనందం.. జోరందుకున్న వరి నాట్లు - బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. బేగంపేట్, మాదాపూర్, అంబర్పేట్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై అనేకచోట్ల నీళ్లు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. సుమారు 300 బస్తీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దీంతో రెండ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మూడు నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలో 8.3 సెం.మీ. భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే జిల్లా చింతకాని, కాకరవాయిల్లో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వావిలాల, ఖమ్మం, ఎర్రుపాలెం, బచ్చోడుల్లో 5 సెం.మీ. చొప్పున నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సాధారణ వర్షపాతం 25.34 సెం.మీ కాగా, ఇప్పటివరకు 29.32 సెం.మీ. నమోదైంది. ఈ కాలంలో సాధారణం కంటే 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాబోయే రెండు మూడ్రోజుల్లో చెరువులు, కుంటలు నిండే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఆరుతడి పంటలకు ప్రాణం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. ముఖ్యంగా గత నెలలో సాగు చేసిన పత్తి, కంది, సోయా తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయి. ఆరుతడి పంటలు వేశాక వారం పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో కొన్నిచోట్ల రైతులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 56.67 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో అత్యధికంగా 35.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ వానలు మొలక దశలో ఉన్న పంటలన్నింటికీ ప్రాణం పోశాయని వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2.32 లక్షల (10%) ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. నాట్లు వేయడానికి ఇంకా సమయముంది కాబట్టి ఈ వర్షాలతో మరింత పుంజుకునే అవకాశం ఉంది. యూరియా.. ఏదయా? రైతులకు అవసరమైన ఎరువులు అందజేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. పాత సరుకు అందుబాటులో ఉంచి కొరత లేదని చూపిస్తోంది. జూలై నెలకు రాష్ట్రంలో 4 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఏకంగా 7.5 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలూనాయక్ పేర్కొన్నారు. అయితే గడ్డకట్టుకుపోయిన 2.5 లక్షల టన్నుల యూరియా, డీఏపీ ఎరువులనే ప్రభుత్వ సంస్థల వద్ద అందుబాటులో ఉంచారు. రైతులు ఈ గడ్డకట్టిన ఎరువులను కొనడానికి ముందుకు రావడంలేదు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉందని ఆయా జిల్లాల నుంచి సమాచారం అందుతోంది. నిండుతున్న చెర్వులు, కుంటలు రాష్ట్రంలో కురిసిన వర్షాలతో చెర్వులు, కుంటల్లో నీరు నిండుతోంది. మూడ్రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ఆశలు చిగురిస్తున్నాయి. ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టికి 27,447 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ జలాశయం నీటిమట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం 1,685.23 అడుగుల్లో నీటి లభ్యత ఉంది. 48.97 టీఎంసీల నిల్వ ఉంది. మరో 80 టీఎంసీల మేర నీరొస్తే తప్ప దిగువకు నీటి ప్రవాహాలుండవు. తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి సోమవారానికి 3,410 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఆల్మట్టికి ప్రవాహాలు మరింత పెరిగి, ప్రాజెక్టు నిండితేనే దిగువ నారాయణపూర్‌కు ఇన్‌ఫ్లో ఉంటుంది. ఇది మినహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో నీటి జాడ లేదు. కృష్ణా బోర్డు ఆదేశాలతో తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి సోమవారం 8,294 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో సాగర్‌లోకి 4,238 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. రైతుకు అందని రుణాలు.. కాలం కలిసొచ్చినా... ప్రకృతి కరుణించినా బ్యాంకులు మాత్రం రైతులకు రుణాలివ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఇప్పటివరకు 50 శాతం పంటలు సాగైతే.. రుణాలు మాత్రం 20 శాతానికి మించలేదు. ఖరీఫ్‌లో రూ.23,851 కోట్ల పంట రుణ లక్ష్యానికి ఇప్పటివరకు బ్యాంకులు రైతులకు కేవలం రూ.4,681 కోట్లే ఇచ్చాయి. ఖరీఫ్‌లో 29.63 లక్షల మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటారు. అందులో ఇప్పటివరకు కేవలం 7.63 లక్షల మంది రైతులకే రుణాలు ఇచ్చాయి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.6 వేల కోట్ల వరకు ప్రైవేటు అప్పులు చేసినట్లు అంచనా. బ్యాంకుల్లో సరిపోను నగదు లేకపోవడం కూడా రైతులకు తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల రైతులకు పంట రుణాలు మంజూరు చేసినా డబ్బు లేక నగదు చేతికి ఇవ్వడం లేదు. చెరువులకు జలకళ వర్షాలతో పలు జిల్లాల్లోని చెరువులు, రిజర్వాయర్లు జలకళం సంతరించుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌లో ఇప్పటిదాకా 9 అడుగుల నీరు ఉండగా.. ఇప్పుడు నీటిమట్టం 11 అడుగులకు చేరింది. సత్తుపల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 16 అడుగులు కాగా.. ప్రస్తుతం 7.3 అడుగులకు చేరింది. బేతుపల్లి పెద్దచెరువు నీటిమట్టం 17 అడుగులు కాగా.. 15 అడుగులకు నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లాయి. జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. పాల్వంచ మండలంలో బూడిదవాగు పొంగడంతో పాండురంగాపురం, సూరారం, సోములగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోనూ జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. పత్తి, సోయాబీన్లకు ప్రయోజనం – డాక్టర్ దండ రాజిరెడ్డి, సంచాలకులు, పరిశోధన విభాగం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని రకాల పంటలకు ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా ఆరు తడి పంటలకు ఈ వర్షాలు ఎక్కువ ఉపయోగం. చెరువులు, కుంటలు నిండితే వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వరికి సమయముంది – విజయకుమార్, అదనపు సంచాలకులు, వ్యవసాయశాఖ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆరుతడి పంటలకు మరింత ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా జూన్ రెండో వారంలో వేసిన పత్తి, కంది తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. వరి వేయడానికి ఇంకా సమయముంది. ఎరువులకు కొరత లేదు – బాలూనాయక్, డిప్యూటీ డైరెక్టర్, వ్యవసాయశాఖ రాష్ట్రంలో ఎరువులకు ఎక్కడా కొరత లేదు. అవసరమైన దానికంటే అదనంగానే అందుబాటులో ఉంచాం. ఈ నెల 4 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 7.5 లక్షలు అందుబాటులో ఉన్నాయి. -
రేపటి నుంచి మూడ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని, దీనివల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిం చింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భువనగిరి, శంషాబాద్, గాండీడ్లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. చేవెళ్ల, మహేశ్వరం, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు
-
వరంగల్ జిల్లాలో శుక్రవారం స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు మండల, గ్రామస్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి అప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. -
నేడు కూడా సిటీలో భారీ వర్షాలు
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల బుధవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి. అల్వాల్, కూకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. అల్వాల్‌లో చాలా చోట్ల అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. చెరువుల్లో నుంచి కాలనీల్లోకి వరద నీరు వచ్చింది. నిజాంపేట బాలాజీనగర్‌లో 40 శాతం అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఖైరతాబాద్ నుంచి మియాపూర్ మరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాంతం వర్షపాతం షాపూర్ నగర్లో- 16 సెం.మీ కుత్బుల్లాపూర్- 9 సెం.మీ బొల్లారం - 9 సెం.మీ మాదాపూర్- 8 సెం.మీ తిరుమలగిరి- 6.5 సెం.మీ అమీర్‌పేట్- 6 సెం.మీ నాచారం, కాప్రా, ఆసిఫ్ నగర్లలో కూడా భారీ వర్షం పడింది. -
నల్లగొండ జిల్లాలో అత్యధిక వర్షపాతం
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల కుంభవృష్టి నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో నల్లగొండ, దేవరకొండల్లో 9 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. మిర్యాలగూడ, మాచిరెడ్డి, కంపాసాగర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రామాయంపేట, మెదక్, జగిత్యాల్, ఆదిలాబాద్, గాంధారిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 665.2 మిల్లీమీటర్లు కాగా... ఇప్పటివరకు 640.4 మిల్లీమీటర్లు కురిసింది. నల్లగొండ జిల్లాలో 23 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా... మెదక్ జిల్లాలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వచ్చే నెల నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఇప్పుడు కురిసే వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లోకి మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితి రబీ పంటలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. -
తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాలు
-
పెను తుపానుగా మారనున్న ‘రావోను’
- రానున్న 48 గంటల్లో ఆంధ్ర- ఒడిశా మధ్య తీరం దాటనున్న తుపాను - కోస్తాంధ్రకు మరో రెండ్రోజులు భారీ వర్షాలు... బందరుకు సమీపంలో కేంద్రీకృతం - హైఅలర్ట్ ప్రకటించిన వాతావరణ విభాగం... గంటకు 120 కి.మీ. వేగంతో పెనుగాలులు - ఒడిశా వైపు పయనించే అవకాశం సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం/ చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి 10 గంటలకు మచిలీపట్నానికి దక్షిణంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశలో నెమ్మదిగా కదులుతుండడంతో బలం పుంజుకుంటోంది. ఫలితంగా గురువారం ఉదయానికి మచిలీపట్నం చేరువలోకి వచ్చే సరికి తుపానుగా బలపడనుంది. అనంతరం మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. ఈ తీవ్ర తుపాను గురు, శుక్రవారాల్లో పెను ప్రభావం చూపనుంది. ఇది ఒడిశా వైపు పయనించి అక్కడ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీంతో భారత వాతావరణ విభాగం హై అలెర్ట్ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో మరో 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బుధవారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. అక్కడక్కడ 30 సెం.మీలకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో గంటకు 95 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఫలితంగా కచ్చా ఇళ్లకు, గుడిసెలకు నష్టం వాటిల్లుతుందని, రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని, కాలువలకు గండ్లు పడతాయని ఐఎండీ వెల్లడించింది. గురువారం ఏర్పడబోయే తుపానుకు మాల్దీవులు దేశం సూచించిన పేరు ‘రావోను’గా నామకరణం చేసే అవకాశం ఉంది. దీనిని గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. తుపాను ప్రభావం వల్ల చెన్నై, పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా వర్షం కొనసాగడంతో పలు ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం కలిగింది. తుపాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు 3రోజుల పాటు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. అండమాన్‌ను తాకిన రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు బుధవారం అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళను నిర్ణీత జూన్ ఒకటో తేదీకంటే ముందుగానే తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈసారి రోహిణిలో రోళ్లు పగలవ్! బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి నందున ఈసారి వచ్చే రోహిణి కార్తె అంతగా ఆందోళనకరం కాదని వాతావరణ నిపుణులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 54% మేర నమోదైంది. రానున్న 24 గంటల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయి.