సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సాగునీరు విడుదల చేయడంతో పాటు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఖరీఫ్–2022లో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం అందించడంతో పాటు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. అవసరమైనన్ని ఎరువులు, పురుగు మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచారు. కానీ.. జూన్‌లో రుతు పవనాలు మొహం చాటేయడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయగా.. పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా జోరు పెంచి సార్వా సాగుకు శ్రీకారం చుట్టారు.
సాగుకు ముందే రూ.5,040.43 కోట్ల సాయం
సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్–2022లో పంటలు దెబ్బతిన్న 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. ఆర్బీకేల ద్వారా 5.73 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 5.15 లక్షల టన్నులను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా 1.52 లక్షల టన్నుల వరి, 2.91 లక్షల టన్నుల వేరుశనగ, 39 వేల టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు.
నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 14.15 క్వింటాళ్లు, మిరప 60 కేజీలు, సోయాబీన్ 137 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. సీజన్‌కు 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 14.75 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో ఇప్పటికే 4.59 లక్షల టన్నులు విక్రయించారు. ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1.59 లక్షల టన్నులు నిల్వ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్బీకేల్లో అవసరమైన పురుగుల మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.
23 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
ఖరీఫ్ సాగు లక్ష్యం 89.37 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 39.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 9.62 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 5.12 లక్షల ఎకరాల్లో పత్తి, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.6 లక్షల ఎకరాల్లో అపరాలు, 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, పంటలు వేశారు.
9 ఎకరాల్లో వరి వేశా
9 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ముదురు దశకు చేరుకున్న పంటకు మేలు చేస్తాయి. మా గ్రామంలో పంట బాగానే ఉంది. కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు రెండ్రోజులు తెరిపిస్తే నీరు కిందకు దిగిపోతే నాట్లకు ఇబ్బంది ఉండదు.
– కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
స్వల్పకాలిక రకాలే మేలు
ఈ వర్షాలతో పత్తి, ఆముదం, కంది వంటి పంటలకు ఇబ్బంది ఉండదు. ఇప్పటివరకు నారుమడులు వేయకపోతే మాత్రం బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156, ఎంటీయూ–1010, ఐఆర్–64 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుంటే మేలు. ఉత్తరకోస్తా, కృష్ణాడెల్టాలో వెద పద్ధతిలో సాగు చేసే రైతులు పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి.
– టి.శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా కేంద్రం, మార్టేరు
ఈ సూచనలు పాటిస్తే మేలు
విత్తిన 15 రోజుల్లోపు నారుమడులు, వెదజల్లిన పొలాలు 3 రోజుల కంటే ఎక్కువ నీట మునిగి ఉంటే మొలక శాతం దెబ్బతినకుండా నీరు తీయగలిగితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మొలక దెబ్బతింటే మాత్రం మళ్లీ నారు ఊడ్చుకోవచ్చు లేదా స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు. విత్తిన 15–30 రోజులలోపు ఉన్న పొలాలు 5 రోజుల కంటే ఎక్కువ నీట మునిగితే.. నీరు పూర్తిగా తీసివేసి 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, ఒక కిలో ఎంవోపీ బూస్టర్ డోస్‌గా వేసుకుంటే వారం రోజుల్లో కొత్త ఆకు చిగురిస్తుంది. నారుమడి కుళ్లకుండా లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బన్‌డిజమ్ మందును పిచికారీ చేసుకోవాలి.
– ఎం.గిరిజారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వరి పరిశోధనా కేంద్రం, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment