న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment