నక్షత్రాలు పూచే దారిలో... | Famous painter Vincent vango story | Sakshi
Sakshi News home page

నక్షత్రాలు పూచే దారిలో...

Published Sun, Aug 16 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

నక్షత్రాలు పూచే దారిలో పయనం... మరపురాని మధురానుభవం: నెదర్‌ల్యాండ్‌‌సలో వెలిగే రోడ్డు

నక్షత్రాలు పూచే దారిలో పయనం... మరపురాని మధురానుభవం: నెదర్‌ల్యాండ్‌‌సలో వెలిగే రోడ్డు

విహంగం
‘కవిత్వం కాగితాల మీదే కనిపిస్తుంది అని అనుకుంటాం గానీ... ఎక్కడైనా కనిపిస్తుంది’ అంటాడు ప్రసిద్ధ చిత్రకారుడు విన్‌సెంట్ వాంగో. ఆయనన్న ఆ మాట డచ్ ఆర్టిస్ట్, డిజైనర్ డాన్ రూసేగార్డెకు  ఇష్టం. అలాగే ఆయన పెయింటింగ్స్ అంటే కూడా. వాంగో పెయింటింగ్‌లో కలర్స్  మాత్రమే కాదు... కవిత్వం కూడా ఉంటుంది! కవిత్వం అంటే సౌందర్యం!  ఆ సౌందర్యాన్ని ఎక్కడంటే అక్కడ చూసే వీలున్నప్పుడు... రోడ్డు మీద మాత్రం ఎందుకు చూడకూడదు అనుకున్నాడు రూసేగార్డే ఒక రాత్రి రోడ్డు మీద ప్రయాణిస్తూ. అప్పుడు అతని ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘వెలుగుదారి’.
 

నెదర్‌ల్యాండ్స్‌లోని ఇన్‌దోవెన్ పట్టణంలో కిలోమీటరు మేర ఉన్న ఈ వెలుగు దారిని చూడడానికి, రాత్రివేళల్లో దానిపై ప్రయాణం చేయడానికి వాంగో అభిమానులు మాత్రమే కాదు... దేశ విదేశాల పర్యాటకులంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇన్‌దోవెన్ పట్టణంలో పెద్ద పెద్ద భవంతులను రంగుల లైట్లతో అలంకరిస్తారు. అందుకే ఈ పట్టణాన్ని ‘సిటీ ఆఫ్ లైట్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ  ‘సిటీ ఆఫ్ లైట్’ కిరీటంలో ‘వాంగో రోడ్డు’ కలికితురాయిగా చేరింది. దాంతో ‘‘కొత్తదారిని చూశాం, కొత్త దారిపై ప్రయాణించాం అనే అనుభూతికి ప్రయాణికులు లోనవడానికే ఈ రోడ్డుకు రూపకల్పన చేశాను.

దీనికి దేశీయంగానే కాదు... అంతర్జాతీయంగా కూడా మంచి స్పందన లభిస్తోంది’’ అంటూ మురిసిపోతున్నాడు రూసేగార్డె. వాంగో పుట్టి పెరిగిన బ్రాబంట్ ప్రాంతంలో ‘వాంగో సైకిల్ రూట్’ ఉంది. కిలో మీటరు పొడవైన  ఈ  అందమైన రోడ్డుపై 50,000 సోలార్-పవర్డ్ స్టోన్స్‌ను అమర్చారు. ఇవి పగలు సూర్యకాంతిని గ్రహించి, రాత్రి వేళల్లో వెలుగుతుంటాయి. ఆకాశం మబ్బుపట్టి, రాళ్లు ఛార్జ్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ‘ఎల్‌ఈడీ లైట్లు’ రోడ్డును వెలిగేలా చేస్తాయి. మరో విశేషమేమిటంటే ఈ రోడ్డు మీద ముందుకు వెళుతున్న కొద్దీ వాంగో జీవితంతో సంబంధం ఉన్న ఎన్నో ప్రదేశాలు కనిపిస్తాయి.

భవిష్యత్తులో ఈ వెలుగుల దూరాన్ని మరింతగా విస్తరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అది విని వారేవా అంటున్నారు అభిమానులు.
 ‘‘పర్యటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మిత్రుడి ద్వారా వాంగో  రోడ్డు గురించి విని ఆశ్చర్యపోయాను. అక్కడికి వెళ్లిన తరువాతగానీ నా మనసు శాంతించలేదు. నా అభిమాన చిత్రకారుడి పేరు మీద ఉన్న దారిలో ప్రయాణిస్తుంటే...భూమి మీద ప్రయాణించినట్లు లేదు  ఎక్కడో కళాప్రపంచంలో విహరించినట్లుగా ఉంది’’ అంటున్నాడు వర్ధమాన ఇంగ్లండ్ చిత్రకారుడు డంకెన్ స్మిత్.
 
స్మిత్ నోటి ద్వారా వాంగ్ వెలుగు దారి గురించి విన్న అతని మిత్రులు నెదర్‌ల్యాండ్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ‘‘ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి ప్రజలెప్పుడూ ఆసక్తికరంగా ఉంటారు. అయితే దాన్ని ఏ మాధ్యమంలో చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. వాంగో చిత్రకళా ఘనతను, చరిత్రను పరిచయం చేయడానికి ఇదొక మంచి మార్గం’’ అంటున్నాడు రూసేగార్డె తన కళల రోడ్డు వైపు చూస్తూ. వాంగో గీసిన పలు చిత్రాల బ్యాక్‌డ్రాప్‌లో  ఇన్‌దోవెన్ కనిపించడం గమనార్హం.
 
నెదర్‌ల్యాండ్స్ ఆర్థికవ్యవస్థకు ‘పర్యాటకం’ అనేది ఎంత కీలకం అన్నది పక్కనపెడితే... పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఏ అవకాశాన్నీ జార విడుచుకోకపోవడం విశేషం. రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కు మాత్రమే పర్యాటకులు పరిమితం కాకుండా వారు చూసే పర్యాటక క్షేత్రాలు ఎప్పటికప్పుడు పెంచడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులను ఆకర్షించడానికి నెదర్‌ల్యాండ్స్‌కు దొరికిన మంచి అవకాశం... ఈ వాంగో రోడ్డు.
 
వాంగో 125వ వర్థంతి సందర్భంగా రూపొందించిన ఈ వెలుగు దారిలో పయనించడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. వారందరి కోసం సైకిళ్లు అద్దెకివ్వడం, రోడ్డు పరిసరాల్లో వాంగోను గుర్తుకు తెచ్చే కళాకృతులు ఏర్పాటు చేయడంలాంటి మరెన్నో నిర్మాణాత్మకమైన పనులు చేపడుతోంది అక్కడి ప్రభుత్వం. అవి కూడా పూర్తయిపోతే... ‘వాంగో రోడ్డు’ నెదర్లాండ్స్ టూరిటం అభివృద్ధిలో మరింత ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరెందరో కళారాధకుల మనసులను మైమరపింపజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement