ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఉండటంతో అన్నదాతల్లో ఆ దిగులు పోయింది. ప్రతి పంటకూ రైతుకు రూపాయి ఖర్చు లేకుండా బీమా చేయిస్తోంది. సగటు దిగుబడి కంటే తక్కువగా వచ్చినప్పుడు అండగా నిలిచి ఆదుకుంటోంది. ఇందుకోసం ఏకంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. 2021 ఖరీఫ్‌కు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు భారీగా బీమా సొమ్ము అందజేస్తోంది.
సాక్షి, అమరావతి: వరదలు, తుపాన్‌లు, అకాల వర్షాలతో పాటు చీడపీడలతో ఖరీఫ్–2021 సీజన్‌లో నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రికార్డు స్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తోంది. లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శించింది. అనంతపురం జిల్లా సీకే పల్లిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీమా సొమ్ము పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పంటల బీమా గతంలో సన్న, చిన్నకారు రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. కొద్దిపాటి అవగాహన ఉన్న బడా రైతులకు మాత్రమే దాని గురించి అవగాహన ఉండేది. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది చిన్న రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారినపడి ప్రతిసారి ఆర్థికంగా నష్టపోయే వారు.
బీమా చేయించుకున్న వారు సైతం బీమా సొమ్ము ఎప్పుడొస్తుందో.. ఎంతొస్తుందో తెలియక ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. సీజన్ ముగియ కుండానే బీమా పరిహారం చెల్లిస్తూ అండగా నిలుస్తోంది.
ఈ పంటే ప్రామాణికంగా పంటల బీమా
గతంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద ఆహార, నూనెగింజల పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, సీజన్‌తో సంబంధం లేకుండా ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మారుస్తూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పైసా భారం పడకుండా రైతులకు పరిహారం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పిస్తోంది. క్‌లైయిమ్ సెటిల్‌మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది.
గత ప్రభుత్వంలో కంటే మిన్నగా..
► టీడీపీ హయాంలో ఏటా సగటున 20 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వస్తే, గత మూడేళ్లలో సగటున 60.35 లక్షల మంది రైతులు, 53.86 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్‌లో పైసా భారం పడకుండా 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు బీమా చేయించగలిగారు.
► 2020–21లో 71.30 లక్షల మంది రైతులకు సంబంధించి 61.75 లక్షల హెక్టార్లలో పంటలు బీమా పరిధిలోకి వచ్చాయంటే ఏ స్థాయిలో పెరుగుదల నమోదైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంతో పోల్చుకుంటే రైతుల పరంగా 198.57 శాతం, విస్తీర్ణ పరంగా 128.51 శాతం పెరిగింది.
► చెల్లించిన క్‌లైమ్‌ల విషయానికి వస్తే టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా చెల్లిస్తే, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల మేర బీమా అందించింది.
► 6.19 లక్షల మంది రైతుల రూ.715.84 కోట్ల గత ప్రభుత్వ బకాయిలను సైతం చెల్లించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా ఖరీఫ్ –2021కు సంబంధించి 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
► మొత్తంగా గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లయింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు.
చరిత్రలో ఇదే తొలిసారి
ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదు. 2021 ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్‌లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– చేవూరు హరి కిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment