సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్–ప్యాక్స్), రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) భాగస్వామ్యం కావాలి.
వీటి నెట్‌వర్క్‌ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఏమన్నారంటే..
ఆర్బీకేల రూపంలో ప్రతీ గ్రామంలో ఓ బ్రాంచ్
ప్రతి పీఏసీఎస్ పరిధిలో 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతీ ఆర్బీకేలోనూ ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను నియమించాం. వీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం. పీఏసీఎస్‌లు ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలను గ్రామ స్థాయిలో పీఏసీఎస్‌లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి. ఇలా పీఏసీఎస్‌ల మాదిరిగానే ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో ఆప్కాబ్‌కు, డీసీసీబీలకు ప్రత్యేకంగా శాఖలు ఉన్నట్టుగానే పరిగణించాలి.
దేశంలో మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు ఉంది. రైతులకు రుణాల విషయంలో ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్‌లు వ్యవహరించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలంటే గ్రామ స్థాయి వరకు ఉన్న ఈ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
సహకారరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
డీసీఎంఎస్‌లపై అధ్యయనం చేయాలి
జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా, రైతులతో పాటు సంబంధిత వర్గాల వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ అధ్యయనం జరగాలి. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయి.
ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోయినా, ధరలు నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్‌లకు సముచిత పాత్ర కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను కూడా డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. ఇందుకోసం çసమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేయాలి.
స్వయం ఉపాధి కల్పించాలి
గ్రామస్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలివ్వడం వల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ చర్యలు తీసుకోవాలి. గుర్తించిన లబ్దిదారు చేతిలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం డబ్బులు పెడుతుంది. వీటితో వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేలా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి. బంగారంపై ఇచ్చే రుణాలపై కూడా తక్కువ వడ్డీ ఉండాలి. పీఏసీఎస్‌ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థంగా ఉండేలా చూడాలి. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్‌ఓపీలు తయారుచేయాలి.
లాభాల బాట పట్టించేలా చూడాలి..
గతంలో చూడని పురోగతి ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్‌లో కనిపిస్తోంది. ఆప్కాబ్ మన బ్యాంకు, మనందరి బ్యాంక్ అన్న భావనతో తీర్చిదిద్దాలి. మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆప్కాబ్ మాదిరిగానే డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా నూటికి నూరు శాతం లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలి. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా అప్‌డేట్ చేయాలి. ఆ వివరాలు పీఏసీఎస్‌ల వద్ద అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రికార్డుల స్వచ్చ్చికరణ జరుగుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది.
84.32 శాతం పెరిగిన కార్యకలాపాలు: అధికారులు
ప్రభుత్వ ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా సహకార రంగంలో ఆర్థిక కార్యకలాపాలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పెరిగాయని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 84.32 శాతం పెరిగాయన్నారు. 2019 వరకూ పీఏసీఎస్‌లో ఆర్థిక కార్యకలాపాలు రూ. 11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ. 21,906 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 400 పీఏసీఎస్‌లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయని సీఎంకు చెప్పారు.
ఆప్కాబ్‌లో 2019 మార్చి నాటికి రూ. 13,322.55 కోట్ల టర్నోవర్ ఉండగా, అది 2023 మార్చి నాటికి రూ. 36,732.43 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో 175 శాతం గ్రోత్ రేటు నమోదైందన్నారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ ఎండీ జీ.వీరపాండియన్, సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఆప్కాబ్ ఎండీ ఆర్‌ఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యం పెంచాలి
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వలన సహకార రంగంలోని ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం తీసుకురాగలిగితే ఆ మేరకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి. డీసీసీబీల్లో ఇప్పటికే ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం. అదే రీతిలో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజాన్ని పెంచాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేల నెట్‌వర్క్ ద్వారా గ్రామ స్థాయిలో నాణ్యమైన సేవలు అందుతాయి.
పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలాముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ అందుబాటులోకి తీసుకురావాలి. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment