గోడ కూలిన చోటులో శిథిలాలను తొలగిస్తున్న సిబ్బంది
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందరిలాగే వారు కూడా రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూసిన కళ్లు తెరవక ముందే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఏం జరిగిందో గుర్తించేలోపే ప్రమాదం ముంచుకురావడంతో పడుకున్న స్థితిలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు కుటుంబాల్లోని 17 మందిని మృత్యుదేవత తడిసిన గోడ రూపంలో కబళించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది.
ఈ ఘటన కారణంగా మరణించిన వారిలో పది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్‌లో ఓ వస్త్రవ్యాపారి ఇంటి సమీపంలో 50 మందికి పైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఇళ్లకు ఆనుకునే ఉన్న వస్త్రవ్యాపారి ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండరాళ్లతో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు పెంకుటిళ్లపై కూలింది.
రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మేట్టుపాళయంకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment