బాక్సాఫీస్‌ను లూటీ చేయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్‌వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్స్‌గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్‌స్టార్స్ గురించి తెలుసుకుందాం.
గ్యాంగ్‌స్టర్ రంగరాయ
గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా మారారు కమల్‌హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్‌హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్‌మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్‌హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
స్టూడెంట్ టు గ్యాంగ్‌స్టర్
‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్‌తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట.
ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఇది జీవీ ప్రకాశ్‌కు నూరవ చిత్రం కావడం విశేషం.
ఇటు చెన్నై... అటు ముంబై
తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్‌లు మెయిన్‌టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్‌రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్‌లో యాభైవ చిత్రం కావడం విశేషం.
ఓ గ్యాంగ్‌స్టర్ చెఫ్‌గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్‌స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్‌స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్‌ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది.
నాగార్జున ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్‌ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాలతో పాటు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment