
వేసవికి యాసంగి సాగు తోడు కావడంతో భారీగా విద్యుత్ వినియోగం
ఈ నెల 20న డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డు
ప్రస్తుత మార్చి, ఏప్రిల్ నెలల్లో 17,500 మెగావాట్లకు చేరనున్నట్టు అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓ వైపు వేసవి తాపం పెరగడం.. మరోవైపు బోరుబావుల కింద పెద్ద మొత్తంలో యాసంగి పంటల సాగు జరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగిపోతోంది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈనెల 20న 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది. గతేడాది మార్చి 8న రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు ఇదే అత్యధికం. ఫిబ్రవరి 6న గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,752 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించగా, నాటి నుంచి రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది.
గత నెలలోనే 16 వేల మెగావాట్లు, ఆ తర్వాత 17 వేల మెగావాట్ల మైలురాళ్లను దాటింది. గత ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు గడిచిన 39 రోజుల్లో ఏకంగా 31 పర్యాయాలు రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లు, ఒకసారి 17 వేల మెగావాట్లకు మించిపోయింది. గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడంలో ఈ ఏడాది విద్యుత్ సంస్థలు సఫలమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్ 17,500 మెగావాట్లకు చేరవచ్చని ట్రాన్స్‌కో అంచనా వేసింది.
ఎక్స్ఛేంజీల నుంచి రోజూ 80 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లు
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుపుతోంది. రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 290–335 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా, అందులో 50–80 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దక్షిణాది రీజియన్‌లో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీల (ఐఈఎక్స్) రోజువారీగా విక్రయిస్తున్న మొత్తం విద్యుత్‌లో 80– 90 శాతాన్ని తెలంగాణనే కొనుగోలు చేస్తోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో యూనిట్‌కు రూ.10 గరిష్ట ధరతో పవర్ ఎక్స్ఛేంజీలు విద్యుత్‌ను విక్రయిస్తుండగా డిమాండ్ లేని సమయాల్లో యూనిట్‌కు రూ.2.5 కనిష్ట ధరతో విక్రయిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కోసం నిత్యం సగటున రూ.50 కోట్ల మేర డిస్కంలు వెచ్చిస్తున్నాయి.
పేరుకే 20 వేల మెగావాట్ల సరఫరా సామర్థ్యం
రాష్ట్రం 20,275 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని (కాంట్రాక్ట్ కెపాసిటీ) కలిగి ఉంది. అందులో ప్రధానంగా జెన్‌కోకి సంబంధించిన 4,842.5 మెగావాట్ల థర్మల్, 2,442.76 మెగావాట్ల జలవిద్యుత్‌తో పాటు 1,200 మెగావాట్ల సింగరేణి, 3186.76 మెగావాట్ల కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌తో పాటు 839.45 మెగావాట్ల సెమ్‌కార్ప్ విద్యుత్ ఉంది. అయితే 1,000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్, 807.31 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ సరఫరా జరగడం లేదు. దీంతో రాష్ట్ర వాస్తవ విద్యుత్ సరఫరా సామర్థ్యం 18,467.69 మెగావాట్లకు తగ్గిపోయింది. ఇందులో 6,123 మెగావాట్ల సౌర విద్యుత్ లభ్యత పగటి పూటే ఉండనుంది.