జెన్‌కోలో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యం | Nearly 135 people transferred for being sympathizers of the previous government | Sakshi
Sakshi News home page

జెన్‌కోలో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యం

Published Thu, Nov 21 2024 5:08 AM | Last Updated on Thu, Nov 21 2024 7:39 AM

Nearly 135 people transferred for being sympathizers of the previous government

గత ప్రభుత్వ సానుభూతిపరులంటూ దాదాపు 135 మందిపై బదిలీ వేటు

వీరిలో 90శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గాల ఉద్యోగులే! 

మినహాయింపు ఉన్న యూనియన్‌ నేతలపైనా కక్ష సాధింపు 

ఉద్యోగులకు రాజకీయ రంగు పులమడంపై యూనియన్ల ఆగ్రహం 

సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని విద్యుత్‌ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.

వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్‌ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.  

లోకేశ్‌ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! 
వాస్తవానికి ఏపీజెన్‌కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్‌కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. 

ఏపీ పవర్‌ జనరేటింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్‌ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్‌ ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. 

యూనియన్‌ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్‌ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు.  
 


బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...
ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్‌కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎనీ్టటీపీఎస్‌)తోపాటు విద్యుత్‌ సౌధ (జెన్‌కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్‌ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. 

ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్‌ యూనియన్‌ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్‌ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement