Nighttime
-
పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్‌రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..
తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు. జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
నక్షత్రాలు పూచే దారిలో...
విహంగం ‘కవిత్వం కాగితాల మీదే కనిపిస్తుంది అని అనుకుంటాం గానీ... ఎక్కడైనా కనిపిస్తుంది’ అంటాడు ప్రసిద్ధ చిత్రకారుడు విన్సెంట్ వాంగో. ఆయనన్న ఆ మాట డచ్ ఆర్టిస్ట్, డిజైనర్ డాన్ రూసేగార్డెకు ఇష్టం. అలాగే ఆయన పెయింటింగ్స్ అంటే కూడా. వాంగో పెయింటింగ్‌లో కలర్స్ మాత్రమే కాదు... కవిత్వం కూడా ఉంటుంది! కవిత్వం అంటే సౌందర్యం! ఆ సౌందర్యాన్ని ఎక్కడంటే అక్కడ చూసే వీలున్నప్పుడు... రోడ్డు మీద మాత్రం ఎందుకు చూడకూడదు అనుకున్నాడు రూసేగార్డే ఒక రాత్రి రోడ్డు మీద ప్రయాణిస్తూ. అప్పుడు అతని ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘వెలుగుదారి’. నెదర్‌ల్యాండ్స్‌లోని ఇన్‌దోవెన్ పట్టణంలో కిలోమీటరు మేర ఉన్న ఈ వెలుగు దారిని చూడడానికి, రాత్రివేళల్లో దానిపై ప్రయాణం చేయడానికి వాంగో అభిమానులు మాత్రమే కాదు... దేశ విదేశాల పర్యాటకులంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇన్‌దోవెన్ పట్టణంలో పెద్ద పెద్ద భవంతులను రంగుల లైట్లతో అలంకరిస్తారు. అందుకే ఈ పట్టణాన్ని ‘సిటీ ఆఫ్ లైట్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ‘సిటీ ఆఫ్ లైట్’ కిరీటంలో ‘వాంగో రోడ్డు’ కలికితురాయిగా చేరింది. దాంతో ‘‘కొత్తదారిని చూశాం, కొత్త దారిపై ప్రయాణించాం అనే అనుభూతికి ప్రయాణికులు లోనవడానికే ఈ రోడ్డుకు రూపకల్పన చేశాను. దీనికి దేశీయంగానే కాదు... అంతర్జాతీయంగా కూడా మంచి స్పందన లభిస్తోంది’’ అంటూ మురిసిపోతున్నాడు రూసేగార్డె. వాంగో పుట్టి పెరిగిన బ్రాబంట్ ప్రాంతంలో ‘వాంగో సైకిల్ రూట్’ ఉంది. కిలో మీటరు పొడవైన ఈ అందమైన రోడ్డుపై 50,000 సోలార్-పవర్డ్ స్టోన్స్‌ను అమర్చారు. ఇవి పగలు సూర్యకాంతిని గ్రహించి, రాత్రి వేళల్లో వెలుగుతుంటాయి. ఆకాశం మబ్బుపట్టి, రాళ్లు ఛార్జ్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ‘ఎల్ఈడీ లైట్లు’ రోడ్డును వెలిగేలా చేస్తాయి. మరో విశేషమేమిటంటే ఈ రోడ్డు మీద ముందుకు వెళుతున్న కొద్దీ వాంగో జీవితంతో సంబంధం ఉన్న ఎన్నో ప్రదేశాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ వెలుగుల దూరాన్ని మరింతగా విస్తరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అది విని వారేవా అంటున్నారు అభిమానులు. ‘‘పర్యటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మిత్రుడి ద్వారా వాంగో రోడ్డు గురించి విని ఆశ్చర్యపోయాను. అక్కడికి వెళ్లిన తరువాతగానీ నా మనసు శాంతించలేదు. నా అభిమాన చిత్రకారుడి పేరు మీద ఉన్న దారిలో ప్రయాణిస్తుంటే...భూమి మీద ప్రయాణించినట్లు లేదు ఎక్కడో కళాప్రపంచంలో విహరించినట్లుగా ఉంది’’ అంటున్నాడు వర్ధమాన ఇంగ్లండ్ చిత్రకారుడు డంకెన్ స్మిత్. స్మిత్ నోటి ద్వారా వాంగ్ వెలుగు దారి గురించి విన్న అతని మిత్రులు నెదర్ల్యాండ్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ‘‘ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి ప్రజలెప్పుడూ ఆసక్తికరంగా ఉంటారు. అయితే దాన్ని ఏ మాధ్యమంలో చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. వాంగో చిత్రకళా ఘనతను, చరిత్రను పరిచయం చేయడానికి ఇదొక మంచి మార్గం’’ అంటున్నాడు రూసేగార్డె తన కళల రోడ్డు వైపు చూస్తూ. వాంగో గీసిన పలు చిత్రాల బ్యాక్‌డ్రాప్‌లో ఇన్‌దోవెన్ కనిపించడం గమనార్హం. నెదర్ల్యాండ్స్ ఆర్థికవ్యవస్థకు ‘పర్యాటకం’ అనేది ఎంత కీలకం అన్నది పక్కనపెడితే... పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఏ అవకాశాన్నీ జార విడుచుకోకపోవడం విశేషం. రాజధాని ఆమ్స్టర్డామ్కు మాత్రమే పర్యాటకులు పరిమితం కాకుండా వారు చూసే పర్యాటక క్షేత్రాలు ఎప్పటికప్పుడు పెంచడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులను ఆకర్షించడానికి నెదర్‌ల్యాండ్స్‌కు దొరికిన మంచి అవకాశం... ఈ వాంగో రోడ్డు. వాంగో 125వ వర్థంతి సందర్భంగా రూపొందించిన ఈ వెలుగు దారిలో పయనించడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. వారందరి కోసం సైకిళ్లు అద్దెకివ్వడం, రోడ్డు పరిసరాల్లో వాంగోను గుర్తుకు తెచ్చే కళాకృతులు ఏర్పాటు చేయడంలాంటి మరెన్నో నిర్మాణాత్మకమైన పనులు చేపడుతోంది అక్కడి ప్రభుత్వం. అవి కూడా పూర్తయిపోతే... ‘వాంగో రోడ్డు’ నెదర్లాండ్స్ టూరిటం అభివృద్ధిలో మరింత ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరెందరో కళారాధకుల మనసులను మైమరపింపజేస్తుంది. -
ఉరి
క్లాసిక్ కథ నాకు మీరు ఉరిశిక్ష వేశారు. నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది. ఇప్పుడు చెప్పుకొన్నా ఒకటే చెప్పుకొనకపోయినా ఒకటే. కాని మీరిప్పుడు చెప్పుకోమనటంలో ఒక విశేషం ఉంది. ఎట్లాగూ చస్తున్నాడు కదా! చచ్చింతర్వాత మాట్లాడేది లేదు, పెట్టేది లేదు, ఆ మాట్లాడేది కాస్తా యిప్పుడే మాట్లాడమని. మనుష్యుడై జన్మ యెత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాపి హితులైన మానవులకు సహజ లక్షణం. మీకు నా శరీరం మీద ప్రేమలేదు. నా ఆత్మ మీద ప్రేమ. నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే గనుక, అయినా కాకపోయినా మీరనుకొంటున్నారు గనుక యిది ఒక మామూలు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు, మాట్లాడితే వచ్చే లాభం లేదు. కాని నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరనుకొంటారు. వాళ్ల ఉద్దేశంలో మాట్లాడవలసిందే. ఏమైనా సరే మాట్లాడవలసిందే. బ్రతికియున్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే. బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే. వాళ్లు మీ కన్న మాయాపిహితులు. నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు. ఆ చంపానన్నది నాకు తెలియదు. మీకూ తెలియదు. చంపానని సాక్ష్యం యిచ్చినవాళ్లకీ తెలియదు, నాకు తల్లీ పెళ్లాం బిడ్డలు ఉన్నారు. వాళ్లను పోషించలేక నేను చాలా బాధపడ్డా. వాళ్లకు తిండిలేదు, నాకూ తిండిలేదు. మీ దయవల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను. ఈ రెండు నెలలు వాళ్లేమైనారో నాకు తెలియదు. ఈపాటికి వాళ్లూ చచ్చే ఉంటారు. వాళ్లకన్న నేనే అదృష్టవంతుణ్ని. వాళ్లు చావకముందు మాడిమాడి చచ్చి ఉంటారు, నేను చచ్చేముందు ఏదో యింత అన్నం తినే చస్తున్నా. నేను ఉద్యోగం చేయలేదు. కూలీ నాలీ కుదురలేదు, మోసం చేయలేను. ఎక్కడో నాల్గురాళ్లు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అదివరకు నాల్గురోజులు ఇంటిల్లి పాదీ పస్తున్నాం. నేను నా భార్య ఎల్లాగో అల్లాగా తమాయించుకొన్నాం. పిల్లలు బక్కనరాలై కూర్చున్న చోటునించి లేవలేక యేడ్చేశక్తిగూడా లేక బ్రతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడటం యెలాగా? బియ్యం అమ్మే దుకాణం పెద్దపులల్లే ఇరవై గజాలతోక పెంచుకొని ఆ తోకచివ్వర నేను. నాలుగు రోజులు ఈ తోక చివరితనం పొందలేక పొందలేక విసిగి చివరికి యింటికి వచ్చాను. ఒక ముసలిది నామీద దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకు అమ్మింది. ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడ్దామంటే అవి గొడ్లు తినాలిగాని మనుష్యులు తినరు. నాలుగు పోట్లు వేసి చెరిగేతేనే గాని వండటానికి పనికిరావు. దంచాలి అంటే నాలుగురోజులు తిండిలేని మా యింటిదానికీ ఓపికలేదు, నాకూ లేదు. అయినా పిల్లల స్థితి చూడలేక మా యింటిది ఆ బియ్యం చిరిగిన చీర కొంగున కట్టుకొని పది కొంపలు తిరిగింది. ఒకళ్లు విసిరికొట్టారు, మరి ఒకళ్లు - వాళ్ల యింట్లో నోమట. అట్లకోసం పిండి దంచుకొంటున్నారు. అన్ని యిళ్లూ ఇట్లాగే అయినవి. చివరికా బియ్యమే పొయ్యి రాళ్లమీద పెట్టింది మా యింటిది, పొయ్యి క్రింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచెపుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరితెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మా మొగుడి సొమ్మనుకొన్నావు’’ అనివచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. ఇంటికి వచ్చాను, ఇల్లంటే నవ్వు వస్తోంది. ఎవరిదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో యెవళ్లూ కాపురానికి లేరు. ఆ గోడక్రింద ఉంటున్నాం, అదేయిల్లు, పైన పుల్లాపుడకా పెట్టి తలలు మాత్రం దానిక్రింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా యింటికి ఆధారం చేసింది. నేను వెళ్లేటప్పటికి ఆ ఆధారం తీసి దానితో మంట వేస్తోంది. ఈ ఆధారం ఎక్కువా? పిల్లల కడుపు మంట యెక్కువా? మరునాడు మా పిల్లల స్థితి చూడ కడుపులో నొప్పితో మెలి తిరిగిపోయినారు. నాలుగు వాము పరకలు తెద్దామంటే చేతిలో ఉన్న నాలుగణాలు నిన్నటి ముసలమ్మే కాజేసింది. మళ్లీ తర్వాత నాలుగురోజుల వరకు బియ్యం లేవు, పిల్లల కడుపునొప్పులూ తగ్గలేదు. మా యింటిది లేవనే లేకపోయింది. నేనట్టాగే తిరుగుతున్నాను. ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు. నేను వాళ్లెక్కడికి వెళుతున్నారని అడిగాను. అందరికీ బియ్యం ఇస్తారట అని చెప్పారు. నేను వాళ్ల వెంట వెళ్లాను, వాళ్లు వందా రెండువందలమంది ఉన్నారు. జనం ఒకచోటికి వెళ్లారు. జనం కేకలూ బొబ్బలూ నానా హంగామా ఉంది. ఒక యింటి దగ్గర ఆగారు. ముందర యేమి జరుగుతోందో నాకు తెలియదు. నేను వెనక ఉన్నాను. బియ్యం కోసం త్రొక్కిళ్లాడుతున్నారనుకొన్నాను. చుట్టుప్రక్కల యిళ్లవాళ్లందరూ కొందరు, తలుపులు వేసికొన్న వాళ్లు కొందరు తొంగిచూచేవాళ్లుగా కన్పించారు. కొంతసేపటికి రక్షకభటులు వచ్చారు. నేననుకొన్నాగదా ‘అమ్మయ్యా వీళ్లువచ్చారుగదా అందరికీ సరిగ్గా పంచిపెట్టిస్తారు’ అని. క్రమక్రమంగా నాకు తెలిసింది ఈ గుంపుకీ ఆ రక్షకభటులకీ దెబ్బలాట జరుగుతోందని. ఇంతలో రక్షకభటులు తుపాకులు కాల్చారు. ఈ గుంపులోంచి రక్షకభటుల మీద రాళ్లు విసురుతున్నారు. వ్యవహారం యెప్పుడైతే ముదిరిందో నాకెందుకురా బాబూ ఇది పోదామనుకొన్నాను. కాని పోవటమెట్లా? ఆట వరకు నెల్లాళ్లబట్టి తిండి లేదు. వారానికొకసారి యేదో తినీతిననట్టు తిన్నా నా ఒంట్లో ఓపిక లేదు. మనిషిని మరీ అబ్బనా కొరివి రాదు గనుక మనుష్యాకృతిలో లోపం లేదు. రక్షకభటులలో కొందరికి దెబ్బలు తగిలినవి. ఒకడు రాయి కణతకు తగిలి చచ్చాడు, ఆ రాయి ఆ చుట్టుప్రక్కలవాడెవడు విసిరాడో నాకు తెలియదు. పైగా చంపడంలో యిన్ని భేదాలేమిటి? రాయి తగిలితే చచ్చి, తుపాకీ గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకీ గుండు తగిలిస్తే శిక్ష లేదూ! రాయి తగిలి చస్తే శిక్ష? ఆ కళ్లులేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు. రాయి విసరటం మాట అట్లా ఉంచండి. నేను చేయి యెత్తగలిగితే చాలు! ఆ స్థితిలో ఉన్నాను. రక్షకభటులు తరిమారు. అందరూ పారిపోతున్నారు. నేనూ పారిపోతున్నాను. పరిగెత్తేందుకు నాకు ఓపిక యేది? వెనక నుంచి నా నెత్తిమీద పెద్ద దెబ్బపడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు. ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. గాఢాంధకారంలో కూర్చొని ఉన్నా, మరునాటి ప్రొద్దుటికి తెలిసింది నాకు అది ఖైదని. ఒకటి రెండు పూటలైన తర్వాత నాకన్నం పెట్టారు. అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చినవి. వెంటనే పిల్లలు జ్ఞాపకం వచ్చారు. వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టాను. మరునాటికి తెలిసింది యింక వాళ్లు నా దగ్గరకు రారని. వాళ్లేమైనారో! ఏమైనారో యెవడికి కావాలి? పూటపూటా అన్నం తినటం నాకూ అలవాటైంది. నా పని రాజభోగంగా ఉంది. రెండు పూటలా తిండి. ఎక్కడికైనా తీసుకొనివెళితే మోటారు కారులో తీసుకొనివెళ్లారు. పెద్దకోర్టుల్లో కూడ నా కోసం ఒక ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశయెత్తుకొంది. ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా ఆ వెనుక కూడా సాగిస్తే యెంతబాగుండేది. ఇంతకన్న యేమిచెప్పను? నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్లు బ్రతకండి. బ్రతుకంతా తిండిలేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండిపెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. కాని నా యింటిదీ, పిల్లలు ఏమైనారో తెలియలేదు, నాకు ఒక్కటే చింతగా ఉంది - నా పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయితే, ఎలాగోలాగా పెద్దవాళ్లు అయితే చివరిరోజుల్లో వాళ్లకుగూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని. అదంతా మీ దయ, వాళ్లని వెదికించి యీ ఉపకారం చేయిస్తే మీ కడుపున పుడ్తాను. చివరికా బియ్యమే రాళ్ల పొయ్యి మీద పెట్టింది మా యింటిది, పొయ్యి కింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచె పుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరి తెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మ మొగుడి సొమ్మనుకొన్నావు’’ అని వచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ -
రాత్రి వేళల్లో ‘డబుల్ డెక్కర్’?
సాక్షి, హైదరాబాద్: పగటి వేళల్లో మాత్రమే పరుగులు పెడుతున్న డబుల్ డెక్కర్ రైలును రాత్రివేళ నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన రెండు సర్వీసులు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాచిగూడ- తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఆక్యుపెన్సీ రేటు సగటున 36 శాతం, కాచిగూడ-విజయవాడ సర్వీసుకు 38 శాతం మాత్రమే. ఇవి పగటివేళ తిరుగుతుండడం, కేవలం కూర్చునే వీలు మాత్రమే ఉండడంతో చాలామంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైళ్లల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సర్వీసులను రాత్రి వేళల్లో నడిపితే ఎలా ఉంటుందన్న విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసేందుకు ఆయన ఒప్పుకొన్నట్లు సమాచారం.