మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 10 శాతం..
కనీసం 500 మెగావాట్ల ప్లాంట్ పెడితేనే ఈ రాయితీలు
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025లో ప్రకటించిన ప్రభుత్వం
గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు
ఎలక్ట్రోలైజర్ ప్లాంట్, ముడి పరికరాలపై 30% పెట్టుబడి రాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్(Green Energy), అనుబంధ ఉత్పత్తుల (డెరివేటివ్స్) పరిశ్రమ లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఎలక్ట్రోలైజర్ ఆధా రిత గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్లాంట్లను స్థాపించే డెవలపర్లకు ఎలక్ట్రోలైజర్ స్టాక్ ప్లాంట్, పరికరాలపై 30 శాతం పెట్టుబడి రాయితీని అందించనుంది. ప్రతి మెగావాట్‌కి/ 1,400 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి రూ.కోటి చొప్పున రూ.30 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి ఒక్కో ప్లాంట్‌కు పెట్టుబడి రాయితీ ఇస్తామని ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’(Green Energy Policy 2025) ప్రభుత్వం హామీ ఇచ్చింది.
‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలు..
ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్‌తో సహా) పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పాలసీలో ప్రాధాన్యతనిచ్చింది. ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్‌తో సహా) వ్యయంలో 30 శాతాన్ని పెట్టుబడి రాయితీగా అందించనుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి సబ్సిడీలు ఇస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ పరిశ్రమల స్థాపనకు పెట్టే పెట్టుబడులపై 25 శాతాన్ని రాయితీగా ప్రభుత్వం అందించనుంది. కనీసం 500 మెగావాట్ల వార్షిక ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
గ్రీన్ హైడ్రోజన్/డెరివేటివ్స్, ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమలకు వర్తించే కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు..
⇒ రాష్ట్రంలో జరిపే గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలపై 100 శాతం ఎస్‌జీఎస్టీని 5 ఏళ్ల పాటు రీయింబర్స్ చేస్తారు.
⇒ ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలపై ఏడేళ్ల పాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు.
⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలకు 10 ఏళ్ల పాటు, ఎలక్ట్రోలైజర్ పరిశ్రమలకు 5 ఏళ్ల పాటు 100 శాతం విద్యుత్ పన్ను మాఫీ.
⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు రాష్ట్ర డిస్కంల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ.3 చొప్పున 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులను తిరిగి చెల్లిస్తారు. ఎలక్టోల్రైజర్ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్‌పై రూపాయి చొప్పున ఈ రాయితీ వర్తిస్తుంది.
⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమల ఏర్పాటుకు కొనుగోలు చేసే స్థలాలకు 100 శాతం స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
ఎలక్ట్రోలైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు
⇒ రూ.2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం వరకు క్వాలిటీ సర్టిఫికేషన్ చార్జీలను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.
⇒ పేటెంట్ ఫైలింగ్ చార్జీల్లో 50 శాతాన్ని రూ.2 లక్షల పరిమితికి లోబడి చెల్లిస్తారు.
⇒ మహిళలు ఏర్పాటుచేసే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రూ.10 లక్షల పరిమితికి లోబడి అదనంగా 10 శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇస్తారు.
⇒ గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి 30 శాతం పెట్టుబడి రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది తొలి 10 యూనిట్లకు మాత్రమే.
గ్రీన్ హైడ్రోజన్ అంటే ?
గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన ఇంధన వనరు. సౌర విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టుతారు. కాలుష్య రహిత సౌర, ఇతర పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి ఇలా తయారు చేసిన హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. వాహనాలతో పాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్న సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగిస్తే ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని అందుకోవచ్చని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సౌర, పవన విద్యుత్‌తో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసుకుని అవసరమైనప్పుడు ఇంధనంగా వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment