శ్రీకాకుళం జిల్లా బలగ సిద్దిపేట రోడ్డులో నీట మునిగిన వరి
సాక్షి, అమరావతి: ‘గులాబ్’ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై కొంత మేర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఆరు జిల్లాల్లో దాదాపు 1,56,756 ఎకరాల్లో వ్యవసాయ, 6,463.65 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముంపునీరు పోయేందుకు వ్యవసాయ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌కు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. అలాగే, ముంపులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్‌బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ముంపులో 1.16 లక్షల ఎకరాల వరిపంట
ఇక వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా ప్రకారం.. వ్యవసాయ పంటలకు సంబంధించి 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న, 11,974 ఎకరాల్లో పత్తి, 4,708 ఎకరాల్లో మినుములు, 689 ఎకరాల్లో వేరుశనగ, 541 ఎకరాల్లో రాజ్మా, 466 ఎకరాల్లో చెరకు, 239 ఎకరాల్లో పెసలు, 150 ఎకరాల్లో మిరప, 62 ఎకరాల్లో పొగాకు, 25 ఎకరాల్లో రాగులు పంటలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే.. 3,260.9 ఎకరాల్లో అరటి, 1,517.5 ఎకరాల్లో మిర్చి, 1,105.85 ఎకరాల్లో కూరగాయలు, 376.55 ఎకరాల్లో బొప్పాయి, 136.75 ఎకరాల్లో పసుపు పంటలతో పాటు 22.75 ఎకరాల్లో పూల తోటలు ముంపునకు గురవగా, 374 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు.
పంటలను కాపాడుకోవచ్చు
ముంపునకు గురైన పొలాల్లోని పంటలను కాపాడుకునేందుకు ఆర్‌బీకే స్థాయిలో వీడియో సందేశాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ముందు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు తగిన మోతాదుల్లో ఎరువులు, మందులు జల్లుకుంటే పంటలను కాపాడుకోవచ్చు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం.
– హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
పక్వానికొచ్చిన పండ్లను కోసేయండి
ముంపునకు గురైన ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పే సూచనలను రైతులు పాటించాలి. పక్వానికి వచ్చిన అరటి, బొప్పాయి పండ్లను కోసెయ్యాలి. నేలకొరిగిన పంటలను నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. సీఓసీ, మాన్‌కోజెబ్ వంటి శిలీంద్ర సంహారిణిని రైతులకు అందించేందుకు ఆదేశాలిచ్చాం.
– డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, కమిషనర్ ఉద్యాన శాఖ
ముంపు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలి
మంత్రి కన్నబాబు ఆదేశం
గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లోని అన్నదాతలకు అండగా నిలబడాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి సోమవారం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్నబాబు మాట్లాడుతూ.. ఈ ఆరు జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లుగా గుర్తించారన్నారు. వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా పర్యటించి రైతులకు అండగా నిలబడాలని.. రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని మంత్రి సూచించారు. ముంపునీరు తగ్గగానే ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు హెచ్. అరుణ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment