
సాక్షి, అమరావతి: ‘అప్పుల చీకట్లో డిస్కంలు’ శీర్షికతో ‘ఈనాడు’ అసంబద్ధ కథనాన్ని ప్రచురించటాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఖండించారు. 2022–23 ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఆగస్టు నాటికి నెలవారీ వాయిదా కింద చెల్లించాల్సిన అప్పులు రూ.24,838 కోట్లేనని చెప్పారు. డిస్కంల అప్పులు రూ.56 వేల కోట్లు దాటాయని అసత్యాలతో నిరాధార కథనాన్ని ప్రచురించటాన్ని తప్పుబడుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ, వివిధ శాఖలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్ చార్జీలను వసూలు చేయడం ద్వారా నెలవారీ అప్పులు, జీతభత్యాలు, ఇతర ఖర్చులను సకాలంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్‌చార్జీ (ఎల్‌పీఎస్) పథకంలో చేరి మొదటి వాయిదాగా గత నెలలో రూ.1,422 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 3 వరకు బకాయిలను పవర్ పీఎఫ్‌సీ, ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఈసీ) లిమిటెడ్ ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆలస్య రుసుము భారం నుంచి మినహాయింపు లభించి డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర వెసులుబాటుగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment