సాక్షి, అమరావతి: ప్రజలకు, రైతులకు మేలు చేసే పథకాలు, కార్యక్రమాలను ఎవరైనా స్వాగతిస్తారు. నిలువెల్లా విషం నింపుకున్న పచ్చ పత్రికలు తప్ప. ప్రజల, రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రోజూ ఏదో విధంగా విషం కక్కడమే ఆ పత్రికల విధానం. ఇందుకు నిదర్శనమే అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై ఈనాడు పత్రిక రాస్తున్న అసత్య కథనాలు.
దేశం మొత్తం మెచ్చిన ఈ పథకంపై వాస్తవాలకు విరుద్ధంగా రోజుకో కథతో రైతులను గందరగోళ పరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. మొత్తం భారమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రికార్డు స్థాయిలో బీమా పరిహారం అందిస్తూ అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది.
దెబ్బతిన్న పంటల నమూనా సేకరణ కూడా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. నమూనాలను రైతు ఎదుటే అధికారులు సేకరిస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడే సేకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి సంబంధించి రైతు సంతకం కూడా తీసుకుంటారు. తద్వారా రైతులకు ఎటువంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం నిర్వహిస్తారు.
పంట నమూనా సేకరణ, బీమా పరిహారం చెల్లింపు, పంటలకు సంబంధించి ఇతరత్రా విషయాల్లో రాష్ట్రంలోని ప్రతి రైతూ ధీమాగా ఉన్నాడు. ధీమా లేనిది రామోజీకే. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రారన్న ఆందోళనతో అడ్డగోలుగా అబద్ధాలు రాసేస్తున్నారు. అదే ధోరణిలో పంటల ఉచిత బీమాపై ఈనాడులో ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవమెంతుందో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆరోపణ : ఇదేనా మీరిచ్చే ధీమా?
వాస్తవం : చంద్రబాబు హయాంలో తొలి రెండేళ్లు వ్యవసాయ బీమా పథకం, ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 6.92 లక్షల మందికి రూ. 887.69 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 23.93 లక్షల మందికి రూ.2,523.51 కోట్ల చొప్పున ఐదేళ్లలో సుమారు 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం ఇచ్చింది. తాజాగా ఖరీఫ్–2022 సీజన్‌కు 10.20 లక్షల మందికి మరో రూ.1,117.21కోట్ల పరిహారం ఇవ్వబోతోంది.
అంటే నాలుగేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7802.05 కోట్ల పరిహారం రైతులకు ఇచ్చినట్టవుతుంది. అంటే టీడీపీ హయాంలో ఏటా సగటున రూ.682 కోట్ల పరిహారం ఇస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.1,950.51 కోట్ల పరిహారం ఇచ్చింది. బాబు హయాంలో ఏటా సగటున 6.17 లక్షల మంది లబ్ధి పొందితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ద్వారా ఏటా సగటున 13.62 లక్షల మంది లబ్ధి పొందారు. అంటే చంద్రబాబు హయాంలోకంటే ఈ నాలుగేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులు బీమా పరిహారం పొందారు.
ఆరోపణ : ప్రీమియం చెల్లింపులో గోప్యత ఎందుకు?
వాస్తవం : పీఎంఎఫ్‌బీవై కింద 2016–18 మధ్య రైతులు వారి వాటాగా రూ.753.70 కోట్లు చెల్లిస్తే బాబు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.912 కోట్లు మాత్రమే. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ. 971 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా రైతులు నష్టపోయిన పరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది.
2022–23లో కేంద్రం దిగి రావడంతో పీఎంఎఫ్‌బీవైతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దిగుబడి ఆధారిత పంటల కోసం ఖరీఫ్–2022 సీజన్‌కు రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించింది. వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగానే పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ గణాంకాలు చాలు ఎవరి హయాంలో రైతులకు ధీమా లభించిందో చెప్పడానికి.
ఆరోపణ : మరీ ఇంత తక్కువ పరిహారమా?
వాస్తవం : ఎకరాకు కంది పంటకు రూ.828, వేరు శనగకు రూ.1,106, పత్తికి రూ.1,815 మాత్రమే ఇచ్చారంటూ చేసిన ఆరోపణలో వాస్తవమే లేదు. ఎందుకంటే వాతావరణ ఆధారిత బీమా పథకంలో అసాధారణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాన్నే పరిహారంగా ఇస్తారు. ఖరీఫ్– 2022 అనూకూల వాతావరణ పరిస్థితులు నమోదవడంతో బీమా పరిహారం వాస్తవ డేటాను అనుసరించి వర్తింపజేశారు.
వాస్తవ దిగుబడుల ఆధారంగా సగటున కంది పంటకు రూ.10,158, వేరుశనగకు రూ.2,444, పత్తికి రూ.4,036 చొప్పున చెల్లిస్తున్నారు. ఎక్కడయితే నిబంధనల మేరకు ఎక్కువ పరిహారం వర్తించలేదో దానిని మాత్రమే హైలెట్ చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఈనాడుకే చెల్లింది.
ఆరోపణ: ఆర్బీకేల్లో కనిపించని జాబితాలు
వాస్తవం : బీమా పరిహారానికి అర్హత సాధించిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం సంబంధిత ఆర్బీకేల్లో గత నెల 28వ తేదీ నుంచి ప్రదర్శిస్తున్నారు. పంట నష్టం జరగని కారణంగా అర్హులెవరూ లేకపోవడంతో కొన్ని ఆర్బీకేల్లో జాబితాలు ప్రదర్శించలేదు. రోజూ ఆర్బీకేలను సందర్శిస్తున్న రైతులు ఈ జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 160 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయంటే, ఈనాడుకు తప్ప రైతుల్లో ఎలాంటి గందరగోళం, అయోమయం లేదన్నది సుస్పష్టం.
ఆరోపణ : దానిమ్మ రైతులను దగా చేశారు
వాస్తవం : దానిమ్మ పంటను అనంతపురం జిల్లాలో వాతావరణ ఆ«ధారిత పంటల బీమా పథకం కింద పరిగణనలోకి తీసుకున్నారు. అయితే వాతావరణ అంశాలకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆ జిల్లాలో పరిహారం వర్తించలేదు కాబట్టే జాబితాలో ఆ పంట వివరాలు పొందుపర్చలేదు.
ఆరోపణ : రైతుల లెక్క ఇలా చేశారు
వాస్తవం: ఒక రైతు పేరుతో 2, 3, 4 సెంట్ల చొప్పున వేర్వేరు ఐడీలు నమోదు చేసి ముగ్గురు రైతులుగా పేర్కొన్నారు. ఇలా 10.20 లక్షల మంది రైతులను చూపారంటూ అవగాహన లేని ఆరోపణ చేశారు. వాస్తవానికి రైతులకు చెందిన ప్రతి సర్వే నంబరు పరిధిలో అతను సాగు చేసిన పంటలను ఈ పంటలో నమోదు చేశారు. రికార్డుల పరంగా, సర్వే నంబర్ వారీ ప్రచురించిన జాబితాల ప్రకారం చూసుకుంటే లబ్ధి పొందిన రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్బీకేలవారీగా లబ్ధిదారులను లెక్కించి 10.20 లక్షల మందిగా నిర్ధారించారు.
ఆరోపణ : పంట నష్టపోయినా బీమా ఇవ్వలేదు
వాస్తవం : ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతు వారీగా నష్టం అంచనా వేసి 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన సందర్భంలో ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది. అయితే బీమా పరిహారానికి మార్గదర్శకాలు పూర్తిగా నోటిఫై చేసిన పంటకు, నోటిఫై చేసిన యూనిట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇన్‌పుట్ సబ్సిడీ మాదిరిగా కంటితో చూసి ధ్రువీకరించి పరిహారం లెక్కింపు ఉండదు.
శాస్త్రీయ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి వచ్చిన దిగుబడి హామీ దిగుబడికన్నా తక్కువ వస్తే, ఆ లోటు శాతాన్ని బీమా మొత్తంతో గణించి పరిహారంగా ఇస్తారు. అదే వాతావరణ ఆధారిత బీమా పథకంలో వివిధ వాతావరణ అంశాల ఆధారంగా బీమా పరిహారం చెల్లిస్తారు. ఈనాడు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా, తోచినట్టుగా అసత్యాలు అచ్చేసింది.
ఆరోపణ : దాటవేత వైఖరి ఎందుకు?
వాస్తవం: 17 జిల్లాలకు వాతావరణ బీమా వర్తింపచేయాల్సి ఉండగా, 9 జిల్లాలను తప్పించారన్న ఆరోపణలో వాస్తవం లేదు. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద 25 జిల్లాల్లో 17 పంటలు, వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలో 17 జిల్లాల్లో 8 పంటలను నోటిఫై చేశారు. వాతావరణ ఆధారిత బీమా కింద 16 జిల్లాలకు పరిహారం మంజూరైంది. జిల్లాలవారీగా పరిహారం వివరాలు విడుదల చేసినా కళ్లుండీ కబోదిలా 9 జిల్లాలకు సున్నా అంటూ అడ్డగోలు ఆరోపణలు చేసింది ఈనాడు.
Comments
Please login to add a commentAdd a comment