సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతుభరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించి మూడోవిడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతుభరోసా అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం రైతుభరోసా పోర్టల్‌లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద ఈ నాలుగున్నరేళ్లలో 53.53 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.
ఈ సాయం అందుకున్నవారిలో ఏటా సగటున 51 లక్షల మంది భూ యజమానులు, పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్‌సీ) ఆధారంగా 1.2 లక్షల మంది కౌలురైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాతో అటవీభూమి సాగుచేసుకుంటున్నవారు 90 వేలమంది ఉన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కౌలురైతులు (సీసీఆర్‌సీ), ఆర్‌వోఎఫ్‌ఆర్ సాగుదారులు మొత్తం 9.39 లక్షల మందికి రూ.1,219.68 కోట్ల పెట్టుబడి సహాయం అందింది.
జనవరిలో మూడోవిడత..
ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. లబ్దిపొందిన వారిలో 51 లక్షల మంది భూ యజమానులు, 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. జనవరిలో మూడోవిడత సాయం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరింతమంది కౌలుదారులు, అటవీ భూ సాగుదారులకు లబ్దిచేకూర్చాలని రైతుభరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు.
రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్‌ను ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఓపెన్ చేశారు. లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి. అర్హత ఉండి ఇంకా అవకాశం వినియోగించుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ (అటవీ) పట్టాదారులు ఈ పథకంలో అర్హత సాధించటానికి రైతుభరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కౌలుదారులు సీసీఆర్సీతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అటవీ భూమి సాగుచేసేవారు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఆర్బీకేకి వెళ్లి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో మూడువిడతల సాయం ఒకేసారి అందించనున్నారు.
విస్తృత ప్రచారం చేస్తున్నాం
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తకర స్థాయి (శాచ్యురేషన్)లో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో అర్హత ఉండి ఇప్పటివరకు పెట్టుబడి సాయం పొందని కౌలుదారులు, అటవీ భూ సాగుదారులు రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ మేరకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం.
– చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment