పండ్లలో 6.02 శాతం నుంచి 15.05 శాతం నష్టం
కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం..
ఫుడ్ ప్రాసెసింగ్, పంటల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 1,680 ప్రాజెక్టులు
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది.
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను, ఫుడ్ ప్రాసెసింగ్–ప్రిజర్వేషన్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ
వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment