AP: ఇక రైతులే డ్రోన్‌ పైలట్లు  | Farmers are drone pilots Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: ఇక రైతులే డ్రోన్‌ పైలట్లు 

Published Sun, Nov 27 2022 6:20 AM | Last Updated on Sun, Nov 27 2022 2:42 PM

Farmers are drone pilots Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల్లో కిసాన్‌ డ్రోన్స్‌ (డ్రోన్స్‌ అండ్‌ సెన్సార్‌ టెక్నాలజీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్బీకేలకు కేటాయించే డ్రోన్లను రైతులే నడిపేలా.. రైతు గ్రూపుల్లో డ్రోన్‌ పైలట్‌గా ఎంపిక చేసిన వారికి ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణకు శ్రీకారం చుడుతోంది. మండలానికి 3 చొప్పున తొలి దశలో 2 వేల ఆర్బీకేల్లో కిసాన్‌ డ్రోన్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా.. తొలిదశలో 1,961 ఆర్బీకేలను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 738 ఆర్బీకేల పరిధిలో ఐదుగురు సభ్యులతో రైతు గ్రూపులను ఏర్పాటు చేశారు. మిగిలిన ఆర్బీకేల పరిధిలో డిసెంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

డీజీసీఐ నిబంధనల మేరకు శిక్షణ 
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఐ) నిబంధనల మేరకు వ్యవసాయ డ్రోన్‌ పైలట్‌గా శిక్షణ పొందాలంటే 18–65 ఏళ్ల వయసు కలిగి, వ్యవసాయ డిప్లొమా లేదా వ్యవసాయ ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా కనీసం ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో విధిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలి. రైతు గ్రూపుల్లో ఈ అర్హతలు కలిగిన వారిని డ్రోన్‌ పైలట్లుగా ఎంపిక చేశారు.

ఇటీవలే వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్‌ పైలట్‌ శిక్షణ ఇచ్చేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిమోట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ కోర్సు (ఆర్పీటీసీ)కు డీజీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి బ్యాచ్‌కు 20 మంది చొప్పున 12 రోజులపాటు రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎన్జీ రంగా వర్సిటీ ప్రత్యేక పాఠ్యప్రణాళికను తయారు చేసింది. 10 ప్రధాన పంటల సాగులో డ్రోన్ల వినియోగంపై విధివిధానాలను రూపొందించింది.

4 రోజులపాటు క్లాస్‌ రూమ్‌ సెషన్స్, రెండ్రోజుల పాటు అనుకరణ, అసెంబ్లింగ్, మరమ్మతు, నిర్వహణలపై శిక్షణ ఇస్తారు. 6 రోజులపాటు ఫీల్డ్‌లో డ్రోన్‌ నిర్వహణపై ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. శిక్షణకు ఇద్దరు టెక్నికల్, ఐదుగురు ఫీల్డ్‌ ఫ్యాకల్టీని సిద్ధం చేశారు. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ.17 వేలు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. శిక్షణ అనంతరం ఆయా రైతులకు డీజీసీఐ ద్రువీకరణతో కూడిన సర్టిఫికెట్‌ కూడా అందజేయనున్నారు. 

మార్చిలోగా తొలిదశ కిసాన్‌ డ్రోన్లు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకే స్థాయిలో సాధ్యమైనంత త్వరగా కిసాన్‌ డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం.  50 శాతం గ్రూపుల ఎంపిక పూర్తయింది. మిగిలిన గ్రూపుల ఎంపిక సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. ఎంపిక చేసిన రైతులకు ఈ నెల 28 నుంచి ఏపీ ఎన్జీ రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో డ్రోన్‌ పైలట్‌ శిక్షణకు శ్రీకారం చుడుతున్నాం. మార్చిలోగా తొలి దశలో నిర్దేశించిన 2వేల ఆర్బీకేల్లో కిసాన్‌ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.     
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయశాఖ

దశల వారీగా శిక్షణ 
వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే డీజీసీఐ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కిసాన్‌ డ్రోన్స్‌ కోసం ఎంపిక  చేసిన రైతులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నాం. బ్యాచ్‌కు 20 మంది చొప్పున దశల వారీగా 2వేల మందికి శిక్షణ ఇస్తాం.     
– డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement