
సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల‍్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు.
పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.
రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment