Department of Horticulture
-
‘చిగు’రిస్తున్న ఆశలు!
సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వచ్చిన పూతకు కాయలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం రెండో విడతలో కూడా పూత కనిపిస్తుండడంపై ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయి. ఎక్కడ చూసినా పూత, పిందెతో చెట్లు కనిపిస్తుండడం.. గతేడాది కంటే ఈసారి ధర కూడా బాగానే ఉండే అవకాశాలు ఉండడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల వరకు మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో సరాసరిన 20 వేల హెక్టార్లలో పెద్ద చెట్లు (కాయలు కాచే) ఉండవచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ఒకవైపు కాయలు.. మరోవైపు పూత అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పంట విస్తారంగా సాగులో ఉంది. ముందుగా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాయలు మార్కెట్‌కు వస్తాయి. తర్వాత మిగతా ప్రాంతాల్లోని కాయలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పిందెలతో కూడిన కాయలు కనిపిస్తుండగా మరోవైపు పూత కూడా ఇప్పుడే విరివిగా కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో శీతాకాలంలో పూత విపరీతంగా వచ్చినప్పటికీ శీతల ప్రభావానికి కొంతమేర ముసురుకుంది. అయితే మంచుకు తట్టుకుని నిలబడిన తోటల్లో ప్రస్తుతం కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరుసలో రెండవ విడతగా పూత కూడా విస్తారంగా రావడంతో ఈసారి కూడా భారీగా మామిడి కాయలు అన్నమయ్య జిల్లా నుంచి మార్కెట్‌కు రానున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు మార్కెట్లో కాయలు మామిడి పంటకు సంబంధించి కాయలు మార్చి నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మనకు తొలుత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్చి నెలలో ఇక్కడి మార్కెట్లకు కాయలు రానున్నాయి. తర్వాత రైల్వేకోడూరుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఏప్రిల్ నెలనుంచి జూన్ వరకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పలు మండలాల నుంచి భారీగా మామిడి కాయలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూర, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, లాల్ బహార్, ఖాదర్, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గూబా తదితర రకాల కాయలను సాగు చేశారు. మార్చి రెండవ వారం నుంచి జూన్ నెలాఖరు వరకు కాయలు ఇక్కడి మార్కెట్లలో కళకళలాడనున్నాయి. రెండుమార్లు పూత మామిడి పంటకు సంబంధించి ప్రస్తుతం పూత విరివిగా కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన పూతకు లేలేత కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వచ్చిన పూత కూడా నిలబడింది. దిగుబడి కూడా ఈసారి అనుకున్న మేర ఆశాజనకంగా ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 37 వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా...సరాసరిన 20 వేల హెక్టార్లలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఈసారి దిగుబడి కూడా బాగా వస్తుందని అంచనా వేస్తున్నాం. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
కొబ్బరికి అ‘ధనం’ కోకో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతరపంటగా మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన కోకో సాగు ప్రస్థానం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పంటగా మారింది. ఆయిల్‌పామ్, కొబ్బరికి అంతరపంటగా రైతుకు రెట్టింపు ఆదాయం కోసం ప్రభుత్వం కోకో సాగును ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండటం, సాగు నిర్వహణ తక్కువగా ఉండటం, సాగుకు సంబంధించి మొదటి మూడేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో జిల్లాలో కోకో సాగు గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 39,714 హెక్టార్లల్లో కోకో సాగు ఉండగా కేవలం ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లోనే 14,364 హెక్టార్లలో కోకో సాగవుతుండడం విశేషం. 1990లో పశ్చిమగోదావరి జిల్లాకు పరిచయమైన కోకో సాగు ఏటా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో వెయ్యి హెక్టార్లు సాగు చేయనున్నారు. ఆయిల్‌పామ్ తరహాలోనే కోకో మొక్కలు కూడా కంపెనీల ద్వారానే రైతులకు పంపిణీ చేసి మొదటి మూడేళ్లు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుండడం, అంతరపంటగా మంచి డిమాండ్ ఉండడంతో సాగు విస్తీర్ణంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన కోకోను 1990లో కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ కాజునట్ అండ్ కోకో డెవలప్మెంట్ ద్వారా దేశానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో మాండలీజ్ కంపెనీ ద్వారా జిల్లాలో కోకో సాగుకు సంబంధించి మొక్కలు సరఫరా చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా ఎకరాకు సగటున రూ.80 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో దిగుబడి అత్యధికంగా ఉంది. అంతరపంటగా ఉన్నప్పటికీ మొక్కలకు సబ్సిడీలు, మొదటి మూడేళ్ల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం ఇస్తుండటం అలాగే 4వ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు మంచి దిగుబడి ఇస్తుండడంతో సాగుకు డిమాండ్ పెరిగింది. చాక్లెట్ల తయారీలో కీలకం ప్రధానంగా కోకోను చాక్లెట్ల తయారీలో వినియోగిస్తుంటారు. జిల్లాలో మాండలీజ్ కంపెనీ కోకోను కొనుగోలు చేసి తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ యూనిట్లో చాక్లెట్ల తయారీలో వినియోగిస్తున్నారు. దాదాపు 8 ప్రధాన కంపెనీలకు సంబంధించి 50కు పైగా రకాల చాక్లెట్లలో కోకోను అధికంగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ప్రోత్సహిస్తుంది. దేశంలో ఏపీ నంబర్‌వన్ కోకో సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో 39,714 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కోకో సాగు ఏటా సగటున 10,903.20 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. తమిళనాడులో 32,080 హెక్టార్లలో 2,802.45 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కేరళ రాష్ట్రంలో 17,366 హెక్టార్లలో సాగు జరుగుతుండగా 9,647.40 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కర్ణాటకలో 14,216 హెక్టార్లలో 3,719.10 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 950 కిలోలు, తమిళనాడులో 350 కిలోలు, కర్ణాటకలో 525, కేరళలో 850 కిలోలు దిగుబడి వస్తుంది. దేశ వ్యాప్తంగా 4 దక్షిణాది రాష్ట్రాల్లో 97,563 హెక్టార్లలో కోకో సాగు విస్తీర్ణం ఉండగా ప్రతి ఏటా 2,07,072.15 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.205గా ఉంది. అంతరపంటగా ప్రోత్సాహం కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా కోకో బాగా ఉపయుక్తంగా ఉండడంతో ఉద్యానశాఖ ద్వారా పభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో అత్యధికంగా సాగు విస్తీర్ణం ఉంది. – ఎ.దుర్గేష్, ఉద్యానశాఖ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ -
వడివడిగా.. ఉద్యాన పంటల విస్తరణ
సాక్షి, అమరావతి: లాభదాయకం కాని వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించి వ్యవసాయ రంగాన్ని పండుగల మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడేళ్లలో 4.29 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలను విస్తరించింది. ఈ ఏడాది 1.34 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణకు కార్యాచరణ రూపొందించి.. ఇప్పటికే లక్ష ఎకరాల్లో విస్తరణ పూర్తి చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 44.88 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. సాగు విస్తీర్ణంలో 39 శాతం రాయలసీమ జిల్లాల్లోనే ఉండటం విశేషం. మన రాష్ట్రం కొబ్బరి, బొప్పాయి, టమోటా సాగులో మొదటి స్థానంలో ఉండగా.. బత్తాయి, అరటి, వంగ, మిర్చి, ఆయిల్‌పామ్ పంటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. మామిడి, ఉల్లి, జీడిపప్పులో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఉద్యాన హబ్‌గా అవతరించే లక్ష్యంతో.. రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బోరు బావుల కింద రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, వరి క్షేత్రాల్లో అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి వంటి పంటలు పండుతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్ స్థానంలో నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి, కృష్టా–గోదావరి రీజియన్‌లో మొక్కజొన్న, చెరకుతోపాటు బోరు బావుల కింద వరి స్థానంలో ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, జామ తోటలు విస్తరిస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో సరుగుడుతో పాటు బోరు బావుల కింద వరి స్థానంలో ఆయిల్‌పామ్, జీడి మామిడి, కొబ్బరి తోటలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు లక్ష ఎకరాల్లో కొత్త తోటల విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. వ్యవసాయ పంటలతో పోలిస్తే రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉన్న ఉద్యాన పంటల వైపు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. పైగా ప్రధానమైన పంటలతో పాటు అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉద్యాన పంటల్లోనే ఉంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించొచ్చు. పైగా ఏ వాతావరణంలో అయినా మెజార్టీ ఉద్యాన పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యాన పంటల విస్తరణే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో లాభదాయకం కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. మూడేళ్లలో 4 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది 1.34 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించాం. ఆ దిశగా వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం. – కె.బాలాజీనాయక్, అదనపు డైరెక్టర్, ఉద్యాన శాఖ -
సాగు పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు, స్ప్రేయర్లను పంపిణీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవన్లో మంగళవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని చెప్పారు. జూలైలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టాలపై సత్వరమే నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా, ఏ దశలోనూ డీఏపీ సహా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఖరీఫ్ సీజన్లో సాగయ్యే 90 లక్షల ఎకరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా–ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పగడ్బందీగా, పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి మూడు ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్ల ఏర్పాటుకు ఈ నెలాఖరులోపు రైతు గ్రూపులను గుర్తించాలని చెప్పారు. ఉద్యాన రైతులకు పంటల మార్పిడిని అలవాటు చేయాలని సూచించారు. మిర్చిలో తామర పురుగు, అరటిలో సిగటోక తెగులు, పత్తిలో తెల్లదోమ వంటి తెగుళ్ల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొం డయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో మియాజాకీ మామిడి.. అక్షరాలా ‘లక్ష’ రూపాయలు
పిఠాపురం: ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్నారు పెద్దలు. ఓ రైతు తన కృషితో అరుదైన పంటలు పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ‘మియాజాకీ’ని పండించి ఔరా అనిపించాడు కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు. తనకున్న నాలుగెకరాల్లోనే వందకుపైగా రకాల పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నాడు. అరటి పండులా తొక్క వలుచుకుతినే బనానా మామిడి, యాపిల్‌లా కనిపించే యాపిల్ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని (సీడ్లెస్) మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడితో పాటు కేజీ సీతాఫలం, అరటి సపోటా, పిక్క లేని (సీడ్లెస్) నేరేడు, తెల్ల నేరేడు, ఎర్ర పనస, స్ట్రాబెర్రీ జామ, హైబ్రిడ్ బాదం, అల్జీరా, పీనట్ బటర్ ఫ్రూట్ తదితర అరుదైన పండ్ల మొక్కలతో పాటు సంప్రదాయ కొబ్బరి, రేగు, జామ, సీతాఫలం, నేరేడు, సపోటా మొక్కలను తన తోటలో నాటి వాటి ఫలాలను పొందుతున్నాడు. పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు, మసాలా దినుసుల సాగు కూడా చేపట్టాడు. ది కింగ్ ఆఫ్ మ్యాంగో మియాజాకీ రకానికి చెందిన మామిడిపండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా, కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు పొందింది. జపాన్ దేశంలోని మియాజాకీ ప్రాంతంలో దీని మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం, క్యాన్సర్‌ను నిరోధించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ. 2.70 లక్షల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. తెల్ల నేరేడు మొక్కల పెంపకంపై మక్కువతో నా నాలుగెకరాల పొలం ఎర్ర రేగడి నేల కావడంతో మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. మొక్కల పెంపకం అంటే నాకు చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం అరుదైన మొక్కలు పెంచాలనే ఆలోచనతో వాటిని నాటడం ప్రారంభించాను. రూ. 9 లక్షల వరకూ ఖర్చు చేసి ఇప్పటి వరకు 100కు పైగా అరుదైన రకాల మొక్కలు నాటాను. కడియం నర్సరీల వారితో మాట్లాడి ఆ మొక్కలు తెప్పించుకునే వాడిని. నా కుమారుడి సహకారంతో తోటను చంటి పిల్లాడిగా చూసుకుంటున్నా. మియాజాకీ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో ఒకటి ఒక కాయ కాసింది. దాని బరువు 380 గ్రాముల వరకు ఉంది. ఆన్లైన్లో పెడితే దాని ధర రూ. లక్షగా నిర్ణయించారు. మియాజాకీ మొక్కతో రైతు నాగేశ్వరరావు నాన్నకు తోడుగా నేను డిగ్రీ చదివాను. కంప్యూటర్ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తాను. ఖాళీ సమయాల్లో తోటలో నాన్నకు సహాయం చేస్తుంటాను. అరుదైన రకాల మొక్కలు ఆన్లైన్ ద్వారా రప్పించి నాటుతుంటాను. వాటికి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నాం. ఏమొక్కను ఎలా పెంచాలనేది ఇంటర్నెట్లో చూస్తాము. ఉద్యాన శాఖ వెబ్ సైట్ల ద్వారా కూడా మెళకువలు తెలుసుకుంటాం. పండ్లతో వ్యాపారం చేయాలనే ఆలోచన లేక పోయినప్పటికి ఆదాయం ఎక్కువగా వచ్చే రకాలు ఉండడంతో చాలా మంది ఆన్లైన్లో మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఫలాలను ఇస్తున్న మొక్కలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. – ఓదూరి కిషోర్, చేబ్రోలు ఇక్కడ మియాజాకీ పండడం చాలా అరుదు మియాజాకీ రకం మామిడి పండటం చాలా అరుదు. ఇది చాలా విలువైనది. మన ప్రాంతంలో పండించడం ఇదే మొదటిసారి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని అరుదైనవే. తోటను పరిశీలించి ఇతర రైతులకు పరిచయం చేస్తాం. ఇలాంటి అరుదైన మొక్కలను నాగేశ్వరరావు పండించటం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్ గానే చెప్పవచ్చు. – శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం -
పూత నిలబడక.. కాత తగ్గి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి పండ్ల దిగుబడి బాగా పడిపోయింది. పూత ఆలస్యంగా రావడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పూత నిలబడకపోవడంతో దిగుబడులు తగ్గాయని ఉద్యాన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి. సాధారణంగా ఎకరానికి 3.5 టన్నుల నుంచి 4.5 టన్నుల వరకు మామిడి దిగుబడి కావాలి. అంటే 12 లక్షల నుంచి 13 లక్షల టన్నుల వరకు రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి అవుతుందని అధికారు లు అంచనా వేశారు. కానీ, ఈసారి ఏడున్నర లక్షల వరకే మామిడి దిగుబడి పరిమితం అవుతుందని ఉద్యాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. రూ.లక్షన్నర నుంచి రూ.62 వేలకు తగ్గిన ధర సహజంగా మామిడి ఉత్పత్తి సగానికిపైగా తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ప్రకారం ధరలు పెరగాలి. కానీ రైతుకు ఆ ధరలు అందడంలేదు. గత నెల గడ్డిఅన్నారం మార్కెట్లో టన్నుకు రూ. లక్షన్నర పలికిన మామిడి ధర, శుక్రవారం గరిష్టంగా రూ. 62 వేలకు పడిపోయింది. కనిష్టంగా రూ. 20 వేలు మాత్రమే ఉండటం శోచనీయం. మోడల్ ధర రూ.37 వేలు మాత్రమే ఉంది. వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం పావు వంతు ధర కూడా పలకని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితమైతే ఒకానొకసారి అదే గడ్డిఅన్నారం మార్కెట్లో మామిడి ధర టన్నుకు రూ. 1.87 లక్షలు పలికింది. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలు తప్ప మరేమీ మిగలడంలేదు. మరోవైపు వినియోగదారులకు ఏమైనా తగ్గి ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఒకవైపు రైతును, మరోవైపు వినియోగదారులను ఎడాపెడా దోచేస్తున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి టన్నుకు సరాసరి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి పండ్లు రూ.40 వరకు ఉండాలి. కానీ, మార్కెట్లో ఏకంగా రూ. 100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ. 150–200 వరకూ వసూలు చేస్తున్నారు. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. మార్కెట్లను వారు తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వినియోగదారులు కూడా ఎవరినీ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడమే ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్నట్లు చెబుతున్నారు. -
ఉద్యాన రైతుకు రక్షణ కవచం
సాక్షి, అమరావతి: నాణ్యతలేని విత్తనం, నర్సరీల వల్ల నష్టపోతున్న రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఏపీ ఉద్యాన నర్సరీస్ రిజిస్ట్రేషన్ యాక్టు–2010లో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం నర్సరీలు, షేడ్‌నెట్, పాలీ హౌస్‌లతో పాటు నర్సరీ రంగంలో వ్యాపారం చేసే ప్రతీ ఒక్కరూ విధిగా లైసెన్సులు తీసుకోవాలి. వాస్తవానికి దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అధికారులు లైసెన్సు మంజూరు చేయాలి. ప్రస్తుతం ఫిబ్రవరి నెలాఖరుకల్లా రాష్ట్రంలోని నర్సరీలన్నింటికీ లైసెన్సులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన చట్టం ప్రకారం వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకూ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, మొక్కలు వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా సరఫరా అవుతాయి. వీఏఏ, వీహెచ్‌ఏల సహకారంతో రైతులు రాష్ట్రంలో ఏ నర్సరీ నుంచైనా మొక్కలను బుక్ చేసుకొని నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. రాష్ట్రంలో 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 312.34 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. విత్తనాలు, మొక్కల కోసం మెజార్టీ రైతులు ప్రైవేటు నర్సరీలు, బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్న షేడ్నెట్లు, పాలీహౌస్‌లపై ఆధారపడుతున్నారు. రాష్ట్రంలోని 5,885 నర్సరీల ద్వారా ఏటా 422.5 కోట్ల మొలకలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 95 శాతం మిరప, టమోటా, కూరగాయలు, అరటి (టిష్యూ కల్చర్) పంటలవే. ఏటా రూ. 2,481.6 కోట్ల టర్నోవర్ సాధిస్తోన్న ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా 4.41 లక్షల మంది, పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం పరిధిలో శాశ్వత పండ్ల మొక్కల నర్సరీలు మాత్రమే ఉన్నాయి. చట్టం పరిధిలో లేని షేడ్నెట్లు, పాలీ హౌస్‌లు, నర్సరీల్లో కొన్ని ఉత్పత్తి చేసే నాసిరకం విత్తనాల బారిన పడి రైతులు ఏటా వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వీరి ఆగడాలకు చెక్ పెడుతూ రూపొందించిన నూతన చట్టం ఈ నెల18 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. లైసెన్సులు ఇలా ► ఆర్బీకేల్లో ఉండే గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల వద్ద ఉండే దరఖాస్తు (ఫామ్–ఏ)తో పాటు రూ.1,000 చలనా రసీదు, పట్టాదార్ పాస్ పుస్తకం లేదా వన్ బీ లేదా కనీసం మూడేళ్ల లీజు డాక్యుమెంట్, నర్సరీ లే అవుట్, ఫీల్డ్ మ్యాప్, సాయిల్/వాటర్ అనాలసిస్ రిపోర్టు, డిజిటల్ ఫోటోలు సమర్పించాలి ► నర్సరీలైతే తల్లి మొక్కల దిగుమతి వివరాలివ్వాలి ► షేడ్‌నెట్, పాలీహౌస్ నర్సరీలు ఏ కంపెనీ నుంచి ఎంత విత్తనం కొన్నారో వాటి బ్యాచ్ నెంబర్‌తో సహా దరఖాస్తుతో పాటు సమర్పించాలి ► స్థానిక ఉద్యానాధికారి 30 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, తనిఖీ నివేదిక (ఫామ్ – బీ)ని జిల్లా ఉద్యానాధికారికి సమర్పిస్తారు. ► 90 రోజుల్లో లైసెన్సు జారీ చేస్తారు ► లైసెన్సు కాలపరిమితి 3 ఏళ్లు. ఆ తర్వాత రూ.500 చెల్లించి దరఖాస్తు (ఫామ్– డీ) సమర్పిస్తే రెన్యూవల్ (ఫామ్–ఈ) చేస్తారు. ► ఉద్యానాధికారి నర్సరీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు ► ఎక్కడైనా నాణ్యతా లోపాలుంటే లైసెన్సు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ► లైసెన్సు పొందిన తర్వాత నర్సరీలు ఉత్పత్తి చేసే మొక్కలు, మొలకలు, ఇతర ప్లాంట్ మెటీరియల్ వివరాలు, ధరలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి ► ఒక్క మొక్క అమ్మినా రైతుకు బిల్లు ఇవ్వాలి. చట్టం మంచిదే చట్టం పరిధిలోకి నర్సరీలన్నింటినీ తేవడం మంచిదే. కానీ ఈ చట్టం వల్ల చిన్న రైతులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం భరోసానివ్వాలి. చట్టంపై అవగాహన కల్పించాలి. రైతుల సందేహాలను నివృత్తి చెయ్యాలి. – పల్లా రామకృష్ణ, పల్లా వెంకన్న నర్సరీ, కడియం, తూర్పుగోదావరి జిల్లా నర్సరీలన్నీ చట్టం పరిధిలోకే.. ఉద్యాన రైతుకు రక్షణ కల్పించేలా ప్రస్తుతం ఉన్న చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఇక నుంచి నర్సరీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంది. నాణ్యమైన, ధ్రువీకరించిన మొలకలు, ప్లాంట్ మెటీరియల్‌ను ఆర్బీకేల ద్వారా రైతులు పొందే అవకాశం ఉంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, ఉద్యాన శాఖ కమిషనర్ -
మిర్చి రైతులకు పరిహారం ఇవ్వండి: తమ్మినేని
కొణిజర్ల: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతుబట్టని వైరస్‌తో మిరప తోటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఆయన భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్థానిక సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి వైరస్‌తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మిర్చి పంట గులాబీ, తామర పురుగులతో దెబ్బతిన్నదని, 80 వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. మిర్చి రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వ్యవసాయ, కీటక శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి ఏమీ తేల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు పూర్తిగా నష్టపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పరిహారం ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తమ్మినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలుండాలి సాక్షి, హైదరాబాద్: అసంబద్ధ, లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించి ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందన్నారు. ఒక పెద్ద మార్పు జరిగే సందర్భంలో ఆ మార్పు వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిశీలించి, జోక్యం చేసుకుని పరిష్కరించాలని తమ్మినేని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ ఉత్తర్వుల కారణంగా ఉద్యోగులు ప్రధానంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్న ఊరును, సొంత జిల్లాను వదిలి పెట్టి మరొక జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరే స్థానికత పునాదులను ధ్వంసం చేయబూనుకోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 10 వేల మంది ఉంటారని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కేటాయించి వారి సొంత జిల్లాలకు తీసుకురావాలని కోరారు. -
తెగుళ్ల తీవ్రతెంత.. పంట నష్టమెంత?
ఖమ్మం వ్యవసాయం: మిర్చిని ఆశించిన తెగుళ్ల ఉధృతిపై కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం బృందం సర్వే చేపట్టింది. తామర పురుగు ఉధృతి, పంట నష్టంపై ఆరా తీసింది. మిర్చిని ఆశించిన తెగుళ్లతో రైతులు నష్టపోతున్న తీరుపై ‘తెగులు తినేసింది.. దిగులే మిగిలింది’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉద్యాన శాఖ.. తెగుళ్ల వల్ల జరిగిన పంట నష్టంపై సర్వే నిర్వహించాలని కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం నిపుణులను అభ్యర్థించింది. దీంతో సస్యరక్షణ కేంద్రం సంయుక్త సంచాలకులు, కీటక శాస్త్రం నిపుణుడు డాక్టర్ అలంగీర్ సిద్ధిఖీ, కీటక శాస్త్రం నిపుణురాలు ఎస్.శ్వేత, రోగ నిపుణురాలు పి.సుధ బృందం శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. కూసుమంచి, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో సాగు చేసిన మిర్చి క్షేత్రాలను పరిశీలించింది. ఈ బృందం వెంట ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.అనసూయ కూడా ఉన్నారు. బృందం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించాక రాష్ట్ర ఉద్యాన శాఖకు నివేదిక అందజేస్తుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తలు నవంబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తామర పురుగు ఆశించిన పూత, కాత, ఆకులు, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు. అయితే నెల గడిచినా పూర్తి స్థాయిలో పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు గుర్తించకపోవడంతో పురుగు ఉధృతి పెరిగి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిర్చి తోటలను తొలగించడం మొదలుపెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో శాస్త్రవేత్తల బృందం పురుగు ఉధృతి, పంటకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటించింది. -
తామర పురుగు నివారణకు ఆర్బీకే సైన్యం
సాక్షి, అమరావతి: మిరప పంటపై తామర పురుగు దాడి చేయడంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో వారికి బాసటగా నిలిచేలా.. పంటను సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకే సిబ్బందిని రంగంలోకి దించింది. ఖరీఫ్‌లో మిరప సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది అనూహ్యంగా 4.75 లక్షల ఎకరాల్లో రైతులు మిరప వేశారు. గడచిన రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మిరప ధర క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి 15 వేల వరకు పలికింది. దీంతో పత్తి, వేరుశనగ రైతులు మిరప సాగువైపు మళ్లారు. పూత, పిందెల్ని పీల్చేస్తున్నాయ్ ప్రస్తుతం 60 శాతం పంట ఏపుగా ఎదిగే దశలో, 25 శాతం పూత దశలో, 10–15 శాతం పిందె దశలో ఉంది. ముదురు–నలుపు రంగులో ఉండే కొత్త రకం తామర పురుగులు మిర్చి పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చేస్తూ పంటను నాశనం చేస్తున్నాయి. 10–15 రోజుల్లో గుడ్డు నుంచి తల్లి దశకు చేరుకునే ఈ పురుగు తన 35 రోజుల జీవిత కాలంలో 150 నుంచి 300 గుడ్లు పెడుతుంది. వీటి నివారణ కోసం రైతులు పెద్దఎత్తున పురుగు మందులు వాడుతున్నా ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం ఇప్పటికే 1.50 లక్షల ఎకరాల్లో పంటపై ఈ పురుగు వ్యాపించినట్టు అంచనా. రంగంలోకి శాస్త్రవేత్తల బృందాలు తామర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తోంది. నివారణ చర్యలపై ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. ఆడియో, వీడియో సందేశాలను వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తోంది. తాజాగా ఉద్యాన వర్సిటీ శాస్తవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. మిరప ఎక్కువగా సాగయ్యే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిధిలోని 1,580 ఆర్బీకేల పరిధిలో ప్రచార జాతాలు సైతం మొదలయ్యాయి. అవసరమైన మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నారు. నివారణ ఇలా తామర పురుగు నలుపు, ముదురు గోధుమ రంగుల్లో కండె ఆకారంలో కోడి పేను లక్షణం కలిగి ఉంటుందని ఉద్యాన పరిశోధన కేంద్రం (లాం) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.శారద తెలిపారు. ఆశించిన వారం పది రోజుల్లోనే పంటను పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. వీటి నివారణకు ఆమె ఈ దిగువ సూచనలు చేశారు. ► తామర పురుగు సోకిన మిరప చేలపై ప్రతి నాలుగైదు రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయాలి. ఇది గుడ్లను పొదగనివ్వదు. పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వేప నూనె చేదు వల్ల ఆహారం తీసుకోలేక చనిపోతాయి. ► పొలంలో 25నుంచి 30 వరకు నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకుంటే పురుగు వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు. ► పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే పెగాసిస్ 1.25 గ్రాములు లేదా ఇంట్రీప్రిడ్ 2 ఎం.ఎల్. లేదా ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. వేపనూనె (10 వేల పీ.పీ.ఎం)తో కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి. ► అదేవిధంగా రెండు కేజీల పచ్చి మిరప, 500 గ్రాముల వెల్లుల్లిని కలిపి రుబ్బగా వచ్చిన పచ్చడిని ఒక గుడ్డలో చుట్టి 10 లీటర్ల నీటిలో ఉంచి, కషాయం దిగిన తరువాత వడకట్టి 1:10 పద్ధతిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ► రోజు మార్చి రోజు పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ► పొలంలో అక్కడక్కడా పొద్దు తిరుగుడు మొక్కలను ఆకర్షక పంటగా నాటాలి. ► విచక్షణా రహితంగా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి. నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నెలాఖరు వరకు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. క్షేత్ర స్థాయి పరిశీలన కోసం శాస్త్రవేత్తల బృందాలను పంపించాం. సామూహిక నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
ముంపు నీరు పోతే నష్టం ఉండదు
సాక్షి, అమరావతి: ‘గులాబ్’ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై కొంత మేర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఆరు జిల్లాల్లో దాదాపు 1,56,756 ఎకరాల్లో వ్యవసాయ, 6,463.65 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముంపునీరు పోయేందుకు వ్యవసాయ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌కు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. అలాగే, ముంపులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ముంపులో 1.16 లక్షల ఎకరాల వరిపంట ఇక వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా ప్రకారం.. వ్యవసాయ పంటలకు సంబంధించి 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న, 11,974 ఎకరాల్లో పత్తి, 4,708 ఎకరాల్లో మినుములు, 689 ఎకరాల్లో వేరుశనగ, 541 ఎకరాల్లో రాజ్మా, 466 ఎకరాల్లో చెరకు, 239 ఎకరాల్లో పెసలు, 150 ఎకరాల్లో మిరప, 62 ఎకరాల్లో పొగాకు, 25 ఎకరాల్లో రాగులు పంటలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే.. 3,260.9 ఎకరాల్లో అరటి, 1,517.5 ఎకరాల్లో మిర్చి, 1,105.85 ఎకరాల్లో కూరగాయలు, 376.55 ఎకరాల్లో బొప్పాయి, 136.75 ఎకరాల్లో పసుపు పంటలతో పాటు 22.75 ఎకరాల్లో పూల తోటలు ముంపునకు గురవగా, 374 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. పంటలను కాపాడుకోవచ్చు ముంపునకు గురైన పొలాల్లోని పంటలను కాపాడుకునేందుకు ఆర్బీకే స్థాయిలో వీడియో సందేశాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ముందు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు తగిన మోతాదుల్లో ఎరువులు, మందులు జల్లుకుంటే పంటలను కాపాడుకోవచ్చు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ పక్వానికొచ్చిన పండ్లను కోసేయండి ముంపునకు గురైన ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పే సూచనలను రైతులు పాటించాలి. పక్వానికి వచ్చిన అరటి, బొప్పాయి పండ్లను కోసెయ్యాలి. నేలకొరిగిన పంటలను నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. సీఓసీ, మాన్కోజెబ్ వంటి శిలీంద్ర సంహారిణిని రైతులకు అందించేందుకు ఆదేశాలిచ్చాం. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్ ఉద్యాన శాఖ ముంపు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలి మంత్రి కన్నబాబు ఆదేశం గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లోని అన్నదాతలకు అండగా నిలబడాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి సోమవారం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్నబాబు మాట్లాడుతూ.. ఈ ఆరు జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లుగా గుర్తించారన్నారు. వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా పర్యటించి రైతులకు అండగా నిలబడాలని.. రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని మంత్రి సూచించారు. ముంపునీరు తగ్గగానే ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు హెచ్. అరుణ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
1 నుంచి సూక్ష్మసేద్య పరికరాల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 1 నుంచి బిందు, తుంపరసేద్య పరికరాలను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,190.11 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 24.76 లక్షల హెక్టార్లలో సూక్ష్మసేద్యానికి అనువుగా ఉన్నా ఇప్పటివరకు 13.42 లక్షల హెక్టార్లలో మాత్రమే అమలవుతోందని చెప్పారు. మరో 11.34 లక్షల హెక్టార్లలో విస్తరించేందుకు అవకాశాలున్నాయన్నారు. ఈ ఏడాది లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అర్హులైన రైతులకు బిందు, తుంపరసేద్య పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. ఆయన గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ల కింద వరి సాగుచేయని, గతంలో ఈ పథకం కింద లబ్ధిపొందని రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నర్సరీల నియంత్రణ కోసం ఉద్యాన నర్సరీ క్రమబద్ధీకరణ చట్టం–2010కి సవరణలు తీసుకొచ్చి అన్ని నర్సరీలను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయకులకు పూర్తిస్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. వైఎస్సార్ పొలంబడి, తోటబడిని క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఉద్యాన పంటలను పండించే రైతులకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొబ్బరి తెగుళ్ల నివారణకు చర్యలు గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలకు సోకుతున్న మొవ్వ తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని కన్నబాబు అధికారులకు సూచించారు. ఉద్యానశాఖ కమిషనర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ ఈ ప్రాంతాల్లో పర్యటించి మొవ్వతోపాటు కొబ్బరికి సోకుతున్న ఇతర తెగుళ్ల తీవ్రతపై అధ్యయనం చేయాలని కోరారు. అధికారులు, శాస్త్రవేత్తలతో రెండు బృందాలను ఆ ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. తెగులు సోకిన వాటి స్థానంలో కొత్త కొబ్బరి మొక్కలు నాటేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు పథకాల ద్వారా ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలతో పాటు ఖరీఫ్ సీజన్లో ఆర్బీకేల ద్వారా జరుగుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపి ణీపై సమీక్షించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు -
కొత్తగా 1,000 హెక్టార్లలో కొబ్బరి సాగు
సాక్షి, అమరావతి: కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ)తో కలిసి ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొబ్బరి తోటల పునరుద్ధరణ, సాగు విస్తరణ తదితర స్కీమ్స్ కోసం రూ.10.76 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అమలు చేస్తోన్న స్కీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ► కొబ్బరి విస్తరణ ప్రాజెక్టు కింద ఈ ఏడాది రూ.74.50 లక్షల అంచనాతో 1,000 హెక్టార్లలో కొత్తగా కొబ్బరి సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. హెక్టార్‌కు రూ.8 వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ► పాత తోటల పునరుజ్జీవం, పునరుద్ధరణ పథకం కింద రూ.8.15 కోట్లతో 1,250 హెక్టార్లలో దిగుబడినివ్వని పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతోపాటు ప్రస్తుతమున్న తోటలను మరింత దిగుబడి వచ్చేలా అభివృద్ధి చేస్తారు. తొలి 20 చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున, ఆ తర్వాత ప్రతీ చెట్టుకు రూ.250 చొప్పున హెక్టార్లో 13 వేల చెట్లకు సబ్సిడీ ఇస్తారు. ► డిమాన్స్ట్రేషన్ కమ్ సీడ్ ప్రొడక్షన్ ఫామ్ (డీఎస్పీ) నిర్వహణ కింద వేగివాడలో సీబీడీ ఆధ్వర్యంలో ఉన్న 40 ఎకరాల్లో ఈ ఏడాది రూ.27 లక్షలతో 60 వేల విత్తనోత్పత్తి చేయనున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 లక్షల విత్తనోత్పత్తి కోసం రూ.96 లక్షలు ఖర్చుచేయనున్నారు. ► రూ.6 లక్షల అంచనాతో ఒక న్యూక్లియర్ కోకోనట్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తాన్ని తొలి ఏడాది రూ.3 లక్షలు, రెండో ఏడాది 1.50 లక్షలు, మూడో ఏడాది రూ.1.50 లక్షల చొప్పున మూడేళ్ల పాటు సర్దుబాటు చేస్తారు. ఇందులో 25 శాతం సబ్సిడీ ఇస్తారు. ► స్మాల్ కోకోనట్ నర్సరీ స్కీమ్ కింద ఒక్కో నర్సరీకి రూ.2 లక్షల అంచనాతో 10 యూనిట్లను మంజూరు చేయనున్నారు. 25 శాతం సబ్సిడీ ఇస్తారు. ► ఉత్పత్తిని మెరుగుపర్చే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ ఫర్ ప్రొడెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద 91.82 హెక్టార్లలో నమూనా క్షేత్రాల ప్రదర్శన కోసం రూ.21.53 లక్షలు ఖర్చు చేయనున్నారు. ► రూ.1.60 లక్షలతో నాలుగు ఆర్గానిక్ మెన్యూర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ► ఈ ఏడాది కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 64 వేల చెట్లకు రూ.9 లక్షలతో బీమా కల్పించనున్నారు. ఇందుకోసం 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించనుండగా, మిగిలిన 25 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ► కేర సురక్ష స్కీమ్ కింద 370 మంది కొబ్బరి దింపు కార్మికులకు రూ.1.48 లక్షలతో బీమా కల్పించనున్నారు. -
మన్యంలో ‘సుగంధ’ పంటల పరిమళం
సాక్షి, విశాఖపట్నం: సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన అల్లం, పసుపు, మిరియాల పంటల సాగుకు విశాఖ మన్యం ఇప్పటికే పేరొందింది. తాజాగా జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క సాగును సైతం చేపట్టిన గిరిజన రైతులు లాభాల పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి సమశీతల వాతావరణం, మెరుగైన వర్షపాతం, సారవంతమైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మేటిగా నిలుస్తున్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కన్నా సేంద్రియ విధానంలో పండిస్తున్న మన్యం మసాలా సరుకులకు క్రమేపీ డిమాండ్ పెరుగుతోంది. వీటిని సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మేలు రకం మొక్కలను తీసుకొచ్చి ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అందిస్తోంది. పసుపు మిసమిసలు ఇక్కడ పండించిన పసుపు కిలో రూ.82 నుంచి రూ.85 వరకూ ధర పలికింది. ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందిన రైతు సహకార ఉత్పత్తి సంఘాలైతే రూ.90 నుంచి రూ.95 వరకూ విక్రయించాయి. 20,552 ఎకరాల్లో సేంద్రియ విధానంలో పండిస్తున్న ఇక్కడి పసుపులో నాణ్యత, ఛాయ అధికంగా ఉంటోంది. ఏటా రెండు వేల ఎకరాల చొప్పున ఐదేళ్లలో మరో 10 వేల ఎకరాల్లో పసుపు సాగును విస్తరించేందుకు పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. అదిరే అల్లం మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. ఘాటు తక్కువగా ఉన్నా పరిమాణంలో పెద్దగా ఉండటంతో వ్యాపారులు పచ్చళ్ల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశవాళీ చింతపల్లి, నర్సీపట్నం రకాల అల్లంలో ఘాటు ఎక్కువ. పీచు కూడా ఎక్కువే. ఒక దశలో కిలో ధర రూ.150 వరకూ వెళ్లింది. ప్రస్తుతం రూ.82 నుంచి రూ.100 వరకు ఉంది. కేరళను తలదన్నే మిరియాలు కాఫీ తోటల్లో అంతర పంటగా 98 వేల ఎకరాల్లో మిరియం సాగు అవుతోంది. ఈ ఏడాది దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచి్చంది. ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. కేరళ మిరియం కన్నా మన్యం మిరియంకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. రెక్కలు తొడుగుతున్న లవంగం కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి పెనాంగ్ రకం లవంగాల మొక్కలను ఉద్యాన శాఖ గత ఏడాది తీసుకొచ్చి గిరిజన రైతులకు ఉచితంగా అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో వేసిన మొక్కలు ఎదుగుదల బాగానే ఉంది. మొలిచిన ‘దాల్చిన’ కేరళలో కాలికట్లోనున్న జాతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం నుంచి దాల్చిన మొక్కలను ఉద్యాన శాఖ తీసుకొచ్చి కొంతమంది రైతులకు అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో అంతర పంటగా ఈ మొక్కలను వేశారు. ఈ ఏడాది మరింత విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుగంధ ద్రవ్యాల సాగుతో మంచి ఆదాయం నాణ్యమైన సుగంధ ద్రవ్య పంటల సాగుకు మన్యంలోని వాతావరణం, సారవంతమైన నేలలు ఎంతో అనుకూలం. ఈ ప్రాంతంలో అల్లం, పసుపు, మిరియాలే కాకుండా జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి వాణిజ్య పంటలను విస్తరించడానికి అవకాశం ఉంది. పసుపు, అల్లం సాగుకైతే ప్రభుత్వం హెక్టారుకు రూ.12 వేలు, మిరియం సాగుకు రూ.8 వేలు రాయితీగా ఇస్తోంది. జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మొక్కలు వేసిన వారికి రూ.20 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. – కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉపసంచాలకులు, విశాఖ జిల్లా వేళ్లూనుకుంటున్న జాజికాయ గత ఏడాదే మన్యంలోకి జాజికాయ మొక్కలు అడుగుపెట్టాయి. కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి విశ్వశ్రీ రకం మొక్కలను ఉద్యాన శాఖ అధికారులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు. ప్రస్తుతం 80 ఎకరాల్లో ఏపుగా పెరుగుతున్న ఈ మొక్కలు ఐదో ఏట నుంచి దిగుబడినిస్తాయి. -
మధుర ఫలం.. చైనా హాలాహలం!
తేనెలూరే మామిడి, నోరూరించే బొప్పాయి, పోషకాలిచ్చే అరటి కనిపిస్తే చాలు కొనేస్తాం. కానీ ఈ పండ్ల వెనుక దాగిన కాలకూట విషం ఆరోగ్యాలను హరిస్తోంది. సహజసిద్ధంగా పండాల్సిన వాటిని 24 గంటల్లో రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు తరచూ తనిఖీలు జరిపి వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. చైనా నుంచి దొడ్డిదారిన మార్కెట్లోకి వస్తున్న ఈ విష రసాయనాల ద్వారా మగ్గించిన పండ్లను తినడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కధనం.. – సాక్షి, అమరావతి విజయవాడలోని ‘నున్న’ మ్యాంగో మార్కెట్ కరోనా ఉధృతిలోనూ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో మామిడి రైతులతో, వివిధ రాష్ట్రాల వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫుడ్ సేప్టీ, ఉద్యాన శాఖాధికారులతో కలిసి ‘సాక్షి బృందం’ మార్కెట్‌ను పరిశీలించగా విస్తుపోయే విషయాలు కనిపించాయి. మామిడి కాయలను కృత్రిమంగా మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత గోల్డ్ రైప్, ఎఫ్‌వైకే ఎథెఫాన్ రెపైనింగ్ పౌడర్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. యశస్విని ప్రసన్న లక్ష్మి ఫ్రూట్ కంపెనీ, ఎస్డీఎఫ్ మ్యాంగో షాపుల నుంచి నాలుగు శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపిన అధికారులు కేసులు నమోదు చేశారు. నూజివీడు, గంపలగూడెం, విస్సన్నపేట, ఆగిరిపల్లి, ఏ.కొండూరు, ఈదర లోకల్ మార్కెట్లలో కూడా ‘సాక్షి బృందం’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే రీతిలో నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను వాడుతున్నట్లు తేలింది. ఏటా రూ.100 కోట్ల ఎథెఫాన్ దిగుమతి పురుగుల మందుల జాబితా కింద 10 శాతం పేస్ట్‌రూపంలో, 39 శాతం లిక్విడ్, 20 శాతం పౌడర్ రూపంలో ఎథెఫాన్ మార్కెట్లోకి వçస్తుంది. మార్కెట్‌కు వచ్చే ఈ ఎథెఫాన్కు అధికారికంగా ఎలాంటి అనుమతుల్లేవు. పెస్టిసైడ్స్ కింద ఏటా చైనా నుంచి రూ.100 కోట్ల విలువైన ఎథెఫాన్ పౌడర్ దేశీయ మార్కెట్లోకి గుట్టు చప్పుడు కాకుండా వస్తోంది. ఎఫ్‌వైకే, గోల్డ్ రైప్ ఎథెఫాన్ ప్యాకెట్లను మామిడి, అరటి, బొప్పాయి మగ్గపెట్టేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. నున్నతో పాటు నూజివీడు, రాయచోటి, కేదారేశ్వరపేట, ఉలవపాడు, బంగారపాలెం, దామల చెరువు, ఒంగోలు, కాకినాడ, విశాఖ, విజయనగరంతో పాటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని గ్రామ స్థాయి మార్కెట్లలో సైతం పండ్లను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు గ్రాములుండే ఒక్కో ప్యాకెట్లో 20 శాతం (600 మిల్లీ గ్రాములు) మించి ఎథెఫాన్ ఉండ కూడదు. ఎథెఫాన్‌తో పాటు మిగిలిన మిశ్రమంపై స్పష్టత లేదు. సాచెట్ మొత్తం ఎథెఫాన్తోనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నున్న మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో బాక్సులో ఏకంగా ఆరేడు ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. అవయవాలపై తీవ్ర ప్రభావం ఎథెఫాన్ ముట్టుకున్న చేతులతో కంటిని తాకితే కంటి చూపు పోతుంది. గొంతులోకి వెళ్తే శ్వాసకోస వ్యవస్థ దెబ్బ తింటుంది. మాగబెట్టే సమయంలో నేరుగా పండు లోపలికి వెళ్లడం వల్ల వీటిని తిన్నవారి నరాల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోకి వెళ్తే లివర్, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరకు టమోటా లాంటి కూరగాయలను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్ లిక్విడ్‌ను వాడుతున్నారు.ఇటీవల వెలుగు చూసిన ఏలూరు ఘటనలో వందలాదిమంది ఆస్పత్రి పాలవడానికి కారణం వారి శరీరంలో పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, ఆర్గనోక్లోరైన్, ఆర్గనోఫాస్పేట్ కెమికల్స్ శాతం ఎక్కువగా ఉండడమేనని ఎయిమ్స్, ఐఐసీడీ, ఎన్ఐఎన్ వంటి జాతీయ ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. రాష్ట్రంలో 280 రైపనింగ్ చాంబర్లు రాష్ట్రంలో 7.40లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగవుతున్నాయి. ఏటా కోటి 82 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తున్నాయి.కూరగాయలు 2.64లక్షల హెక్టార్లలో సాగవుతుండగా 75.38లక్షల ఎంటీల దిగుబడులు వస్తున్నాయి. వీటిని మగ్గబెట్టేందుకు 53,923 ఎంటీల సామర్థ్యంతో 280 ఎథిలీన్ రైపనింగ్ చాంబర్స్, 19.60లక్షల ఎంటీల సామర్థ్యంతో 394 కోల్డ్ స్టోరేజ్లున్నాయి. ఎలాంటి హాని కలిగించని ఎథిలిన్ గ్యాస్ ద్వారా పండ్లను మగ్గబెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. ఈమేరకు రైపనింగ్ చాంబర్స్‌ను ఏర్పాటు చేసింది. రైపనింగ్ చాంబర్స్ నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చే వారికి 50 శాతం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు 75 శాతం సబ్సిడీ అందచేస్తోంది. ఎథెఫాన్.. ఓ పురుగుల మందు ఎథెఫాన్‌తో మగ్గబెడితే 24 గంటల్లోనే ఏ పండైనా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఎథెఫాన్ కృత్రిమంగా తయారు చేసిన సింథసైజ్డ్ కెమికల్. మొక్కల పెరుగుదలకు ఉపయోగించే దీన్ని ఆర్గానో ఫాస్పారిక్ (శాస్త్రీయ నామం సీ 2హెచ్ 6 సీఎల్ ఒ 3పీ), ఇౖథెల్ ఫాస్పానిక్ యాసిడ్ అని కూడా అంటారు. దీని పీహెచ్ విలువ 2 కంటే తక్కువ. కడుపులో ఉండే డైల్యూట్ హైడ్రోలిక్ క్లోరిక్ యాసిడ్స్ కంటే పవర్ ఫుల్ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. 1975లో ఎథెఫాన్‌ను పురుగుల మందుల జాబితాలో చేర్చారు. ఏదైనా పురుగుల మందును కోతలకు ముందు వాడితే డీకంపోజ్ అవుతుంది. తినే ముందు వాడితే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలా ప్రమాదకరం... ‘నున్న మార్కెట్లో 10 కిలోల మామిడికి ఏకంగా ఆరేడు ఎథెఫాన్ ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. ఏకంగా 18 నుంచి 21 గ్రాముల ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నారు. ఇది కాల్షియం కార్బైడ్ కంటే ప్రమాదకరం. రెండు కేసులు పెట్టాం. మిగిలిన మార్కెట్లలో తనిఖీలు చేస్తాం’ –ఎన్.పూర్ణచంద్ర రావు, జోనల్ ఫుడ్ కంట్రోలర్, విజయవాడ అవయవాలపై తీవ్ర ప్రభావం ‘ఎథెఫాన్ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల గొంతు, ఊపిరితిత్తులు, లివర్ దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. స్కిన్ అలర్జీలొస్తాయి. పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది’ –డాక్టర్ సూర్యదీప్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ యాసిడ్స్ విడుదల ‘ఒక పదార్థం కానీ పండు కానీ తింటే లోపలకు వెళ్లగానే అమైనోయాసిడ్స్‌గా విడిపోవాలి. ఆ తరా>్వత కార్బోహైడ్రేట్స్‌గా మారి శరీరంలోకి అబ్జార్వ్ అవుతాయి. విషపూరిత రసాయనాలను వినియోగించి బలవంతంగా మగ్గించిన పండ్లను తినడం వల్ల అవసరమైనవి కాకుండా ప్రమాదకరమైన యాసిడ్స్ శరీరంలోకి చేరతాయి. మోతాదు పెరిగే కొద్ది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి క్యాన్సర్ కారకంగా మారుతుంది’ – ప్రొ.ఎం.వి బసవేశ్వరరావు, కెమిస్ట్రీ విభాగం, కృష్ణా యూనివర్శిటీ రైపనింగ్ చాంబర్స్‌కు చేయూత ‘కాల్షియం కార్బైడ్‌ను పూర్తిగా కట్టడి చేశాం.ఎథిలిన్ రైపనింగ్ చాంబర్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. వాటి ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి చేయూతనిస్తున్నాం. కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎఫ్ఎస్ఎస్ఎఐ నిబంధనలకు విరుద్ధంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎథెఫాన్ వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటి నియంత్రణకు ఉద్యాన శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటాం’ – ఎం.వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు, ఉద్యాన శాఖ -
దక్షిణ కొరియాకు ఆంధ్రా మామిడి
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలో మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ధరలు పడిపోకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం ఎగుమతులకు ఆటంకం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల మామిడి పండ్ల దిగుబడులు వస్తాయని అంచనా. గతేడాది లాక్డౌన్ కారణంగా మామిడి రవాణా విషయంలో విదేశాలతో పాటు దేశీయంగానూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతుకు ఊరటనిస్తున్నాయి. దశల వారీగా పంట మార్కెట్‌కు వచ్చేలా చేయడం.. రైతులు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని సమీక్షించడం, లాక్డౌన్ అమలులో రాష్ట్రాలతో పాటు ఆంక్షలు విధించిన రాష్ట్రాలతో చర్చలు జరుపుతూ రవాణాకు ఇబ్బంది లేకుండా చూడటం వంటి చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత నెలలో విజయవాడ, తిరుపతిలో నిర్వహించిన బయ్యర్స్, సెల్లర్స్ మీట్ల ద్వారా సుమారు 5 వేల టన్నుల ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి (కలెక్టర్), చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. తొలిసారి దక్షిణ కొరియాకు.. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విజయవాడ నుంచి విమాన మార్గం ద్వారా సౌదీకి పంపించి.. అక్కడి నుంచి వాయు మార్గంలోనే దక్షిణ కొరియాకు పంపించారు. న్యూజిలాండ్, సింగపూర్, ఒమన్ దేశాలకు సైతం 70 టన్నులకు పైగా మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, యూరప్ దేశాల నుంచి కనీసం 500 టన్నుల ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్ నుంచి ఆయా దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఎగుమతులపై ప్రభావం చూపింది. నెలాఖరులోగా పరిస్థితి చక్కబడి విమాన రాకపోకలు పునరుద్ధరిస్తే ఎగుమతులకు డోకా ఉండదని భావిస్తున్నారు. ఏడు కిసాన్ రైళ్లలో రవాణా ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది. ఇప్పటికే విజయవాడ, విజయనగరం నుంచి ఢిల్లీకి కిసాన్ రైళ్లు వెళ్లాయి. వీటి ద్వారా సుమారు 3,500 టన్నుల మామిడితో ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌కు పంపించారు. ఈ నెలాఖరులోగా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని కిసాన్ రైళ్ల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు రోజుకు వంద టన్నులకు పైగా మామిడి రవాణా అవుతోంది. వినియోగదారులకు నేరుగా మామిడి ఈ ఏడాది కూడా రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు, అపార్టుమెంట్లలో నివసించే వారికి రాయలసీమ ప్రాంత రైతులు నేరుగా మామిడిని రవాణా చేస్తున్నారు. గతేడాది కరోనా దెబ్బకు టన్ను రూ.30 వేలకు మించి పలుకని మామిడి ఈ ఏడాది గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. కాగా ప్రస్తుతం రూ.35వేల నుంచి రూ.45 వేల మధ్య నిలకడగా ఉంది. దేశీయంగా ఇబ్బందుల్లేవు మామిడి రైతులు నష్టపోకుండా ఎప్పటికప్పుడు మార్కెట్‌ను పరిశీలిస్తున్నాం. లాక్డౌన్ ఉన్న రాష్ట్రాలతో చర్చిస్తున్నాం. రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. సౌత్ కొరియాకు తొలి కన్సైన్మెంట్ వెళ్లింది. మిగిలిన దేశాలకూ పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎం.వెంకటేశ్వరరావు, ఏడీ, ఉద్యాన శాఖ -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఉలవపాడు మామిడి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. ప్రధాన క్లస్టర్‌గా ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. కాయల్ని ఎలా ప్యాక్ చేయాలో శిక్షణ ఇస్తున్నాం.. ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం. – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా -
5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అగ్రికల్చరల్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) సౌజన్యంతో ఉద్యానశాఖ మంగళవారం విజయవాడలో ఓ హొటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బయ్యర్లు–సెల్లర్ల మీట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు వంద మందికి పైగా మామిడి రైతులు, దేశం నలుమూలల నుంచి ఏటా దేశ విదేశాలకు ఎగుమతి చేసే 55 మంది అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు పాల్గొన్నారు. ఈ మీట్లో 5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు రైతులు–ఎగుమతిదారుల మధ్య జరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టార్‌కు 15 టన్నుల చొప్పున 56 లక్షల టన్నులకుపైగా మామిడి దిగుబడులు రానున్న దృష్ట్యా ఆ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విజయవాడ, తిరుపతిలలో బయ్యర్స్– సెల్లర్స్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ..మామిడి ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. అపెడా ఏజీఎం నాగ్‌పాల్ మాట్లాడుతూ..మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయాలనుకునే రైతులు అపెడా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖాముఖి భేటీలో పలువురు ఎక్స్‌పోర్టర్స్ మాట్లాడుతూ అమెరికా, సింగపూర్, లండన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ కార్గోహెడ్ అబ్రహాం లింకన్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ప్రైవేట్ రంగం నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు వంటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో ఎన్నో సందేహాలు ఉంటున్నాయని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) అభిప్రాయపడింది. అందుకే ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని సిఫారసు చేసింది. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఆస్కీని అధ్యయనం చేయమని కోరింది. ఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించింది. ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదికను అందజేసినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యానశాఖ అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఏ పంట.. ఎలా పండిస్తే ఏ మేరకు లాభం ఉంటుందో వివరించి చెప్పాలని సూచించింది. అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు రాష్ట్ర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు పండాలంటే సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగాలని ఆస్కీ స్పష్టం చేసింది. అందుకోసం వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అదనంగా రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచాలని సిఫార్సు చేసింది. దీంతో ఉద్యాన ఉత్పత్తుల విలువ దాదాపు రూ. 40 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి, ఎగుమతులు కూడా పెరుగుతాయని తెలిపింది. ఉద్యాన ఉత్పత్తులను పెంచాలంటే, ఉద్యాన శాఖకు ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. 1,700 కోట్లు కేటాయించాలని సూచించింది. అలాగే ఉద్యానశాఖలో అధికారులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అందుకోసం నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసింది. క్రాప్ క్లస్టర్ల ఏర్పాటు రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల లోటు భారీగా ఉందని, వాటి కొరత తీరాలంటే క్రాప్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ‘పండ్ల సాగుకు ఐదు క్లస్టర్లు, కూరగాయలకు తొమ్మిది, పూలకు ఒకటి, సుగంధ ద్రవ్యాలకు ఐదు క్లస్టర్లు ఉండేలా ప్రణాళిక రచించాలి. అందుకోసం ప్రతి జిల్లాలో అక్కడి వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, నీటి వసతిని పరిశీలించాలి. రైతులు తమ పంటల పొలాల గెట్ల వద్ద టేకుతో పాటు చింత, జామ, వెదురు తదితరమైనవి వేసుకునేలా అవగాహన కల్పించా’లని తెలిపింది. అక్టోబర్ నెలలో ఉల్లిగడ్డ దిగుమతులు రాష్ట్రానికి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు తగ్గి, రైతులకు నష్టం వస్తోంది. అందుకే అక్టోబర్‌లో ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గించాలని సూచించింది. ఆలుగడ్డ పండిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని, దాన్ని 27 వేల ఎకరాల్లో సాగు చేసేలా చూడాలంది. 16 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పండించాలని పేర్కొంది. మరికొన్ని సిఫారసులు ►ఖరీఫ్, రబీలలో కొన్ని రకాల కూరగాయలు అదనంగా వస్తున్నాయి. వాటికి డిమాండ్ వచ్చేలా ప్రణాళిక రచించాలి. ►వేసవిలో వస్తున్న కొరతను అధిగమించేలా ఉత్పత్తి, సరఫరా పెంచాలి. ►ఉద్యాన ఉత్పత్తులకు కోల్డ్‌చైన్లు ముఖ్యం. ప్రీ కూలింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు, రైసెనింగ్ చాంబర్లు (పండ్లను మగ్గబెట్టేందుకు) ఏర్పాటు చేయాలి. ►5 వేల మెట్రిక్ టన్నులతో 30 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, 300 రైసెనింగ్ చాంబర్లు, ప్రతి కూరగాయల మార్కెట్‌కు ఒక రిఫ్రిజిరేటర్ ఉండాలి. ►రెడీ టు సర్వ్‌లో భాగంగా డ్రైయింగ్, ఓస్మోటిక్ డీ హైడ్రేషన్, పల్పింగ్ జ్యూస్ చేసే ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించాలి. ►మార్కెట్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. -
ఆంధ్రా అరటి.. చలో యూరప్
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా అరటి’ తీపిని ప్రపంచ దేశాలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అరటి సాగు, దిగుబడి, ఎగుమతుల్లో ఇప్పటికే మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి రెండేళ్లుగా మధ్య తూర్పు దేశాలకు అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది నుంచి యూరోపియన్ దేశాలతోపాటు లండన్‌కు సైతం ఎగుమతి చేయనున్నారు. కనీసం లక్ష టన్నుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యాన శాఖ ఉపక్రమించింది. రాష్ట్రంలో ఈ ఏడాది 1,08,083 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. 64,84,968 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. చక్కెరకేళి, గ్రాండ్–9, ఎర్ర చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బుడిద చక్కెరకేళి, తేళ్ల చక్కెరకేళి, సుగంధ, రస్తోలి వంటి రకాలు సాగవుతున్నాయి. వైఎస్సార్, అనంతపురం, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా విస్తరించింది. పచ్చ అరటికి భలే డిమాండ్ రాష్ట్రంలో వివిధ రకాల అరటి సాగవుతున్నా.. నిల్వ సామర్థ్యం, తీపి అధికంగా ఉండే గ్రాండ్–9 (పచ్చ అరటి) మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2016–17 సంవత్సరంలో ఇక్కడి నుంచి ఎగుమతులకు శ్రీకారం చుట్టగా.. ఆ ఏడాది 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి అయ్యాయి. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులను ఎగుమతి చేశారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తినా 38,520 టన్నులను ఎగుమతి చేయగలిగారు. ముంబై కేంద్రంగా ఎగుమతులు అరటి ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఐఎన్ఐ, ఫార్మ్స్, దేశాయ్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కంపెనీలతో రాష్ట్ర ఉద్యాన శాఖ ఒప్పందాలు చేసుకుంది. వీటితో పాటు మరో 10 మేజర్ కార్పొరేట్ కంపెనీల ద్వారా కనీసం లక్ష టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక్కొక్కటి 45 వ్యాగన్ల సామర్థ్యం గల ఆరు ప్రత్యేక రైళ్ల ద్వారా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబై నౌకాశ్రయానికి అరటి పండ్లను రవాణా చేశారు. అక్కడ నుంచి విదేశాలకు 20 వేల టన్నులను ఎగుమతి చేశారు. మరో రైలు ఈ నెల 27వ తేదీన బయల్దేరబోతుంది. విత్తు నుంచి మార్కెట్ వరకు.. డ్రిప్ ఇరిగేషన్, టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించడంతో పాటు బడ్ ఇంజెక్షన్, బంచ్ స్ప్రే, బంచ్ స్లీవ్స్, రిబ్బన్ ట్యాగింగ్, ఫ్రూట్ కేరింగ్, ప్రీ కూలింగ్, వాషింగ్, గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా.. విత్తు నుంచి మార్కెట్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 12 జిల్లాల్లో 46 క్లస్టర్స్‌ను గుర్తించి ఐఎన్ఐ ఫరŠమ్స్, దేశాయ్ కంపెనీల సహకారంతో కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ తోట బడుల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రూట్ కేరింగ్ కార్యకలాపాలను రైతులకు చేరువ చేస్తున్నారు. ఆంధ్రా అరటే కావాలంటున్నారు ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల వ్యాపారులు ఆంధ్రా అరటి మాత్రమే కావాలంటున్నారని ఎక్స్‌పోర్టర్స్ చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన అరటి కోసం ఎగుమతిదారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎక్స్‌పోర్టర్స్ ముందుకొచ్చారు. మరింత మంది రాబోతున్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్‌తో పాటు ఆర్బీకేల ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ తోటబడులు అరటి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో దోహదపడ్డాయి. ఈ ఏడాది హెక్టార్‌కు 65 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ (పండ్ల విభాగం) -
మొక్కలు, కల్తీ నారు అమ్మితే జైలుకే
సాక్షి, కరీంనగర్: ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. ఇబ్బడిముబ్బడిగా పూలు, పండ్ల మొక్కల విక్రయాలు, బంతి, మిర్చి నారు విక్రయాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు అంకెల్లో ఉన్న నర్సరీలు నేడు వందలకు చేరాయి. హైబ్రిడ్ మొక్కలని అంటగట్టి ఉడాయిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రయివేటు నర్సరీలను కూడా చట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోరలు లేని గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. నర్సరీల రిజిస్ట్రేషన్ సదరు శాఖ కనుసన్నల్లో సాగనుంది. ఇకపై జిల్లాలో ఉన్న నర్సరీలన్నీ ఉద్యాన శాఖ పరిధిలో చేరాల్సిందే. రైతులు, ప్రకృతి ప్రేమికులకు నాణ్యమైన మొక్కలు, నారు విక్రయాలతోపాటు నర్సరీలు బాధ్యతగా వ్యవహరించనున్నాయి. నష్టపరిహారం కూడా ఇచ్చే నిబంధన ఉండటంతో పారదర్శకంగా ఉండనున్నారు. పక్కాగా రిజిస్ట్రేషన్.. లేకుంటే కఠిన చర్యలే రైతులను మోసగించే నర్సరీదారులను ఏకంగా జైలుకు పంపించే నూతన నియమావళిని జారీ చేసింది ప్రభుత్వం. 27 పేజీల జీవోలో విత్తన దశ నుంచి నారు విక్రయం వరకు అన్ని దశల్లో రైతును కాపాడేలా కఠిన నిబంధనలను విధించింది. రైతులను మోసగించే ఏ చర్యనూ సహించబోమని మార్గదర్శకాల్లో పేర్కొంది. గతంలో ఖమ్మం జిల్లాలో నాసిరకం మిర్చి విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం రైతు రక్షణకు ఈ చట్టాన్ని రూపొందించింది. ఏటా నకిలీ మకిలీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో నర్సరీదారుల నూతన లైసెన్సు పొందే అంశం నుంచి నారు ఏ దశలో విక్రయించాలి, అక్రమాలు జరిగితే విధించే శిక్షలు తదితర విషయాలన్ని అందులో వివరంగా పేర్కొంటూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్(నియంత్రణ) నియమావళి–2012కు పలు సవరణలు చేస్తూ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సరీ రూల్స్–2017 పేరిట ఉద్యాన శాఖ దీనిని రూపొందించింది. 4 లక్షల లోపు మొక్కలుండే నర్సరీకి రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము, 4 లక్షలకు పైగా మొక్కలుండే నర్సరీలకు రూ.వెయ్యి రుసుము నిర్ణయించారు. ఏ సర్వే నంబర్ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నారు, భూసార పరీక్ష ఫలితాలున్నాయా, ఏ నేల, నేల స్వభావం, ఏయే మొక్కలు వృద్ధి చేస్తున్నారు, భూమికి సంబంధించిన పాసుపుస్తకాలు ఇలా అన్ని వివరాలను అందజేయాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కల తయారీకి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల ఉత్పత్తికి రూ.5 వేలు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలు 4 లక్షలలోపు పెంపకానికి రూ.వెయ్యి, 4 లక్షలకు మించిన మొక్కల పెంపకానికి రూ.2,500 ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల నర్సరీలను ఏడాదికోసారి, కూరగాయ నర్సరీలను 4 నెలలకోసారి అధికారులు తనిఖీ చేస్తారు. నిబంధనలు తప్పనిసరి అనుమతి పొందిన నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారుచేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల పెంపకానికి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచాలి. నీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షేడ్‌నెట్ హౌస్, నెట్‌హౌస్, పాలీటన్నెల్, చాంబర్ తదితరరాలు సమకూర్చుకోవడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. నిబంధనలు అతిక్రమిస్తే శిక్షే నిబంధనలు పాటించని నర్సరీదారులపై చట్ట ప్రకారం రూ.50 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతులు కూడా రిజిస్టర్ నర్సరీ నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం గడువేమీ లేదని, వీలైనంత త్వరగా ఉద్యాన శాఖలో సంప్రదించి నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారులు వివరించారు. -
అరటి ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక రైతుల ఆసక్తి, ఉద్యాన శాఖ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. వివరాలు చిరంజీవి చౌదురి మాటల్లోనే.. – అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరింది. – దిగుబడిలోనూ మన రైతులు గణనీయమైన పురోగతి సాధించారు. 2014–15లో హెక్టార్‌కు 44 టన్నులుగా ఉన్న దిగుబడి 2019 నాటికి 60 టన్నులకు చేరింది – టిష్యూ కల్చర్ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, ఫలదీకరణలో కొత్త పోకడలతో అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ పెరిగాయి. టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత సుమారు 50 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగింది. – మరోవైపు ఉద్యాన శాఖ రైతులకు అనుకూల విధానాలను అమలు చేసింది. కాయ కోత, కోత అనంతర జాగ్రత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ఏర్పాటు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం వంటి వాటితో రైతులకు మేలు చేకూర్చింది. – ఎఫ్‌పీవోలను క్రియాశీలకంగా మార్చి బనానా క్లస్టర్లను నెలకొల్పి ఎగుమతులకు అనువైన కాయల్ని ఎలా తీర్చిదిద్దాలో నేర్పించింది. – దీంతో మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. – లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ప్రస్తుతం ఎగుమతులు ఊపందుకున్నాయి. 75కి పైగా ఎఫ్‌పీవోలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. – 2016–17లో 246 టన్నులుగా ఉన్న ఎగుమతులు 2019–20 నాటికి 55 వేల టన్నులకు చేరాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతులకు హెక్టార్‌కు అదనంగా రూ.2.90 లక్షల ఆదాయం వస్తోంది. -
36 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళిక రచించింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు మంగళవారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు వంటివి మన రాష్ట్రంలోనే పండించుకోవాలనేది ఉద్యానశాఖ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. కూరగాయల దిగుమతికి చెక్ పెట్టేలా.. రాష్ట్రంలో ప్రస్తుతం 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఏటా 30.71 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుబడి అవుతున్నాయి. దాదాపు 20 రకాలకు పైగా కూరగాయలను పండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఏడాదికి 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఏడాదికి సరాసరి 90 కిలోల కూరగాయలు వినియోగిస్తున్నాడు. ఆ ప్రకారం ఏటా రూ.11,130 కోట్లు కూరగాయలకు ఖర్చు చేస్తున్నారు. అయితే మనం పండించే వాటిల్లో కొన్నింటిని అవసరానికి మించి, కొన్నింటిని అవసరానికన్నా తక్కువగా పండిస్తున్నాం. టమాట, వంకాయ, బెండ మొదలైన వాటిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. పండించిన వాటిలో 7.72 లక్షల మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. అదే సమయంలో మన అవసరాలకు కావాల్సిన ఉల్లి, మిరప, బీర, సోర, కాకర, చిక్కుడు, దోస, ఆలు, క్యారెట్, ఆకుకూరలు వంటి 17 రకాలను 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులను తగ్గించి, మన రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపడా కూరగాయలను పండించేందుకు ఉద్యానశాఖ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ వానాకాలంలో 2.47 లక్షల ఎకరాల్లో 17.64 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 2.77 లక్షల ఎకరాల్లో 18.36 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తారు. రాష్ట్రంలో 12 రకాల పండ్ల సాగు.. మన రాష్ట్రంలో పండ్లు 4.35 లక్షల ఎకరాలలో సాగవుతున్నాయి. ఏడాదికి 22.97 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా 14 రకాల పండ్ల వినియోగం జరుగుతుండగా, 12 రకాలు మన రాష్ట్రంలోనే పండుతున్నాయి. సగటున రాష్ట్ర జనాభా ఏడాదికి 12.44 లక్షల టన్నుల పండ్లను వినియోగిస్తున్నారు. అందుకోసం ప్రజలు ఏడాదికి రూ. 7,942 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ మన అవసరాలకు మించి ఉత్పత్తి అవుతున్నాయి. 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఈ పండ్లను ఉత్తర భారత్‌కి ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కొరత ఉన్న అరటి, సపోట, నేరేడు, కర్బూజ, యాపిల్, పైన్ యాపిల్ పండ్లను ఏడాదికి 7.91 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. యాపిల్, పైనాపిల్ రాష్ట్రంలో పండించేందుకు వీలుకాదు. మిగిలినవాటిని దాదాపు 65,866 ఎకరాలలో కొత్తగా దశల వారీగా పెంచేందుకు ప్రయత్నించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. సుగంధ ద్రవ్యాలు.. రాష్ట్రంలో సుగంధ ద్రవ్య పంటలు 3.85 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏడాదికి 7.85 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 8 రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. పసుపు, ఎండు మిర్చి సాగులో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటిని మన అవసరాలకు మించి సాగు చేస్తున్నాం. మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, చింతపండు మొదలైన పంటల స్వయం సమృద్ధి కోసం 95,646 ఎకరాల్లో పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. దేశంలో 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి.. మన దేశ జనాభాకి 22 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ ఒకటే 60 శాతం. అంటే 9 నుంచి 10 మిలియన్ టన్నుల పామాయిల్ నూనెను సుమారు రూ.60 వేల కోట్లు వెచ్చించి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని నివేదికలో వెల్లడించారు. -
ఆర్బీకేల నుంచే పండ్లు, విత్తనాలు, మొక్కలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నుంచే ఉద్యాన పంటల విత్తనాలు, మొక్కలు రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల విత్తనాలు, మొక్కలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ ఆగ్రోస్, అన్ని జిల్లాల వ్యవసాయ, అనుబంధ విభాగాల్ని సంప్రదించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉండనున్నాయి... ► కూరగాయల సాగులో పాల్పంచుకుంటున్న కంపెనీలతో ఆగ్రోస్ ఎండీ అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ► ఆర్బీకేల నుంచి ఆర్డరు చేసిన విత్తనాలను సమీపంలోని హబ్‌లకు పంపి రైతులకు నేరుగా పంపిణీ అయ్యేలా చూస్తారు ► ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని రైతులకు కావాల్సిన విత్తనాలను గుర్తించి వంగడాల జాబితాలను ఆగ్రో స్కు పంపిస్తారు. ► కూరగాయలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల విషయంలో స్థానిక వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎంత మొత్తం కావాలో అంచనా వేస్తారు. ► తమ ప్రాంతాల్లోని విస్తీర్ణం ఆధారంగా గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు విత్తన అవసరాన్ని గుర్తిస్తారు. ► ఆర్డరు అందిన 48 గంటల్లోపు సరఫరా చేసేలా ఏపీ ఆగ్రోస్ చర్యలు తీసుకుంటుంది ► ప్రస్తుత నర్సరీల చట్టం ప్రకారం ఉద్యాన శాఖ అన్ని పంటల నారుమళ్లను నమోదు చేసి పర్యవేక్షిస్తుంది. ► నారుమళ్ల నాణ్యతలో లోపాలుంటే సంబంధిత సంస్థపై చర్య తీసుకుంటారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) సైతం విత్తనాల సేకరణకు ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. ► ఆర్బీకేల నుంచే కూరగాయల విత్తనాలు, మిర్చి, బొప్పాయి, టిష్యూ కల్చర్ అరటి, పుచ్చ, కర్బూజ పంటల మొక్కలు, విత్తనాల పంపిణీ. ► పొలంబడి కార్యక్రమంలో ఉద్యాన శాఖ పండ్లు, కూరగాయల పంటల సాగుపై రైతులకు మెళకువలు నేర్పించి మంచి దిగుబడులు వచ్చేలా చూస్తుంది. ► పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల మొక్కలను నర్సరీల నుంచి సేకరించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఎవరితో కలిసి పని చేయాలో ఉద్యాన శాఖ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ► ఇలా చేయడం వల్ల ఉద్యాన రైతులు నష్టపోవాల్సి ఉండదని ఉద్యాన శాఖ స్పష్టం చేస్తోంది. -
కొరత లేకుండా కూరగాయలు
సాక్షి, అమరావతి: కూరగాయల కొరత రాకుండా ఉద్యాన శాఖ.. వేసవి సాగు (ముందస్తు ఖరీఫ్) ప్రణాళికను ఖరారు చేసింది. ఇప్పటి నుంచే కూరగాయల సాగును చేపడితే ఆగస్టు నుంచి ఎటువంటి కొరత ఉండబోదని రైతులకు సూచించింది. ఇదే సమయంలో రైతులకు ఏయే రాయితీలు ఇవ్వచ్చో ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో 2,50,689 హెక్టార్లలో ఏడాది పొడవునా ఆకు కూరలు కాకుండా సుమారు 22 రకాల కూరగాయలు సాగవుతాయి. 77,71,620 టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఈ సీజన్ (మార్చి నుంచి జూలై వరకు)లో 8,21,650 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా కాగా అందులో ఇప్పటికే 3,75,461 టన్నులు అమ్ముడ య్యాయి. జూలై చివరిలోగా మిగతా 4,46,189 టన్నులు వస్తాయి. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే జూలై నుంచి కూరగాయల ధరలు పెరుగు తాయి. ఆగస్టు నుంచి కూరగాయల కొరత లేకుండా చూ డాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టాలి. రైతులకు ఉద్యాన శాఖ సూచనలు ► నీటి వసతి, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఉన్న రైతులు తీగజాతి కూరగా యల సాగును తక్షణమే చేపట్టాలి. ► ప్రస్తుత అంచనా ప్రకారం.. సుమారు 36 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపా రుదల వ్యవస్థ ఉంది. మల్చింగ్ (మొక్కల చుట్టూ ప్లాస్టిక్ లేదా పాలిథీన్ కవర్లతో కప్పిఉంచడాన్ని మల్చింగ్ అంటారు) పద్ధతిన కూరల సాగును చేపడితే మంచి లాభాలూ పొందొచ్చు. ► నీటి వసతి ఉన్న రైతులు తమ పొలాల్లో బెండ, వంగ, దోస జాతి కూరలు, బీర, సొర, చిక్కుడు, కాకర, ఆకుకూరల్ని ప్రణాళికా బద్ధంగా సాగు చేయాలి. ► తాత్కాలిక పందిళ్లతో కూరగాయల్ని సాగు చేసే రైతులు ప్రస్తుతం చిక్కుడు, పొట్ల వేయాలి. ► పర్మినెంట్ పందిళ్లు ఉండే రైతులు దొండ, బీర, కాకర, సొర, ఇతర తీగ జాతి కూరగాయల్ని సాగు చేయాలి. ► కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టారు. ► హైబ్రీడ్ కూరగాయల్ని సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ రాయితీ ఇస్తుంది. ► రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద 50 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తారు. ► పాలీ హౌసులు, షేడ్ నెట్స్ ఉన్న రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తారు. కరోనాతో విపత్కర పరిస్థితులు ఉండటం వల్ల ఉచితంగా మొక్కలు ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ► పర్మినెంట్ పందిళ్లు ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీపై కాకర, బీర, సొర లాంటి కూర జాతి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంది. ► రైతు భరోసా కేంద్రాల వద్ద కూరగాయల విత్తనాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఆర్కేవీవై కింద ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాల్సిందిగా ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి ప్రభుత్వానికి నివేదించారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక ఆదా యం వచ్చే పంటల్ని సాగు చేయించాలి. -
ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ 7.91 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలోనూ 7.91 లక్షల టన్నుల ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించినట్టు ఉద్యాన శాఖ ప్రకటించింది. మార్చి చివరి వారంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం వరకు 7,91,792 టన్నుల పండ్లు, కూరగాయలు, పూలు, ప్లాంటేషన్ పంటలను సేకరించి మార్కెటింగ్ చేసింది. ఇందులో సుమారు 6.58 లక్షల పండ్లు, కూరగాయల కిట్లను ప్రజల వద్దకు చేర్చింది. మార్చి నుంచి జూలై వరకు పరిగణించే సీజన్లో ఉద్యాన పంటల మొత్తం దిగుబడి అంచనా 45,87,833 టన్నులు కాగా ఇందులో ఇప్పటివరకు 14,71,935 టన్నులను ప్రభుత్వం మార్కెటింగ్ చేసింది. ఈ మొత్తంలో లాక్డౌన్ సమయంలోనే 7.91 లక్షల టన్నుల్ని మార్కెటింగ్ చేయడం గమనార్హం. మార్కెటింగ్, ఉద్యాన శాఖల అనుసంధానంతోనే ఇది సాధించగలిగామని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ చర్యలివీ.. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పలు చర్యలను చేపట్టడం వల్లే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సాధ్యపడిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య తెలిపారు. ► వివిధ శాఖల మధ్య అనుసంధానం, రవాణాకు పర్మిట్లు, అంత ర్రాష్ట్ర మార్కెటింగ్‌కు ఏర్పాట్లు ► రూ.55, రూ.100, రూ.150 విలువైన పండ్లు, కూరగాయలు, పూల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు ► రూ.250 మామిడి కాయల కిట్లు (ఏ జిల్లాలో ఏ పండు ఉంటే ఆ పండ్లతో కిట్ల తయారీ) ► తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పూల రైతుల సమస్య పరిష్కారం. మార్కెటింగ్ శాఖే కొనేలా చర్యలు ► తూర్పుగోదావరిలో సాగయ్యే కర్రపెండలం, కంద కనీస మద్దతు ధరకు కొనుగోలు ► చిత్తూరు జిల్లాలో క్యారెట్‌ను కిలో రూ.13కు కొనేలా ఏర్పాటు ► రాష్ట్రవ్యాప్తంగా అరటి, బత్తాయి సేకరణకు ఏర్పాట్లు ► శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడిమామిడి ఎగుమతి, దిగుమతులకు సంబంధించి తలెత్తిన హమాలీల సమస్య పరిష్కారం ► వివిధ జిల్లాల్లో పండ్లు, కూరగా యల సేకరణకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎగుమతిదారులతో ఆయా జిల్లా కలె క్టర్లు సమావేశాలు నిర్వహించి పరి స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం ► మొబైల్ వ్యాన్లు, రైతు బజార్లతో సరకును ప్రజల ముంగిటకు చేర్చడం -
మామిడి.. ఊపందుకున్న రవాణా
సాక్షి, అమరావతి: పండ్లలో రారాజు మామిడికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. నోరూరించే రసాలు, చూస్తేనే తినాలనిపించే బంగినపల్లి, చెరకును మరిపించే సువర్ణరేఖ.. ఇలా మొత్తం 30 రకాల పండ్లకు రాష్ట్రం నిలయం. లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మామిడి పండ్లను తినగలుగుతామా? అనే బెంగ లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు పండ్లను చేర్చే క్రమంలో మార్కెటింగ్, ఉద్యాన శాఖలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ రకాల కిట్ల రూపంలో అడిగిన వెంటనే పండ్లను సరఫరా చేసే ప్రక్రియ కూడా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రారంభమైంది. అయితే కాయలు పక్వానికి రాకముందే కోస్తే సమస్యలుంటాయని, కొన్ని రోజులు వాయిదా వేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యమని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి సూచించారు. మరో 15 రోజుల్లో సీజన్ ఊపందుకోనున్న తరుణంలో మామిడి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు ► దళారులు లేకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం ► రైతులు, కొనుగోలుదార్ల మధ్య మీటింగ్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీవోలు) అనుసంధానం. ► ఎపెడా(అ్కఉఈఅ– అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) సహకారంతో ఎగుమతులు పెంపొందించడం ► ఇ–రైతు, కిసాన్ నెట్ వర్క్, కాల్‌గుడీ, ఎన్ఇఎం వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారాలపై అవగాహన కల్పించి రైతులు, ఎఫ్‌పీవోల నుంచి నేరుగా ఆన్లైన్లో సరకు కొనుగోలు ► స్థానిక మార్కెట్ల ఏర్పాటు. ఇళ్ల ముంగిటకే సరకును సరఫరా చేయడం ► పండ్ల రవాణాకు తక్షణమే పర్మిట్లు. లాక్డౌన్ ఆంక్షల తొలగింపుతో ఆటంకం లేకుండా రవాణా ► సమస్యలపై స్థానిక అధికారులను లేదా 1902, 1907 నెంబర్లలో సంప్రదించే అవకాశం రాష్ట్రంలో 3.85 లక్షల హెక్టార్లలో సాగు రాష్ట్రంలో సుమారు 3,85,881 హెక్టార్లలో సాగు. ప్రధానంగా కృష్ణా, చిత్తూరు, విజయనగరం,విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు,వైఎస్సార్ కడప జిల్లాలలో అత్యధిక సాగు, ఉత్పత్తి. ► రైతులకు రోజువారీగా ధరల సమాచారం తెలిసేలా చర్యలు. ► అంతర్రాష్ట్ర వాణిజ్యానికి చొరవ. ఎగుమతుల కోసం 54 ఎఫ్‌పీవోలు. ► రవాణాకు ప్రత్యేక రైళ్ల కోసం నాఫెడ్‌తో ఒప్పందం ► చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లతో ఒప్పందం ► శుక్రవారం నాటికి 25, 628 టన్నుల సేకరణ. రాష్ట్రం నుంచి ఎగుమతులు ఇలా ► కృష్ణా, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పలు దేశాలకు ఎగుమతి. ► ఎగుమతి కోసం రైతులు ఎపెడా(అ్కఉఈఅ) రూపొందించిన హార్టీ నెట్ వెబ్ నుంచి ఉద్యాన శాఖ వద్ద నమోదు చేసుకునే అవకాశం. ► 2018–19లో 1471 టన్నుల సరకు ఎగుమతి కాగా, ఈ ఏడాది మూడు వేల టన్నులు లక్ష్యం. ► ఇప్పటికే న్యూజిలాండ్,స్విట్జర్లాండ్‌కు ఎగుమతులు. ► విదేశీ ఎగుమతులను ఉద్దేశించి తిరుపతి, నూజివీడులలో రెండు వాపర్ హీట్ ట్రీట్మెంట్ యూనిట్లు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు. ► చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో త్వరలో మరో 9 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసులు. రైతుల సమస్యలు ఇవీ ► విమాన రవాణా ఛార్జీలు, ఇతర రాష్ట్రాలకు లారీల కిరాయి అధికం. వీటిని తగ్గించాలని ఎఫ్‌పీవోల వినతి. ► దిగుబడి తక్కువగా ఉన్నా.. ధరలు గత ఏడాది కంటే తక్కువ. ► కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు టన్ను ధర రూ.80 వేలు. ఇప్పుడు రూ.35వేలు మాత్రమే. ► చాలా చోట్ల మార్కెటింగ్ సౌకర్యం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ► రైతులకు కనీస మద్దతు ధరలు లభించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్కెటింగ్ సదుపాయాలు అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. నౌక,విమానయాన సంస్థలతో సంప్రదింపులు పండ్లను నౌకలు, విమానాల ద్వారా పంపేందుకు ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక కార్గోలు నడిపేందుకు ముందుకొచ్చాయి. కాయలను పండించేందుకు కార్బైడ్‌ను నిషేధించాం.ఎథిలిన్ ప్లాంట్లను వినియోగిస్తున్నాం. – పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి టన్నుకు రూ.60 వేలు వస్తేనే లాభం కరోనా వైరస్ మా ఆశలను నీరుగార్చింది. బంగినపల్లికి టన్నుకు కనీసం రూ.60 వేల వరకు ధర ఆశించాం. లాక్డౌన్ సడలింపుతో చెన్నై వ్యాపారులు వచ్చి టన్నుకు సగటున రూ. రూ.35 వేల వరకు ఇస్తున్నారు. కనీసం రూ.60 వేల వరకు ధర ఉంటేనే రాణించగలం. - వెంకటసుబ్బారెడ్డి,ఓర్వకల్ మండలం, కర్నూలు జిల్లా -
ఉభయ ‘మారకం’
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడిన తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థలు పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఉభయతారక ప్రయోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను ఉద్యాన శాఖ భుజాన వేసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి.. గ్రామాలు, పట్టణ కాలనీలలో విక్రయించే నమూనాను రూపొందించి అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రస్తుత విపత్తు సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ నమూనాను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ సర్కులర్ జారీ చేసింది. మార్గదర్శకాలివీ.. ► ఉభయ తారక ప్రయోజన విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీలు) కీలక బాధ్యత పోషిస్తాయి. సేకరణ, పంపిణీని కూడా ఇవే చేపడతాయి. ► గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పండ్లు, కూరగాయలు ఏ మేరకు అవసరం అవుతాయనేది (ఇండెంట్) మదింపు చేయడంతో పాటు సరఫరా బాధ్యతను కూడా ఏఎంసీ కార్యదర్శి చూస్తారు. ► అతడికి గ్రామీణ ప్రాంతంలోని సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), పట్టణ ప్రాంతంలోని సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం) సహకరిస్తారు. వాస్తవ డిమాండ్‌ను ఏపీఎం, సీఎంఎం మదింపు చేసి ఏఎంసీ కార్యదర్శికి పంపితే ఆయన ఆర్డరు పెడతారు. ► ఏఎంసీ పరిధిలో గుర్తించిన గ్రామాల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పండ్లు, కూరగాయలు సేకరించి సంబంధిత ప్రాంతానికి ట్రక్కుల్లో పంపిస్తారు. ► పట్టణాలు, నగరాలైతే సిటీ మిషన్ మేనేజర్‌కు రైతు బజార్లను అనుసంధానం చేస్తారు. ఏఎంసీ ఏ పాత్ర పోషిస్తుందో.. పట్టణాల్లో రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్ ఆ పాత్ర పోషించాలి. సెర్ప్ ఏపీఎం పాత్రను సిటీ మిషన్ మేనేజర్ నిర్వహిస్తారు. ► రైతు బజార్లు లేని పట్టణ ప్రాంతాల్లో ఏపీఎం, సీఎంఎం నుంచి ఏఎంసీ ఆర్డర్ సేకరించి సరఫరా చేస్తుంది. రైతుల నుంచి సరుకును సేకరించిన తర్వాత ఆన్లైన్లో చెల్లింపులు చేస్తారు. ► ఈ మొత్తం ప్రక్రియను గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పీడీ, అర్బన్ ఏరియాలో మెప్మా పీడీ పర్యవేక్షిస్తారు. తొలిరోజే 22,195 టన్నులు ► ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన, మార్కెటింగ్, సెర్ప్ అధికారులు శనివారం 22,195 టన్నుల పండ్లు, కూరగాయలను సేకరించి వివిధ ప్రాంతాలకు రవాణా చేశారు. ► 7,539 టన్నుల అరటి, 2,087 టన్నుల టమాటాలు, 12,569 టన్నుల ఇతర పండ్లు, కూరగాయలు సేకరించి పంపిణీ చేశారు. చిత్తూరు నుండి మామిడి కాయల లోడ్‌తో బయలుదేరిన లారీ -
వాతావ'రణం'.. పూతకు ప్రతికూలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రాలిపోతోంది.దీంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఉద్యానశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అకాల వర్షాలు కురవడం, తర్వాత చలి నెలకొనడం తదితర కారణాల వల్ల ఈసారి పూత రావడమే ఆలస్యమైందని, ప్రస్తుత వాతావరణం కూడా పూత, పిందెలు నిలబడే స్థితి లేకుండా పోయిందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 60 శాతం దిగుబడులు పడిపోయే ప్రమాదం... రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి.అత్యధికంగా ఖమ్మం, మంచి ర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా తోటలుండగా, మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు సరాసరి 4 టన్నుల వరకు మామిడి దిగుబడులు వస్తాయి.బాగా కాస్తే ఏడెనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అంటున్నారు.ఆ ప్రకారం రాష్ట్రంలో సుమారు 20 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుందని అంచనా. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా మన మామిడి పంట ఎగుమతి అవుతుంది. ఈసారి కాపు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు కురవడంతో దాని ప్రభావం మామిడి పూతపై పడింది. సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే 92 శాతం, అక్టోబర్ నెలలో సాధారణం కంటే 70% అధికంగా వర్షం కురిసింది. ఫిబ్రవరిలో ఇప్పటివరకు అంటే ఈ 12 రోజుల్లో ఏకంగా 279% అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 12 రోజుల్లో 2.4 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 9.1 మి.మీ నమోదైంది. అంటే మామిడి పూతకు అత్యంత కీలకమైన సమయాల్లో వర్షాలు కురిశాయి. మధ్యలో చలి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితే మామిడి పూత, కాతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఫంగస్, చీడపీడలు... అక్టోబర్ నెల నుంచే మామిడి పూతకు అను కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈసారి అక్టోబర్ వరకూ వర్షాలు విపరీతంగా కురిశాయి. ఈ దెబ్బ ఇప్పటివరకు కొనసాగుతోంది. జనవరిలో సంక్రాంతి నాటికి పూత పూర్తిస్థాయిలో రావాలి. ఉద్యానశాఖ వర్గాల అంచనా ప్రకారం నెల రోజులపాటు మామిడి పూత, కాతకు అంతరాయం ఏర్పడిందంటున్నారు. వాతావరణ మార్పులతో మామిడిపై ఫంగస్ పంజా విసిరింది. చీడపీడలు విజృంభించాయి. దీంతో రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పూతలో 98 % మగ పూతే ఉంటుంది. అది రాలిపోతుంది. ఇక మిగిలిన 2 శాతం ద్విలింగ (ఆడ, మగ) పూత ఉంటుంది. దాని నుంచే కాపు వస్తుంది. అందులో సాధారణంగా 0.5 శాతం మాత్రమే మామిడి కాయగా వస్తుంది. దానినే దిగుబడిగా లెక్కిస్తారు. ఇప్పుడు ఆ దిగుబడి కూడా 60 శాతం వరకు పడిపోయే ప్రమాదముందని ఉద్యాన శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం పంటపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపిందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మార్చిలో మార్కెట్లోకి మామిడి కాయ రావాలి. జూన్ నెల వరకు వస్తూనే ఉంటుంది. ఈసారి ఏప్రిల్‌లో కాయలు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని అంచనా. పూత నిలవడంలేదు పదేళ్ల కిందట 4 ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. అప్పటినుంచి మంచి దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది పూతనే రాలేదు. బంగినపెల్లి మామిడి చెట్లకు పూత వచ్చినా నిలవడం లేదు. దస్రీ రకానికి ఇప్పుడిప్పుడే వస్తోంది. మామిళ్లు పూతకు వస్తే ఎండకాలంలో చెట్లకు కాయలెట్లా నిలుస్తది. ఈ ఏడాది మామిడి తోటలకు నష్టం వచ్చినట్లే. ఎండాకాలంలో నీళ్లు అందక కాయలు రాలిపోతాయి. – తిరుపతిరావు, గాంధీనగర్, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా ఆరంభం నుంచే సమస్య వాతావరణ మార్పుల వల్ల పూత రాలిపోతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ సమస్య నెలకొంది. పూత రాలటంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం కూడా ఉంది. – ఎనమల నారాయణరెడ్డి, బోడు, టేకులపల్లి మండలం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
ఆయిల్‌పామ్ రైతులకు రూ.76 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: మరో హామీని నిలబెట్టుకుని తాను మాట తప్పనని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయిల్‌పామ్ రైతులకు ఇస్తామన్న నిధులు విడుదల చేశారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఫ్యాక్టరీలో ఆయిల్‌పామ్ నూనె రికవరీ శాతం 1.72 శాతం తక్కువ ఉంటోంది. తెలంగాణ రైతులతో సమానంగా మన రైతులకు చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2018 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు ఒక్కో టన్నుకు ఎంత వ్యత్యాసం ఉందో లెక్కించి.. ఆ మేరకు నష్టపోయే మొత్తాన్ని రైతులకు చెల్లించాలని హార్టీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధరలో వ్యత్యాసం ఏడాదికి రూ.76.01 కోట్లుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని ఆయిల్‌పామ్ కంపెనీలకు జమ చేసి రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు, రైతు సంఘాల ఆనందోత్సాహం మద్దతు ధర విషయంలో తమను ఆదుకోవడంపై జాతీయ ఆయిల్‌పాం రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రాంతికుమార్‌రెడ్డి, ఏపీ ఆయిల్‌పాం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల విడుదలకు కృషి చేసిన మంత్రి కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ స్థాయిలో ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర వర్తింపజేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో సమానంగా ధర చెల్లించడంపై రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ఆధునీకరించి రికవరీ శాతాన్ని పెంచాలని, ప్రస్తుత సిబ్బందిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు కనీస మద్దతు ధర రూ.12 వేలుగా నిర్ణయించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 1.75 లక్షల హెక్టార్లలో సాగు 2018 నవంబర్‌లో టన్నుకు వ్యత్యాసం రూ.629, డిసెంబర్లో రూ.623, 2019 జనవరిలో రూ. 590, ఫిబ్రవరిలో రూ.624, మార్చిలో రూ.605, ఏప్రిల్‌లో రూ.617, మేలో రూ.573, జూన్‌లో రూ.571, జూలైలో రూ.572, ఆగస్టులో రూ.610, సెప్టెంబర్‌లో రూ.621, అక్టోబర్‌లో రూ.619గా ఖరారు చేసింది. రాష్ట్రంలో సుమారు 1.75 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పాంను రెండు లక్షల మంది రైతులు సాగుచేస్తున్నారు. దాదాపు 15 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలోని అశ్వారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీలో వచ్చే రికవరీ శాతానికీ పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీకి తేడా ఉంటోందని కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ తేడా వల్ల తాము నష్టపోతున్నామని రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేసినట్టు ఉద్యాన శాఖ కమిషనర్ తెలిపారు. -
కోకో.. అంటే కాసులే!
సాక్షి, అమరావతి: తీయదనం.. అందులోనూ చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి! అందువల్లనే ఏమో 2011లో భారత్‌లో 1.14 లక్షల టన్నులుగా ఉన్న చాక్లెట్ల వినియోగం 2018 నాటికి 3 లక్షల 23 వేల టన్నులకు చేరింది. యూరప్ దేశాల్లో అయితే మరీ ఎక్కువ. ఇటీవలి సర్వే ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్కరు ఏటా సగటున 8 నుంచి 9 కిలోల వరకు చాక్లెట్లు తింటున్నారట. ఈ చాక్లెట్ల తయారీకి ఉపయోగపడేదే.. కోకో. ఒక్క చాక్లెట్లే కాదు.. కాఫీ, కేకుల తయారీలోనూ దీన్ని వాడతారు. ఫలితంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి పంటగా కోకో గుర్తింపు పొందింది. దీంతో రాష్ట్రంలో ఈ పంటకు ఆదరణ పెరుగుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు ఉత్పత్తి కోకో సాగుకు ఎర్ర నేలలు, గరప నేలలు అనువైనవి. తొలకరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు. రాష్ట్రంలో అంతర పంటగా మూడు రకాల కోకో.. క్రయల్లో, ఫొరాస్టెరో, ట్రినిటారియోను సాగు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలోనూ, ఉష్ణ మండల తడి వాతావరణంలోనూ పెరుగుతోంది. కోకో చెట్లకు చిత్తడి అడవుల నీడ అవసరం. ఉద్యాన శాఖ లెక్క ప్రకారం.. మన రాష్ట్రంలో సుమారు 57 వేల ఎకరాల్లో కోకో పంట సాగవుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి. కోకో రైతులకు ఉద్యాన శాఖ హెక్టారుకు రూ.11 వేల సబ్సిడీ అందిస్తోంది. కోకో కాయలు సేకరించేందుకు ప్లాస్టిక్ ట్రేలను సరఫరా చేస్తోంది. పాలిషెడ్స్ ప్లాట్‌ఫారాలూ ఏర్పాటు చేస్తోంది. కమీషన్ ఏజెంట్లు కోకో గింజలను కొనుగోలు చేసి చాక్లెట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు. ప్రధానంగా మాండెలెజ్ కంపెనీ (క్యాడ్బరీస్).. రైతుల నుంచి కోకో గింజలను కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ.. రైతులకు ఒక్కో కోకో మొక్కను రూ.4.80కు సరఫరా చేస్తోంది. సేద్యంలో మెళకువలనూ నేర్పుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతంలో ఉన్న నర్సరీ నుంచి ఈ మొక్కలు సరఫరా అవుతున్నాయి. ఎకరాకు 200 మొక్కలు ఎకరా కోకో పంటకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పెట్టుబడి అవసరం. ఎకరాకు 200 మొక్కల వరకు నాటుతుంటారు. నాటిన మూడో ఏడాది నుంచి కాపుకు వస్తుంది. పిందె వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు రావడానికి ఐదు నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది పొడవునా పంట చేతికి వస్తుంది. ప్రతి కాయలో 25 నుంచి 45 వరకు విత్తనాలు ఉంటాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా వేయడం వల్ల అవసరమైన నీడ ఉంటుంది. కోకో చెట్లు రాల్చే ఆకులే ఆ పంటకు సేంద్రీయ ఎరువుగా దోహదపడతాయి. కొబ్బరి తోటల్లో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఆయిల్‌పామ్ తోటల్లో 4 క్వింటాళ్ల పైబడి దిగుబడి వస్తుంది. అయితే.. ఎలుకలు, ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోకో లాభదాయకమైన పంట కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. ఆఫ్రికా దేశమైన ఘనా తర్వాత అంతటి నాణ్యమైన విత్తనాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. లాభదాయకమైన పంట కావడంతో రైతులకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విస్తరణ అధికారులను కూడా నియమించాం. రైతులకు సబ్సిడీలు ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాన్నీ కల్పిస్తున్నాం. రైతులు అదనపు సమాచారం కోసం సమీపంలోని ఉద్యాన అధికారిని లేదా యూనివర్సిటీ ఉద్యాన విభాగాన్ని సంప్రదించవచ్చు. సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – చిరంజీవి చౌధురీ, కమిషనర్, ఉద్యాన విభాగం -
ఎన్‌రిప్.. 'పండంటి' ఆరోగ్యానికి టిప్!
సాక్షి, హైదరాబాద్: పండ్లను మగ్గబెట్టే క్రమంలో అటు పర్యావరణానికి, ఇటు మానవ ఆరోగ్యానికి హానికలిగించే రసాయన కారకాలను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇథిలిన్ వినియోగంతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘ఎన్‌రిప్’అనే ఉత్పత్తులను వినియోగించనుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే మామిడి, నారింజ, అరటి పండ్లను మగ్గబెట్టే క్రమంలో భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించనుంది. బెంగళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మామిడి, అరటి పండ్లపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపిన అనంతరం ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’కూడా ఈ ఉత్పత్తులను అనుమతించింది. దీంతో మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సహకారంతో ఉద్యాన శాఖ ముందుగా రాష్ట్రంలోని పెద్ద పండ్ల మార్కెట్లలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టడంపై పరిశీలన జరపనుంది. వెంటనే ప్రారంభించండి త్వరలోనే మామిడి పండ్ల సీజన్ రానున్నందున ‘ఎన్‌రిప్’పరిజ్ఞానం వినియోగంపై ప్రయోగం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పేరుగాంచిన గడ్డిఅన్నారం, జగిత్యాల, వరంగల్ మార్కెట్లలో ప్రయోగాలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వీటిలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆ ప్రకారం పండ్లను మగ్గబెట్టే వ్యాపారులు లేదా ఏజెంట్లు ఎప్పటికప్పుడు నమూనాలను పరిశీలించి తాము అనుసరిస్తున్న పద్ధతుల్లో ‘ఎసిటిలిన్’లేదా ‘కార్బైడ్’లను వినియోగించడం లేదని ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా ఆ విధానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు గతంలో మాదిరిగా వ్యవసాయ క్షేత్రాల్లోనే ‘ఇథిలిన్’పౌడర్ ద్వారా మగ్గబెట్టే విధానాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాల్షియం కార్బైడ్‌తో అనర్థాలివే - కాల్షియం కార్బైడ్ వినియోగం ద్వారా వెలువడే కార్బైడ్, ‘ఎసిటిలిన్’వాయువు ద్వారా పండ్లను మగ్గబెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరమంటూ 2011 నుంచి ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ఈ పద్ధతిని అనుమతించడం లేదు. - ఈ పద్ధతిలో పండ్లను పక్వానికి తెచ్చే పనిని చేపట్టే కార్మికులు, ఆ వ్యాపారులు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు, వారితో కలిసి జీవించే వారి కుటుంబీకులతో పాటు పండ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా కార్బైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. - ఈ పండ్లు తినే చిన్నారులు, వృద్ధులతో పాటు గర్భిణుల ఆరోగ్యానికి ముప్పు. - మగ్గబెట్టిన పండ్లను రవాణా చేసే సమయంలో అవి పాడుకాకుండా ఉండేందుకు క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల హానికర వాయువులు వెలువడి పర్యావరణంతో పాటు పంటలు, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. దీంతో ‘ఇథిలిన్’తో పాటు ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించాలని నిర్ణయించింది. -
చిట్టి గింజలకు పెద్ద సాయం
సాక్షి, అమరావతి : చిరు ధాన్యాలకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల సాగును పెంపొందించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. చిరు ధాన్యాల పంటలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని, సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలు, వర్క్‌షాపులు, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలో చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాలని సూచించారు. విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల నుంచి ఏపీ సీడ్స్ నేరుగా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. దీని వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు, విత్తనాల ఉత్పత్తిలో నాణ్యతకు, స్వయం సమృద్ధికి ఊతం ఇచి్చనట్టవుతుందని చెప్పారు. రైతులకు వివిధ పంటలపై అవగాహన, సాగులో మెళకువల కోసం వైఎస్సార్ పొలం బడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని పంటలను ఇ–క్రాప్ విధానంలో నమోదు చేయాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు లేదా సెల్ఫోన్లు ఇవ్వనున్నామని తెలిపారు. మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలు, ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయాధికారులను జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతమే నమోదైందని అధికారులు వివరించారు. ప్రస్తుత రబీలో 25.84 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని, రిజర్వాయర్లు నిండినందున వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పక్కనే రైతుల కోసం పెడుతున్న వర్క్‌షాపులను మరింత పటిష్టం చేయాలన్నారు. వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. విత్తనాల కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం మొదలు రైతులకు అందించే వరకూ ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, ఉత్తమ ప్రమాణాలతో జరగాలన్నారు. చంద్రబాబు లాంటి మనుషులు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయతి్నస్తారని, ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరని అన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అంతా అన్యాయం జరిగిపోయిందని.. ఇలా నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని, అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలుగా వర్క్‌షాపులు.. పంట సమస్యలను నివేదించడానికి గ్రామ పరిధిలోనే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయంలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభించేలా ఏర్పాటు ఉండాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే వర్క్‌షాపులకు రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెట్టి రైతు సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు వివరించారు. సచివాలయాల్లో బ్లాక్ బోర్డులు పెట్టి, పంటలపై సూచనలు, పరిష్కారాలు సూచిస్తామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఏమి చేసినా వ్యవసాయంలో ఉత్తమ విధానాలనే రైతులకు సూచించాలన్నారు. రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను ధరల స్థిరీకరణ నిధికి, ప్రకృతి వైపరీత్యాల నిధికి లింక్ చేయండని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అరటి చెట్లు పడిపోతే రైతులకు బీమా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాల నిధితో అండగా నిలవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు సీఎం తెలిపారు. తుపాన్లు, పెను గాలులను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల డిజైన్లు రూపొందాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందు భూసార పరీక్ష పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్, ఉద్యాన విభాగం కమిషనర్ చిరంజీవి ఛౌదురీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పెదవేగి ఆయిల్ పామ్ రైతులకే : కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకే అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పారు. తెలంగాణతో సమానంగా ఏపీ ఆయిల్ పామ్ రైతులకూ న్యాయం చేస్తామని మీడియాతో అన్నారు. రాష్ట్ర పామాయిల్ రైతులకూ రూ.87 కోట్లు మంజూరు చేశామన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 2018లో 15.50 లక్షల మంది బీమా చేయించుకుంటే 2019 ఖరీఫ్‌లో ఆ సంఖ్య 21.5 లక్షల మందికి చేరిందన్నారు. పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్ సమస్యపై బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు.గోదావరిలో మునిగిన పడవను వెలికి తీయడంలో శ్రమించిన ధర్మాడి సత్యానికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చిరు ధాన్యాలు అంటే.. చిరు ధాన్యాలను ఇటీవలి కాలం వరకు తృణ ధాన్యాలుగా పిలిచేవారు. ఎంతో పోషక విలువలున్న వీటిని ఇంగ్లిషులో మిల్లెట్స్ అని, స్మాల్ మిల్లెట్స్ అని రెండుగా విభజించారు. మనందరికీ తెలిసిన చిరు ధాన్యాలు.. సజ్జ, జొన్న, రాగి. కంకిని నూర్చితే నేరుగా విత్తనాలు వస్తాయి. పొట్టు ఉండదు కనుక వాటిని నేరుగా వండుకుని తినవచ్చు. మరీ చిన్నవిగా ఉండే ధాన్యాలు కొన్ని ఉన్నాయి. అవి.. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, వరిగలు. వీటి కంకుల్ని నూర్చితే పొట్టున్న గింజలు వస్తాయి. వాటిని మళ్లీ మర పట్టించుకుని వండుకోవాలి. ఈ ప్రక్రియ కాస్త కష్టం కావడంతో కొంత కాలం క్రితం వరకు అవి మరుగున పడ్డాయి. వీటి విలువ తెలియడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. నాణ్యతకు ప్రభుత్వం తరఫున గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలి. షాపులో పెట్టే ప్రతి ఉత్పత్తికీ శాంపిల్ కచ్చితంగా ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ -
ఎల్లలు దాటే..మిర్చీ ఘాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్దఎత్తున పండించే మిర్చిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా ఐటీసీ, రాష్ట్ర ఉద్యాన శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య నమూనా కింద ఈ ఏడాది పది వేల ఎకరాల్లో మిర్చి సాగును లక్ష్యంగా నిర్ణయించగా వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన భౌతిక, సాంకేతిక సహకారాన్ని ఐటీసీ, ఉద్యాన శాఖ అందిస్తాయి. ఈ మేరకు శనివారం గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో ఉద్యాన శాఖ, ఐటీసీ అధికారులు చిరంజీవి చౌధరి, సంజీవ్ రంగరాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కాల్ సెంటర్, మొబైల్ యాప్.. ఐటీసీ ఇప్పటికే ఎంపిక చేసిన రైతులతో మిర్చి సాగు చేయించి ఎగుమతులు చేస్తుండగా దీన్ని తాజాగా మరింత విస్తరించారు. మొదటి ఏడాది కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 41 గ్రామాల్లో నాలుగు వేల మంది రైతులతో 10 వేల ఎకరాల్లో మిర్చిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు చేయిస్తారు. రైతు సేవల కోసం ఐటీసీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, పురుగు మందుల నిర్వహణ, పంట నాణ్యత, దిగుబడి పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాల్‌సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ సేవలు అందుతాయి. మిర్చి మార్కెట్ అవసరాలను తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐటీసీ సంయుక్తంగా హ్యాండ్ బుక్‌ను రైతులకు పంపిణీ చేస్తాయి. ఇ–చౌపల్ 4.0 పేరుతో మొబైల్ యాప్ కూడా రైతులకు అందుబాటులోకి రానుంది. రూ.200 కోట్లతో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రయోగాత్మకంగా కనీసం వెయ్యి ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చేపట్టాలన్న విజ్ఞప్తిపై ఐటీసీ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (అగ్రి బిజినెస్) సంజీవ్ సానుకూలంగా స్పందించారు. రూ.200 కోట్లతో గుంటూరు సమీపంలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రత్యేకించి మిర్చి కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఐటీసీ సన్నాహాలు చేస్తోందని, ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. పర్యావరణానికి నష్టం లేకుండా మిర్చి సాగు చేస్తున్న వివిధ జిల్లాల రైతులకు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, వైఎస్సార్ సీపీ నేత ఏసురత్నం, ఉద్యానశాఖ అధికారులు ఎం.వెంకటేశ్వర్లు, పి.హనుమంతరావు పాల్గొన్నారు. కల్తీలను సహించం గుంటూరు కేంద్రంగా కొందరు మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని దోపిడీ చేస్తున్నారని, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు హెచ్చరించారు. కల్తీ ఏ రూపంలో ఉన్నా సహించవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కిలో మిర్చి విత్తనాలు రూ.వేలు, లక్షల్లో ఉండటమేమిటని ప్రశ్నించారు. పరిశోధనల ద్వారా నాణ్యమైన మిర్చి విత్తనాలు రైతులకు సరసమైన ధరలకు సరఫరా చేసేలా చూస్తామన్నారు. ఈనెల 15వతేదీ నుంచి ప్రతిష్టాత్మక వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాయలసీమలో మిల్లెట్స్ (చిరుధాన్యాల) బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. -
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్: ఆర్.సి.శ్రీవాత్సవ
సాక్షి, హైదరాబాద్: ములుగు, జీడిమెట్లలో రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఉత్తరాఖండ్ ఉద్యాన సంచాలకుడు ఆర్సీ శ్రీవాత్సవ శనివారం సందర్శించారు. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నూతన సాంకేతిక పద్ధతిలో పెంచుతున్న మామిడి తోటలు, నాణ్యమైన కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను ఆయన పరిశీలించారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పాలీహౌజ్‌లో సాగు చేస్తున్న పంటలు, కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను సందర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అనుసరిస్తున్న సాగు విధానాలను శ్రీవాత్సవ అభినందించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధి కోసం ఉద్యాన శాఖ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్ ఎల్.వెంకట్ రాంరెడ్డి వివరించారు. పంట కాలనీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాఖండ్‌లో సాగులో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, నాణ్యమైన మొక్కల సరఫరా, పాలీహౌజ్ విధానంలో పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం తదితరాల అంశాలపై శ్రీవాత్సవ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. -
కొత్తగా వెయ్యి హెచ్‌ఈవో పోస్టులు!
ఉద్యానశాఖలో మంజూరుకు ప్రభుత్వం కసరత్తు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో ఉద్యో గాల జాతర ప్రారంభించిన ప్రభుత్వం ఉద్యాన శాఖలోనూ కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించింది. సుమారు వెయ్యి ఉద్యాన విస్తరణాధికారుల(హెచ్‌ఈవో) పోస్టులను కొత్తగా మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోం ది. ఇప్పటివరకు మండలాల్లో హెచ్‌ఈవో పోస్టులు లేకపోవడంతో వాటిని కొత్తగా మం జూరు చేయాలనుకుంటోంది. కొత్తగా హెచ్‌ఈవో పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. దీనిపై సానుకూ లంగా స్పందించిన పోచారం.. సీఎం కూడా ఉద్యాన పోస్టుల మంజూరుకు యోచిం చారని, తాజా ప్రతిపాదనను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండలానికి ఇద్దరు చొప్పున వెయ్యి హెచ్‌ఈవో పోస్టులను మం జూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దొండకు సరైన రేటు మరోవైపు మార్కెట్ యార్డుల్లో కమీషన్ చార్జీలు లేకుండా దొండకాయ రైతులకు మంచి ధర ఇప్పించాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ డైరెక్టర్లు లక్ష్మీబాయి, డిప్యూటీ డైరెక్టర్ వై.జె.పద్మహర్ష కమీషన్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతుబజార్లలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో కేజీకి రూ.8 తగ్గకుండా రైతులు దొండ అమ్ముకోడానికి చర్యలు చేపడతామన్నారు. -
గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్
⇒ ఈ ఏడాది నుంచి దృష్టి సారించనున్న ఉద్యానశాఖ ⇒ గ్రీన్‌హౌస్‌కు రూ. 40 లక్షలైతే... నెట్‌హౌస్‌కు రూ. 17 లక్షలే సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుంటే... నెట్‌హౌస్ నిర్మాణానికి రూ. 17 లక్షలు కానుంది. పైగా నిర్వహణ భారం తక్కువగా ఉండటం, పంటల దిగుబడి గ్రీన్హౌస్తో సమానంగా ఉండటంతో నెట్ హౌస్ వైపు వెళ్లడమే ఉత్తమమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రీన్హౌస్ తోపాటు నెట్హౌస్నూ ఎక్కువగా ప్రోత్స హించాలని.. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందువల్ల వచ్చే బడ్జెట్లో గ్రీన్‌హౌస్‌తోపాటు నెట్హౌస్కూ నిధులు కేటాయించాలని ఆ శాఖ ప్రభు త్వాన్ని కోరింది. రెండింటికీ కలిపి రూ. 300 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరినట్లు తెలిసింది. ధనిక రైతులకే గ్రీన్హౌస్..? గ్రీన్‌హౌస్‌కు బడ్జెట్లో ప్రభుత్వం అధికంగానే నిధులు కేటాయిస్తోంది. 2016–17 బడ్జెట్లో రూ.200కోట్లు కేటాయించింది. 800 ఎకరా ల్లో సాగు చేయాలన్నది లక్ష్యం. గ్రీన్హౌస్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ఏకంగా 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. దేశంలో ఇంత భారీ సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం మరోటి లేదు. గ్రీన్‌హౌస్‌కు ఎకరానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా... అందులో రైతు తన వాటాగా రూ. 10 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. మూడు ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తుండటంతో అందుకోసం రైతు రూ. 30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇది ధనిక రైతులకే ఉపయోగపడుతోంది. ఒకవైపు కంపెనీలకు, మరోవైపు పేద, మధ్యతరగతి రైతులకు భారంగా మారుతున్న గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక ఎకరా నెట్‌హౌస్ నిర్మాణానికి రూ.14 లక్షలు, సాగునీటి వ్యవస్థల ఏర్పాటుకు రూ.1.60 లక్షలు, సాగు ఖర్చు రూ. 2 లక్షలు కలిపి రూ. 17.60 లక్షలు ఖర్చు అవుతుందని ఉద్యానశాఖ అంచనా వేసింది. అందులో ప్రభుత్వం రూ. 13.20 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. రైతు తన వాటా గా రూ. 4.40 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ జీడిమెట్లలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో నెట్హౌస్లను ఏర్పాటు చేశారు. నెట్హౌస్తో లాభాలేంటంటే... ∙తక్కువ ఖర్చుతో నెట్‌హౌస్‌ను నిర్మించు కోవచ్చు. ∙గ్రీన్హౌస్ నిర్మాణానికి వాడే ప్లాస్టిక్ షీట్‌తో సూర్యరశ్మి ద్వారా వచ్చే వేడి మొక్కలపై పడుతోంది. దీంతో ఏసీలను వాడాల్సి వస్తోంది. నెట్‌హౌస్‌కు ప్లాస్టిక్ షీట్ వేసినా రంధ్రాలు ఉండటం వల్ల గాలి లోనికి వెళ్లడంతో వేడి సాధారణంగానే ఉంటుంది. ∙నెట్ల వల్ల కొన్ని రకాల చీడపీడల నుంచి రక్షణ పొందొచ్చు. ∙నెట్‌హౌస్‌లో ప్లాస్టిక్ రంధ్రాలున్న నెట్ షీట్ల వల్ల 130 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడా తట్టుకోగలుగుతుంది. -
ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ షురూ
మొత్తం 1,000 కొత్త పోస్టులు, 506 ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖల్లో కొత్తగా 1000 పోస్టులు, ఖాళీగా ఉన్న 506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. వీటి భర్తీకి గత నెల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 వారాల తర్వాత భర్తీ ప్రక్రియ మొదలు పెట్టవచ్చన్న కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 14 తర్వాత జిల్లాల వారీగా నియమకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా పోస్టింగులను కూడా టీఎస్పీఎస్సీనే జారీ చేస్తుంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిశాక అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోవైపు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అరుుతే తాము కేవియట్ దాఖలు చేసినందున సమస్య ఉండకపోవచ్చని, కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలని అంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు.. కొత్తగా మంజూరైన వెరుు్య ఏఈవో పోస్టులను పాత 10 జిల్లాల ప్రాతిపదికగా కేటారుుంచారు. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు 214, వరంగల్ జిల్లాకు 149, ఆదిలాబాద్ జిల్లాకు 145 పోస్టులను కేటారుుంచారు. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా నియమిస్తారు. మొత్తంగా ఖాళీ పోస్టులతో కలుపుకొని 1311 ఏఈవో, 120 ఏవో పోస్టులను వ్యవసాయశాఖ పరిధిలో భర్తీ చేస్తారు. ఉద్యానశాఖలో 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేస్తారు. 6,500 ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశముంది. వారు పొలాలను, పంటలను పరిశీలించి.. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వేయాలో రైతులకు ప్రిస్కిప్షన్ రాసిస్తారు. న్యాయ నిపుణుల సలహా కూడా.. పాత జిల్లాల వారీగా పోస్టులను కేటారుుంచ డం, వాటికి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడం తెలిసిందే. ఇవన్నీ కూడా జిల్లా పోస్టులే. అరుుతే ఆ తర్వాత 21 కొత్త జిల్లాలు ఏర్పడడంతో.. పాత జిల్లాల ప్రకారం కేటారుుంచిన జిల్లా పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం ఎలా కేటారుుస్తారన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల కేటారుుంపులు ఉంటాయని చెబుతున్నా.. కొత్త జిల్లాలకు వాటిని ఎలా సర్దాలన్న అంశంపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. -
ఇంటితోట కూరల రుచి ఎంతో ఇష్టం!
ప్రకృతితో మమేకమవ్వాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. కానీ, ఆ ఆకాంక్షకు కార్యరూపం ఇవ్వగలిగేది కొందరే. అటువంటి కోవలోని వారే డాక్టర్ కొండా శ్రీదేవి. హైదరాబాద్ కృష్ణనగర్‌లో సొంత ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా బిజీగా ఉండే ఆమె తన ఆసుపత్రి మేడ మీద ప్రత్యేక శ్రద్ధతో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుప మెట్లను ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ కుండీలను అమర్చారు. పూలమొక్కలతోపాటు సేంద్రియ పద్ధతుల్లో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను పదేళ్లుగా పండిస్తున్నానని డా. శ్రీదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సేపు మొక్కల పనిలో గడుపుతానన్నారు. పెద్ద కుండీలో దానిమ్మ చెట్టు ఫలాలనిస్తోంది. ఎక్కువ కుండీల్లో వంగ, మిరప, టమాటా పండిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండే వెడల్పాటి మట్టి కుండీలో కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సబ్సిడీపై రూ. 3 వేలకు అందిస్తున్న ఇంటిపంటల కిట్‌ను కొనుగోలు చేశారు. వారు ఇచ్చిన సిల్పాలిన్ బెడ్స్‌లో టమాటాతోపాటు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ విత్తారు. మట్టిలో పశువుల ఎరువు కొంచెం కలిపిన మట్టి మిశ్రమం వాడుతున్నానని, నెలకోసారి ప్రతి కుండీకీ కొద్ది మొత్తంలో వర్మీ కంపోస్టు వాడుతున్నానని ఆమె తెలిపారు. మొక్కలతో సంభాషిస్తూ వాటి బాగోగులు చూసే పనిలో నిమగ్నమైతే రోజంతా పనిచేసిన అలసట ఇట్టే మాయమవుతుందన్నారు. మొక్కలు మరింత ఏపుగా పెరగడం కోసం, చీడపీడల నివారణకు కంపోస్టు టీని, ట్రైకెడోర్మా విరిడి ద్రావణాన్ని కూడా వాడాలనుకుంటున్నానని డా. శ్రీదేవి తెలిపారు. తాను పండించుకున్న వంకాయలు, టమాటాల రుచి తనకెంతో ఇష్టమని ఆమె సంతృప్తిగా చెప్పారు. నగరవాసుల ఆరోగ్యదాయకమైన జీవనానికి సేంద్రియ ఇంటిపంటల సాగు చాలా అవసరమని అంటున్న డా. శ్రీదేవి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ (రిటైర్డ్) సంగెం చంద్రమౌళి కుమార్తె. వివరాలకు 98495 66009 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు. - ఇంటిపంట డెస్క్ (intipanta@sakshi.com) ఫొటోలు: రాంపురి లావణ్యకుమార్ -
ప్రోత్సాహమేదీ?
♦ పుట్టగొడుగుల పెంపకాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం ♦ సబ్సిడీలు, ప్రోత్సాహం లేక ముందుకురాని యువత, రైతులు ♦ శిక్షణకు హాజరయ్యేందుకు అనాసక్తి ♦ ఇతర పథకాల్లాగే రాయితీలు వర్తింపజేయాలని డిమాండ్ పుట్టగొడుగుల పేరు చెబితే భోజన ప్రియులు లొట్టలేస్తారు. శాఖాహారులు.. మాంసాహారులనే బేధం లేకుండా ఉభయులూ ఇష్టపడతారు. హృద్రోగులకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకూ ఆరోగ్యకరమైన ఆహారం. మష్రూమ్స్ కర్రీకి హోటళ్లలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుట్టగొడుగుల పెంపకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయూన్నిచ్చే వీటి పెంపకంపై నిరుద్యోగ యువత, రైతులు ఆసక్తి కనబర్చు తున్నప్పటికీ ప్రోత్సాహం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా పుట్టగొడుగుల పెంపకం పథకం 20 ఏళ్లుగా అమలవుతోంది. ఒంగోలులోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల కేంద్రంలో ప్రతి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ శిక్షణకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా రైతులు వస్తుంటారు. శిక్షణకు ప్రతి రైతు రూ.100 చెల్లించాల్సి ఉండటంతో చాల మంది అనాసక్తి చూపిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే హాజరవుతున్నారు. కొత్తపట్నంలో విత్తన ఉత్పత్తి కేంద్రం.. జిల్లాలోని తీరప్రాంతమైన కొత్తపట్నంలోని ఉద్యాన నర్సరీలో పుట్టగొడుగుల విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఏటా 1000 కిలోలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. అంతే స్థాయిలో ఏటా లక్ష్యంగా నిర్ణయించారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను శిక్షణకు వచ్చిన రైతులకు మాత్రమే అమ్ముతారు. కిలో విత్తనాలు రూ.90 విక్రయిస్తారు. ఒక్కొక్క రైతుకు 20 కేజీలు మాత్రమే ఇస్తారు. విత్తనాల కొనుగోలు కూడా ఎలాటి రాయితీ లేకపోవడంతో శిక్షణకు వచ్చి రైతులు సైతం నిరుత్సాహనికి గురవుతున్నారు. పుట్టగొడుగుల పెంపకంతో ఏదైనా తేడా వస్తే.. రైతు ఆర్థికంగా మొత్తం నష్టపోవాల్సి వస్తోందని శిక్షణకు వచ్చిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంపకానికి ఎక్కడ అనుకూలం.. తీరప్రాంతంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలమే. చల్లగా ఉండే కొండప్రాంతాలు, మన రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. వైట్ బటన్, అయిస్టర్ లేక థింగీ (ముత్యపు చుక్క), చైనీస్ (ఓల్వోరిల్లా స్పీషిస్), సబ్ స్ట్రాట్, ఇంక్యుబేషిన్ క్రాపింగ్ ఇలా దాదాపు రెండు వేల రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటి పెంపకంలో సాంకేతిక నైపుణ్యం అవసరం. ఉష్ణోగ్రతలలో ఏదైన తేడా వస్తే పుట్టగొడుగుల బెడ్స్ మొత్తానికి వైరస్ సోకి పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలూ అందని ద్రాక్షే.. ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు లక్షాలాది రూపాయలను సబ్సిడీలుగా అందిస్తున్న ప్రభుత్వం పుట్టగొడుగుల పెంపకాన్ని మాత్రం విస్మరించడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు కూడా అందని ద్రాక్షే అవుతోంది. కొత్తగా పండ్లతోటలు సాగు చేసే రైతులకు 40 శాతం, బత్తాయి, నిమ్మతోటలకు రూ.23,160, మామిడికి రూ.19,460, దానిమ్మకు 29,500, టిష్యుకల్చర్ అరటి సాగుకు రూ.54,100, బొప్పాయి తోటలకు రూ.48,030 ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. రెండవ, మూడవ సంవత్సరంలో పండ్ల తోటల నిర్వహణకు 75 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. 50 శాతం రాయితీపై పాత తోటల పునరుద్ధరణ పథకం కింద బత్తాయి, నిమ్మ, జామ, జీడి మామిడి తోటలకు హెక్టారుకు రూ.20,000 సాయం అందిస్తోంది. మామిడి, బత్తాయి మరియు నిమ్మతోటలలో కొమ్మ కత్తిరింపుల పథకం కింద 50 శాతం రాయితీలు మంజూ చేస్తోంది. ఇలా పలు పథకాలకు రాయితీలు అందిస్తూ పుట్టగొడుగుల పెంపకానికి మాత్రం మొండిచేయి చూపడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పండ్ల తోటలకు మాదిరిగానే పుట్టగొడుగుల పెంపకానికి కూడా సబ్సిడీలు మంజూరు చేసి ప్రోత్సాహించాలని రైతులు కోరుతున్నారు. -
ఆంధ్రాలో పనిచేయలేం
* తేల్చి చెప్పిన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు * మార్గమధ్యంలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి సాక్షి, అమరావతి: తెలంగాణలో పుట్టిపెరిగి ఆంధ్రాలో ఉద్యోగం చేయడం తమ వల్ల కాదంటూ ఉద్యానశాఖ ఉద్యోగులు తేల్చిచెప్పారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడే పనిచేయమంటే సెలవుపెట్టి హైదరాబాద్ వెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏపీ కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపులో భాగంగా గురువారం ఉద్యానవన శాఖ ఉద్యోగులను గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఆ శాఖ కొత్త కార్యాలయానికి వీరు రాత్రి ఏడు గంటలకు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ఆ కార్యాలయానికి చేరుకోగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రిటైరయ్యేవారిని కూడా పంపారని మండిపడ్డారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 7 గంటలకు చేరడం గమనార్హం. మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి రావడంతో చికిత్స చేయించుకుని వచ్చేసరికి వీరి ప్రయాణం ఆలస్యమైంది. -
సమన్వయంతో సమస్యల పరిష్కారం
వివిధ శాఖల సమీక్షలో చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వేసవిలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, సాగునీరు, వ్యవసాయం, ఉద్యాన పంటలు తదితర వాటిపై అధికారులను అడిగి, పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా మనుషులు, పొలాలు, పశువులకు నీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో ఉద్యాన పంటల వివరాలు.. వ్యవసాయ శాఖ మాదిరి ఉద్యాన శాఖలో నూ పంటల వివరాలు ఆన్లైన్ చేయాలని, సర్వే నెంబరు సహా మొత్తం సమాచారాన్ని అందులో ఉంచాలని సీఎం ఆదేశించారు. -
కరువులోనూ కంటినిండా పంట..!
♦ పది ఎకరాల్లో మామిడి పంట రూ. 18 లక్షలకు అమ్మకం ♦ సేంద్రియ పద్ధతులతో సంతృప్తికరంగా దిగుబడులు ♦ తోటను ప్రదర్శన క్షేత్రంగా ప్రకటించిన ఉద్యాన శాఖ వచ్చే ఏడాది మంచి దిగుబడుల కోసం ఇప్పటి నుంచే పాటుపడాలనే స్వభావాన్ని ఒంటపట్టించుకొన్న ఓ యువ మామిడి రైతు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయనాల వాడకం చాలా వరకు తగ్గించుకుంటూ సంపూర్ణ సేంద్రియ సేద్యం దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది పంట దిగుబడులను, నాణ్యతను నిర్దేశించేది నేడు మనం చేపట్టే చర్యలేనని బలంగా విశ్వసిస్తారు నర్సింహారెడ్డి. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కట్కూర్. ఆ గ్రామంలో 2 కి. మీ. పరిధిలో విస్తరించిన మామిడి తోటల్లో ఈ ఏడాది పూత, కాత లేదు. అయినా నర్సింహారెడ్డి మాత్రం కరువు పరిస్థితుల్లోనూ ఎకరాకు పది టన్నులకు పైగా దిగుబడులు సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. 1997లో బీడుగా ఉన్న తన పదెకరాల పొలాన్ని బాగు చేయించిన నర్సింహారెడ్డి బంగినపల్లి మామిడి మొక్కలను ఎకరాకు 50 చొప్పున నాటారు. మామిడి తోటను చంటి బిడ్డ మాదిరిగా సాకుతారాయన. మామిడి సాగులో ఫలసాయం తీసుకొని తోట గురించి మర్చిపోయినా.. కాయ కాసే ముందు మేలుకొని ఎరువు వేసినా ఫలితం ఉండదంటారు నర్సింహారెడ్డి. చెట్లు బాగా పెరిగి గాలి, వెలుతురు సోకకుండా అడ్డంగా ఉన్న కొమ్మలను ప్రూనింగ్(క త్తిరింపులు) చేస్తారు. వర్షం పడగానే రోటావీటర్‌తో దున్నుతారు. దీనివల్ల మామిడి చెట్ల నుండి రాలిన ఆకులు, కలుపు భూమిలో కలిసి సేంద్రియ ఎరువుగా మారుతుంది. నాలుగేళ్లకు కాపు ప్రారంభమైంది. రసాయనిక సేద్యంలో మొదటి ఏడాది పదెకరాలకు కలిపి 4 టన్నుల దిగుబడి వచ్చింది. ఇది 2007 కల్లా 50-60 టన్నులకు చేరింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగుబడుల్లో ఏ మాత్రం పెరుగుదల రాలేదు. చెరువుమట్టి వేసినా, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసినా దిగుబడులు పెరగలేదు. దీంతో రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులతో ప్రయత్నించి చూడాలని నర్సింహారెడ్డి నిర్ణయించుకున్నాడు. 2012లో రూ. 60 వేలు ఖర్చు చేసి 30 ట్రక్కుల గొర్రెల ఎరువును కొని తోటకు వేశారు. దీనితోపాటు ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును వాడారు. చె ట్ల కాండం వద్ద కాకుండా.. కొమ్మల చివర్ల నుంచి అడుగు లోపలికి పాదులు చేసి ఎరువు వేశారు. నర్సింహారెడ్డి ప్రయత్నం ఫలించింది. ఆ ఏడాది దిగుబడి 110 టన్నులకు పెరిగింది. ఆ ఏడాది తోటను పరిశీలించిన శాస్త్రవేత్తలు మరుసటి ఏడాది దిగుబడులు పడిపోతాయని చెప్పటంతో నర్సింహారెడ్డి ఆందోళనకు గురయ్యారు. ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతోపాటు.. రూ. లక్ష వెచ్చించి 60 ట్రక్కుల పశువుల ఎరువును కొనుగోలు చేసి తోటకు వేశారు. ఆ ఏడాది కూడా 110 టన్నుల దిగుబడితో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం లభించింది. తర్వాతి రెండు సంవత్సరాలు పశువుల ఎరువును వేయలేదు. అయినా దిగుబడి తగ్గలేదు. ఈ ఏడాది ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును కొనసాగించారు. కరువు పరిస్థితులున్నప్పటికీ తోటకు నీటి కొరత రాలేదు. తెగుళ్ల నియంత్రణకు వాడే రసాయనాలను పూర్తిగా ఆపివేసి.. ఉసిరి, కుంకుళ్లతో తయారు చేసిన పొడి, వేపనూనె, ఆవుమూత్రం కలిపి 4 దఫాలు చల్లారు. 20 రోజులకోసారి 400 లీ. గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా తోటకు అందించారు. పూత సమయంలో చీడపీడలు ఆశించకుండా 10 లీ. నీటికి 1 లీ. ఆవు మూత్రాన్ని కలిపి చెట్లపై పిచికారీ చేశారు. వచ్చే ఏడాది నుంచి పురుగుల మందుల వాడకాన్ని కూడా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ నుంచే ప్రణాళి కాబద్ధంగా ప్రతి 15 రోజులకోసారి సేంద్రియ పిచికారీలు చేపట్టాలనుకుంటున్నానన్నారు. ఈ ఏడాది సేంద్రియ పిచికారీల వల్ల కాయల పరిమాణం, నాణ్యత, రంగు బావుందన్నారు. పదెకరాల్లోని మామిడి పంటకు రూ. 18 లక్షల ధర పలికింది. నర్సింహారెడ్డి తోటను ఉద్యాన శాఖ ప్రదర్శన క్షేత్రంగా ఎంపిక చేసింది. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఇటీవల స్వయంగా ఈ తోటను సందర్శించి ప్రశంసించారు. - పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా సేంద్రియ పద్ధతుల వల్లనే దిగుబడి.. మొక్క పెట్టి, కాస్తాయిలే అనుకుంటే.. కాయవు. వాటికి అన్ని రకాల పోషకాలనూ అందిస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ పద్ధతుల వల్లనే గడ్డు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నాం. మనం ఇచ్చిన దానికి చెట్లు పది రె ట్లు తిరిగి ఇస్తాయి. - గూడ నర్సింహారెడ్డి (99480 97877),కట్కూర్, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా -
దుబాయ్‌కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’
♦ ఎగుమతులు చేయాలని ఉద్యాన శాఖ యోచన ♦ వ్యాపారులతో చర్చిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ♦ రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టడంపై కసరత్తు ♦ విదేశాల్లో కిలో రూ. 300 వరకు పలుకుతున్న నాణ్యమైన పండ్లు సాక్షి, హైదరాబాద్: పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడితో రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దుబాయ్‌కు ‘తెలంగాణ బ్రాండ్’తో మామిడి పండ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. నాణ్యమైన పండ్లను గుర్తించి వాటిని దుబాయ్‌కు పం పేందుకు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే మామిడి పండ్ల వ్యాపారులు, రైతులతో చర్చించారు. అన్నీ కుదిరితే వచ్చే నెలలో దుబాయ్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉంది. రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి.. రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో ఏటా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కాస్తాయి. అందులో దాదాపు 6 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్తర భారతదేశానికి వెళ్తుంటాయి. విదేశాలకు మాత్రం 5-6 వేల మెట్రిక్ టన్నులకు మించి మామిడి పండ్ల ఎగుమతులు కావడంలేదు. చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాలకు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచే మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ బ్రాండ్‌తో నాణ్యమైన మామిడి రకం అంటూ ఒకటి ప్రజాదరణ పొందలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో సరైన మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులకు కిలో రూ. 25-50 మించి దక్కడంలేదు. స్థానికంగా ఇంత తక్కువ ధర పలుకుతున్న మామిడి పండ్లు... విదేశాలకు ఎగుమతి చేస్తే వాటి ధర కిలో రూ. 300 వరకు ఉంటోంది. కాబట్టి సేంద్రీయ, సహజ మామిడి పండ్లపై దృష్టి సారించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాండ్‌తో విక్రయించేలా నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పండుతోన్న నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించి వాటిని తెలంగాణ బ్రాండ్‌తో విక్రయించాలని భావి స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ పండ్లపైనే దృష్టి.. తెలంగాణ బ్రాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కల్తీలేని సేంద్రీయ పండ్లు, కూరగాయలు, అల్లం, కారం, పసుపు తదితర పదార్థాలను ప్రజలకు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ)ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులు పండించిన సేంద్రీయ పండ్లను కార్పొరేషన్ సేకరిస్తుంది. మామిడి పండ్లను సహజంగా మాగబెట్టి నాణ్యమైన వాటిని ఎగుమతి చేస్తారు. భారీ చెట్లు పెరగకుండా తక్కువ ఎత్తులోనే మామిడి కోసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల ఒక ఎకరంలోనే దాదాపు 675 మొక్కలను వేసే అవకాశం ఉంటుంది. ఎగుమతి చేసే ఆలోచన ఉంది దుబాయ్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేయాలని యోచిస్తున్నాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రైతులకు అధికలాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. - వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ -
గ్రీన్ హౌస్‌కు 100 శాతం సబ్సిడీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయం ఎకరాకే వర్తింపు... సీఎం వద్దకు ఫైలు సాక్షి, హైదరాబాద్: గ్రీన్ హౌస్ (పాలీ హౌస్) నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవలే 95 శాతం సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం... మరో ఐదు శాతం కూడా వారు భరించడం కష్టమని భావించింది. ఆ ఐదు శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా, మిగిలిన 95 శాతం ఉద్యాన శాఖ బడ్జెట్ నిధుల నుంచి కేటాయించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు సీఎం అంగీకరించినందున తక్షణమే అమలులోకి వచ్చేలా ప్రతిపాదన ఫైలును సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైలు వెళ్లనుంది. ఇదిలావుంటే ప్రస్తుతం 3 ఎకరాల వరకు ఏ రైతైనా 75 శాతం సబ్సిడీ పొందే వీలుంది. కానీ ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం నూటికి నూరు శాతం సబ్సిడీని ఒక ఎకరానికి మాత్రమే పొందేలా పరిమితి విధించారు. వారు ఒక ఎకరానికి మించి గ్రీన్ హౌస్ సాగు చేసినా ఆర్థికంగా ఇబ్బంది పడతారని... కనుక ఎకరాకే పరిమితం చేశామని అధికారులు వెల్లడించారు. ఒకవేళ అంతకు మించి రెండు మూడు ఎకరాల వరకు సాగు చేస్తే 75 శాతం సబ్సిడీ వర్తింపచేస్తారు. ఎకరానికి రూ.40 లక్షలు... ఎకరా విస్తీర్ణంలో గ్రీన్ హౌస్ నిర్మాణానికి రూ.33.76 లక్షలు, దీనికి అదనంగా పూలు, కూరగాయల నారు మొక్కలకు రూ.5.6 లక్షల నుంచి రూ.25.3 లక్షలు ఖర్చవుతుంది. మొక్కలు, దుక్కులు తదితరాల కోసం మొత్తం కలిపి 40 లక్షల రూపాయలకు పైన వ్యయమవుతుందని అంచనా. వివిధ మొక్కలను బట్టి అది మారుతుంటుంది. నూరు శాతం సబ్సిడీ అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఈ మొత్తం అందుతుంది. -
ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ
ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. ఈ మేర కు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు ఉల్లి సాగు చేసే రైతులకు రూ.5 వేలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తుండగా... మరో 10 హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉల్లి సాగు చేసే రైతులను గుర్తించారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చుచేస్తే కేవలం 6 టన్నుల ఉల్లి మాత్రమే పండుతోంది. దీంతో కొత్తగా విత్తనం తీసుకొచ్చారు. అది ఎకరానికి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ప్రస్తుతం కిలో ఉల్లి ఉత్పత్తి చేయాలంటే రూ. 10 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. -
నాబార్డు ‘సూక్ష్మ’ రుణం రూ.వెయ్యి కోట్లు
ఉద్యానశాఖపై సీఎస్ రాజీవ్‌శర్మ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉద్యానశాఖ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా ఇప్పటికే పాలీహౌస్, సూక్ష్మసేద్యం అమలు చేస్తోంది. త్వరలో ఉద్యాన కార్పొరేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కీలకమైన బిందుసేద్యానికి నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యానశాఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ, బిందు సేద్యం పరికరాల కోసం రైతులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నిర్దేశించిన కోటాకు మించి దరఖాస్తులు రావడంతో అవి వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్‌కు తగినవిధంగా స్పందించేందుకుగాను నాబార్డు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు వ్యవసాయశాఖకు ఉన్నట్లుగానే ప్రతి మండలానికి ఒక ఉద్యాన విస్తరణాధికారి(హెచ్‌ఈవో)ని నియమించాలని సీఎస్ ఆదేశించారు. అయితే ఎన్ని మండలాల్లో విస్తరణాధికారుల అవసరం ఏ మేరకు ఉందో చర్చించి నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. పైస్థాయి కేడర్ పోస్టుల సంఖ్యపైనా కసరత్తు చేస్తున్నారు. గతంలో వెయ్యి ఉద్యాన పోస్టులకు ప్రతిపాదనలు పంపిన ఉద్యానశాఖ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా 500 పోస్టులకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని పోస్టులను కూడా రెండు దశలుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. -
ఐదు తండాల్లో ఆకుకూరల హబ్
♦ గిరిజన రైతులతో గ్రీన్హౌస్ ద్వారా సేంద్రియ పద్ధతిలో సాగు ♦ నల్లగొండ జిల్లాలో ఐదు గ్రామాల దత్తత ♦ 500 మంది రైతులు...500 ఎకరాల్లో ఆకుకూరల సాగు ♦ 10 మంది రైతులకో క్లస్టర్... ఉద్యానశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గిరిజన రైతులతో సేంద్రియ ఆకుకూరల హబ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకోసం నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్, అవ్వాపూర్ , హాజీపూర్ , బోయినపల్లి, తిమ్మాపూర్ తండాలను ఎంపిక చేసింది. వాటిని ఉద్యానశాఖ దత్తత తీసుకుంది. ఆ ఐదు గ్రామాలను సేంద్రియ ఆకు కూరల హబ్‌గా ప్రకటించింది. ఆయా గ్రామాలకు చెందిన 500 మంది ఎస్టీ రైతులను గుర్తించి 500 ఎకరాల్లో సేంద్రియ పద్దతిలో ఆకుకూరల సాగు చేపట్టనున్నారు. ఈ నెల 28వ తేదీన బొమ్మలరామారంలో 500 మంది గిరిజన రైతులతో ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహిస్తారు. పది మంది రైతుల వంతున ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. వారికి విత్తనాలు, సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్టీ రైతులకు గాను ఎకరాకు రూ. 20 లక్షలు మాత్రమే ఖర్చయ్యేలా గ్రీన్హౌస్ నిర్మాణానికి రూపకల్పన చేస్తామని... 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఒక్కో గిరిజన రైతు ఎకరానికి రూ. 5 లక్షలు చెల్లిస్తే గ్రీన్హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకులతో అనుసంధానం... సేంద్రియ పద్ద్ధతిలో పండించే ఆకు కూరలను హైదరాబాద్‌లోని ఒక మార్కెట్‌కు అనుసంధానం చేసి మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు. ఏడాదిపాటు నిత్యం ఆకుకూరలు ఈ హబ్‌లో సాగు చేస్తారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, మెంతి, కొత్తిమీర, పుదీన సాగు చేయిస్తారు. ఇలా సాగుచేసిన ఆకు కూరలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు వ్యాన్లను ఏర్పాటు చేస్తారు.వాటి కొనుగోలుకు బ్యాంకులతో అనుసంధానం చేస్తారు. ఆకు కూరల హబ్‌కు సంబంధించి ఆదివారం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. అక్కడి భూములు, నీటి వసతి, రైతులపై ప్రత్యేకంగా సర్వే చేసి హబ్‌గా ప్రకటించామన్నారు. ఇప్పటికే ప్రకటించిన 399 ఉద్యాన పంటల క్రాప్ కాలనీల్లో భాగంగా నిర్ధారించిన వాటిల్లో ఈ గ్రామాలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
నారు పోస్తుంది.. నీరూ పోస్తుంది!
విత్తు మొదలు నారు పెంపు వరకు యాంత్రీకరణ పద్ధతిలోనే.. ♦ రూ.11 కోట్ల కూరగాయల నారుమడికి శ్రీకారం ♦ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ములుగులో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు ♦ 7న ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: తోటల పెంపకానికి నారే అత్యంత కీలకం. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో దాని నుంచి వచ్చే పంట అంతే స్థాయిలో అధిక దిగుబడినిస్తుంది. సహజంగా నారు మడులను రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో తయారు చేస్తారు. కొన్నిచోట్ల నర్సరీల్లోనూ తయారు చేస్తారు. అలా తయారైన నారును తీసేటప్పుడు కొన్ని మొక్కల వేర్లు తెగిపోతుంటాయి. ఫలితంగా అందులో కొన్ని చనిపోతాయి. చీడపీడలు ఆశించి మరికొన్ని చనిపోతాయి. మరోవైపు దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులో ఈ పరిస్థితి రైతుకు నష్టదాయకంగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలని తెలంగాణ ఉద్యానశాఖ, ఆగ్రోస్ నిర్ణయించాయి. చంటి బిడ్డను కాపాడుకున్నట్లుగా నారును పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించాయి. ఫ్లగ్ టైప్ నర్సరీని నెలకొల్పి రైతుకు నారును సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. కోళ్ల ఫారాల్లో కోడిగుడ్లను ట్రేలల్లో పెట్టి సరఫరా చేసినట్లుగానే నారును కూడా అలాగే పెంచి రైతులకు సరఫరా చేయనున్నారు. రూ.11 కోట్లతో ఫ్లగ్ టైప్ నర్సరీ ఫ్లగ్ టైప్ నర్సరీలో ఆటోమేషన్ యూనిట్, గ్రీన్హౌస్, ప్రైమరీ హార్డినింగ్ చాంబర్ తదితరాలుంటాయి. అంతా వ్యవసాయ సంబంధిత యంత్ర పరికరాలే అందులో ఉంటాయి. ఆటోమేషిన్ యూనిట్లో విత్తనానికి సంబంధించిన ప్రక్రియ, వాటికి ఎంతెంత నీరు, ఎరువు, ఉష్ణోగ్రత ఉండాలో నిర్దారణ జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఆటోమేటిక్‌గా గ్రీన్హౌస్లోని సీడ్ జర్మినేషన్ చాంబర్‌కు పంపిస్తారు. అక్కడ నారుకు ఉష్ణోగ్రత, నీరు, తేమ ఎంత మోతాదులో ఉండాలనే వాటిని కంప్యూటర్ ద్వారానే నియంత్రిస్తారు. ఎరువు, నీరు కూడా కంప్యూటర్ ఆదేశాల మేరకు నిర్ణీత పరిమాణంలో విత్తనానికి చేరుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపరేట్ చేయడానికి, శాస్త్రవేత్తల పర్యవేక్షణ కోసం తప్ప ఇతరత్రా కూలీలు, మనుషులతో పనిలేనేలేదు. నారు తయారయ్యాక కన్వేయర్ బెల్టు ద్వారా నారు ట్రేలల్లో బయటకు వస్తుంది. ఇదీ ఫ్లగ్ టైప్ నర్సరీకి సంబంధించిన ప్రాథమిక అంశాలు. ఈ ఫ్లగ్ టైప్ నర్సరీలో కూరగాయల నారును పెంచుతారు. ఒక్క నారు మొక్క కూడా చనిపోదు. దే నికీ చీడపీడలు రావు. అలా తయారైన నారు మొక్కలను రైతులకు ఇస్తే అవి పెరిగి పెద్దవై 30 శాతం అదనపు దిగబడులు ఇస్తాయి. ప్రస్తుతం ఫ్లగ్ టైప్ నర్సరీలు రాయపూర్, కేరళల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా మెదక్ జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంగణంలోనే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ఫ్లగ్ టైప్ నర్సరీ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుడతారు. రూ.11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల్లో ఈ నర్సరీని ఏర్పాటు చేస్తారు. వీటిల్లో బీర, సోర, కాకర, దోస, టమాటా, వంకాయ సహా వివిధ రకాల కూర గాయల నారును పెంచుతారు. ఈ నర్సరీ సామర్థ్యం ఏడాదికి 80 లక్షల నారు మొక్కలను తయారు చేయగలదు. ఆ నారు 666 ఎకరాలకు సరిపోతుందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ తయారయ్యే కూరగాయల నారును రైతులకు సబ్సిడీపై ఇస్తామన్నారు. పరిశ్రమగా అభివృద్ధి చేసే యోచన గ్రీన్‌హౌస్‌కు సబ్సిడీ ఇచ్చినట్లుగానే ఫ్లగ్ టైప్ నర్సరీకి కూడా సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. దీన్ని సాధారణ రైతులు నెలకొల్పుకోవడం అసాధ్యం. అనవసరం కూడా. అయితే దీన్నో పరిశ్రమగా ప్రోత్సహిస్తే ఫ్లగ్ టైప్ నర్సరీల్లో తయారయ్యే నారు మొక్కలతో కూరగాయల ఉత్పత్తిని 30 శాతం వరకు పెంచుకోవచ్చు. ఔత్సాహికులుంటే వారిని ఫ్లగ్ టైప్ నర్సరీ వైపు ప్రోత్సహిస్తామని ఆగ్రోస్ ఎండీ ఎ.మురళి ‘సాక్షి’కి చెప్పారు. -
‘తెలంగాణ ఆపిల్’గా ఆపిల్ బేర్!
నామకరణం చేసిన ఉద్యాన శాఖ రాష్ర్టంలో ఈ పంటను భారీగా ప్రోత్సహించాలని ప్రణాళికలు ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం వర్షాభావ ప్రాంతాల్లోనూ విరివిగా దిగుబడి 35 శాతం రాయితీ ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయం హైదరాబాద్: రేగు జాతికి చెందిన ఆపిల్ బేర్ కాయ.. థాయ్‌లాండ్‌లో పుట్టి బంగ్లాదేశ్ మీదుగా మహారాష్ట్రకు చేరుకుంది. ఐదేళ్లుగా అక్కడి రైతులు విరివిగా పండిస్తున్నారు. ప్రస్తు తం హైదరాబాద్ మార్కెట్లో దాదాపు కిలోకు రూ.100కు ఈ కాయలు లభ్యమవుతున్నాయి. ఆపిల్‌లో ఉండే అన్ని పోషకాల కన్నా ఎక్కువగా బేర్ కాయలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపిల్ బేర్‌కు రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు ‘తెలంగాణ ఆపిల్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దీన్ని కేవ లం 50 ఎకరాల్లో పండిస్తున్నారు. దీని సాగు ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది తెలంగాణ ఆపిల్‌ను కనీసం వెయ్యి ఎకరాల్లో పండిచాలని భావిస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చులో 35 శాతం సబ్సిడీ కింద ఇవ్వాలని యోచిస్తోంది. ఎకరాకు పెట్టుబడి రూ.20 వేలే.. కేవలం రూ.20 వేల పెట్టుబడితో ఎకరా విస్తీర్ణంలో ఆపిల్ బేర్‌ను వేయొచ్చు. అందులో రైతుకు 35 శాతం సబ్సిడీ (రూ.7 వేలు) ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పంటపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి సబ్సిడీపై పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్న క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పంట వేయాలని నిర్ణయించారు. అందుకోసం కోల్‌కతా నుంచి దాదాపు 3 వేల మొక్కలు తేనున్నారు. ఎకరాకు రూ. 20 లక్షల ఆదాయం.. మొండిజాతి రకమైన ఈ ఆపిల్ బేర్‌ను బీడు భూముల్లో కూడా పండించవచ్చు. ఒకసారి మొక్కలు నాటితే వందేళ్ల వరకు పంట కొనసాగుతూనే ఉంటుంది. కేవలం యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మొక్క నాటిన ఏడాది నుంచే పంట చేతికి వస్తుంది. రెండు మూడేళ్ల వరకు రూ.లక్ష నుంచి 2 లక్షల ఆదాయం వచ్చినా, తర్వాత ఎకరాకు రూ.20 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మహారాష్ర్టలోని షో లాపూర్‌కు చెందిన ఓ రైతు ఎకరంలో నాటిన 200 మొక్కల ద్వారా ప్రస్తుతం రూ.20 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడని చెప్పారు. ఒక్కో చెట్టుకు దాదాపు 250 కిలోల కాయలు కాస్తున్నాయని వివరించారు. హోల్‌సేల్‌గా కిలో కాయలకు రూ.40కి విక్రయిస్తున్నాడన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో కూడా ఈ చెట్లకు ఢోకా ఉండదని చెప్పారు. ఈ జాతికి చీడ పీడలు తక్కువ. పైగా పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ప్రతి గ్రామంలో కనీసం 50 ఎకరాల వరకు ఈ పంటను ప్రోత్సహిస్తే అక్కడి ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ పంట అధ్యయనానికి మహారాష్ట్రకు తెలంగాణ రైతు బృందాన్ని పంపిస్తామన్నారు. కాగా, ఒక్కో కాయ పావు కిలో వరకు తూగుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నేలలు ఈ పంటకు అనుకూలమైనవని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర రాష్ట్రాల్లో ఈ కాయలకు డిమాండ్ బాగా ఉంది. -
వ్యవసాయ కోర్సుల్లో సామాజిక శాస్త్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో సైన్సు, డిగ్రీ, పీజీల్లో వ్యవసాయ విద్య, తర్వాత వ్యవసాయాధికారిగా ఉద్యోగం... అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండటం. ఇలా వ్యవసాయ ఉద్యోగంలో ప్రవేశించిన వారి జీవితం ప్రారంభం అవుతుంది. అయితే అనేకమంది ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా భావించడం లేదని, రైతులకు అందుబాటులో ఉండటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తించింది. కొందరైతే తమకోసమే ఉద్యోగమన్న భావనలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన చెందుతోంది. దీన్ని సరిదిద్దేందుకు ఐకార్ నడుం బిగించింది. వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లోనూ సామాజిక శాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టి వారిలో సామాజిక స్పృహ పెంపొందించాలని యోచిస్తోంది. దీనిపై మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఐకార్ ఉన్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశముందన్నారు. వందలాది మంది అధికారులున్నా అంతే! పాఠశాల స్థాయిలో పదో తరగతి వరకు మాత్రమే విద్యార్థులు సాంఘిక శాస్త్రం చదువుతున్నారు. ఇక ఇంటర్ నుంచి సైన్సు, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సైన్సు కోర్సులో చేరిన విద్యార్థులు పూర్తిగా సామాజిక శాస్త్రాలకు దూరం అవుతున్నారు. ఫలితంగా సామాజిక స్పృహ, బాధ్యత లేక వ్యవసాయాధికారులు ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించడంలేదని ఐకార్ భావిస్తోంది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, మరోవైపు కరువుఛాయలు రైతును కుదేలు చేస్తున్నాయి. రైతు కోసం వేలాది మంది వ్యవసాయాధికారులున్నా రైతుకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదని భావిస్తోంది. రాష్ట్రంలో వందలాది మంది వ్యవసాయ కోర్సులు చేస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగంలో చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఏఈవో పోస్టులు, 450 ఏవో, 122 ఏడీఏ, 25 డీడీఏ, 15 జేడీఏ, రెండు అడిషనల్ డెరైక్టర్ పోస్టులున్నాయి. జిల్లాల్లోని ప్రయోగశాలల్లో దాదాపు 60 మంది ఉన్నారు. మరోవైపు ఉద్యానశాఖలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీలో 500 మందికిపైగా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరుగాక ఇతర వ్యవసాయ అనుబంధ విభాగాల్లో వందలాది మంది ఉన్నారు. కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థల్లో అనేకమంది పరిశోధనలు చేస్తున్నారు. ఇలా వేలాది మంది ఉన్నా రైతుకు కలిగే ప్రయోజనం ఎంతనేది ఐకార్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఇంత యంత్రాంగం ఉన్నా రైతులు నూతన సాగు విధానాలను పాటించకుండా సంప్రదాయ వ్యవసాయంపైనే ఎందుకు ఆధారపడుతున్నారని అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల పట్ల సున్నితంగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు వ్యవసాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో తప్పనిసరిగా సామాజికశాస్త్రాన్ని పరిచయం చేయాలని నిర్ణయించింది. -
గ్రీన్‌హౌస్‌కు ప్రత్యామ్నాయంగా ‘షేడ్‌నెట్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్‌తోపాటు షేడ్‌నెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. భారీ పెట్టుబడితో కూడిన గ్రీన్‌హౌస్‌ను ధనిక రైతులే ఉపయోగించుకుంటున్నందున.. అందుకు ప్రత్యామ్నాయంగా చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండేలా షేడ్‌నెట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన శాఖ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి షేడ్‌నెట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతుకు భారంగా గ్రీన్హౌస్ గ్రీన్‌హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందుకోసం ఈ ఏడాది 847 ఎకరాలకు రూ.250 కోట్లు కేటాయించింది. గ్రీన్హౌస్ కోసం ముందుకు వచ్చే రైతులకు దాని నిర్మాణ వ్యయంలో 75 శాతం సబ్సిడీని ఇస్తోంది. ఆ ప్రకారం ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టాలంటే రూ. 39.50 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో 75 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఎకరాకు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేయడం రైతుకు భారంగా మారుతోంది. దీంతో గ్రీన్‌హౌస్‌కు అనుకున్నంత స్థాయిలో రైతుల నుంచి స్పందన రావడంలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 30 ఎకరాల్లోపే గ్రీన్హౌస్ నిర్మాణం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు ఎవరూ గ్రీన్‌హౌస్‌కు దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. రైతులకే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయినా గ్రీన్‌హౌస్‌కు భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలు దానివైపే చూడడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఉద్యాన శాఖ షేడ్‌నెట్ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. చిన్నసన్నకారు రైతుల కోసమే షేడ్‌నెట్.. గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.50 లక్షలైతే, షేడ్‌నెట్‌కు రూ. 12 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతోంది. గ్రీన్హౌస్లో వేసే పంటలకు అవసరమైన ఉష్ణోగ్రతలను పూర్తిస్థాయిలో నియంత్రించుకునే వీలుంటుంది. వర్షం పడినా గ్రీన్ హౌస్‌లో పంటలపై పడదు. షేడ్‌నెట్ కేవలం ఒక పందిరిలాంటిది అనుకోవచ్చు. నాలుగు పక్కలా ఆగ్రో నెట్(ఆకుపచ్చ రంగులో కనిపించే వలలు) లేదా ఇతర విధంగా నేయబడిన వలతో కప్పివేయబడి ఉంటుంది. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి, గాలి, తేమ ఆ వలలోని సందుల గుండా ప్రసరించేలా అనువైన వాతావరణం ఉంటుంది. షేడ్‌నెట్‌లో ఎండ, గాలి, వడగండ్ల నుంచి మాత్రమే రక్షించుకోవచ్చు. వర్షం వస్తే మాత్రం పంటలపై బోరున పడుతుంది. అందువల్ల రబీలోనే షేడ్‌నెట్ వల్ల ప్రయోజనం ఉంటుందని, వర్షాకాలంలో దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. గ్రీన్హౌస్ ద్వారా పూల సాగు చేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందని, షేడ్‌నెట్ ద్వారా రబీలో కూరగాయల సాగు చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షేడ్‌నెట్‌ను వచ్చే ఏడాది నుంచి భారీగా ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. ఎకరాకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతున్నందున గ్రీన్‌హౌస్‌కు ఇచ్చినట్లే దీనికి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో షేడ్‌నెట్ సాగు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్హౌస్ నిర్మాణానికి ముందుకొచ్చిన కంపెనీలతోనే షేడ్‌నెట్ నిర్మాణాలు చేపట్టేలా చూడాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేసి షేడ్‌నెట్‌పై విరివిగా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. -
అరటి రైతు గిలగిల
9 నెలలకే పండిపోతున్న వైనం తగ్గిన కాయ పరిమాణం పడిపోయిన ధర ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం కానరాని ఉద్యానశాఖాధికారులు తాడేపల్లి రూరల్: గతేడాది అరటి పంటను సాగు చేసిన రైతులు ఒకింత ఆధాయాన్ని పొందారు. అయితే ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో పెళ్ళిళ్లు, శుభముహుర్తాలు, పండుగలు ఉండటంతో అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది అందుకు విరుద్దుంగా అరటి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి తల్తెతింది. జిల్లాలోని అరటితోటల పెంపకానికి కృష్ణాతీరం పేరొందిన ప్రాంతం. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర తదితర మండలాల్లో వేలాది ఎకరాలలో అరటి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఎకరానికి కౌలుతో కలిపి రూ. 90 వేలు పెట్టుబడి అవుతోంది. వర్షాలు సకాలంలో కురువకపోవడంతో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల అరటి రైతులకు ఈ సంవత్సరం కలిసి రాలేదని రైతులు చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుండి 11 నెలలకు పంట చేతికి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 8-9 నెలలోనే అరటి గెలలు పండి ధర సగానికి సగం పడిపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేక, ఎండా కాలాన్ని తలపిస్తుండడంతో గెలలు ముందుగానే పక్వానికి వస్తున్నాయి కానీ కాయ పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. అదే 11 నెలలకు గనుక పక్వానికి వస్తే ఇప్పుడున్న సైజుకు రెండింతలు ఉంటుంది. దాంతో మార్కెట్లో కూడా అనుకున్న రేటు వస్తుందని రైతులు అంటున్నారు. ఆగిపోయిన ఎగుమతులు.. మన ప్రాంతంలో పండిన అరటి గెలలు రాజస్తాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గెల 9 నెలలకే పండడంతో ఇతర రాష్ట్రాల ఎగుమతి ఆగిపోయింది. రూ. 250లకు అమ్ముడుపోయిన గెల రూ. 100-130 లకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.1.5 లక్షలు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. అరటి తోటల్లో లోపాలను గుర్తించి, సలహాలు సూచనలు ఇచ్చే చర్యలు ఉద్యానవన శాఖాధికారులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు. -
మండలానికో ఉద్యానాధికారి!
సర్కారుకు ఉద్యానశాఖ ప్రతిపాదన గ్రీన్హౌస్, సూక్ష సేద్యం పథకాల నేపథ్యంలో సిబ్బంది పెంపునకు విజ్ఞప్తి సీఎం ఆమోదిస్తే 500 కొత్త ఉద్యోగాలకు అవకాశం హైదరాబాద్: వ్యవసాయశాఖలో మాదిరిగానే ఉద్యాన శాఖలోనూ ప్రతి మండలానికి ఒక ఉద్యానాధికారి (హెచ్‌వో)ను నియమించాలని ఆ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తద్వారా ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చింది. పూర్తి సమాచారంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఆమోదం పొందాలని భావిస్తోంది. కేసీఆర్ ఆమోదిస్తే ఉద్యానశాఖలో 500 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ముఖ్యంగా గ్రీన్హౌస్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.250కోట్లు కేటాయించింది. ఇక రాష్ట్రంలో కూరగాయల అవసరాల్లో 85శాతం పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని నివారించాలని, కూరగాయల సాగును పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే దాదాపు 10 వేల ఎకరాల్లో అదనంగా ఉల్లి సాగు చేపట్టాలని నిర్ణయించింది. వీటితోపాటు సూక్ష్మ, బిందు సేద్యంపైనా దృష్టిపెట్టింది. ఇవన్నీ ఉద్యానశాఖ పరిధిలోవి కావడంతో ఆ శాఖపై బాధ్యతలు పెరిగాయి. కానీ సరిపడా సంఖ్యలో సిబ్బంది లేరు. ఈ శాఖలో మంజూరైన పోస్టులు 150 మాత్రమేకాగా... ఇందులోనూ 75 ఖాళీగానే ఉన్నాయి. ఉద్యానశాఖ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సిబ్బంది ఏమాత్రం సరిపోరని... సిబ్బందిని పెంచాలని ఆ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ప్రతీ మండలానికి ఒక ఉద్యానాధికారి, జిల్లా కేంద్రంలో కొన్ని పోస్టులను ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త పోస్టులు ఏర్పడతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఉద్యాన పంటల సాగు పరిస్థితి ఏమిటి, నిబంధనల ప్రకారం ఎన్ని ఎకరాలకు ఒక ఉద్యానాధికారి అవసరం? వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై దీనిపై విజ్ఞప్తిచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
గ్రీన్హౌస్ కంపెనీల బ్యాంక్ డిపాజిట్ సొమ్ము తగ్గింపు
రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు కుదిస్తూ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్హౌస్ (పాలీహౌస్) ప్రాజెక్టు మందకొడిగా సాగుతోన్న నేపథ్యంలో పలు నిబంధనలను సడలిస్తూ పోతున్న సర్కారు.. తాజాగా మరికొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. గ్రీన్హౌస్ ప్రాజెక్టును విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా మరికొన్ని సవరణలు చేయాలని ఉద్యానశాఖ సాంకేతిక కమిటీ నిర్ణయించింది. గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టే కంపెనీలు ఉత్సాహంగా ముందుకు రావాలంటే కఠినంగా ఉన్న నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా గ్రీన్హౌస్ కంపెనీలు చెల్లించాల్సిన బ్యాంక్ డిపాజిట్ సొమ్మును రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు త గ్గించాలని ప్రతిపాదించింది. రైతులకు ఒక ఎకరా వరకు గ్రీన్హౌస్ నిర్మాణం చేసే కంపెనీలు రూ. 25 లక్షల వరకు బ్యాంక్ డిపాజిట్ సొమ్ము చూపిస్తే చాలని ప్రతిపాదించారు. ఒక ఎకరాకు మించి మూడెకరాల వరకు గ్రీన్హౌస్ చేపట్టగల సామర్థ్యం గల కంపెనీలు రూ. 35 లక్షల వరకు బ్యాంక్ డిపాజిట్ కలిగి ఉండాలని నిర్ణయించారు. ఇదిలావుండగా నిర్దేశించిన భూమిలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా సంబంధిత పరికరాలు చేరాక రైతు చెల్లించే 25 శాతం సొమ్మును మాత్రమే ఇస్తున్నారు. ఆ తర్వాత పని చాలా వరకు జరిగాకనే మరో 25 శాతం అడ్వాన్సుగా ఇస్తున్నారు. దీన్ని సవరించి 35 శాతం వరకు ఇచ్చేలా చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు. కఠిన నిబంధనల కారణంగా 5 కంపెనీలే ముందుకు వచ్చాయన్న చర్చ అధికారుల్లో నెలకొంది. దీనివల్ల అటు కంపెనీలు... ఇటు రైతులు నిరాశగా ఉన్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సడలింపులు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఉద్యానశాఖలో ‘సూక్ష్మ సేద్యం’ విలీనం
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవోకు అనుగుణంగా మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉద్యానశాఖలో సూక్ష్మసేద్యం పథకాన్ని (తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) విలీనం చేస్తున్నట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ టీకే. శ్రీదేవి ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యానశాఖ రెండో సహాయ సంచాలకుల కార్యాలయాన్ని త్వరలోనే నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రెండు శాఖల విలీనంతో సిబ్బంది కొరత తీరడంతో పాటు సంక్షేమ పథకాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు. -
సేంద్రియ ఇంటిపంటలపై 25నశిక్షణ
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25(శనివారం)న ఉ.10 గంటలకు రసాయనాల్లేకుండా ఇంటిపంటల సాగుపై శిక్షణా కార్యక్రమం జరగనుంది. వేదిక : రెడ్‌హిల్స్‌లోని హార్టీకల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వక్త : ప్రభాకర్‌రావు, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రి సెన్సైస్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : ఉద్యాన అధికారిణి అరుణ - 83744 49458 ,ఉద్యాన అధికారి పద్మనాభ - 83744 50023 -
తీరని నష్టం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అకాలవర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. మూడు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు రైతులకు విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు.. వడగళ్లతో జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలి వానలతో మామిడితోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి, కొద్దిరోజుల్లో చేతికిరావాల్సిన మామిడి వాన బారిన పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,910 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించిన జిల్లా యంత్రాంగం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. జిల్లాలోని 14 మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు రూ.కోట్లలో పంటనష్టం సంభవించిందని లెక్క తేల్చింది. యాచారం, మొయినాబాద్, కందుకూరు, కీసర, ఘట్కేసర్, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో వరి పైరు నేలకొరిగినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. జిల్లాలో కూరగాయలు, ఉద్యానతోటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పూలు, పండ్ల తోటలు తుడుచుకుపోయాయి. చేవెళ్ల ప్రాంతంలో కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం చేకూరింది. 116 హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయ పంటలు నీటిపాలు కావడం రైతాంగాన్ని కుంగదీశాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 5,052.80 హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లు, కూరగాయ తోటలు 50శాతానికి పైగా దెబ్బతిన్నట్లు నిర్ధారించిన అధికారులు.. 448.20 హెక్టార్లలో 50శాతం లోపు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. అకాల వర్షాలకు 1,201 మంది పూలు, కూరగాయ రైతులు నష్టపోయినట్లు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. యాచారం, కీసర, శామీర్‌పేట, మేడ్చల్ తదితర మండలాల్లో వర్షానికంటే వడగళ్లు భారీగా పడడం అన్నదాతల్లో విషాదాన్ని మిగిల్చింది. పంటల నష్టంపై అంచనాలు రూపొందించినప్పటికీ, కుండపోత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన నష్టం అంచనాలను పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు ఇంకా తయారు చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులు వర్షాలతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. ప్రతిపాదిత చెరువుల్లోకి వర్షపు నీరు చేరడంతో పనులు ఆగిపోయాయి. వర్షం తెరిపిఇస్తే కానీ ఇవి ప్రారంభమమ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇదిలావుండగా శంకర్‌పల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి పరిశీలించారు. -
పచ్చపాతం!
ఉద్యానవనశాఖలో వేళ్లూనుకున్న అవినీతి బినామీ కాంట్రాక్టర్లతో అధికారుల ఇష్టారాజ్యం విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ఉద్యానవన శాఖ పనుల్లో అవి నీతి చిగుళ్లు తొడుగుతోంది. బినామీ కాంట్రాక్టర్ల పేరిట అధికారులే ఎడాపెడా పనులు దక్కించుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఇతర కాంట్రాక్టులెవరికీ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా పనులు చేజి క్కించుకుంటున్నారు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేస్తున్నారంటే అదీ లేదు. తూతూ మంత్రంగా పనులు చేసేసి బిల్లులు డ్రా చేసుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న తీరు ఇలా ఉంది...! లాసన్స్ బే కాలనీలో బీచ్ వద్ద పార్కు అభివృద్ధికి రూ. 80.39 లక్షల విలువతో గత ఏడాది టెండర్లు పిలిచారు. ఇందులో ప్రధానమైనవి రూ. 49 లక్షలతో చేపట్టాల్సిన పార్కు పనులు. ఇందులో పచ్చిక తివాచీ(లాన్), పూల మొక్కలు, కొరియన్ కార్పెట్‌తో కూడిన ల్యాండ్ స్కేపింగ్ పనులు. కాగా ఈ టెండర్‌ను కూడా బినామీ పేరుతో అధికారులు చేజిక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ. 49 లక్షల పార్కు పనులకు టెండర్లు పిలిస్తే పలువురు పోటీపడే అవకాశం ఉంటుంది. అందుకే మరికొన్ని సివిల్ పనులను కూడా కలిపి అంచనా వ్యయాన్ని రూ. 80.39 లక్షలకు పెంచేశారు. ఆ పనులు దక్కించుకునేందుకు తమకు సన్నిహితుడైన పి.శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్‌ను రంగంలోకి తెచ్చారు. వాస్తవానికి ఆయనకు ల్యాండ్ స్కేపింగ్ పనుల్లో తప్ప మిగిలిన పనుల్లో ఎలాంటి అనుభవం లేదు. కానీ ఆయనకు అర్హత క ల్పించేందుకు కేవలం రెండు మాసాల వ్యవధిలో తొమ్మిది పనులు చేసినట్టుగా రికార్డులు జత చేశారు. ఒకే కాంట్రాక్టర్ రెండు నెలల్లో తొమ్మిది పనులు పూర్తి చేయడం అసాధ్యం. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు రూ. 80.39 లక్షల పనుల టెండర్‌ను ఖరా రు చేసేశారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కొన్నాళ్లు ఫైల్‌ను తొక్కిపెట్టారు. తర్వాత చడీచప్పుడు కాకుండా ఆ పనులను పి. శ్రీనివాస్‌కే క ట్టబెట్టారు. ముందుకు సాగని పనులు కాంట్రాక్టు దక్కించుకోవడం మీద చూపించిన శ్రద్ధ... పనులు పూర్తి చేయడం మీద మాత్రం అధికారులకు లేకుండా పోయింది. దాదాపు ఏడాది కావస్తున్నా లాసన్స్ బే కాలనీ బీచ్ పార్కు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇంత వర కూ కేవలం ఎర్రమట్టిని వేసి చేతులు దులుపుకున్నారు. పచ్చిక తివాచీ, పూలమొక్కలు, కొరియన్ కార్పెట్‌తో ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు ఊసే లేకుండా పోయింది. ఇవి కూడా..!: జీవీఎంసీ ఉద్యానవన శాఖలో ఆది నుంచీ ఇదే రీతిలో అవినీతిపర్వం కొనసాగుతోంది. అధికారులకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయకుండా బిల్లులు చెల్లించేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలివిగో..! 15వ వార్డు నుంచి 22వ వార్డు వరకూ రూ. 3.4 లక్షలతో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అసలు జరగనే లేదు. 32వ వార్డు చాకలిపేట హిందూ శ్మశానం పక్కన పార్కు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఆ ఫైలును మాయం చేశారు. తమ సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు మళ్లీ పనులు అప్పగించి బిల్లులు డ్రా చేసుకున్నారు. జీవీఎంసీ నర్సరీలో గత నాలుగేళ్లలో మొక్కల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు రూ. 25లక్షలు విలువైన మొక్కలు జాడ లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఉద్యానవన శాఖలో ఓ అధికారి తన సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు 2012-13, 2013-14లో ఏకంగా రూ. 80 లక్షల వి లువైన పనులను ఏక పక్షంగా కట్టబెట్టా రు. ఇంత అవినీతి జరుగుతున్నా ఉద్యానవన శాఖను సంస్కరణకు జీవీఎంసీ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఓసీలకూ 90 శాతం సబ్సిడీ
సూక్ష్మసేద్యంపై ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యంపై ఓసీలకు ఇస్తున్న సబ్సిడీని ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి 90 శాతం అమలు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఉద్యానశాఖ ప్రదర్శన సభలో రైతులు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీసిన సంగతి తెలిసిందే. తమలోనూ చిన్నసన్నకారు రైతులు ఉన్నందున ఐదెకరాల లోపున్న వారికి కూడా 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పోచారం ఆదేశాల మేరకు ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మంగళవారం ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఉంది. నూతన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఐదెకరాల లోపున్న ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ అమలుకానుంది. ఐదెకరాలు మించిన వారికి మాత్రం యథావిధిగా 80 శాతం మాత్రమే సబ్సిడీ ఉంటుంది. 90 శాతం సబ్సిడీ వల్ల అదనంగా 20 వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
‘షేడ్‌నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్‌రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్‌నెట్ హౌస్‌తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్‌ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్‌నెట్ మౌస్‌లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
కూర మిరపతో లాభాల మెరుపు
ఖమ్మం వ్యవసాయం: వివిధ కూరగాయ పంటలతో పాటు కూరమిరప అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనిలో క్యాప్సికం(కూర మిరప)ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీని సాగు పద్ధతులను ఉద్యానశాఖ సహాయ సంచాలకులు-2 కె.సూర్యనారాయణ (83744 49066) వివరించారు. ఈ క్యాప్సికం కాయలు ఎక్కువ కండ కలిగి గంట ఆకారంలో ఉండటం వలన దీన్ని ‘బెల్ పెప్పర్’ అని కారం లేకపోవడం వలన లేదా తక్కువ కారం ఉండటం వలన ‘స్వీట్ పెప్పర్’ అని అంటారు. ఈ కాప్పికం కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లు టమాటాలో కన్నా అధికం. మన జిల్లాలో ఏటేటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంటకు అనువైన సమయం: క్యాప్సికం సాగు చేయటానికి అక్టోబర్- నవంబర్, జూలై- ఆగస్టు నెలలు అనుకూలం. నేలలు: మురుగు నీరు నిలువ ఉండని నల్లభూములు, ఎర్రభూములు అనుకూలం. ఉదజని సూచిక 6.0 - 6.5 ఉన్న నేలలు బాగా అనుకూలిస్తాయి. చౌడు భూముల్లో ఈ పంట పండించకూడదు. సాధారణ రకాలు: కాలిపోర్నియా వండర్, ఎల్లో వండర్, అర్కమోహిని (సెలక్షన్-13) లర్కగౌరవ్ (సెలక్షన్-16) అర్కబసంత్ (సెలక్షన్-3), నాంధారి-10, నాంధారి-33. సంకర జాతి రకాలు: భారత్, మాస్టర్ మాస్టర్, ఇంద్రా, లారియో, ఎస్.ఎస్-436, ఎస్.ఎస్-625, నాథ్ హీరా, తన్వి, విక్రాంత్, గ్రీన్ గోల్డ్, సన్ 1090, సన్ 1058. విత్తన శుద్ధి: ఎన్నుకున్న రకానికి థైరమ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పెపంకం: ఎత్తై నారుమళ్లు లేదా ప్రొట్రేల ద్వారా నారు పెంచుకోవచ్చు. ప్రోట్రేల ద్వారా నారు పెంచితే దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాటు విధానం: మొక్కకు, సాళ్లకు మధ్య దూరం 2.5ఁ2.5 అడుగులలో నాటాలి. ఇలా నాటితే ఎకరానికి 8 వేల నుంచి 9 వేల మొక్కలు పడతాయి. రబీ పంటగా 2ఁ2 అడుగుల దూరంలో నాటాలి. ఈ విధానంలో ఎకరాకు 11 వేల నుంచి 12 వేల మొక్కలు పడతాయి. ఎరువుల యాజమాన్యం: ఎకరానికి 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులను పంట పెరిగే వివిధ దశల్లో వేసుకోవాలి. నీటి యాజమాన్యం: నేల స్వభావాన్నిబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. {yిప్ పద్ధతిలో నీరు పెట్టేటట్టయితే 10-20 శాతం దిగుబడిలో వృద్ధి పొందటమేగాక నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు. తెగుళ్లు-నివారణ పంట పెరిగే వివిధ దశల్లో కాయ తొలుచు పురుగు, పై ముడత, కింది ముడత, కాయ ఈగ పురుగు, కోనోఫారా కొమ్మ ఎండు తెగులు, బూడిద తెగులు, కాయ కుళ్లు తెగులు, వైరస్ తెగులు, ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయి. పై ముడత నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ రీజెంట్ లేదా 2 మి.లీ డైమిథోయెట్ లేదా 0.2 గ్రాములు ట్రేసర్ పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు లీటర్ నీటిలో 5 మి.లీ డైకోపాల్ లేదా 3 మి.లీ ట్రైజోఫాస్ మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఆకులు కింద, పైనా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొక్కల్లో సూక్ష్మదాతు లోపాలు కనిపిస్తే తొలి దశలో లీటర్ నీటిలో 3 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, పై సల్ఫేట్, 1.5 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా పిచికారీ చేయాలి. దిగుబడి: నేల స్వభావం, యాజమాన్య పద్ధతులపై దిగుబడి ఆధార పడి ఉంటుంది. మొక్క నాటిన 50-60 రోజుల నుంచి ఉత్పత్తి వస్తుంది. సగటున ఎకరాకు 40-60 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. పంట సాగులో ఆదాయం మార్కెట్ ధరపై గాకుండా రైతులు పొందే దిగుబడులపైనే ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో కనీస దర దొరికినా దిగుబడి ఎక్కువపొందటం వలన రైతుకు నికరాదాయం అధికంగా లభిస్తుంది. -
సాగుకు సర్కారీ సాయం
వ్యవసాయ శాఖ పథకాలు 1. మాగాణి భూములకు పచ్చి రొట్ట పైర్ల విత్తనాలు, అంతర పంటల విత్తనాలు 50శాతం సబ్సిడీపై సరఫరా. 2. విత్తన గ్రాస పథకం కింద రైతులు వారికి కావాల్సిన విత్తనం వారే తయారు చేసుకునేందుకు ఫౌండేషన్ విత్తనాల సరఫరా. 3. భూసార వారోత్సవాల నిర్వహణ- మట్టి నమూనాల విశ్లేషణ ఆధారంగా ఎరువుల వాడకానికి ప్రోత్సాహం. 4. మండలానికి పది చొప్పున ముఖ్యమైన పంటల్లో ఆధునిక పద్ధతుల సమగ్ర ప్రదర్శనకు పదెకరాల ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ. 5. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ప్రచారానికి వరి, పత్తి, వేరుశనగ, కంది పంటల్లో క్షేత్ర పాఠశాల నిర్వహణ. 6. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు సరఫరా. 7. పురుగు మందులు కల్తీల నిరోధానికి శాంపుల్స్ రహస్య కోటింగ్ పద్ధతిన కొనసాగింపు. 8. జీవ నియంత్రణ విధానాల ప్రచారానికి తక్కువ ధరకు ట్రైకోడెర్మా విరిడి, ఎన్పీవీ ద్రావణం, ట్రైకోగ్రామా కార్డుల సరఫరా. 9. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, రైతు గ్రూపులు తదితర కార్యక్రమాల నిర్వహణ. ఉద్యానవన శాఖ పథకాలు 1. ఆయిల్ ఫామ్ తోటల అభివృద్ధి. 2. అధిక దిగుబడి నిచ్చే కూరగాయ, ఉల్లి విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా. 3. మేలు రకం పండ్ల మొక్కలు, టిష్యూ కల్చర్ మొక్కలను రాయితీపై అందజేత. 4. ఉద్యాన పంటల ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెంపునకు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు సరఫరా. 5. సమగ్ర పండ్ల అభివృద్ధి పథకం, కూరగాయల అభివృద్ధి పథకం, సమగ్ర సుగంధ ద్రవ్యాల అభివృద్ధి పథకం. 6. పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక పథకాల అమలు. 7. ఆకులలో పోషకాలను విశ్లేషణ చేసే లేబొరేటరీ ద్వారా ఆకులను విశ్లేషించే సమగ్ర పోషక యాజమాన్యం అమలు. 8. రైతు బజార్ల రైతులకు విత్తనాల సబ్సిడీ, సాంకేతిక సలహాలు అందజేయడం. 9. రైతు శిక్షణా కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటు, రైతు విజ్ఞాన యాత్రల ద్వారా అవగాహన పెంపొందించడం. 10. మామిడి, ద్రాక్ష, గులాబీ, పుట్టగొడుగుల ఎగుమతి ప్రోత్సాహానికి చర్యలు. -
అవినీతి పురుగులు
- ఉద్యాన శాఖలో అక్రమార్కులు - రైతుల సబ్సిడీలు స్వాహా - లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లు - ఫిర్యాదు చేస్తే బెదిరింపులు - అక్రమార్కులకు అండగా తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు :కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అన్న చందంగా మారింది జిల్లాలో కొందరి ఉద్యాన శాఖ అధికారుల పనితీరు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి సబ్సిడీలను దిగమింగేస్తున్నారు. బోగస్ పేర్లలో అక్రమాల పంట పండిస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ నేతల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు.. పండ్లు, పూల తోటలను అభివృద్ధి చేసుకునేందుకు, అలాగే వ్యవసాయ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సబ్సిడీల కోసం రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోగా వీరిలో కొంత మందికి మంజూరయ్యాయి. అయితే లబ్ధిదారులైన రైతులకు తెలియకుండానే వారికి మంజూరైన నిధులను కొందరు అధికారులు స్వాహా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలకుపైగా నిధులు పక్కదారిపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవీ ని‘దర్శనాలు’ ►డోన్ మండలం అలేబా తండాకు చెందిన 14 మంది ఎస్టీ రైతులు.. పసుపుతోటల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం రూ.72,600 మంజూరు చేసింది. మంజూరైన ఈ మొత్తం రైతులకు చేరలేదు. బ్యాంకుకు వచ్చిన నిధులు మాత్రం వారి పేరున వేరొక అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి. ►కొత్తకోట గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ రైతులకు 2012-13లో ఒక్కొక్కరికి రూ.14వేలకుపైగా నిధులు మంజూరయ్యాయి. అందులో రూ.5 వేలు మెటీరియల్ పోను మిగిలిన మొత్తం నిధులు స్వాహా చేసినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ►ప్యాపిలి మండలంలో 79 మంది రైతులకు రూ.1,95,130 మొత్తం డీడీ నంబర్ 180963తో బ్యాంక్‌కు చేరింది. ఆ జాబితాలోని 17, 19, 35, 38, 40, 67 సీరియల్ నంబర్లలో ఉన్న రైతుల పేర్లతోపాటు ఎం కేశవరెడ్డి, ఆర్. క్రిష్ణన్న మరో 8 మంది రైతులు పేర్లు ఉండాల్సిన చోట బ్లాంక్ పెట్టి అక్కడ వేరొకరి అకౌంట్ నంబర్లు వేసి నిధులు మళ్లించుకున్నారు. ►టమాట రైతులకు బుట్టలు, కత్తెర్లు, రంపాలు వంటి పరికరాలు పంపిణీ చేస్తారు. వాటిని పంపిణీ చేసినందుకు సర్వీస్ చార్జ్ కింద 10 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ పరికరాలను ఆ కంపెనీ వారు పంపిణీ చేయటం లేదని తెలిసింది. అధికారులే పంపిణీ చేస్తూ ఆ 10 శాతం నిధులను నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ►ప్యాపిలి మండలం జక్కసానికుంట్ల గ్రామంలో అరటితోటల పెంపకానికి సంబంధించి 2012-13, 2013-14 ఏడాదికి సంబంధించి కూడా నిధులు పెద్ద ఎత్తున మంజూరైనట్లు సమాచారం. స్థానిక వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు నొక్కేశారనే విమర్శలు ఉన్నాయి. బెదిరింపులు..: డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రాంబాబు పీజీ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణించటంతో కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాడు. ఉన్న పొలంలో వ్యసాయం చేసేందుకు ట్రాక్టర్ కోసం సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సబ్సిడీ కింద నిధులు మంజూరయ్యాయని, అయితే ముందుగా రూ.3.83 లక్షల డీడీ కట్టాలని అధికారులు సూచించారు. దీంతో ఆ యువకుడు వడ్డీకి తెచ్చి డీడీ కట్టి అధికారిని కలిశారు. అయితే ఆ అధికారి సబ్సిడీ మంజూరు చేయాలంటే రూ.15 వేలు అడిగినట్లు రాంబాబు వెల్లడించారు. తన వద్ద లేదని చెప్పటంతో సబ్సిడీ ఇవ్వకుండా అడ్డుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై రాంబాబు గత ఏడాది డిసెంబర్లో, అలాగే గతనెల 19న ఉద్యానశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కమిషనరేట్ నుంచి అవినీతి అధికారులపై విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చారు. అయితే విచారణ ముందుకు సాగలేదు. దీంతో రాంబాబు మరోసారి కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. స్పందించిన కలెక్టర్ ఏజేసీని విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయం అవినీతి అధికారులకు తెలియటంతో స్థానిక టీడీపీ నేతల ద్వారా పోలీసులకు చెప్పి, పోలీసులతో తనను తీవ్రస్థాయిలో హెచ్చరించారని రాంబాబు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయటంతో పాటు రక్షణ కల్పించాలని మరోసారి కలెక్టర్‌ను కలిసి విన్నవించటం గమనార్హం. ఇదిలా ఉండగా డోన్ నియోజక వర్గంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై తనకు ఫిర్యాదులు అందాయని ఉద్యాన శాఖ ఏడీ సాజానాయక్ తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
అరటిలో పోషక లోపం.. దిగుబడిపై ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘అరటి చెట్లలో పోషకాలు లోపిస్తే ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గుతుంద’ని ఉద్యానశాఖ ఏడీ బీ రవీంద్రబాబు(83744 49050) తెలిపారు. పోషక లోపాలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. పోషక లోపాలను ఎలా గుర్తించాలి, రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : అరటిలో ఏఏ పోషకాలు లోపిస్తాయి? జ : జింక్, బోరాన్, ఇనుము, మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపిస్తాయి. ప్ర : జింకు లోపాన్ని గుర్తించడం ఎలా. నివారణ చర్యలేంటి? జ : అరటి ఆకుల ఈనెల వెంట తెల్లని చారలు మొదలై ఆకులు పాలిపోతాయి. దీని నివారణకు మొక్కకు 10 గ్రాముల చొప్పున జింక్ సలే ్ఫట్ను భూమిలో వేయాలి. 2 గ్రా.జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్ర : బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించాలి. నివారణ మార్గాలు? జ : ఆకులపై ఈనెలు ఉబ్బెత్తుగా తయారై, పెలుసుగా మారతాయి. ఆకులపై నిలువు చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్ మందు కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్ర : అన్నబేధి మందును ఏ ధాతు లోపానికి వాడతారు? జ : ఇనుప ధాతు లోప నివారణకు వాడతారు. మొక్కలో ఇనుప ధాతువు లోపిస్తే లేత ఆకులపై తెలుపు చారలు ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు 5 గ్రాముల అన్నబేధిని లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపిస్తే.. ముదురు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి ఆకులన్నీ తడిసేలా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే లోపించిన పోషకాలు మెరుగుపడతాయి. -
‘ఉద్యానం’.. బహు లాభదాయకం
నిజామాబాద్ వ్యవసాయం : పండ్ల తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ శామ్యూల్ సూచించారు. పండ్ల తోటల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధి పథకాల గురించి ఆయన వివరిం చారు. తోటల పెంపకంపై ఆసక్తిగల రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మామిడి మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చులో 40 శాతం రాయితీ ఇస్తోంది. మూడేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ రూ. 6,560కి(ఎకరానికి) మించకుండా లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీకి అర్హుడు. రైతులు తోటకు ఉపయోగించిన మందులు తదితర వివరాలతో ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే రాయితీ మొత్తాన్ని ఆ రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అరటి అరటి సాగుకు సైతం 40 శాతం రాయితీ లభిస్తుంది. ఎకరం విస్తీర్ణంలో మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందులకు రెండేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం(రూ. 16,394 మించకుండా) రాయితీ మొత్తాన్ని సదరు రైతు ఖాతాలో జమ చేస్తారు. బొప్పాయి బొప్పాయికి 40 శాతం (గరిష్టంగా రూ. 9,865) రాయితీ లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీ పొందడానికి అర్హుడు. మామిడి తోటల పునరుద్ధరణ రోగాల బారిన పడిన లేదా కాతకాయనటువంటి పాత మామిడి తోటలను పునరుద్ధరించడానికి సైతం ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు లో 50 శాతం (ఎకరానికి రూ. 6 వేలు) రాయితీ ఇస్తారు. బంతిపూలు సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ (గరిష్టంగా ఎకరానికి రూ.4 వేలు) ఇస్తారు. -
‘ఉద్యానా’న్ని కాపాడుకోండి..
ఖమ్మం వ్యవసాయం: వరదలు, వర్షాల కారణంగా తోటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు- 1 జినుగు మరియన్న తెలిపారు. జిల్లాలో గోదావరి వరదలు, వర్షాల కారణంగా తెగుళ్లు సోకే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. మిర్చి: భద్రాచలం ఏజెన్సీలోని భూములు మిర్చి సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. భద్రాచలం, వెంకటాపురం, చర్ల, కూనవరం, కుక్కునూరు, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, అశ్వాపురం, వేలేరుపాడు తదితర మండలాల్లో ఎక్కువగా మిర్చి చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని మిర్చి తొలిదశలో ఉంది. ముందుగా వేసిన మిర్చి కొమ్మల దశలో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో మొక్క దశలో ఉంది. మిర్చిలో ఆకుమచ్చ తెగులు: నీటి వలయాలతో కూడిన మచ్చలు ఆకులపై ఏర్పడి క్రమంగా ఆకులు మొత్తం అల్లుకొని ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ 1 గ్రాము టైప్రోసైక్లిన్ మందులను లీటరు నీటిలో కలిపి తెగులు ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కొమ్మ ఎండు తెగులు: ప్రస్తుత వాతావరణంలో కొమ్మ, రెమ్మలపై నీటిలో నానిన విధంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తెగులు ఆశించిన భాగాలు కుళ్లి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాబ్రియోటప్ లేదా 1 మి.లీ ప్రాపికోనొజోల్ లేదా అర మి.లీ డైపిన్కోనోజోల్లను పిచికారీ చేయాలి. ఎండు తెగులు: నీరు నిలిచిన దగ్గర ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది చెట్టు ఏ దశలోనైనా ఈ తెగులు సోకితే నిలువునా ఎండిపోతుంది. అన్ని భాగాలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, కణజాలం దెబ్బతిని ఎదుగుదల ఉండక పూర్తిగా ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల బ్లైటాక్స్ మందును చెట్ల వేర్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి. మామిడిలో ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం కలదు. ఆకులపై త్రిభుజాకారంలో చెదురు మొదురుగా మచ్చలు ఏర్పడి..మొత్తం వ్యాపించి పత్రహరితం కోల్పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల సాఫ్ మందును కలిపి పిచికారీ చేయాలి. జామలో ఎండు తెగులు: వేరుపై తెగులు ప్రారంభమైన కొద్దికాలంలోనే ఆకులు పసుపుపచ్చ రంగుకు మారతాయి. కొమ్మలు పై నుంచి కిందకు ఎండుతాయి. ఎక్కువగా చెట్టుకింది భా గం కొమ్మలు ఎండుతాయి. ఆకులు వడలిపోయి..రాలిపోతాయి. చె ట్టు కూడా మోడువారుతుంది. ఈ తెగులు తీవ్రతను తగ్గించేందుకు వర్షపునీరు, వరద నీటిని మొక్కల మొదళ్లలో నిల్వ ఉండకుండా చూడాలి. మొక్కకు కిలో చొప్పున సు న్నం, లేదా జిప్సం, పచ్చిరొట్ట ఎరువు లేదా పశువుల ఎరువును వేసుకోవాలి. మొదళ్లలో కార్బండిజమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి తడపాలి. తె గులుతో ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా తొలగించాలి. చెట్టు చుట్టూ 1-1 1/2 మీటర్ల లో తు వరకు తవ్వి 2 శాతం ఫార్మాలిన్ ద్రావణంతో గుంతను తడపాలి. 14 రోజుల తర్వాత ఎండుటాకులను గుంతలో వేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత కొత్త మొక్కలను నాటుకోవాలి. ఆంత్రక్నోన్ లేదా క్షీణింపు, కాయకుళ్లు చెట్టుపై నుంచి రెమ్మలు, కొమ్మలు ఎండిపోతాయి. పూర్తిగా మాగిన పం డ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి. ఈ మచ్చలు మధ్యభాగం గులాబీ రంగును కలిగి ఉం టాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుళ్లిపోతాయి. దీని నివారణకు ఎండిన రెమ్మలను, కొమ్మలను కత్తిరించి కుళ్లిన పండ్లను తొలగించి, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నిమ్మలో గజ్జి తెగులు: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై, కొమ్మలపై ఆఖరికి కాయలపై ఒక రకమైన పుం డ్లు, మచ్చలు ఏర్పడి, నష్టాన్ని కలిగిస్తాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బైటాక్స్, 5 గ్రాముల ప్లాంటామైసిన్ కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు బ్యాక్టీరియా వలన, శిలీంధ్రం వలన కలుగును. బ్యాక్టీరియా వల్ల అనగా కొమ్మ పంగలపై స్పష్టమైన బ్యాక్టీరియా వలన జిగురు ఏర్పడి కొమ్మలు పెరుగుదలను నిరోధిస్తుంది. కొమ్మల పెరుగుదలకు 10 లీటర్ల నీటిని 30 గ్రాముల బైటాక్స్, 5 గ్రాముల ప్లాంటామైసిన్ పిచికారీ చేయాలి. అలాగే శీలింధ్రం వలన ఎండుతెగులు సోకినట్లయితే మొదళ్ల వద్ద, ప్రధాన వేర్ల వద్ద జిగురు కారి చెట్లు చనిపోతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి రిడోమిల్ ఎం.జడ్.20 మిల్లీలీటర్లు లేదా 30 గ్రాముల బైటాక్స్ కలిపి పాదులో తేమ ఉన్నప్పుడు పోయాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న తోటల్లో కాల్వలు ఏర్పాటు చేసి ప్రధానంగా మురుగు నీటిని పొలాల నుంచి తొలిగించే చర్యలు చేపట్టాలి. -
పందిరి వేద్దాం..పాకిద్దాం..
ఖమ్మం వ్యవసాయం: ఉద్యానశాఖ ద్వారా రాయితీ పొంది జిల్లాలో 135 ఎకరాల్లో శాశ్విత పందిర్లపై తీగజాతి కూర పంటలను సాగు చేస్తున్నారు. శాశ్విత పందిరిపై బీర సంవత్సరానికి మూడుసార్లు, కాకర, సొర రెండు సార్లు, బోడ కాకర ఒక పంటను తీసుకునే వెసులుబాటు ఉంది. శాశ్విత పందిర్లతో తీగజాతి సాగు ద్వారా ఎకరాకు రూ.2.50 లక్షల ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. శాశ్విత పందిర్లతో కూడిన కూరగాయ పంటల్లో పాటించాల్సిన మెళకువలు తెలుసుకుద్దాం... రకాలు: కాకర: యూఎస్- 6214, యూఎస్- 33, మహికోగ్రీన్, వినయ్, ఉజాల, పీహెచ్బీ, పునమ్ సొర: మహికో వరద్, రవీనా, యూఎస్-161, శ్రామిక్, కావేరి బీర: సురేఖ, నిశాంత్, సానియా-4, యూఎస్-134, సరిత దొండ, పొట్ల, బోడ కాకర లోకల్ రకాలు వాతావరణం: వేడి వాతావరణం అనుకూలం. నేలలు: నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం. విత్తనం విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవటానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో పాదులకు పొలం అంతట నీటిపారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావున్న కొమ్మలు నాలుగు కణుపులున్నవి రెండు చొప్పున నాటుకోవాలి. వర్షాధారంతో కూడిన అన్ని తీగజాతి కూర పంటలను 15ఁ10 సెం.మీ కొలతలున్న పాలిథిన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తరువాత అదను చూసి నాటుకోవాలి. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్, ఐదు గ్రాముల ఇమడాక్లోప్రిడ్తో ఒకదాని తరువాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు: విత్తేముందు ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. 32-40 నత్రజనినిచ్చే ఎరువును రెండు సమభాగాలుగా చేసి విత్తిన 25-30 రోజులు అంటే పూత, పిందే దశలో వేయాలి. కలుపు నివారణ: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. రెండు, మూడు తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పిండిమిథాలిన్ 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి. ఆడపువ్వుల నిష్పత్తి పెంచుట: మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి పిచికారీ చేస్తే ఆడపువ్వుల నిష్పత్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం: బిందు సేద్యం ద్వారా నీరు పారించటం మంచింది. సస్యరక్షణ: పెంకు పురుగులు: పిల్ల పురుగులు పెరుగుద ల దశలో ఉన్న ఆకులు, పూలను కొరికి తిం టాయి. దీని నివారణకు మూడు గ్రాముల కార్బొరిల్ లేదా రెండు మి.లీ మలాథీన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొట్ల ఆకు పురుగు: గొంగళి పురుగులు ఆకు లు, పూలను తింటాయి. నివారణకు 2.5 మి.లీ క్లోరీఫైరీఫాస్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ: పూత దశలో తల్లి ఈగలు పూలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పరుగులు పిందెలలో చేరి తీవ్రంగా నష్టపరుస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ మలాథీన్ను పూతదశలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెగుళ్లు ఆకుమచ్చ : ఆకులపై ఆకుపచ్చ, ముదురాకుప చ్చ కలిసి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. ఆకుపై భాగంలో పసుపు రంగు, కింద ఊదా రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు గ్రాముల సాఫ్ లేదా మెటాక్సిల్ యంజెడ్ రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు: దీనినే ఎండు తెగులు అంటారు. ఈ తెగులు సోకితే తీగలు వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల బ్లైటాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో 250 కిలోల వేప పిండిని వేయాలి. ట్రైకోడెర్మా విరిడీ కల్చర్‌ను భూమిలో వేయాలి. బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి పొడి కప్పబడి ఉంటుంది. పోడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత ఎక్కువ. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల గంధకం పొడి, లేదా ఒక మి.లీ డైనోకాప్ లేదా రెండు మి.లీ హెక్సాకోనోజోల్ కలిపి పిచికారీ చేయాలి. శంకు/పల్లాకు తెగులు: ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారుతాయి. ఈ తెగులును గుర్తించి వెంటనే కాల్చి వేయాలి. నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ పిచికారీ చేయాలి. గమనిక: పొట్టదశలో రెండు రోజుల పిందెకు చివర చిన్న రాయిని పురికోసతో కట్టాలి. లేకుంటే కాయలు మెలితిరుగుతాయి. -
‘ఉద్యానవనం’.. ఉద్యోగులు శూన్యం!
మోర్తాడ్ : జిల్లాలో ఉద్యానవన శాఖలోని ఖాళీలను, ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే పాలకుల హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉండిపోనున్నాయని స్పష్టమవుతుంది. జిల్లాలో 36 మండలాలు ఉండగా, కేవలం ఏడుగురు ఉద్యానవన శాఖాధికారులతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులందరికీ ఉ ద్యానవన శాఖ పథకాలు అందడం లేదని వెల్లడవుతోంది. జిల్లా అంతటికీ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ఒకటి , నాలుగు ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌లో ఏడీఏ పోస్టు ఉంది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలలో ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి అధికారి బదిలీ కాగా, ఇంతవరకు భర్తీ కాలేదు. ఆ ర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో మాత్రం ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు మూడు ఉన్నాయి. ఖాళీలతో లక్ష్యాలు చేరేనా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడటం, పం టలకు గిట్టుబాటు ధరలు అంతగా లేకపోవడం తో చాలామంది రైతులు ఉద్యానవనాల పెం పుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ సంవత్సరం వంద హెక్టార్లలో పం డ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఉద్యోగులు తక్కువగా ఉండటంతో పండ్ల తోటల పెంపకం 50 శాతం కూడా సాగయ్యే సూచనలు కనిపించడం లేదు. మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ, బత్తాయి, జామ, నిమ్మ తదితర పండ్లతోటలను పెంచడంతో పాటు రైతులకు కూరగాయల విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో అందించడం ఉద్యానవన శాఖ విధి. పండ్ల తోటల పెంపకంతో పాటు వ్యవసాయ పరికరాలు, పసుపు రైతులకు తగిన సూచనలు సలహాలు, పని ముట్లను ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నారు. పైరవీలు చేస్తేనే పనులు జిల్లాల్లో 36 మండలాలకు కేవలం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఒక ఉద్యానవన అధికారితోపాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డు కన్సల్టెంట్లు ఉంటేనే రైతులకు పరిపూర్ణంగా సేవలు అందుతాయి. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ శాఖ ద్వారా అందించే పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పైరవీలు చేసిన వారికి మాత్రమే ఉద్యానవన పథకాల లబ్ధి చేకూరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖ ప్రయోజనాలు అందాలంటే ఉద్యోగుల సంఖ్యను త్వరితగతిన పెంచాల్సిన అవసర ముందని పలువురు సూచిస్తున్నారు. -
ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
విజయనగరం మున్సిపాలిటీ : ఆయిల్ పామ్ తోటల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. రైతులకు రాయితీపై మొక్కలు పంపిణీ చేయనున్నారు. 2014-15లో 12 వందల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలు పెంపకం లక్ష్యంగా ఉద్యాన శాఖ నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ తోటల అభివృద్ధి పథకం ద్వారా హెక్టారురకు స్వదేశీ రకపు మొక్కలతో నాలుగేళ్లకు రూ 22 వేల రాయితీ అందజేస్తారు. మొక్కలతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం నిమిత్తం ఎరువులకు మొదటి సంవత్సరానికి రూ.8 వేలు, రెండో సంవత్సరానికి రూ.3,500, మూడో సంవత్సరానికి రూ.4,500 నాలుగో సంవత్సరానికి రూ. 6000 అందజేస్తారు. మొదటి సంవత్సరంలో ఒక హెక్టారుకు 143 ఆయిల్ పామ్ మొక్కలు వేయాలి. మొక్క ఒక్కంటికి రూ.55 చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. ఒక మొక్క ఖరీదు రూ.60, ఇందులో రైతు వాటా కింద రూ.5 చెల్లించి నర్సరీల నుంచి పొందవచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా ఒక రైతుకు 15 హెక్టార్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. అంతర పంటలపై రాయితీ ఆయిల్‌పామ్ తోటల్లో అంతరపంటలుగా అరటి , కూరగాయాలు, కంద, కోకో , నిమ్మగడ్డి తదితర పంటలను సాగు చేసుకునేందుకు 50 శాతం రాయితీతో గరిష్ఠంగా రూ.3 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. మొక్కలు కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలు రైతులు ఆయిల్‌పామ్ మొక్కలను ప్రభుత్వం గుర్తించిన సంస్థల యందు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాధిక వెజిటల్ కంపెనీ నర్సరీ (గరివిడి), 3ఎఫ్ కంపెనీ (ఎర్నగూడెం-పశ్చిమగోదావరి జిల్లా), లక్ష్మీబాలాజీ కంపెనీ నర్సరీ (పార్వతీపురం)లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రవాణా ఖర్చు రైతులు భరించుకోవాలి. సాధారణంగా ఆయిల్‌పామ్ మొక్క ఖరీదు రూ.55 కాగా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5లకు అందజేస్తుంది. ఉద్యానశాఖ అధికారులు సంబంధిత ైరె తు భూమికి నీటి వసతి, తోటల పెంపకానికి అనుకూలమైంది, లేనిది పరిశీలించిన అనంతరం మొక్కలు పంపిణీ చేస్తారు. మొక్కలు పంపిణీ చేసే సమయంలో సదరు రైతు దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం నకలు, పాస్‌పోర్టు సైజు ఫోటో, రేషన్ కార్డు నకలు ఉద్యాన శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని ఉద్యాన సహాయ సంచాలకులు పిఎల్ ప్రసాద్ తెలిపారు. -
అంచన... అంతా వంచన
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం మళ్లీ బీభత్సం సృష్టించింది. అన్నదాతల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. శుక్రవారం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి, తెర్పాల్, మునిదేవులపల్లి, ఎదురుగూడెం, హరిదాస్పూర్ గ్రామాల్లో గోదుమ, పసుపు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. ఇక మనూరు మండలంలోని పలు గ్రామాల్లో కంది, శనగ, ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. కానీ, జిల్లా వ్యవసాయ శాఖ శనివారం ప్రభుత్వానికి పంపించిన ప్రాథమిక అంచనా నివేదికలో మాత్రం కేవలం కల్హేర్, చేగుంట మండలాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. కొండాపూర్, మనూరు తదితర మండలాల్లో సంభవించిన పంటనష్టంపై ఈ నివేదికలో ప్రస్థావనే లేదు. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నష్టం లేదని సమాచారాన్ని ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వర్షపాతం 14.2 మి.మీటర్లు శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఈ దురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిం ది. జిల్లా సగటు వర్షపాతం 14.2 మి.మీటర్లు నమోదైంది. చేగుంట మండలంలో 35.4 మి.మీటర్లు, కల్హేర్ మండలంలో 22.2 మి.మీటర్ల వర్షం కురిసింది. పంట నష్టం 350 హెక్టార్లే ! జిల్లాలో 350.8 హెక్టార్ల రబీ పంటలు వర్షార్పణమైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపించింది. ఒక్క కల్హేర్ మండలంలోనే 326.8 హెక్టార్లు, చేగుంట మండలంలో 28 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. కల్హేర్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 320 హెక్టార్లలో మొక్కజొన్న, 4 హెక్టార్లలో గోదుమలు, 2.8 హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. చేగుంట మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో 20 హెక్టార్ల మొక్కజొన్న, 4 హెక్టార్ల వేరుశనగ, మరో 4 హెక్టార్లలో పొద్దు తిరుగు డు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక పంపింది. కానీ వాస్తవంగా పంటనష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని మండలాల్లో మామిడి తదితర పండ్ల తోటలు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతున్నా, ఉద్యానశాఖ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపించలేదు. -
ఆశలు రేపుతున్న ఆయిల్‌పామ్
=మెట్ట భూములకు లాభదాయకం =ఆసక్తి చూపుతున్న రైతులు =మూడు వేల ఎకరాలకు విస్తరించిన సాగు మాడుగుల, న్యూస్‌లైన్: వరి, చెరకు పంటల సాగుకు సమతల భూములుండాలి. కొండ పరీవాహక ప్రాంతాల్లో భూములు సాధారణంగా ఎగుడు దిగుడుతో ఏటవాలుగా ఉం టాయి. వీటిలో వరి, చెరకు పంటల సాగుకు వీలు కాదు. ఈ భూముల్లో ఒకప్పుడు గిరి రైతులు జొన్నలు, చోళ్లు తదితర పంటలతో అరకొర ఆదాయం పొందేవారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని మెట్ట భూముల రైతులు అందిపుచ్చుకున్నారు. గతంలో ఎకరాకు రూ. 1500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయాన్ని చూసిన వారు ఇప్పుడు ఏకంగా రూ.40 నుం చి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి పెట్టుబడితో పాటు రుణం లభించడం రైతులను మరింత ఆకట్టుకుంటోంది. ఐదెకరాల మెట్ట భూమి ఉన్న రైతులు ఆ పొలంలో బోరు తవ్వించుకుంటే ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ తోట ల పెంపకానికి హెక్టారుకు రూ.35 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. ఏపీఎంఐసీ అధికారులు ఈ మొక్కలకు 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సిష్టంను ఏర్పాటు చేస్తున్నారు. రైతు కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టగలిగితే ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ఏకదాటిగా శాశ్వత ఆదాయం వస్తుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంతో పాటు మంచి లాభాలు వస్తుండడంతో మాడుగుల మండలంలో సుమారు మూడు వేల ఎకరాలలో అయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. మొక్కలు నాటాక కొద్ది రోజుల సంరక్షణ అనంతరం అదే భూముల్లో అంతర పంటగా వంగ, బెండ, కంద వంటివి సాగు చేసుకోవచ్చని, దీని వల్ల ఏడాదికి గరిష్టంగా రూ.30 వేల ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుబాటులో మిల్లులు గతంలో పామాయిల్ మిల్లులు అందుబాటు లో లేక రైతులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మాడుగుల మండలంలో మూడు మిల్లులు ఏర్పాటు చేశారు. గెలలు కోసిన నాలుగైదు గంటలలో మిల్లులకు తరలిస్తున్నారు. ఏటా పెట్టుబడి లేకుండా, పెద్దగా కూలీల అవసరం లేకుండా ఆదాయం వస్తుందని రైతులు సక్కింటి రాంబాబు, డి.రాములు తెలిపారు. ఇతర రాష్ట్రాలలోకు ఎగుమతి ఇక్కడ మిల్లుల్లో తయారయ్యే పామాయిల్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండలంలో ఆయిల్‌పామ్ తోటలు, మిల్లుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారుల అంచనా. మంచి లాభాలు ఆయిల్‌పామ్ సాగుతో ఏటా మంచి లాభాలు వస్తున్నాయి. ప్రస్తుతం కూలీలు లభించకపోవడంతో వ్యవసాయం చేయలేక పోతున్నాం. పెద్దగా పెట్టుబడి, కూలీ లు అవసరం లేకపోవడంతో ఆయిల్‌పామ్ తోటలపై ఆసక్తి చూపించాము. - సురేష్ కుమార్, రైతు, కృష్ణంపాలెం పెద్ద మొత్తంలో రాయితీలు ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. ఐదు నుంచి పదెకరాల్లో సాగు చేసుకునే వారికి 75 శాతం రాయితీ వస్తోంది. రైతులు తమ భూమిలో బోరు నిర్మించుకుని ఉద్యాన వన శాఖాధికారులను సంప్రదిస్తే ఆయిల్‌పామ్ తోటల సాగుకు సహకారం అందిస్తారు. - పి.శ్రీనివాసరావు, ఫీల్డ్ సూపర్వైజర్