సాక్షి, అమరావతి: పంటల బీమా కోసం ప్రభుత్వం తరఫున బీమా కంపెనీ ఏర్పాటుపై సత్వరం చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రైతులకు 2020–21 ఖరీఫ్ బీమా సొమ్ము ఏప్రిల్‌లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, మే నెలలో ఈ ఏడాది రైతు భరోసా తొలివిడత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఎక్కడా మోసాలకు గురికాకుండా వారికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశానని, ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్లపై ఆలోచన చేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. దీనిపై పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని వ్యవసాయశాఖకు సూచించారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏం చెప్పారంటే..
కౌలు రైతుల చట్టంపై వివరించాలి..
పొలంబడిలో భాగంగా కౌలు రైతుల కోసం చేసిన చట్టంపై అవగాహన కల్పించాలి. సాగు ఒప్పంద పత్రం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని వివరించాలి. ఆర్బీకేల్లో దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఆర్బీకేల్లో రైతులకు ఎలాంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో తెలియచేసేలా హోర్డింగ్స్ ఉండాలి. విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల కార్యక్రమాలకు సంబంధించి కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ప్రజలకు మెరుగైన అవగాహన కలుగుతుంది.
సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి..
సేంద్రీయ వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. మిల్లర్లే నేరుగా ఆర్బీకేల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలన్న సందేశం గట్టిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రం చేసిన వ్యవసాయ, ఆక్వా చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలి.
జనతా బజార్లపై ప్రతిపాదనలు
జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా అధికారులు వివరించారు. ఐదు వేల జనాభా ఉన్న చోట 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు కానున్నాయి. 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్నచోట 5 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటవుతాయి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు జనతా బజార్లలో లభించాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని సీఎం స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్దతు ధరలు లభించాలని, మరోవైపు వినియోగదారులకు సరుకులు తక్కువ ధరకు లభించేలా ఉండాలన్నారు. జనతా బజార్ల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.
ఏపీ అమూల్ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌లపై సమీక్ష
ఏపీ అమూల్ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు, నిధుల సమీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. సమీక్షలో అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ స్పెషల్ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి.యస్. ప్రద్యుమ్న, ఏపీ డీడీసీ ఎండీ అహ్మద్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment