power distribution companies
-
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్‌లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది.. వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు. ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది.. వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో. ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది.. వాస్తవం : తక్కువ ధరకు కోట్‌చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్‌వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్మోహన్రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు? ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది.. వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి. ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ. వివిధ కంపెనీల ట్రాన్స్ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఎస్ఐ) టెస్ట్‌చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్‌స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్‌తో ఫైవ్‌స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. ఆరోపణ : కడప కంపెనీదే హవా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్‌గేర్, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్‌విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి. ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది.. వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి. -
వెలుగు వెనుక..చీకటి చరిత్ర!
సాక్షి, అమరావతి: తనకు నచ్చిన అంశాలను మాత్రమే ఇతరులతో పోల్చే ఈనాడు రామోజీకి పొరుగింటి పుల్లకూర బాగా నచ్చినట్లుంది!! విద్యుత్తు సంస్థల మెడకు అప్పుల గుదిబండ వేలాడదీసి రూ.30 వేల కోట్ల అప్పులను ఐదేళ్లలో దాదాపు రూ.70 వేల కోట్లకు చేర్చిన చంద్రబాబు నిర్వాకాలను మాత్రం పొరపాటున కూడా పోల్చే సాహసాన్ని చేయరు! ఆయన ఈనాడూ, ఏనాడూ దీని గురించి ప్రస్తావనే తీసుకురారు. అడ్డగోలు పీపీఏలు, పాతికేళ్ల ఒప్పందాలతో గత సర్కారు ప్రజాధనాన్ని పీల్చి పిప్పి చేసినా అబ్బే అదే బాగుందంటారు!! విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో మైనస్ రూ.4,315 కోట్లు ఉంటే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి దారుణంగా క్షీణించి మైనస్ రూ.20 వేల కోట్లకు చేరింది. ఇక సబ్సిడీ, రాయితీలు, ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల కింద గత సర్కారు పంపిణీ సంస్థలకు రూ.20,167 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు నాలుగేళ్లలోనే రూ 48,090 కోట్లు చెల్లించారు. టీడీపీ సర్కారు చెల్లింపులతో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. మరి ఈ విషయాలన్నీ చెబుతుంటే ఈనాడుకు షాక్ కొడుతుందేమో!! ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకట్లో కూరుకుపోతుందని ప్రచారం చేసిందెవరో సూటిగా చెప్పకుండా ఎందుకీ డొంక తిరుగుడు? విభజన అనంతరం వాడుకున్న విద్యుత్తుకు సంబంధించి దాదాపు రూ.7 వేల కోట్ల బకాయిలను మన రాష్ట్రానికి ఇంతవరకు చెల్లించని తెలంగాణతో ఏపీని పోల్చుతూ ఈనాడు ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను (పీపీఏ) ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే వదిలేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం కరెంట్ కోతలతో చీకట్లో ఉండేదని డిస్కంలు పేర్కొన్నాయి. మొండి బాకీ వసూలు కాక.. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ స్థాపక సామర్ధ్యం అధికం. అయితే అప్పటికే ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని, పీపీఏ నిష్పత్తి ప్రకారం విద్యుత్‌ను పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)కు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపడం వల్ల ఎంత లోడ్ వాటా పెరుగుతుందో దానికి సరిపడా నిష్పత్తి పెంచారు. దాని ప్రకారం పీపీఏలలో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 49.11 శాతం వాటాగా నిర్దేశించారు. విభజన తేదీకి లోడ్ ప్రకారం ఏపీకి రోజుకి 22 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 1,000 మెగావాట్లు బేస్ లోడ్ కొరత ఉంది. విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి ఎక్కడిది అక్కడి రాష్ట్రానికే అని చట్టంలో పొందుపరచి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు మిగులు, తెలంగాణకు కొరత ఉండేది. అదనపు విద్యుత్ కోసం తీసుకున్న చర్యలు.. కృష్ణపట్నం మూడో యూనిట్ పనులు 2014–19 మధ్య 90 శాతం పూర్తైనట్లు ఈనాడు ప్రచురించిన కథనంలో నిజం లేదు. రెండేళ్ల పాటు కోవిడ్ పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత ఆర్థిక సంవత్సరం మార్చిలో మూడో యూనిట్లో వాణిజ్య ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గ్రిడ్ అనుసంధానం (సింక్రనైజేషన్)– వాణిజ్య కార్యకలాపాల ప్రారంభం (సీవోడీ) మధ్య ఏడెనిమిది నెలల నుంచి ఏడాది వరకూ సమయం పట్టడం సాధారణం. కృష్ణపట్నం మొదటి దశ ప్రాజెక్టులను 2014లో సింక్రనైజేషన్ చేయగా దాదాపు ఏడాది తర్వాత 2015లో సీవోడీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు హిందుజా విద్యుత్ కేంద్రం నుంచి 1,040 మెగావాట్ల పీపీఏను పునరుద్ధరించారు. సెంబ్‌కార్ప్ నుంచి 625 మెగావాట్లను అతి తక్కువ ధర (యూనిట్ రూ.3.84)కు కొనుగోలు చేసేలా 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023 డిసెంబర్ నుంచి అది అందుబాటులోకి రావాల్సి ఉన్నా అనూహ్య కొరత కారణంగా ముందస్తుగా ఫిబ్రవరి నుంచే విద్యుత్ సేకరణ ప్రారంభమైంది. వీటీపీఎస్ స్టేజ్ 5లో 800 మెగావాట్ల ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించి ట్రయల్ రన్ పనులు జరుగుతున్నాయి. వీటీపీఎస్ ఎనిమిదో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడంతో డిసెంబర్ కల్లా ఈ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కొనుగోలు వ్యయాన్ని తగ్గిస్తూ.. దాదాపు 20 కేంద్ర విద్యుత్ కేంద్రాల్లో 625 మెగావాట్ల అధిక ధర థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వడం వల్ల ఏటా రూ.625 కోట్లు స్థిర చార్జీల రూపంలో మిగులుతున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించిన ఆలస్య చెల్లింపుల సర్ చార్జీ స్కీములో చేరడంతో తక్కువ వడ్డీ రుణంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థల బకాయిలన్నీ తీర్చారు. దీంతో సర్ చార్జీ నుంచి డిస్కంలకు విముక్తి లభించింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలం పాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెకీ’ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం జరిగింది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువకే వస్తుంది. విశాఖ, విజయవాడలో.. విశాఖ నగరంలో అత్యాధునిక భూగర్భ విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఇది ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని అంతరాయం లేకుండా సరఫరా చేస్తుంది. విజయవాడలో కూడా విద్యుత్ సరఫరా నియంత్రణకు అన్ని 33/11 కేవీ ఉపకేంద్రాలను అనుసంధానించి ‘స్కేడా’ సిస్టం అభివృద్ధి చేస్తున్నారు. ఆటోమేషన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కొత్త సబ్ స్టేషన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఖర్చు ప్రభుత్వానిదే రాష్ట్రంలో మొత్తం వినియోగంలో 18 శాతం నుంచి 20 శాతం వరకు వ్యవసాయ రంగంలో నమోదవుతోంది. కచ్చితత్వంతో ఈ విద్యుత్‌ను లెక్కించకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టం అవుతోంది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం వ్యవసాయ వినియో గదారులకు మీటర్లు బిగించాల్సి ఉంది. దీనికయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ సంస్థలపైన గా>నీ, రైతులపైనగానీ ఒక్క రూపాయి కూడా భారం పడదు. వ్యవసాయ కనెక్షన్లలో దేశంలోనే రికార్డు.. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు అమలు జరగడం లేదు. ఖర్చుకు వెనుకాడకుండా (సీలింగ్ యూనిట్ రూ.10) సేకరించి సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2022–23లో రాష్ట్రంలో 25,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా రికార్డు స్థాయిలో 1,27,959 కనెక్షన్లు రైతులకు మంజూరైనట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 3.4 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కనెక్షన్లు ఇవ్వలేదు. అప్పుల నుంచి అభివృద్ధి దిశగా.. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల అప్పులు దాదాపు రూ.29,700 కోట్లు కాగా 2019 మార్చి నాటికి గత సర్కారు హయాంలో రూ.68,600 కోట్లకు (131 శాతం పెరుగుదల) చేరుకున్నాయి. 2023 మార్చి నాటికి రూ.97,500 కోట్లకు (42శాతం పెరుగుదల) చేరాయి. గత సర్కారు సబ్సిడీ, రాయితీలు, ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల కింద డిస్కంలకు రూ.20,167 కోట్లు చెల్లిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.48,090 కోట్లు చెల్లించింది. -
విద్యుత్ వినియోగానికి పరిమితులు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం ప్రకటించాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్ని రంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్‌గానీ లేదు. సెప్టెంబర్ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్–సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు అభ్యర్థన పంపించాయి. ఆ అభ్యర్థన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండ్‌తో పరిశ్రమలకు ఊరట రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిగా తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్షలో అభిప్రాయానికి వచ్చారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి అమలు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి కారణంగా.. కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో పరిమితి–నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని కమిషన్‌కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. రోజుకి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.9.10 వెచ్చించి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రావిుక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్‌గానీ, విద్యుత్ వాడకంలో పరిమితులుగానీ లేవని తెలియజేస్తున్నాం. – కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే
సాక్షి, అమరావతి: గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అంగీకారం తెలిపింది. రేపటి (ఈ నెల 5వ తేదీ) నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్ హాలిడేకి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథీ్వతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గృహ, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కొంత ఇబ్బందికరంగా ఉంటోంది. రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇంకా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయానికి బోర్లపై ఆధారపడిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ స్థితి, ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్ వినియోగంపై కొన్ని నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్ హాలిడే అమలు చేస్తున్నామని, విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చని వారు సూచించారు. ఇవీ నిబంధనలు ♦ పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికోరోజు వారాంతపు సెలవులకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయాలి. ♦ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాలి. ♦ సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్ వినియోగానికి అనుమతించేది లేదు. ♦ పరిశ్రమలు రోజువారీ విద్యుత్ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి. ♦ ఈ పవర్ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్ చేస్తారు. ♦ ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుంది. ♦ నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలపై కమిషన్ నిర్దేశించిన జరిమానా చార్జీలు విధిస్తారు. ♦ ఈ నియంత్రణ చర్యల నుంచి బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య ఆక్సిజన్ ప్లాంట్లు, రైస్ మిల్లింగ్ యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంది. ♦ రోజూ విద్యుత్ సరఫరా తీరును సమీక్షించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారు. -
‘కోతల’ కథలు మీ బాబు కోసమేగా రామోజీ..
సాక్షి, అమరావతి : ఆగస్టు నెలలో గత వందేళ్లలో కనీవినీ ఎరుగని ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమై కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు చాలా అరుదుగా తలెత్తుతుంటాయని భారత వాతావరణ శాఖ స్వయంగా ప్రకటించింది. అయినా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రణాళికాబద్ధంగా, ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా పీక్‌లోడ్ సమయంలో సైతం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కనీస స్థాయికి తగ్గించగలిగాయి. వాస్తవం ఇది కాగా.. నిరంతరం కోతలు విధించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ శీర్షికతో శుక్రవారం ఈనాడు తప్పుడు కథనాన్ని అచ్చేసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితులు, ఇందుకు కారణాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చాల్సిందిపోయి బాధ్యతారాహిత్యంగా.. వరుసగా అసత్య కథనాలను ఈనాడు అడ్డగోలుగా వండి వారుస్తోంది. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడానికే కోతల పథకం ప్రవేశపెట్టిందంటూ ప్రభుత్వంపై బురదజల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు నెలవారీ సాధారణ ప్రణాళిక ప్రకారం వివిధ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అంచనాలు తయారుచేసుకుంటాయి. విద్యుత్ కేంద్రాలు డిస్పాచ్ ప్రణాళికను సాధారణంగా ఒక నెల ముందుగానే సిద్ధంచేసుకుంటాయి. ఈ అంచనాలతోనే జల, పవన, థర్మల్, సౌర విద్యుత్ కేంద్రాలు విద్యుత్ లభ్యతను పొందుపరుస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రామోజీ దిగజారుతున్నారని ఈనాడు కథనం స్పష్టంచేస్తోంది. దారుణంగా పడిపోయిన జల, పవన విద్యుదుత్పత్తి.. ప్రతికూల వాతావరణంతో జల, పవన విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి ఈ ఏడాది ఆగస్టులో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఆగస్టులో జలవిద్యుత్ ఉత్పత్తి 680 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 208 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తి పడిపోయింది. పవన విద్యుదుత్పత్తి ఒక్కోసారి 2,500 మెగావాట్ల నుంచి 150–200 మెగావాట్లకు దారుణంగా తగ్గిపోయింది. మరోవైపు.. మండు వేసవిని మరిపించేలా రాష్ట్రంలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల గృహావసరాల రంగంతోపాటు అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. వర్షపాత లేమివల్ల కాలువలు చెరువులు నిండక రైతులు కూడా సాగునీటి కోసం ఈ నెలలో విద్యుత్ పంపుసెట్లపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఆగస్టులో కనీస స్థాయికి చేరాల్సిన వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దానివల్ల గ్రిడ్ మీద తీవ్ర ఒత్తిడి పడింది. ఒక్కసారిగా విద్యుదుత్పత్తి పెరుగుతుందా? ఇలా అనూహ్య వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు ఉత్పత్తి పెంచడం వీలుకాదు. అందువల్ల కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి కొంత అనివార్యమవుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని అనుమతులిచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులవల్ల బహిరంగ మార్కెట్లోనూ, విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోను స్వల్పకాలిక, అత్యవసర విద్యుత్ సమయాల్లో కొనుగోలుకు తగినంత విద్యుత్ అందుబాటులో లేదు. పైగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోంది. బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 5–10 శాతం మాత్రమే విద్యుత్ లభిస్తోంది. టైం బ్లాక్‌కు 2 వేల మెగావాట్లకు ఆన్లైన్లో బిడ్ వేస్తుంటే కేవలం 100 నుండి 200 మెగావాట్ల విద్యుత్ మాత్రమే దొరుకుతోంది. ఇది కూడా సీలింగ్ ధర యూనిట్‌కు రూ.10 వద్ద లభిస్తోంది. సెంట్రల్ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రా చేయాలన్నా మనకు 250 మెగావాట్లకు మించి చేసేందుకు అనుమతిలేదు. ఒక్కోసారి ఆ గరిష్ట పరిమాణం దాటి కూడా ఓవర్ డ్రా చేస్తున్నాం. ఇందుకోసం అధిక ధర, జరిమానా కూడా చెల్లించాల్సి వస్తోంది. అయినా.. ఒక్కోసారి ఓవర్ డ్రాలు నియమాలకు మించి పెరిగిపోతుంటే గ్రిడ్ భద్రత రీత్యా ఆటోమాటిక్ లోడ్ రిలీఫ్ వ్యవస్థ ఆక్టివేట్ కావడంతో అక్కడక్కడా విద్యుత్ సరఫరాలో స్వల్పంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటోమాటిక్ వ్యవస్థ ఆక్టివేట్ కాగానే వెంటనే పరిస్థితులు చక్కదిద్ది రాష్ట్రమంతా లోడ్‌ను అందుబాటులో ఉన్న ఉత్పత్తితో సమన్వయం చేసి గ్రిడ్ వైఫల్యం చెందకుండా అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. గ్రిడ్‌లో సర్దుబాటు కోసం అప్పుడప్పుడూ ఇస్తున్న అత్యవసర లోడ్ రిలీఫ్‌లు రోజువారీగా సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ పరిమాణంలో 2.5 శాతం కూడా లేదు. అక్కడలా.. ఇక్కడిలా ఏంటి రామోజీ!? విద్యుత్ కోతలపై రామోజీ రాతలు కేవలం డ్రామాలని, తాను భుజానికెత్తుకుని మోస్తున్న వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని నిరూపించుకున్నారు. ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ అంటూ శుక్రవారం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో రాస్తే, ఇదే విద్యుత్ కోతలపై రెండ్రోజుల క్రితం అంటే ఆగస్టు 30న ‘వర్షాలు లేక.. కరెంటు కాక’ శీర్షికతో తెలంగాణ ఎడిషన్‌లో కథనాన్ని ప్రచురించింది. జల విద్యుత్ ఉత్పత్తి లేక కోట్లలో నష్టం అని.. ఇంధన ఎక్స్చేంజీల్లో కొందామన్నా కరెంటు దొరకడంలేదని విద్యుత్ కోతలకు కారణాలను తెలంగాణలో రాసుకొచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఆ కథనంలో చెప్పిన ఈనాడు.. ఏపీకి వచ్చేసరికి ప్లేటు మార్చింది. వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరిస్థితులకు కారణమన్నట్లు అసత్య కథనాన్ని ముద్రించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులే తెలంగాణ, ఏపీలోనూ ఉంటాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గమనార్హం. దక్షిణ భారతదేశమంతా ఇదే పరిస్థితి.. నిజానికి.. ఆగస్టులో దక్షిణ భారతదేశమంతా విద్యుత్ సరఫరా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆగస్టులో విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుచేసి సరాసరి 1,360 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అత్యవసరంగా స్వల్పకాలిక ఎక్సే్ఛంజీల నుంచి కొరతను అధిగమించడానికి కొనుగోలు చేశాయి. మిగిలిన స్వల్ప పరిమాణం 3–5 మిలియన్ యూనిట్లు కూడా కొనడానికి సిద్ధపడినా మనకు అవసరం వచ్చినపుడు మార్కెట్లో తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవడంవల్ల కొరత ఏర్పడింది. అత్యవసర లోడ్ రిలీఫ్ పరిస్థితి ఈ ఏడాదంతా లేదు. అత్యవసర విద్యుత్ కొనుగోలు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
విద్యుత్ చార్జీలపై అచ్చోసిన అబద్ధాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీలపై అవే అబద్ధాలను పదేపదే రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ‘గుట్టుగా షాక్’ అంటూ మరో తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన మంగళవారం ప్రచురించింది. తాను చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసి కూడా పచ్చి అబద్ధాలను అచ్చోసి వదిలింది. సర్దుబాటు చార్జీల పాపం గత ప్రభుత్వానిదేనని.. ఈ ప్రభుత్వంలో వినియోగదారులపై అదనపు భారం మోపకపోగా.. విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినా వాటన్నిటినీ పక్కనపెట్టి పచ్చ పత్రిక అవాస్తవాలను పచ్చిగా వండి వార్చేసింది. ‘ఈనాడు’ విషపు రాతలపై తీవ్రంగా మండిపడిన ఇంధన శాఖ అసలు నిజాలను వెల్లడించింది. టెలిస్కోపిక్ విధానం వల్ల వినియోగదారులకు మేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో మూడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచిందనడం పూర్తిగా అవాస్తవమని ఇంధన శాఖ పేర్కొంది. ఏడాదిన్నర కాలంలో విద్యుత్ చార్జీలను పెంచింది ఒకసారి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబద్ధీకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూపు టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వివరించింది. దీనివల్ల వినియోగదారులకు మొదటి స్లాబ్ రాయితీ ధరల ప్రయోజనం అందుతుందని వెల్లడించింది. గతంలో విద్యుత్ వాడకపోయినా నెలవారీ కనీస చార్జీలు కట్టాల్సి వచ్చేదని, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వాటిని రద్దు చేశారని తెలిపింది. దీని ప్రకారం సింగిల్ ఫేజ్ వారికి రూ.65, త్రీ ఫేజ్ వినియోగదారులకు రూ.150 చొప్పున ప్రతినెలా మిగులుతోందని వివరించింది. ఇంధన శాఖ తెలిపిన మరిన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి. గత ఖర్చులను దాచి పెట్టడం వల్లే.. ► ప్రస్తుతం విధిస్తున్న ట్రూ ఆప్ చార్జీలు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ కోసం చేసిన వాస్తవ ఖర్చులను నిజాయితీగా బయటపెట్టకపోవడం వల్ల వచ్చినవే తప్ప ఇప్పటి ప్రభుత్వం విధించినవి కావు. ► గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన వాస్తవ ఖర్చులను దాచిపెట్టి .. అన్ని నివేదికలలోనూ తక్కువ అంచనాలు చూపించారు. దానికి సంబంధించిన సర్దుబాటు కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ► డిస్కంలు నష్టాలను భరించడానికి చేసిన అప్పులపై గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టలేదు. ఆ అప్పులు తీర్చడానికి సంస్థలకు ఏవిధమైన ఆర్ధిక సహాయం చేయలేదు. ► 2014–15 నుంచి 2018–19 వరకూ (మూడవ నియంత్రణ కాలవ్యవధికి) ట్రూ అప్ చార్జీలను రూ.3,977 కోట్లుగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ధారించింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లు కాగా.. దీనిని రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా మండలి పేర్కొంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని ఈఆర్సీ ఆదేశించింది. ► వినియోగదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా.. అందరి నుంచీ అభ్యంతరాలను తీసుకుని, వినియోగదారులు కోరినట్టు, దక్షిణ, మధ్య డిస్కంల పరిధిలో 36 నెలలు, తూర్పు డిస్కంలో 18 నెలలుగా వసూలు వ్యవధిని నిర్ధారించింది. ఇది ఆగస్టు బిల్లుల నుంచి అమలులోకి వచ్చింది. ► ఈ ట్రూ అప్ చార్జీ కూడా ఎక్కువేం కాదు. ఎస్పీడీసీఎల్లో యూనిట్‌కు రూ.0.22 పైసలు, సీపీడీసీఎల్‌లో రూ.0.23 పైసలు, ఈపీడీసీఎల్‌లో రూ.0.7 పైసలు మాత్రమే. ఈ ప్రభుత్వం రూ.47,530 కోట్లు చెల్లించింది ► 2019–20 ప్రారంభం నాటికి గత ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు, వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీలు కలిపి దాదాపుగా రూ.12,950 కోట్లు ఉన్నాయి. ► రాష్ట్ర విభజన (2 జూన్, 2014) నాటికి రూ.12,500 కోట్లుగా ఉన్న కొనుగోలు బకాయిలు–నిర్వహణ వ్యయ రుణాలు గత ప్రభుత్వ హయాంలో 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.31,844.13 కోట్లకు చేరాయి. ► ప్రభుత్వం 2019 మే నుంచి 2022 సెప్టెంబర్ వరకూ సబ్సిడీ రూపంలో దాదాపు రూ.38,600 కోట్లను డిస్కంలకు ఇచ్చింది. వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీల రూపంలో రూ.8,930 కోట్లు చెల్లించింది. ఇలా మూడున్నరేళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మొత్తం రూ.47,530 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు అందించింది. -
అన్నదాత అడిగిందే తడవుగా విద్యుత్ కనెక్షన్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వేగంగా మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,420 వ్యవసాయ సర్వీసులు అందజేశారు. డిస్కంల వారీగా పరిశీలిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) ఇప్పటివరకూ 33,794 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను అధికారులు అందజేశారు. మరో 33,099 సర్వీసులకు ఈ నెలాఖరుకల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ ఏడాది 4,525 సర్వీసులను రైతులకు అందించారు. 3,687 సర్వీసులను ఈ నెలలో మంజూరు చేయనున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ఇక ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకూ 19,101 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు మంజూరు చేశారు. విజయవాడ సర్కిల్ పరిధిలో 6,411, గుంటూరు సర్కిల్ పరిధిలో 2,064, ఒంగోలుæ సర్కిల్ పరిధిలో 11,479, సీఆర్డీఏ పరిధిలో 88 చొప్పున మరో 20,042 కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. రూ.1,700 కోట్ల ఖర్చు వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా తీసుకునే సౌర విద్యుత్‌ను 9 గంటలపాటు పగటిపూటే పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,700 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా హై–ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం ద్వారా రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటిని బాగుచేయడం కోసం రూ.102 కోట్లు ఖర్చవుతోంది. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అవసరమైన మెటీరియల్ కూడా ఆయా జిల్లాల స్టోర్లలో అధికారులు సిద్ధంగా ఉంచారు. -
రూ.3,897.42 కోట్లతో విద్యుత్ వ్యవస్థ పటిష్టం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) ఆధ్వర్యంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టపరిచే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందుకోసం మొత్తం రూ.3,897.42 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునికీకరణ, కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం వంటి పనులతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయితే సాంకేతిక, సరఫరా నష్టాలు తగ్గి విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలపడటంతోపాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 31,301 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) మేర విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. వీటిలో 5,532.161 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎంల 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎంల పొడవున 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. ఇవి 354 మార్గాల ద్వారా రాష్ట్ర, అంతర్రాష్ట్ర పవర్ గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 351 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 400 కేవీ సామర్థ్యంగలవి 16, 220 కేవీ సామర్థ్యం ఉన్నవి 103, 132 కేవీ సామర్థ్యంగలవి 232 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఈ 351 సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ సంస్థలకు (డిస్కంలకు) ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. ఆ విద్యుత్‌ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. వీటన్నిటినీ అధికారులు తనిఖీ చేయించనున్నారు. ఎక్కడైనా ఆయిల్ లీకేజీలు ఉన్నా, కాయిల్స్ మార్చాల్సి వచ్చినా, వైండింగ్ చేయాల్సినా, స్విచ్‌లు, ఇతర సామగ్రి పాడైనా గుర్తించి వాటిస్థానంలో కొత్తవి అమర్చాలని భావిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ‘విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల అనేక నష్టాలను తగ్గించవచ్చు. ట్రాన్స్మిషన్ నష్టాలను పరిశీలిస్తే.. 2018–19లో 3.10 శాతం ఉండగా, 2022–23లో మే నెల నాటికి 2.83 శాతానికి తగ్గాయి. 2014–15లో ఇవి 3.37 శాతం ఉండేవి. అలాగే విద్యుత్ సరఫరా నష్టాలు 2020–21లో 7.5 శాతం ఉండగా, 2021–22లో 5 శాతానికి తగ్గాయి. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా 2021–22లో 11 శాతమే ఉన్నాయి. ఇలా సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు, మరింత నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వ సహకారంతో పనులు జరుగుతున్నాయి.’ – బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్‌కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్‌కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
చంద్రబాబు హయంలో తప్పులు.. నేటికీ తీరని అప్పులు
సాక్షి, అమరావతి: స్వప్రయోజనాల కోసం గత ప్రభుత్వం చేసిన తప్పులకు నేటికీ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కప్పం కడుతూనే ఉన్నాయి. తమకు అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అసలు, వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బకాయి దాదాపు రూ.7 వేల కోట్లను ఏడాదిలోగా చెల్లించేస్తామంటూ ముందుకొచ్చాయి. మాట నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్పీఎస్) పథకంలో చేరి 12 నెల వాయిదాల్లో ప్రతి నెలా దాదాపు రూ.600 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చిన కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వీటికి ఫిక్సిడ్ చార్జీల రూపంలో యూనిట్‌కు రూ.1.1 చెల్లించాల్సి వచ్చింది. పవన విద్యుత్‌ను యూనిట్ ఏకంగా రూ.4.84కు తీసుకున్నారు. ఫిక్సిడ్ చార్జీతో కలిపి రూ.5.94 పడింది. అప్పట్లో సౌరవిద్యుత్ యూనిట్ రూ.3.54కు బదులు రూ.8.90 వెచ్చించారు. ఇలా దాదాపు ఏడువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల మన విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. నిజానికి రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్‌పీపీవో) నిబంధనల ప్రకారం మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను 5 నుంచి 11 శాతం తీసుకోవాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఏకంగా 23 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. మిగులు విద్యుత్ వృధా చేసి.. 2014–19 మధ్య దేశ వ్యాప్తంగాను, మన రాష్ట్రంలోను మిగులు విద్యుత్ ఉండేది. రాష్ట్రంలో 2015–16లో విద్యుత్ డిమాండ్ 54,225 మిలియన్ యూనిట్లు ఉండగా ఉత్పత్తి 54,867 మిలియన్ యూనిట్లు. ఆ ఏడాది 642 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులుగా ఉంది. 2016–17లో 10,500 మిలియన్ యూనిట్లు, 2017–18లో 12,000 మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,600 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉండేది. 2017–19 మధ్య రూ 2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత ఈ మిగులు విద్యుత్‌ను బ్యాక్‌డౌన్ (వృధా) చేసి పీపీఏల ద్వారా అధికధరలు చెల్లించి కొనుగోలు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి భారం లేకుండా.. చంద్రబాబు గద్దెదిగేటప్పుడు రూ.2,300 కోట్ల పీపీఏ బకాయిలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టి వెళ్లారు. భారీ ధరలకు పీపీఏలు ఉండటంతో వాటిని సవరించాలంటూ డిస్కంలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అప్పుడు యూనిట్‌కి రూ.2.43 పైసల చొప్పున ప్రస్తుతానికి చెల్లించమని చెప్పిన కోర్టు తుది తీర్పులో ఒప్పందం మేరకు ఇమ్మని చెప్పింది. దీంతో పీపీఏ ప్రకారం చెల్లించాల్సిన ధరకు, చెల్లిస్తున్న ధరకు మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం చెల్లించాల్సిన పీపీఏ బకాయిలు వడ్డీతో కలిపి రూ.ఏడువేల కోట్లకు చేరాయి. ఈ మొత్తాన్ని ఏడాదిలోగా నెలవారీ వాయిదాల్లో కట్టేస్తామని డిస్కంలు ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో రాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో యూనిట్ కేవలం రూ.2.49 పైసల ధరకే ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. -
చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి చంద్రబాబు చేసిన పాపాలు శాపాల్లా వెంటాడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, విధానాల వల్ల కుదేలైన విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బకాయిలను సకాలంలో చెల్లించలేదంటూ ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’ నుంచి క్రయవిక్రయాలు జరపకుండా ఏపీతో సహా 13 రాష్ట్రాలకు చెందిన 29 డిస్కంలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) రాష్ట్రాలకు సమాచారం పంపింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని అందులో పేర్కొంది. మొదటి వాయిదా చెల్లించినా.. ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.17,265 కోట్లు కాగా కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో గడువులోగా చెల్లించలేదని ప్రకటించిన బకాయిలు రూ.412 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మొత్తం బకాయిలను 12 వాయిదాల్లో చెల్లించేలా లేట్ పేమెంట్ సర్ చార్జ్ (ఎల్పీఎస్) పథకంలో ఏపీ ఇటీవలే చేరింది. మొదటి వాయిదాగా ఈ నెల 6న రూ.1,422 కోట్లను చెల్లించింది. ఈలోగానే కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఇక్కడి అవసరాలకు సరిపోనప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా మన దగ్గర విద్యుత్ మిగిలితే దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటారు. ఇప్పుడు కేంద్రం నిషేధం విధించడంతో ఏపీతో పాటు 13 రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు జరపలేవు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నందున కేంద్రం విధించిన నిషేధం ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చునని, అయినప్పటికీ తాము కేంద్రానికి లేఖ రాస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ పరిస్థితికి ఆ ఆప్పులే కారణం.. టీడీపీ హయాంలో 2014లో రూ.29,703 కోట్లుగా ఉన్న విద్యుత్ రంగం మొత్తం అప్పులు 2019 నాటికి రూ.68,596 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా పవర్ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయి. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. టీడీపీ సర్కారు దాదాపు 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) అధిక ధర (యూనిట్ రూ. 4.84 + ఇతర ఛార్జీలు అదనం) చొప్పున కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు భారం మోయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల మేర రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదుకునేందుకు మూడేళ్లలోనే దాదాపు రూ.40 వేల కోట్లు సాయంగా అందించింది. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. -
ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్! విద్యుత్ చట్ట సవరణ బిల్లు బహిర్గతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో ప్రభుత్వ విద్యుత్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరవేస్తూ.. ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నూతన సంస్కరణలతో తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదా శుక్రవారం బహిర్గతమైంది. దీనిని ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోని కీలక అంశాలు.. ►ఎక్కడైనా ఒకే ప్రాంతం పరిధిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎక్కువ డిస్కంలకు అనుమతులు ఇవ్వనున్నారు. సొంత ట్రాన్స్మిషన్ వ్యవస్థ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు) ఉన్న కంపెనీలకే లైసెన్స్ అన్న నిబంధనను తొలగిస్తున్నారు. దీనితో ప్రైవేటు కంపెనీలూ తెరపైకి రానున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్స్ జారీ చేసేలా కేంద్ర నిబంధనలు ఉన్నాయి. ►ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు.. భవిష్యత్తులో వచ్చే అన్ని కంపెనీలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్ అవసరమైన కంపెనీలు కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ►రిటైల్ విద్యుత్‌కు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. అంటే ఈ గరిష్ట, కనిష్ట ధరల మధ్య ఎవరు తక్కువ చార్జీలను ఆఫర్ చేస్తే ఆ కంపెనీని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సంస్థల మధ్య పోటీ వల్ల నాణ్యమైన సరఫరా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు డిస్కంల రాకతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. ►ప్రస్తుతం విద్యుత్ రంగం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడీ సవరణలు అమల్లోకి వస్తే.. విద్యుత్ రంగం పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి వెళుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. చదవండి: మూడురోజులు అతిభారీ వర్షాలు! -
వారానికోసారి కట్టించేసుకోండి
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా బకాయి పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జెన్కోలకు ఊరట కలిగేలా డిస్కంల నుంచి వారం వారం పేమెంట్లను స్వీకరించాలని సూచించింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీ రుణభారంతో కష్టనష్టాల్లో ఉన్న డిస్కంలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లేనని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. జెన్కోలకు పెరిగిన ఖర్చులు.. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సే్ఛంజీ)లో విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు పీక్ అవర్స్‌లో యూనిట్ ధర రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లు దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ దిగుమతి బొగ్గును కలిపి వాడాలని, విదేశీ బొగ్గు సరఫరా ఈ నెల నుంచే మొదలవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. ఒకప్పుడు టన్ను బొగ్గు రూ.4వేల నుంచి రూ.7 వేలు ఉండేది. కానీ ఇప్పుడది రూ.19 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. ఇంత ఖర్చవుతున్నా డిస్కంల నుంచి వస్తున్నది మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దీంతో వారం వారం బిల్లులు వసూలు చేస్తే, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులకు వాడుకోవచ్చనేది కేంద్రం భావన. డిస్కంలకు భారమే..అయినా.. కేంద్రం చెప్పిన దాని ప్రకారం..డిస్కంలు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రొవిజనల్ బిల్లులో కనీసం 15 శాతం ఒక వారంలోగా చెల్లించాలి. ఒకవేళ అలా జరగకపోతే విద్యుత్ జెన్కోలు వారి ఉత్పత్తిలో 15 శాతాన్ని పవర్ ఎక్సే్ఛంజీలకు విక్రయించుకోవచ్చు. పవర్ ప్లాంట్లు సాధారణంగా డిస్కంలతో దీర్ఘకాల (లాంగ్ టెర్మ్) అగ్రిమెంట్ల చేసుకుంటాయి. ఫిక్స్డ్ రేట్లనే కొనసాగిస్తుంటాయి. అయితే దిగుమతుల వల్ల వ్యయాలు పెరిగితే ఆ భారాన్ని డిస్కంలకు బ దిలీ చేయొచ్చు. ఈ లెక్కన విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత ఎక్కువ భారం పడనుంది. నిజానికి రుణభారం వల్ల డిస్కంల నుంచి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సరైన సమయంలో చెల్లింపులు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ డిస్కంలు సరైన సమయానికి బిల్లులు చెల్లిస్తే మాత్రం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఊరట కలుగుతుంది. అలాగే డిస్కంలకు కూడా ఊరట కలిగించేలా ఇటీవల కేంద్రం రుణ బకాయిలను 48 నెలల ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. -
రాష్ట్రంలో 59.19 లక్షల స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలతోను, అటవీ, పోలీసు అధికారులతోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. డిస్కంల సీఎండీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 46.41 లక్షల స్మార్ట్ మీటర్లు, 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉందని చెప్పారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలు, విద్యుత్ చౌర్యాలు, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు ఫెయిలయితే వారం రోజుల్లో మార్చాలని ఆదేశించారు. ఈ విషయంలో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయన్నారు. సీఎండీలు దీనిపై దృష్టిసారించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీపడకూడదన్నారు. ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు జగనన్న కాలనీలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలని, వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని, వాటికి అన్ని వసతులను కల్పించాలనే సీఎం లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దన్‌రెడ్డి, హెచ్.హరనాథ్‌రావు, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అటవీ, పోలీసు అధికారులతో ఎర్రచందనంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వెంటనే ఆ రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి అవసరమైతే పొరుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశం కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఉన్న ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని, స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని కోరారు. ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,376.043 మెట్రిక్ టన్నుల సీజ్చేసిన ఎర్రచందనం నిల్వలున్నాయని, వీటి విక్రయానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి ప్రతీప్‌కుమార్, అదనపు పీసీసీఎఫ్ (విజిలెన్స్) గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు 'పరిమితి'పై త్వరలో సడలింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విధించిన పరిమితి, నియంత్రణ చర్యలు సాధ్యమైనంత త్వరగా సడలించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. డిస్కంలు జరిమానా చార్జీలను ఆదాయ వనరుగా చూడకూడదని, నిబంధనల అమలుకు వాటిని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతల నుంచి ఉపశమనం కలిగించడం కోసం పరిశ్రమలపై ఇటీవల విధించిన ఆంక్షలపై కమిషన్ సభ్యులు పి.రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ సింగ్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్, మూడు డిస్కంల సీఎండీలతో ఏపీఈఆర్సీ చైర్మన్ బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుండి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల రికవరీకి సంబంధించిన సమస్యలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర్రంలో బొగ్గు కొరత, దానిని అధిగమించేందుకు తీసుకుంటున్న పలు చర్యలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. ఏ ధరకైనా విద్యుత్ కొనుగోలు చేసి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. విద్యుత్ రంగం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని, అనవసర పెట్టుబడులు మానుకోవాలని సూచించారు. సకాలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ, ఈ విషయంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పనితీరు బాగోని ఏ డిస్కంను కమిషన్ ఉపేక్షించేది లేదని చైర్మన్ హెచ్చరించారు. ఊరట ఇలా.. ► విద్యుత్ ఆంక్షల అమలు కాలంలో క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి ఉండదు. ► కాంట్రాక్ట్ చేసిన డిమాండ్‌పై కాకుండా పరిమితం చేసిన డిమాండ్‌పై మాత్రమే డిమాండ్ చార్జీలు. ► ఏప్రిల్ 15 నుంచి మాత్రమే జరిమానా చార్జీల విధింపు. ► ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగం ఉన్న వినియోగదారులకు నెలవారీ విద్యుత్ కోటా పూర్తయ్యాకే జరిమానా. ► ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఓపెన్ యాక్సెస్ లభ్యత కోసం నిరభ్యంతర పత్రం జారీ. -
డిస్కంలకు చేయూత
సాక్షి, అమరావతి: ఇంధన శాఖలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం’ సాయంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చేయూతనందించి వాటిని బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కాగా దానికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3:2 నిష్పత్తిలో భరిస్తాయి. నష్టాలను తగ్గించి.. పథకంలో భాగంగా డిస్కంలు 2024–2025 నాటికి అగ్రిగేట్ ట్రాన్స్మిషన్, కమర్షియల్(ఏటీసీ) నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం (ఏసీఎస్) అగ్రిగేట్ రెవిన్యూ రిపోర్ట్ (ఏఆర్ఆర్) మధ్య అంతరాన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్మిషన్, పంపిణీ నష్టాలను తగ్గించడం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, సౌర విద్యుత్ సరఫరాకు అనువుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేయడం వంటి కార్యక్రమాలను డిస్కంలు చేపట్టాలి. వినియోగదారులకు ప్రయోజనం పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఫీడర్లు వేరు చేయడం వల్ల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నేరుగా అందడంతో పాటు మిగతా వినియోగదారులకు విద్యుత్ అంతరాయాల్లో సమస్యలు తలెత్తవు. నష్టాలు తగ్గడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులపై వేసే చార్జీల భారం కూడా తగ్గుతుంది. వార్షిక ఆదాయ, వ్యయ నినేదికలు సకాలంలో సమర్పించడం, టారిఫ్ పిటిషన్‌ను సకాలంలో దాఖలు చేయడం, టారిఫ్ ఆర్డర్ల జారీ, యూనిట్ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి చర్యలతో డిస్కం లలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఇప్పటికే మొదలు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు, ఇతర వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ) నుంచి వ్యవసాయానికి 9 గంటలు ఉచిత సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ కూడా ఆమోదం తెలిపాయి. వ్యవసాయ ఫీడర్లను వేరుచేసే ప్రక్రియ కూడా మొదలైంది. విశాఖపట్నంలో గృహ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ఫలితాలను అక్కడి డిస్కం పర్యవేక్షణలో అధ్యయనం చేయిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేస్తోంది. ఆ మొత్తాన్నీ ట్రూ డౌన్ కింద తిరిగి వినియోగదారులకే తిరిగి ఇస్తోంది. -
విద్యుత్ వాత.. అభ్యంతరాల మోత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపు నకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై బడా పారిశ్రా మికవేత్తలు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు, టాప్ కంపెనీలతోపాటు సామాన్య వినియోగదా రులూ భగ్గుమన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కి రికార్డు సంఖ్యలో రాత పూర్వక అభ్యంత రాలు అందాయి. గడువు ముగిసిన జనవరి 28 నాటికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు 191, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్)కు 92 అభ్యంతరాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీ రింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈ ఐఎల్), ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్ (టీసీ ఎస్), ఎల్అండ్టీ మె ట్రో రైలు, పెన్నా సిమెంట్స్, జువారి సిమెం ట్స్, ఫ్యాప్సీ తెలంగాణ, తెలంగాణ ఫెర్రో అలాయ్స్ ఉత్పత్తిదారుల సంఘం, ఐటీసీ లిమిటెడ్, ఇండియా ఎనర్జీ ఎక్సే్ఛంజీ లిమి టెడ్, మైత్రాహ్ ఎనర్జీ, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పవర్ అసోసియేషన్, సౌత్ ఇండియా సిమెంట్స్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతోపాటు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆయోధ్య రెడ్డి, విద్యుత్ రంగ విశ్లేషకులు తిమ్మారెడ్డి, ఎం.వేణు గోపాల్ రావు, ధోంతి నర్సింహా రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఏపీసీపీడీసీఎల్ మాజీ డైరె క్టర్ సూర్య ప్రకాశ రావు, అఖిల భారత్ కిసాన్ మహాసభ నుంచి సారంపల్లి మల్లారెడ్డి అ భ్యంతరాలు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. బహిరంగ విచారణలో మళ్లీ.. భారీగా వచ్చిన అభ్యంతరాలన్నింటికీ రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం డిస్కంలకు ఇబ్బందికర విషయమే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 18న సిరిసిల్లలో, 21న హన్మకొండలో, 23న వనపర్తిలో, 25న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఈఆర్సీ ప్రకటించింది. ఆ సమయంలో మళ్లీ పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశముంది. వీటికి డిస్కంల సీఎండీలు అప్పటికప్పుడే మౌఖికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించని రీతిలో పెద్దసంఖ్యలో స్పందన వస్తుండటంతో చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
పవన, సౌర విద్యుత్ ధరలపై తుది విచారణ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కంపెనీలు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆయా కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వైద్యనాథన్, బసవ ప్రభుపాటిల్, సజన్ పూవయ్య, పి.శ్రీరఘురాం, చల్లా గుణరంజన్ తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించడం సరికాదని నివేదించారు. ఒప్పందాలు ప్రభుత్వాలతో జరుగుతాయే తప్ప రాజకీయ పార్టీలతో కాదన్నారు. పీపీఏల విషయంలో ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వాల జోక్యాన్ని నివారించేందుకు విద్యుత్ చట్టంలో స్పష్టమైన నిబంధనలు పొందుపరిచారని తెలిపారు. చట్టబద్ధంగా, పారదర్శకంగా పీపీఏలు జరిగాయని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థల తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పీపీఏలో పేర్కొన్న ధరలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి ఉందని వివరించారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. -
విద్యుత్ కొనుగోలు లెక్కలు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి. యూనిట్‌కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్సీ వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్‌గా విచారించనున్నట్లు తెలిపింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం! ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ ఎల్డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ గతంలోనే తెలిపింది. తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్‌లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్‌ఎల్‌డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రకటించనుంది. -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్‌లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్‌లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్‌స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్.. స్మార్ట్ సబ్‌స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్ (స్మార్ట్ సబ్‌స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్ స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్