వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్‌ ఎవరు? | Stars in New Getups: Tollywood | Sakshi
Sakshi News home page

వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్‌ ఎవరు?

Published Wed, Jul 10 2024 12:07 AM | Last Updated on Wed, Jul 10 2024 2:08 PM

Stars in New Getups: Tollywood

వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్‌ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్‌. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్‌లో ఆ స్టార్స్‌ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

⇒ మేకోవర్, కొత్త గెటప్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్‌ ఒకరు. ‘పితామగన్‌’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్‌ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్‌’లోనూ విక్రమ్‌ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్‌’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్‌ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్‌ కూడా పూర్తి డీ–గ్లామరస్‌గా, ఆడియన్స్‌ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.

⇒ తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్‌ రోల్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్‌ దుషారా విజయన్‌. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్‌’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్‌ రోల్స్‌లోనే కనిపిస్తారు. సందీప్‌ కిషన్, కాళిదాసు ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. నార్త్‌ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్‌ కానుంది.

⇒ కథ డిమాండ్‌ చేస్తే అందులోని గెటప్‌లోకి అవలీలగా మారిపోతారు కమల్‌హాసన్‌. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్‌ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్‌లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్‌ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్‌లో సర్‌ప్రైజ్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్‌ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్‌లోనే చూడాలి. ఇక శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్‌ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. 

⇒ డిఫరెంట్‌ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించడంలో ధనుష్‌ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్‌ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్‌ బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తారట.

⇒ మాస్‌ హీరో అనిపించుకున్న విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ ఫస్టాఫ్‌ అబ్బాయిగా, సెకండాఫ్‌ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ  రామ్‌నారాయణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్‌ గెటప్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్‌కుమార్‌ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్‌ కానుంది.

ఇలా గుర్తు పట్టలేని గెటప్‌కి సై అని, సవాల్‌గా తీసుకుని నటిస్తున్న స్టార్స్‌ మరికొందరు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement