Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy Will Release Rs.3,923.21 Crore Under YSR Rythu Bharosa - Sakshi
Sakshi News home page

YSR Rythu Bharosa: వరుసగా ఐదో ఏడాదీ వైఎస్సార్‌ రైతు భరోసా

Published Thu, Jun 1 2023 2:45 AM | Last Updated on Thu, Jun 1 2023 3:40 PM

CM YS Jagan To Tranfer Funds Of YSR Rythu Bharosa - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్‌ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో  పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం. 

నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం
వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు,  జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది.

2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది ఉండగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. 2023–24లో అందించే ఈ తొలివిడత సాయం రూ.3923.22 కోట్లతో కలిపి ఇప్పటివరకు సగటున 52 లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం అందించనట్లవుతుంది.

ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌ ముగియక ముందే..
వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందిస్తూ బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78,830 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 51,468 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.53.62 కోట్ల పంట నష్టపరిహారాన్ని పెట్టుబడి సాయంతో పాటు బుధవారం జమ చేయనున్నారు. ఈ సాయంతో కలిపి 22.73 లక్షల మంది రైతులకు రూ.1,965.41 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేసినట్లవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement