రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్‌కు గత సర్కారు చారిత్రక ఒప్పందం
సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్ధ ‘సెకీ’ నాడు స్వయంగా లేఖ రాసింది
పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది
ఉచిత విద్యుత్‌పై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేందుకు కేంద్రం సంసిద్ధత
ఏటా రూ.3,750 కోట్లు.. 25 ఏళ్లలో రూ.లక్ష కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రక ఒప్పందం.. ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడూ, ఏ సీఎం హయాంలోనూ డిస్కంలు కుదుర్చుకోలేదు
అలాంటి చారిత్రక ఘట్టాన్ని ప్రశంసించాల్సింది పోయి నిందలా?.. అది ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం
కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా?.. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి, లంచాలకు తావెక్కడ?
అమెరికా సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే జగన్‌పై విషం చిమ్ముతారా?
చంద్రబాబు రూ.5.90కి కొంటే ఒప్పు..! జగన్ రూ.2.49కి తీసుకుంటే తప్పా?
గుజరాత్ టెండర్లలో యూనిట్ కేవలం రూ.1.99కే అంటూ ఈనాడు వితండవాదం
అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలను కలిపితే యూనిట్ కొనుగోలు వ్యయం రూ.4 అవుతుందనే విషయాన్ని కప్పిపుచ్చిన ఎల్లో మీడియా
యూనిట్ వ్యయం ఏటా క్రమేణా తగ్గుతుందంటూ మరో పసలేని వాదన..
అదే నిజమైతే 2020లో రూ.1.99 ఉన్న వ్యయం 2024 నాటికి రూ.1.50కి దిగి రావాలి కదా?
మరి గుజరాత్ టెండర్లలో ఈ ఏడాది యూనిట్ వ్యయం రూ.2.70కి పెరిగింది..
సెకీతో గత ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే కుదుర్చుకుంది కదా!
టీడీపీ హయాంలో మార్కెట్ కంటే రెట్టింపు రేట్ల పీపీఏలతో రాష్ట్రంపై పెనుభారం
చంద్రబాబును ప్రశ్నించని ఈనాడుకు అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా?
మరి ధరలెందుకు తగ్గలేదు..?
ఎల్‌ఈడీ టీవీ ధర 2016లో రూ.రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలతో అవే కంపెనీ టీవీలు ఇప్పుడు రూ.55 వేలకే దొరుకుతున్నాయంటూ ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు కరెంట్ ధరలు మాత్రం ఎందుకు తగ్గవనే సందేహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఈనాడు చేస్తున్న వాదనే గనుక నిజమైతే 2020లో రూ.1.99 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కాకుండా)గా ఉన్న యూనిట్ విద్యుత్తు ధర 2024 నాటికి రూ.1.50 లేదా అంతకంటే తక్కువకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. రూ.2.70 కంటే ఎక్కువకు పెరిగింది. అయిన్పటికీ గత ప్రభుత్వం యూనిట్ రూ.2.49 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కలిపి)కే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదీగాక భారత ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది.
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్తు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది.
చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్‌టీఎస్) నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్తు అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా, డిస్కమ్‌ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ‘ఈనాడు’ బురద చల్లేందుకు తెగబడింది.
చౌకగా విద్యుత్తు ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడ? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడ? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం ఏమిటి? అంతా అసంబద్ధ వాదనలు.. పసలేని ఆరోపణలు!! సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా రూ.3,750 కోట్ల విద్యుత్తు భారం తగ్గుతుంది.
25 ఏళ్లలో రాష్ట్రంపై రూ.లక్ష కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చర్యగా భావించవచ్చు. గుజరాత్‌లో రూ.1.99కే విద్యుత్తు అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా చార్జీల కింద వాటిపై మరో రూ.రెండు అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది.
మన రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలతో కలిపితే అది రూ.3.98 నుంచి రూ.4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్‌కే నెలకు రూ.4 లక్షలు చొప్పున సరఫరా చార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. ఐఎస్‌టీఎస్ చార్జీల భారం పడుతోందంటూ ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేసింది.
ప్రత్యేక ప్రోత్సాహకంగా దాని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు సెకీ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నిలువెల్లా విషం చిమ్ముతోంది. ఇక అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టుకథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనడం తప్పన్నట్లు అడ్డగోలు రాతలు అచ్చేసింది.
ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టే..
గుజరాత్‌లో నెలకొల్పే ప్లాంట్ల నుంచి మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్‌లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2020 డిసెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్‌ఎల్) 2020 సెపె్టంబర్ 28న ఫేజ్ 11లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్‌లో యూనిట్ రూ.1.99కి ఇచ్చేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు.
విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్‌లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత(వికిరణం) ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో పీఎల్‌ఎఫ్ 17 శాతం నుంచి 18 శాతం ఉంటే అక్కడ 23.5 శాతం ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది.
అదే విధంగా 1,070 మెగావాట్ల విద్యుత్‌కు సెకీ టెండర్లు పిలవగా టారిఫ్ యూనిట్‌కి రూ.2కి ఒప్పందం కుదిరింది. అయితే ఆ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యేది కూడా రాజస్థాన్‌లోనే కాబట్టే ఆ రేటు! 2020లో ఆంధ్రప్రదేశ్‌లో 6,400 మెగావాట్ల పీవీ సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు టెండర్ జారీ చేసినప్పుడు యూనిట్ రూ.2.49, రూ.2.58 చొప్పున ఇచ్చేందుకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఎన్‌టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ రెన్యూవబుల్, హెచ్‌ఇఎస్ ఇన్‌ఫ్రా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పాల్గొన్నాయి.
ప్రసార చార్జీలు లేనందున తక్కువే కదా..
మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ రూ.1.99 లేదా రూ.2.01, రూ.2.36కి ఇస్తామని చెప్పినా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్) లేని కారణంగా ఆ ప్రాజెక్ట్‌లకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్‌ను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్ ఖరీదు యూనిట్‌కు రూ.3.98 (యూనిట్ రూ.1.99కి కొంటే మరో రూ.1.99) చెల్లించాలి.
అదే యూనిట్ రూ.2.01కి కొంటే దానికి ఐఎస్‌టీఎస్ చార్జీ రూ.1.99 కలిపి యూనిట్‌కు మొత్తం రూ.4.00 కట్టాలి. ఇక యూనిట్ రూ.2.36కు తీసుకుంటే దానికి రూ.1.99 జోడిస్తే యూనిట్ ధర రూ.4.35 పడుతుంది. అంటే నెలకు ఒక మెగావాట్‌కు రూ.4 లక్షలు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలకే చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే ఈ ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 తక్కువే కదా.
కోవిడ్ తర్వాత పెరిగిన సోలార్ ప్యానల్స్ ధరలు..
జీయూవీఎన్‌ఎల్ ఫేజ్ 9 టెండర్ గుజరాత్ ప్రభుత్వం చేపట్టే నాటికి కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులోనూ ధరలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆ ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్∙తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్యానెల్ ధరలు పెరిగాయి. దీంతో తర్వాత టెండర్లలో సోలార్ టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జీయూవీఎన్‌ఎల్ 2024 మార్చి 15న గుజరాత్‌లోని ఖవ్డా ప్రాంతంలో అధిక సూర్యరశ్మి తీవ్రత, అధిక పీఎల్‌ఎఫ్ ఉన్న ప్రాంతాల్లో టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్‌లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు వచ్చిన టారిఫ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...
టీడీపీ హయాంలో అత్యధిక ధరలతో పీపీఏలు..
2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందానికి భిన్నంగా ఉన్నాయి. అధిక ధరలకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు టీడీపీ హయాంలో పీపీఏలు కుదుర్చుకున్నారు. 2019–20 నాటి ఏపీఈఆర్‌సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం సౌర విద్యుత్ సగటు ధర రూ.5.90కి పెరిగింది. అంత ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను డిస్కంలు హడావుడిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కారణమయ్యారని ఈనాడు పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆందోళన చెంది ఉంటే చంద్రబాబును దీనిపై ఎందుకు నిగ్గదీయలేదు?
ఐఎస్‌టీఎస్ చార్జీలు మాఫీ అని చెప్పిన కేంద్రం
2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్‌లో భాగంగా సెకీ టెండర్ ద్వారా ఏర్పాటయ్యే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్‌టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆరీ్పఓ)తో సంబంధం లేకుండా అది ఉన్న సంస్థలకు కూడా ఈ ప్రయోజనం అందుతుంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రానికి ఐఎస్‌టీఎస్ చార్జీల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహంతో సెకీ టెండర్ ద్వారా స్థాపించే ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా అందుతుంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై ఈ భారం యూనిట్‌కు రూ.1.99 నుంచి రూ.2 వరకూ పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది.
Comments
Please login to add a commentAdd a comment