
వాన్‌గార్డ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం..
నాలుగేళ్లలో 2,300 ఉద్యోగ అవకాశాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘వాన్‌గార్డ్’ తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు.. రానున్న నాలుగేళ్లలో 2,300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది, వాన్‌గార్డ్ దాదాపు ఐదు కోట్ల మంది పెట్టుబడిదారులతో సుమారు 10.4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా కొనసాగుతోంది.
వాన్‌గార్డ్ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఈవో, ఎండీ నితిన్ టాండన్, మానవ వనరుల ప్రధానాధికారి జాన్ కౌచర్, జీసీసీ–ఇండియా వాన్‌గార్డ్ హెడ్ వెంకటేశ్ నటరాజన్‌లు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం వాన్‌గార్డ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఈ సంవత్సరం చివరి నాటికి నగరంలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఈ జీసీసీ ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేస్తుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌లో వాన్‌గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం భరోసా ఇచ్చారు. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందని సలీం రాంజీ తెలిపారు.