రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు
ఉష్ణతాపానికి పశ్చిమ గాలులే కారణం
స్తబ్దుగా నైరుతి రుతుపవనాలు
4 రోజుల్లో కదలిక వచ్చి, రాష్ట్రంలో మరింతగా విస్తరించే అవకాశాలు
వచ్చే రెండ్రోజులు వానలతో పాటు ఉక్కపోత
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోపక్క వడగాడ్పులూ వీస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు దడ పుట్టించిన వడగాడ్పులు ఆ తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకొని, వడగాడ్పులు వీస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఆరంభంలో ఆశాజనకంగానే ప్రభావం చూపాయి.
గత వారంలో ఉత్తరాంధ్రకు విస్తరించాయి. అప్పట్నుంచి ముందుకు కదలకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో వర్షాలు అరకొరగానే కురుస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం కోస్తాంధ్రపైకి పశ్చిమ గాలులు వీస్తుండడం, కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు దోహద పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఒకట్రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఫలితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వడగాడ్పులకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోనూ వడగాడ్పుల అనుభూతి కలుగుతుందని పేర్కొంది.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు..
వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా>శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడ గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోను, బుధవారం అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిత్తమూరు (తిరుపతి)లో 4.2 సెంటీమీటర్లు, నెమలికళ్లు (పల్నాడు)లో 3.9, మంగళగిరి (గుంటూరు)లో 3.5, ఎస్.కోట (విజయనగరం)లో 3.5, నగరి (చిత్తూరు)లో 2.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment