సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది.
బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది.
జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు
నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్‌లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి.
= రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
= రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి.
ప్రోత్సాహకాలివీ..
–పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు.
–డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు.
–సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు.
–ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు.
–భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
– ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు.
–పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది.
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
Published Sun, Nov 17 2024 5:50 AM | Last Updated on Sun, Nov 17 2024 5:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment