అన్నదాతలను ఆదుకున్నాం | CM YS Jagan at YSR Rythu Bharosa fund release programme | Sakshi
Sakshi News home page

అన్నదాతలను ఆదుకున్నాం

Published Wed, Nov 8 2023 4:16 AM | Last Updated on Wed, Nov 8 2023 6:41 PM

CM YS Jagan at YSR Rythu Bharosa fund release programme - Sakshi

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం , సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చదువుకొనే పిల్లలు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారి గుండెల్లో ఎంతగా స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైఎస్సార్, ఒక వైఎస్‌ జగన్‌ను చూస్తే అర్థం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న సామాజిక సాధికార యాత్రలను చూస్తే తెలుస్తుంది. ఆయా వర్గాల వారి నాయకత్వంలో జరుగుతున్న ఈ యాత్రలకు, మీటింగ్‌లకు తండోపతండాలుగా కదిలి వస్తున్న జనాలను చూస్తుంటే వారి గుండెల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానం, మీ బిడ్డ జగన్‌ స్థానం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది.   ప్రతి అడుగులోనూ రైతన్నలకు, పేద వాడికి, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలని.. వారి కుటుంబాలు బాగుండాలని, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలని, ఎదగాలని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం. ఇలాంటి మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్న ఆలోచించాలి.  
– సీఎం వైఎస్‌ జగన్‌ 


సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రంలో నాలుగేళ్లు కరువనేది లేకపోయినా రైతులకు చేయాల్సిన సాయం చేశాం. రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వమిది. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచించని విధంగా ఆలోచించి అన్నదాతలకు మేలు చేశాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం మనదే. మీ అందరి ఆశీస్సులు, పుట్టపర్తి స్వర్గీయ బాబా దీవెనలు మెండుగా ఉన్నాయి. అందుకే రైతుల గుండెల్లో నిలిచాం.

ఈ రోజు వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 53.53 లక్షల మంది రైతులకు, వారితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు లబ్ధి జరుగుతోందన్నారు.

దాదాపు రూ.2,200 కోట్లలో రేపటికల్లా మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. తర్వాత పీఎం కిసాన్‌ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక్కడికి రాక ముందు కూడా తాను వాళ్లతో మాట్లాడానని, మీ డబ్బులు కూడా క్రోడీకరించాలని కోరానని.. ఈ నెలలో కచ్చితంగా ఇస్తామని చెప్పారని తెలిపారు.

ఈ 53 నెలల్లో 53 లక్షల మంది పైచిలుకు రైతన్నలకు మన ప్రభుత్వం రూ.61,500 చొప్పున ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఈ విడత ఇచ్చే రూ.4,000 కలుపుకుంటే రూ.65,500 లబ్ధి కలిగినట్లవుతుందని చెప్పారు. ఈ ఒక్క పథకం ద్వారానే రైతులకు నేరుగా రూ.33,209.81 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. రైతులకు ఇలా మేలు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఇదివరకెన్నడూ లేని విధంగా రైతులకు లబ్ధి 
► విత్తనం వేసినప్పటి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.  ఈ క్రాప్‌ ద్వారా ప్రతి ఎకరా నమోదు చేస్తున్నాం. పంట పండించే ప్రతి రైతన్నకూ పారదర్శకంగా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ మంచి చేస్తున్నాం.  

► పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది మన ప్రభుత్వం మాత్రమే. గతంలో పగలూ రాత్రి రెండు సమయాల్లో కలిపినా కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేకపోయారు. వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. పంటల బీమా కోసం రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. 

► వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.7,802 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద రూ.1,286 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం రూ.45 వేల కోట్లు..చివరకు ఆక్వా జోన్లలో రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం ఇదే. రైతు కుటుంబాలకు మంచి జరిగేందుకు, రైతన్నకు తోడుగా ఉండేందుకు రూ.1.75 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 62 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం మీద  ఇలాంటి పనులు చేయాలన్న ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేదు?
 
కనీస మద్దతు ధర కల్పించాం 
► గతంలో బాబు ఐదేళ్ల పాలనలో 17,94,000 మంది రైతన్నల వద్ద రూ.40,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. మన ప్రభుత్వ పాలన నాలుగేళ్లలో  దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ ఈ క్రాప్‌ తెచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగలిగాం. ఇతర పంటల కొనుగోలుకు కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా ఆర్బీకేల్లో జాబితాలు పెట్టి కనీస మద్దతు ధర ఇచ్చాం. రూ.8 వేల కో­ట్లు వెచ్చించి ఇతర పంటలూ కొనుగోలు చేశాం. 

► సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎలా నిర్వీర్యం చేశారో అందరం చూశాం. మనం ఆ పథకానికి నిజమైన అర్థం చెబుతూ పంట రుణాలు తీసుకుంటే ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా కల్పించాం. వ్యవసాయం ఒక్కటే రైతన్నకు సరిపోదని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. పాడి రైతులకు మంచి చేశాం. గతంలో తక్కువ ధర చెల్లిస్తూ చంద్రబాబు తన హెరిటేజ్‌కు, మిత్రుల డెయిరీలకు మేలు చేశారు. మనం సహకార రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాం. పాడి రైతులకు పాల వెల్లువ ద్వారా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు అదనపు ఆదాయం వచ్చేలా చేశాం. 

అప్పుడు స్కీములు లేవు.. స్కాములే 
► చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునేది ప్రజలకు మంచి చేయడానికి కాదు. కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠా, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు మేలు చేయడానికే. రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు మాత్రమే.  

► వాళ్ల హయాంలో ఒక్కటంటే ఒక్క మంచి స్కీముందా? కేవలం స్కాములు మాత్రమే జరిగాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ గ్రిడ్, మద్యం, ఇసుక, రాజధాని భూములు ఇలా ఎక్కడ చూసినా స్కాములే. ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్‌ రేటు కూడా ఇప్పుడు తక్కువే. ఈ ప్రభుత్వ హయాంలో మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా ఇప్పటికే 53 నెలల కాలంలోనే రూ.2.40 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది. 

► చంద్రబాబు హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయి? ఈ నిజాల గురించి అందరూ ఆలోచించాలి. మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్‌ స్కూళ్లు ఎందుకు మారుతున్నాయి? ఇంగ్లిషు మీడియం ఎందుకు వచ్చింది? 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన కోసం ఐఎఫ్‌పీలు ఎందుకు పెడుతున్నారు? 8వ తరగతిలో ట్యాబులు ఎందుకు పెట్టగలుగుతున్నాం. టెక్ట్స్‌ బుక్‌లో ఒక పేజీ ఇంగ్లిషులో, మరో పేజీ తెలుగులోకి ఎందుకు మారింది? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదో ఆలోచించండి. 

► గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆస్పత్రులకు వెళితే పక్కన పెట్టే పరిస్థితి. గతంలో 1,058 ప్రొసీజర్లు ఉండగా, నేడు 3,300 ప్రొసీజర్లకు పెంచి పథకం పరిధిని విస్తరించాం. 1,600 పైచిలుకు 104, 108 వాహనాలు కొనుగోలు చేశాం. 108కు ఫోన్‌ చేసినా, 104కు ఫోన్‌ చేసినా గ్రామాల్లోనే ఇంటికి వచ్చి.. వైద్యం అందిస్తున్నారు. పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని పరితపిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం ఇదే. 

► వ్యవసాయం, చదువులు, ఆరోగ్య రంగం ఇలా ఏ రంగం తీసుకున్నా కనీవినీ ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత సాధించాం. దిశ యాప్‌ 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో కనిపిస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి మీకు అండగా, తోడుగా నిలిచే గొప్ప వ్యవస్థ. గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. 

► పేదలకు సొంత ఇంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేశాం. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇల్లు పూర్తయితే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి పెట్టినట్లవుతుంది. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? మీ బిడ్డ హయాంలో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి.  

► మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం చేతకాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మద్దతు ఉండదు. దత్తపుత్రుడి వద్దకు వెళ్లి సపోర్ట్‌ లేకపోతే నేను బతకలేనని చెప్పలేడు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. రాబోయే రోజుల్లో చంద్రబాబు సైన్యం అబద్ధాలు, మోసాలు మరింతగా పెరుగుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారిస్తామంటారు. ఆ అబద్ధాలు నమ్మకండి. మీకు మంచి జరిగిందా, లేదా అన్నది మాత్రమే చూడండి.   

చంద్రబాబు హయాంలో వరుసగా కరువు 
► గడిచిన 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లూ కరువే. అయినా రైతుల తరఫున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నకు తోడుగా ఉండాలని, ప్రతి రైతుకూ బీమా అందాలనే ఆలోచన చేయలేదు. కరువు తాండవిస్తున్నా చంద్రబాబు.. రైతుల దగ్గర బీమా ప్రీమియం రూ.1,250 కోట్లు లాగేసుకున్నాడు. 

► మన ప్రభుత్వం నాలుగేళ్ల పరిపాలనలో పుష్క­లంగా వర్షాలు పడినా ఇన్సూ్యరెన్స్‌ సొమ్ము కింద రూ.7,802 కోట్లు ఇచ్చింది. కరువు రావటం, రాకపోవటం మన చేతుల్లో లేకపోయినా, కరువు వస్తే ఆదుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇది మనసున్న ప్రభుత్వానికి, మనసు లేని ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా.  

uమన ప్రాంతానికి దుర్భిక్ష పరిస్థితులు, కష్టాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా ఎక్కడా కరువు మండలంగా డిక్లేర్‌ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాల్లో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బందులు కలిగాయి. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోపే మీ బిడ్డ ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. గతంలో ఎప్పుడైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ సమయానికి ఇచ్చారా? ఇవ్వాల్సిన వారందరికీ ఇచ్చారా? మీ బిడ్డ హయాంలో అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు.. నాటి పాలకులు ఎందుకు చేయలేకపోయారు?  

► 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బాబు మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ముష్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చారు. 

మిమ్మల్ని మా గుండెల్లో దాచుకుంటాం 
గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మధ్యలో చేతులెత్తేశాడు. దాంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరి కష్టాలను కళ్లారా చూసిన మీరు (సీఎం వైఎస్‌ జగన్‌).. తండ్రిని మించిన తనయుడిగా ప్రజలను ఆదుకుంటున్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. నేను రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా ద్వారా లబ్ధి పొందాను. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. కనీస మద్దతు ధర ఆదుకుంటోంది. పొలంబడి ద్వారా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. మొత్తంగా మీ పథకాల వల్ల మా కుటుంబానికి రూ.2,52,000 లబ్ధి జరిగింది. మీ వల్ల మారుమూల ప్రాంతంలోని పేద విద్యార్థి ఐక్యరాజ్యసమితిలో కూర్చోగలిగాడు. మిమ్మల్ని మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. 
– రమేష్, రైతు, గాజులపల్లి, అమడగూరు మండలం 

రాక్షస పాలనలోని చీకట్లను చీల్చిన నేత జగన్‌  
రాష్ట్రంలో రాక్షస పాలనలో అలుముకున్న చీకట్లను చీల్చుకుంటూ అధికారం చేపట్టిన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రైతుల కోసం దివంగత వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పేరుతో ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా, పరిహారం, ఆర్‌బీకే ఇలా.. ఎన్నో అడుగులు ముందుకేసి అండగా నిలిచాడు. ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రెయిన్‌గన్‌ల పేరుతో రూ.450 కోట్లు దోచేశారు. చంద్రబాబు ఏనాడూ రైతు సమస్యల గురించి పట్టించుకోలేదు. ఏం చేశారో చెప్పుకోలేక స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే (పల్లె రఘునాథరెడ్డి) కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయం చేస్తుండటం దౌర్భాగ్యం. 
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే  
   
సమగ్ర భూసర్వే ద్వారా కొత్త చరిత్ర 
► వంద సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగింది. భూ రికార్డులు సరిగా లేక వివాదాలు వస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విప్లవాత్మకంగా సమగ్ర భూసర్వే చేపట్టాం. తద్వారా భూముల రికార్డులు అప్‌డేట్‌ చేస్తున్నాం. భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి చేస్తున్నాం.  

► రాష్ట్రంలో గతంలో ఎవరూ ఎప్పుడూ చేయని రీతిలో 19.31 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్‌ భూములున్న వారికి హక్కులు కల్పిస్తున్నాం. 22ఏలో ఇరుక్కున్న చుక్కల భూములకు విముక్తి కల్పించాం. సర్వీస్‌ ఈనాం పట్టాలు ఉన్న కుల వృత్తుల రైతులకు సంబంధించి ఏకంగా 34.89 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే.   

► గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా 154 లక్షల టన్నులు. ఈ ప్రభుత్వ హయాంలో అది 166 లక్షల టన్నులకు పెరిగింది.   

మనసున్న మారాజు సీఎం జగన్‌
ముఖ్యమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్న వ్యాధిగ్రస్తులు 
ఏడుగురికి రూ.5.5 లక్షల తక్షణ సాయం 
గంటల వ్యవధిలో చెక్కులు అందజేసిన కలెక్టర్‌   
మెరుగైన వైద్యం కోసం చర్యలు 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు.  వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
–పుట్టపర్తి అర్బన్‌ (శ్రీసత్యసాయి జిల్లా)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement