సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని భూ యజమానులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్‌లో రెండు విడతల సాయం కలిపి పంపిణీ చేయనున్నారు.
ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం
2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ఇటీవల పంపిణీ చేసిన తొలి విడత సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 52,57,263 రైతు కుటుంబాలకు రూ.31 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏటా తొలి విడత సాయం పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్ లాగిన్‌ను తెరుస్తుంటారు.
ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా తొలి ఏడాది (2019–20) 45,11,252 భూ యజమానులు అర్హత పొందగా.. ఆ తర్వాత వరుసగా 2020–21లో 50,04,874 మంది, 2021–22లో 50,66,241 మంది, 2022–23లో 49,26,041 మంది లబ్ధి పొందారు. 2023–24 వ్యవసాయ సీజన్‌లో 50,19,187 మంది భూ యజమానులు లబ్ధి పొందారు.
ఏటా పెరుగుతున్న భూ యజమానులు
ఇలా ఈ నాలుగేళ్లలో 5,07,935 మంది అదనంగా భూ యజమానులు అర్హత పొందారు. ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందిన వారు, తల్లిదండ్రులు మృతిచెందగా వారసత్వంగా భూములు పొందినవారు, అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్న వారు, వివిధ రూపాల్లో మ్యుటేషన్ పొందిన వారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఇప్పటివరకు లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్‌ను ఈ నెల 12నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం తెరిచారు. ఇంకా అర్హత ఉండి అవకాశం వినియోగించుకోని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించటానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కల్గిన భూ యజమానులకు అక్టోబర్‌లో రెండు విడతల సాయం అందించనున్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాం. మ్యుటేషన్ చేయించుకున్న వారు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు, వారసత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి.
– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
మరింత మందికి రైతు భరోసా
Published Sun, Sep 17 2023 2:43 AM | Last Updated on Sun, Sep 17 2023 8:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment