నివారణ చర్యల పై పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తన్న శాస్త్రవేత్తలు
సాక్షి, అమరావతి: మిరప పంటపై తామర పురుగు దాడి చేయడంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో వారికి బాసటగా నిలిచేలా.. పంటను సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకే సిబ్బందిని రంగంలోకి దించింది. ఖరీఫ్‌లో మిరప సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది అనూహ్యంగా 4.75 లక్షల ఎకరాల్లో రైతులు మిరప వేశారు. గడచిన రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మిరప ధర క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి 15 వేల వరకు పలికింది. దీంతో పత్తి, వేరుశనగ రైతులు మిరప సాగువైపు మళ్లారు.
పూత, పిందెల్ని పీల్చేస్తున్నాయ్
ప్రస్తుతం 60 శాతం పంట ఏపుగా ఎదిగే దశలో, 25 శాతం పూత దశలో, 10–15 శాతం పిందె దశలో ఉంది. ముదురు–నలుపు రంగులో ఉండే కొత్త రకం తామర పురుగులు మిర్చి పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చేస్తూ పంటను నాశనం చేస్తున్నాయి. 10–15 రోజుల్లో గుడ్డు నుంచి తల్లి దశకు చేరుకునే ఈ పురుగు తన 35 రోజుల జీవిత కాలంలో 150 నుంచి 300 గుడ్లు పెడుతుంది. వీటి నివారణ కోసం రైతులు పెద్దఎత్తున పురుగు మందులు వాడుతున్నా ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం ఇప్పటికే 1.50 లక్షల ఎకరాల్లో పంటపై ఈ పురుగు వ్యాపించినట్టు అంచనా.
రంగంలోకి శాస్త్రవేత్తల బృందాలు
తామర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తోంది. నివారణ చర్యలపై ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. ఆడియో, వీడియో సందేశాలను వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తోంది. తాజాగా ఉద్యాన వర్సిటీ శాస్తవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. మిరప ఎక్కువగా సాగయ్యే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిధిలోని 1,580 ఆర్బీకేల పరిధిలో ప్రచార జాతాలు సైతం మొదలయ్యాయి. అవసరమైన మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నారు.
నివారణ ఇలా
తామర పురుగు నలుపు, ముదురు గోధుమ రంగుల్లో కండె ఆకారంలో కోడి పేను లక్షణం కలిగి ఉంటుందని ఉద్యాన పరిశోధన కేంద్రం (లాం) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.శారద తెలిపారు. ఆశించిన వారం పది రోజుల్లోనే పంటను పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. వీటి నివారణకు ఆమె ఈ దిగువ సూచనలు చేశారు.
► తామర పురుగు సోకిన మిరప చేలపై ప్రతి నాలుగైదు రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయాలి. ఇది గుడ్లను పొదగనివ్వదు. పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వేప నూనె చేదు వల్ల ఆహారం తీసుకోలేక చనిపోతాయి.
► పొలంలో 25నుంచి 30 వరకు నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకుంటే పురుగు వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు.
► పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే పెగాసిస్ 1.25 గ్రాములు లేదా ఇంట్రీప్రిడ్ 2 ఎం.ఎల్. లేదా ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. వేపనూనె (10 వేల పీ.పీ.ఎం)తో కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి.
► అదేవిధంగా రెండు కేజీల పచ్చి మిరప, 500 గ్రాముల వెల్లుల్లిని కలిపి రుబ్బగా వచ్చిన పచ్చడిని ఒక గుడ్డలో చుట్టి 10 లీటర్ల నీటిలో ఉంచి, కషాయం దిగిన తరువాత వడకట్టి 1:10 పద్ధతిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
► రోజు మార్చి రోజు పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి.
► పొలంలో అక్కడక్కడా పొద్దు తిరుగుడు మొక్కలను ఆకర్షక పంటగా నాటాలి.
► విచక్షణా రహితంగా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి.
నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు
తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నెలాఖరు వరకు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. క్షేత్ర స్థాయి పరిశీలన కోసం శాస్త్రవేత్తల బృందాలను పంపించాం. సామూహిక నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ
Comments
Please login to add a commentAdd a comment