విద్యుత్ సంస్థల కీలక పోస్టుల్లో తమ వారిని నియమించే ప్రయత్నాలు
రూ.కోట్లలో దండుకునేందుకు బేరాలు
ఇప్పటికే పలువురు అధికారుల రాజీనామా
విద్యుత్ సంస్థల్లో 10 మంది డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా
త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల అధిపతులకూ స్థాన చలనం!
వారి స్థానంలో అనుకూలురైన ఐఏఎస్‌ల నియామకం!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు.
ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్‌కో ఓఎస్‌డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు.
ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
10 మంది డైరెక్టర్ల రాజీనామా
ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజీనామా చేసిన డైరెక్టర్లు
» టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్‌కో)
» డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్‌కో)
» సయ్యద్ రఫి (హెచ్‌ఆర్, ఐఆర్ – ఏపీ జెన్‌కో)
» ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్‌కో)
» సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్)
» ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్)
» వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్)
» బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్)
» టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్)
» కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్)
Comments
Please login to add a commentAdd a comment