మాటకు మించి సాయం  | CM YS Jagan Credit Rythu Bharosa Funds to Farmers At Camp Office | Sakshi
Sakshi News home page

మాటకు మించి సాయం 

Published Thu, Feb 29 2024 4:25 AM | Last Updated on Thu, Feb 29 2024 9:46 AM

CM YS Jagan Credit Rythu Bharosa Funds to Farmers At Camp Office - Sakshi

వైఎస్సార్‌ రైతు భరోసా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్‌

హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించాం

రూ.50 వేలే ఇస్తామని చెప్పినా ప్రతి ఒక్కరికీ రూ.67,500 ఇచ్చాం.. ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసాతో రూ.34,288 కోట్లు రైతుల చేతికి 

చిన్న రైతులకు పెట్టుబడి ఖర్చుల్లో 80% కవర్‌

సకాలంలో సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం.. పైసాభారం పడకుండా బీమా కవరేజ్‌

ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ

ఈ–క్రాప్‌ ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు 

ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం

19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు.. ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా 

అన్నదాతలకు ఈ ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం

వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడతగా 53.58 లక్షల కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు

సున్నా వడ్డీ రాయితీ కింద 10.79 లక్షల మందికి మరో రూ.215.98 కోట్లు

బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌     

సాక్షి, అమరావతి:  అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపించామ న్నారు. ప్రతీ పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలన్నీ అందించామని, రాష్ట్రంలో ఐదేళ్లుగా మాత్రమే ఇలా జరుగుతోందని గుర్తు చేశారు.

ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో అండగా నిలిచి ఆదుకుంటామని భరో­సా ఇచ్చారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా వరుసగా ఐదో ఏడాది మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు 10.79 లక్షల మందికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.215.98 కోట్లు కలిపి మొత్తం 64.37 లక్షల మంది ఖాతాలకు రూ.1,294.34 కోట్లను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

హామీ కంటే మిన్నగా.. 
వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తా మని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రూ.12,500 బదులు ఏటా రూ. 13,500 చొప్పున అందచేశాం. రూ.50 వేలకు బ దులు ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 67,500 చొప్పున లబ్ధి చేకూర్చాం. హామీకి మించి ప్రతి రైతు కుటుంబానికి రూ.17,500 చొప్పున అదనంగా అందచేశాం. తద్వారా ఏటా మూడు విడ తల్లో రూ.13,500 చొప్పున ఈ ఐదేళ్లలో మొత్తం రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్లైంది. ఇవాళ జమ చేస్తున్న పెట్టుబడి సాయంతో కలిపి ఐదేళ్లలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.34,288 కోట్లు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయంగా అందించాం.  

క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ  
ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీని కూడా వర్తింపజేస్తూ రూ.లక్ష వరకు పంట రుణాలను అందిస్తున్న కార్యక్రమం కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. పంట రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే బ్యాంకులకు రైతులపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ రైతన్నలు వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్లీ ఆ వడ్డీ రాయితీ డబ్బులను క్రమం తప్పకుండా అన్నదాత­లకు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే.

బ్యాంకులకు కట్టిన వడ్డీని తిరిగి వెనక్కి ఇవ్వడం వల్ల రైతులకు వడ్డీ లేకుండా రుణా­లు అందుతాయి. ఆ డబ్బులు వారికి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 84.67 లక్షల మంది అన్నదాతలకు సున్నా వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.2,051 కోట్లు అందించాం. 



నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తు.. 
19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమం ఈ 57 నెలల్లోనే జరుగుతోంది. మనం అధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంట్‌ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాడు ఫీడర్లకు ఆ సామర్థ్యమే లేదు. మన ప్రభు త్వం వచ్చిన తర్వాత రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ విద్యు­త్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాం. పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తూ ప్రతి రైతన్నకు రూ.45 వే ల వర­‡కు మేలు చేశాం. ఉచిత విద్యుత్‌ కోసం ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.  

ఉచిత పంటల బీమా.. 
దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతులు పండించే ప్రతి ఎకరాను ఈ– క్రాప్‌ చేస్తూ నోటిఫై చేసిన ప్రతి పంట, సాగైన ప్రతి ఎకరా ఇన్సూరెన్స్‌ కవరేజీలోకి తెచ్చాం. రైతన్నల తరపున ప్రీమియం డబ్బులను పూర్తిగా రాష్ట్రమే కడుతున్న ప్రభుత్వం మనదే. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతోంది. ము­నుపెన్నడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు.

కొందరు రైతులకు మాత్రమే క్రాప్‌ లోన్‌ ఇచ్చిన సమయంలో బ్యాంకులు బీమా ప్రీ­మియం సొమ్ముని కట్‌ చేసుకుని వర్తింప చేసిన ప­రిస్థితి ఉండేది. రైతులు బ్యాంకులకు వెళ్లకుంటే రుణాలు రాని పరిస్థితి. తద్వారా వారికి ఇన్సూరెన్స్‌ గురించి తెలియక చెల్లించలేకపోయేవారు. అలా వా­రు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్‌ పెడు­తూ ప్రతి రైతన్న పంట వేసిన వెంటనే ఆటోమేటిక్‌­గా గ్రామ సచివాలయంలో ఈ– క్రాప్‌ ద్వారా పూ­ర్తి­గా ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ కలి్పస్తూ వారి తరపున ప్రీ­మియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్న పరిస్థితి తొలిసారిగా మన ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. 

ఆక్వాకు తోడుగా.. పాడికి అండగా 
గతంలో ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌ ఇచ్చి వారిని అదుకున్న పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే  కరెంట్‌ అందించి వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. ఆక్వా, పాడి రైతుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో లేనివిధంగా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు ఈ 57 నెలల కాలంలోనే సేకరణ ధరలు పెరిగాయి. దీనికి కారణం మనం చేపట్టిన పాలవెల్లువ అనే కార్యక్రమమే. సహకార రంగంలో దేశంలోనే అతి పెద్దదైన అమూల్‌ లాంటి సంస్ధను రాష్ట్రానికి తీసుకొచ్చాం. తద్వారా స్థానికంగా పోటీని సృష్టించాం. అమూల్‌ రేట్లు పెంచింది కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాం. 

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. 
దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో మన భూముల సర్వే జరిగింది. రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం, సబ్‌ డివిజన్లు, సర్వేలు జరగకపోవడం వల్ల ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు తలెత్తాయి. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సమగ్ర భూసర్వే చేపట్టాం. రికార్డులన్నీ అప్‌డేట్‌ చేసి ఏకంగా రిజి్రస్టేషన్‌ ప్రక్రియను గ్రామస్ధాయిలో సచివాలయాల పరిధిలోకి తెచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే సాకారమైంది.

దాదాపు 34.72 లక్షల ఎకరాలపై రైతులు, పేదలకు అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏకంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గతానికి, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడాను గమనించండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రతి ఆర్బీకే మనతో కనెక్ట్‌ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది.  

పెట్టుబడికి భరోసా.. చిన్న రైతుకు 80% ఖర్చులు కవర్‌ 
రాష్ట్రంలో అర హెక్టార్‌ (1.25 ఎకరాలు) లోపు భూమి కలిగిన రైతులు 50% మంది ఉండగా హెక్టార్‌ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన వారు 70% ఉన్నారు. సాగు పెట్టుబడి కోసం తీసుకునే రుణాలపై వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వారిది. ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే నడ్డీ విరిగే వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. మన ప్రభుత్వం రైతన్నలకు ఆ అవస్థలను తొలగించి రైతు భరోసాతో ఆదుకుంటోంది. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అందించే సాయంతో అర హెక్టారు లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు 80% పెట్టుబడి ఖర్చులు కవర్‌ అవుతుండగా హెక్టారు లోపు పొలం ఉన్నవారికి 70% ఖర్చులు పథకంతో కవర్‌ అవుతున్నాయి. 

నష్టపోతే అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ 
ఈ ఐదేళ్లలో వచ్చిన మరో గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడైనా రైతన్నలకు వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దాన్ని తన కష్టంగానే భావించింది. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా అందించే కార్యక్రమం కూడా మొట్ట మొదటిసారిగా ఈ 57 నెలలుగా జరుగుతోంది. ఇదో విప్లవాత్మకమైన మార్పు. నష్టపోయిన రైతులు మళ్లీ సీజన్‌లో పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఇన్‌పుట్‌ సబ్సి­డీ డబ్బులు ఆయా  సీజన్‌ ముగిసేలోగా చేతికిస్తేనే పెట్టుబడి కోసం వారికి ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచిన ప్రభు­త్వం మనది. ఇలాంటి ఆలోచనలు మనం ప్రభుత్వంలోనే జరిగాయి.  

పంటలకు ‘మద్దతు’.. 
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పి పంటలను కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు సైతం మనం కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్‌లో మద్దతు ధర తగ్గినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే. 

మాఫీ పేరుతో బాబు మోసాలు.. 
2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఎలా మోసగించారో గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని పబ్లిసిటీ చేసి ఆ తరువాత వంచనకు పాల్పడ్డా­రు. చివరికి ఆ రూ.87,612 కోట్లపై సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్లు ఆ వడ్డీలకే అవుతుంది.

ఆయన ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలను కూడా మ­నమే ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం ద్వారానే రైతు­ల చేతుల్లో రూ.34,288 వేల కోట్లు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.65 కోట్లు వెచ్చించాం. ఇలా పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయం కోసం ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది.   

ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికంగా
పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ మనసు, పాలన బాగున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎం జగన్‌ దేశం గర్వించేలా పలు సంస్కరణలు తెచ్చారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్‌ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో పుట్టి (850 కేజీలు) రూ.18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12 వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. కానీ ఇవాళ పుట్టి రూ.23,500 నుంచి రూ.24 వేలు పలుకుతోంది. ఇది ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికం. 
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి  

పంట మాది.. బీమా మీది
నాకు 3.38 ఎకరాలున్నా గతంలో బీడుగా ఉండేది. గత నాలుగేళ్లుగా పంటలు పండిస్తున్నాం. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు. సున్నా వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతు­లకు వ్యవ సాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడి గాపులు కాశాం.

ఇప్పుడు నాణ్యమైన విత్త­నాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా మా ఇంటికే పంపిస్తు­న్నారు. గతంలో పాలు కర్ణాటకలో విక్రయించగా ఇప్పుడు మా గ్రా­మంలోనే అమూల్‌ కేంద్రంలో మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకో­గ­లు­గుతున్నాం. మీద్వారా మా కుటుంబం రూ.3,42,152 మేర లబ్ధి పొందింది. మీరు మళ్లీ సీఎం కావాలి.
–ఎన్‌. బాబు, రైతు, అనంతపురం జిల్లా 

రైతుల కోరిక.. మళ్లీ మీరే
నాలుగెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. గతంలో ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు. నేడు ఆర్బీకేల ద్వారా అన్నీ గ్రామంలోనే అందిస్తున్నారు. ఈ–క్రాప్‌ ద్వారా పంట రుణాలు, వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గతంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు. పైసా భారం పడకుండా ఉచితంగా ఇన్సూరెన్స్‌ ఇస్తున్నారు.

దేశంలో ఎక్కడా ఈ–క్రాప్‌ విధానాన్ని చూడలేదు. మన దగ్గర చక్కగా అమలవుతోంది. నేను మూడెకరాల్లో 78 బస్తాల ధాన్యాన్ని పండిస్తే రూ.1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే వైజాగ్‌ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.1,48,000 చెల్లించింది. పైగా కోలుకోవడానికి ఆసరాతో రూ.4,750 జమ చేశారు. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము. 
–వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా

వ్యవసాయం సుసంపన్నం పుస్తకావిష్కరణ
ఐదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగతిపై ‘వ్యవసాయం సుసంపన్నం–రాష్ట్రానికి సౌభాగ్యం’ పేరిట వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు ఐ.తిరుపాల్‌రెడ్డి, పి.శివప్రసాద్‌రెడ్డి, సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement