80 శాతం సబ్సిడీపై విత్తనాలు | Seeds at 80 percent subsidy in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

80 శాతం సబ్సిడీపై విత్తనాలు

Published Sun, Aug 20 2023 5:26 AM | Last Updated on Sun, Aug 20 2023 5:26 AM

Seeds at 80 percent subsidy in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది. 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను సిద్ధం చేసింది. అధిక వర్షాలతో నారుమడులు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తోంది. అలాగే రాయలసీమలో అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.98.92 కోట్లు ఖర్చు చేస్తోంది.  

5.14 లక్షల క్వింటాళ్లు పంపిణీ 
ఖరీఫ్‌ సీజన్‌లో 89.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సమకూర్చుకుంది. ఇందులో భాగంగా 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసింది. అయితే ఊహించని రీతిలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలైలో కురిసిన వర్షాలతో కాస్త ఊపిరిపీల్చుకున్నప్పటికీ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారాయి.

సీజన్‌లో ఇప్పటివరకు 341.10 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 261.60 మి.మీ. మాత్రమే కురిసింది. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే.. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో 20–59 శాతం మధ్య లోటు వర్షపాతం రికార్డైంది.

మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో సుమారు 132 మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నట్టుగా గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు.  

రైతులు ఇబ్బంది పడకుండా.. 
గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు రాయలసీమలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను అందించారు. ఇలా 2018–19 సీజన్‌లో 63,052 క్వింటాళ్లు, 2019–20 సీజన్‌లో 57,320 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క రైతూ విత్తనం కోసం ఇబ్బందిపడకుండా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో రైతుల కోసం తక్కువ కాలపరిమితి కలిగిన ఎంటీయూ–1121, ఎంటీయూ–1153, బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్‌– 34449, ఎంటీయూ–1010 రకాలకు చెందిన 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు.   

ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ 
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వరి విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాలో 1,221 క్వింటాళ్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 278 క్వింటాళ్లు, ఏలూరు జిల్లాలో 24 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో కూడా అపరాలు, చిరుధాన్యాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 25,750 క్వింటాళ్లు, అనంతపురం జిల్లాలో 14,650 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 11,500 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 6 వేల క్వింటాళ్లు, వైఎస్సార్‌ జిల్లాలో 670 క్వింటాళ్లు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 250 క్వింటాళ్ల చొప్పున ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఉలవలు, అలసందలకు 85–90 రోజులు, కొర్రలకు 80–85 రోజులు, మినుములకు 70–75 రోజులు, పెసలకు 65–75 రోజుల పంట కాలం ఉంటుంది. కాస్త వర్షాలు కురిస్తే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. 

ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు.. 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో నేను 20 ఎకరాల్లో ఎంటీయూ–1318 రకం వరి వేశా. వర్షాలు, వరదలతో నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.8 వేలు నష్టపోయా. ఆర్బీకే ద్వారా ఎంటీయూ 1121 రకం 4.5 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. సబ్సిడీపోనూ రూ.3,402 మాత్రమే చెల్లించాను. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు. గతంలో ఇంత వేగంగా స్పందించిన ప్రభుత్వాలు లేవు.  
– చలమలశెట్టి రామ్మోహన్‌ రావు, మోటూరు, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా  

ప్రభుత్వం ఆదుకుంది 
3.5 ఎకరాలు సొంతంగా, 2 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. ఖరీఫ్‌లో వరి సాగు చేస్తే జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు రూ.7 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఖరీప్‌ సాగుకు దూరంగా ఉండాలని భావించా.

ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై కోరుకున్న విత్తనం ఆర్బీకే ద్వారా అందించి ఆదుకుంది. ఆ విత్తనంతో నాట్లు వేసుకున్నాం. గతంలో ఎప్పుడూ ఇలా అదును దాటక ముందే 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేసిన దాఖలాలు లేవు. సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.   
 – యెరగాని వీరరాఘవులు, దిరుసువల్లి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement