
దేశంలో పెరుగుతున్న రాత్రి వేళ ఉష్ణోగ్రతలు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వేడి గాలులు
417 జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న తాపం
201 జిల్లాల్లో మధ్యస్థంగా ఉష్ణోగ్రతలు
కేవలం 116 జిల్లాల్లోనే సాధారణ పరిస్థితులు
రాత్రి వేడి పెరుగుతున్న రాష్ట్రాల్లో టాప్–2లో ఏపీ
ఇంధన, పర్యావరణ, నీటి మండలి తాజా అధ్యయనంలో వెల్లడి
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్‌ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతి
ఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడి
దేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది.
కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్‌తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది.

ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.
పగలూ రాత్రీ ఏకమైపోతాయి
గత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది.
ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్‌ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది.