అప్పట్లో ‘కొనుగోళ్లు’ కతలెన్నో! ధాన్యం కొనుగోళ్లు అంతా రికార్డుల్లోనే.. | Fake Records Of Grain purchases under TDP rule | Sakshi
Sakshi News home page

అప్పట్లో ‘కొనుగోళ్లు’ కతలెన్నో! ధాన్యం కొనుగోళ్లు అంతా రికార్డుల్లోనే..

Published Wed, May 10 2023 4:36 AM | Last Updated on Wed, May 10 2023 8:28 AM

Fake Records Of Grain purchases under TDP rule - Sakshi

2015లో ధాన్యం కొనుగోలు అక్రమాలపై నాడు సాక్షిలో వచ్చిన కథనం (ఫైల్‌ ఫోటో)

సాక్షి అమలాపురం: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీతులు వల్లిస్తుండడంపై అన్నదాతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అప్పట్లో రైతులకు కావల్సిన కనీస అవసరాలేవీ అమలులో లేవు. రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే)గానీ, ఈ–క్రాప్‌ విధానం కానీ, మద్దతు ధర కానీ వీటి గురించి చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు. ఇవేకాదు.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం అన్న ఊసు కూడా ఎక్కడాలేదు. పైగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి స్థానిక రైతుల పేరు మీద చూపించి అడ్డుగోలుగా దోపిడీ చేశారు.

మిల్లులు అధికంగా ఉన్నచోట ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ దోపిడీ తతంగాన్ని నడిపారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పల్లెపల్లెలో ఆర్బీకేలను ఏర్పాటుచేసి రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు అక్కడ నుంచే కల్పించడం, ఈ–క్రాప్‌ విధానం ప్రవేశపెట్టడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం చేస్తుంటే అన్యాయం, ఘోరం జరిగిపోయిందని టీడీపీ వెర్రెక్కిపోతూ గుండెలు బాదుకుంటోంది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కొనుగోళ్ల తీరుతెన్నులు ఎలా ఉండేవంటే..

టీడీపీ హయాంలో ఇలా..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2014 నుంచి 2019 వరకు వరి ధాన్యం కొనుగోళ్లు తీసుకుంటే రైతులు ఎంతో నష్టపోయారు. ఉదాహరణకు..
► 2015లో ఖరీఫ్‌ దిగుబడి 12 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులలోపు మాత్రమే. అంటే దిగుబడిలో మూడోవంతే. కొనుగోళ్లలో 90 శాతం రికార్డుల్లోనే. కొన్నది లేదు సరికదా.. రికార్డుల్లో చూపినదంతా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దొడ్డిదారిన తెచ్చిన ధాన్యం. 

► అలాగే.. స్థానికంగా తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో ధాన్యం పండించిన చోట ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కన్నా, మిల్లులు ఎక్కువగా ఉన్న బిక్కవోలు, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అనపర్తి, రాయవరం వంటి కేంద్రాల్లో కొనుగోళ్లు అధికంగా ఉండడానికి కారణం ఈ దొడ్డిదారి వ్యవహారమే. 

► అప్పట్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1,057 ఉండేది. కానీ,  కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసే అవకాశంలేక రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. 

► వీరి ధాన్యాన్ని తేమ, నూకలు, తాలూ తప్పల పేరుతో క్వింటాల్‌ ధాన్యాన్ని రూ.600ల నుంచి రూ.800లు చొప్పున కొనుగోలు చేయడంవల్ల రైతులు ఎంతగానో నష్టపోయారు. 

► వీటిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,057 పొందేవారు. 

► కొనుగోలు లేకున్నా కొన్నామని చూపించడం ద్వారా కేంద్రాల నిర్వాహకులు  సైతం ప్రభుత్వం నుంచి క్వింటాల్‌కు రూ.32 కమీషన్‌ రూపంలో నొక్కేసేవారు. 

► రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను, కూలీ ఖర్చులను కూడా స్వాహా చేసేవారు. 

► అంతేకాక.. అప్పట్లో ఈ–క్రాప్‌ లేనందున ఇష్టా­నుసారం బుక్‌ ఎంట్రీ చేసే వీలు ఉండేది. మిల్లర్లు ధాన్యం బహిరంగంగా కొనుగోలు చేసినా కొనుగోలు కేంద్రాల్లో తమకు తెలిసిన రైతుల చిరునామాలను, సర్వే నెంబర్లు మీద ధాన్యం కొనుగోలుగా చూపించేవారు. అప్పట్లో వీటిల్లో టీడీపీ నేతల హవా ఉండడంతో దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. 
2015లో ధాన్యం కొనుగోలు అక్రమాలపై నాడు సాక్షిలో వచ్చిన కథనం (ఫైల్‌ ఫోటో)   

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
టీడీపీ హాయాంలో జరిగిన విధానంలో ధాన్యం కొనుగోళ్ల తీరుతో రైతులు నష్టపోతున్న విషయాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ గుర్తించారు. తన ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా క్షేత్రస్థాయిలో నేరుగా ధాన్యం సేకరణ సమర్ధవంతంగా జరుగుతోంది. 

ఎలాగంటే..
► రైతులకు అడుగడుగునా అండగా నిలిచే రైతుభరోసా కేంద్రాలు ఊరూరా వెలిశాయి.

► ఈ–క్రాప్‌ విధానంవల్ల దిగుబడిపై పక్కాగా లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తప్పుడు రికార్డులు సృష్టించే అవకాశమేలేదు. 

► క్షేత్రస్థాయిలో కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంవల్ల రైతుకు కనీస మద్దతు ధరకు ఢోకా లేకుండా పోయింది. 

► చివరకు మిల్లుల వద్ద రైతులకు సమస్యలు రాకుండా కస్టోడియన్‌ అధికారులను ఏర్పాటుచేశారు. 

► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత రబీలోనే కాదు.. గత ఖరీఫ్‌లో సైతం రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. 

► ఉమ్మడి ‘తూర్పు’లో 7.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 7.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే.. 97.84 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో రూ.6.51 కోట్లు సైతం చెల్లించడం విశేషం. 

► ఇక ప్రస్తుత రబీ విషయానికొస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. 

► ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికెళ్లి పరిష్కరిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై నిరంతర సమీక్ష చేస్తున్నారు. 

► అయినప్పటికీ టీడీపీ నేతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగడం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. 
ఈ నెల 6వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో తడిచిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ఎగుమతి చేస్తున్న దృశ్యం 

నాటి విధానంతో నష్టమనే మార్పులు..
టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు విధానంవల్ల రైతులు నష్టపోయారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై సమీక్ష జరుపుతున్నారు. సమస్యలను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్షాలు, దళారులు, ఒక వర్గం మీడియా చేస్తున్న రాజకీయాలవల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదనే విష ప్రచారంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 
– జిన్నూరి రామారావు (బాబీ), ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు, అల్లవరం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement