సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్ విశేష ఆదరణతో దూసుకుపోతోంది. రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది.
శాస్త్రవేత్తలతో సందేహాల నివృత్తి..
ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్ సెంటర్)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు.
ఈ చానల్ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ చానల్ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్‌షిప్ లభించింది. రైతులు ఈ చానల్ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్‌ను కూడా సాధించింది.
అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి
ఆర్బీకే చానల్ అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది. నీతి ఆయోగ్, ఐసీఏఆర్ తదితర జాతీయ సంస్థతో పాటు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్‌ఏవో సహా వివిధ దేశాల ప్రముఖులు ఈ చానల్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ చానల్ కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చానల్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది.
అనూహ్య స్పందన..
ఆర్బీకే చానల్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు స్వచ్చందంగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్‌తో పాటు ఆర్బీకేల్లోని డిజిటల్ స్టూడియో ద్వారా ప్రసారాలను వీక్షిస్తున్నారు. శాస్త్రవేత్తలు, అధికారులతో మాట్లాడుతూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
– వల్లూరి శ్రీధర్, జేడీఏ, ఆర్బీకేల ఇన్‌చార్జి
ఎంతో మేలు..
సాగు సమయంలో ఎప్పుడు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ తెగులు నివారణకు ఏం చేయాలనే వాటి గురించి ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలిస్తున్న సూచనలు బాగా ఉపయోగపడుతున్నాయి. పంటల బీమా, రైతు భరోసా, యంత్ర సేవ పరికరాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా ఈ చానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం.
– కొండవీటి కిశోర్, విప్పర్ల రైతు, పల్నాడు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment