ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు! | Transco assets to private Central Power Department | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!

Published Wed, Oct 5 2022 1:38 AM | Last Updated on Wed, Oct 5 2022 1:38 AM

Transco assets to private Central Power Department - Sakshi

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్‌ రంగంలో జనరేషన్‌ (ఉత్పత్తి), ట్రాన్స్‌మిషన్‌ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్‌ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్‌మిషన్‌ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. 

సాక్షి, హైదరాబాద్‌:  విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్‌ఫర్‌ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్‌ మానిటైజేషన్‌) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్‌ శాఖ విడుదల చేసింది.

మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్‌మిషన్‌ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్‌మిషన్‌ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన ఐదు ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్‌ కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. 

నామమాత్రపు బుక్‌ విలువ ఆధారంగా.. 
కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్‌కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్‌మిషన్‌ లైసెన్స్‌ తీసుకోవాలి.

అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్‌మిషన్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్‌ విలువ ఆధారంగా బిడ్డింగ్‌ జరుగుతుంది.

అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్‌కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్‌ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement